సేవా మూర్తి కన్నుమూత | kurnool nightingale no more | Sakshi
Sakshi News home page

సేవా మూర్తి కన్నుమూత

Published Tue, Sep 27 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా  జాతీయ స్థాయి ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ అవార్డును  అందుకుంటున్న సుగంధమ్మ

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయి ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ అవార్డును అందుకుంటున్న సుగంధమ్మ

– అనారోగ్యంతో మరణించిన కర్నూలు నైటింగేల్‌ సుగంధమ్మ
– మే 11న రాష్ట్రపతి చేతుల మీదుగా ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ అవార్డు ప్రధానం
 
కర్నూలు(హాస్పిటల్‌):  జాతీయ స్థాయి ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ అవార్డు గ్రహీత కర్నూలు నగరంలోని న్యూ కృష్ణానగర్‌కు చెందిన గుండాల సుగంధమ్మ మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. అనంతపురం జిల్లా నార్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమె కొంతకాలంగా షుగర్‌వ్యాధితో బాధపడుతున్నారు. సమాజసేవలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో గత శనివారం ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే నేపథ్యంలో మూత్రపిండాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అందించే జాతీయ స్థాయి ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ అవార్డును ఆమె గత మే 11వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న విషయం విదితమే. 
 
సేవామార్గంలో అనేక కార్యక్రమాలు
 ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన జి.మద్దిలేటి, సరోజమ్మల కూతురైన సుగంధమ్మ 1985లో కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్‌ స్కూల్‌లో జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసి, 1986లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్‌నర్సుగా చేరారు. 1996 నుంచి 1998 వరకు బీఎస్సీ నర్సింగ్‌ విద్యను పూర్తి చేసి, ట్యూటర్‌గా పదోన్నతి పొంది ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్‌)కు బదిలీ అయి, అక్కడే 2006 వరకు పనిచేశారు. అనంతరం 2006 నుంచి 2012 వరకు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజిలో పబ్లిక్‌హెల్త్‌ నర్సుగా పనిచేశారు. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పదోన్నతి రావడంతో అనంతపురం జిల్లా నార్పల పీహెచ్‌సీకి బదిలీ అయ్యారు.
 
సామాజిక సేవలో సుగంధమ్మ
 పేదరోగుల కోసం బుధవారం, లక్ష్మీనగర్, వన్‌టౌన్‌ ప్రాంతాలతో పాటు కర్నూలు మార్కెట్‌యార్డు సుగంధమ్మ ఫ్రీ క్లినిక్‌లు నిర్వహించారు. గుంతకల్‌లోని పద్మావతి నర్సింగ్‌ స్కూల్‌లో 100 మందికి పైగా విద్యార్థినిలను చదివించారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని ఓ గహంలో 12 మంది ఎయిడ్స్‌ రోగులను ఉంచి చికిత్స చేశారు. స్థానికులు అభ్యంతరం చెప్పడంతో వారిని తన ఇంట్లోనే ఉంచి సేవ చేశారు. 2009లో వచ్చిన వరదల సందర్భంగా 21 రోజుల పాటు మురికివాడల్లోనే ఉండి వైద్యసేవలందించారు. ఆమె సేవలకు మెచ్చి తెలుగు వికాస ఉద్యమం వారు శ్రీ కష్ణదేవరాయల 500 జయంతిని పురస్కరించుకుని విశిష్ట మహిళా అవార్డును,  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సేవా పురస్కార్‌ అవార్డును అందుకున్నారు. 1998, 1999, 2004, 2005లో అప్పటి జిల్లా కలెక్టర్లు, మంత్రులు ఆమెకు ఉత్తమ సేవా పత్రాలను అందజేశారు. గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లోని పేద ప్రజలకు సేవ చేసేందుకు  సెయింట్‌ లూడ్స్‌ పీపుల్స్‌ సెల్ఫ్‌ సర్వీసు అండ్‌ సొసైటీని స్థాపించి గ్రామీణ, మురికివాడల్లోని పేదలకు సేవ చేశారు. లయన్స్‌ క్లబ్‌లో వివిధ హోదాల్లో, ఉమెన్స్‌ క్లబ్‌ కో ఆర్డినేటర్‌గా సేవలందించారు.
 
సుగంధమ్మకు పలువురు నివాళి
అనారోగ్యంతో కన్నుమూసిన సుగంధమ్మకు మంగళవారం ఆమె నివాసం వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు టి.షడ్రక్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రాజశేఖర్, ఎండి ఆనంద్‌బాబు, సఫాయి కర్మాచారుల హక్కుల సాధన సంఘం అధ్యక్షులు గుర్రాల శ్రీనివాసులు, సీనియర్‌ దళిత నాయకులు టిపి శీలన్న, వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు మద్దయ్య, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంతా సుబ్బరాయుడు, ఎస్సీ,ఎస్టీ గజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ వై.ప్రవీణ్‌కుమార్, సునీల్‌కుమార్‌ తదితరులు సంతాపం తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement