Singer Lata Mangeshkar Died Due To Covid In Mumbai - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar Death: గాన కోకిల లతా మంగేష్కర్‌ కన్నుమూత

Published Sun, Feb 6 2022 9:49 AM | Last Updated on Mon, Feb 7 2022 3:41 PM

Legendary Singer Lata Mangeshkar Passes Away at 92 - Sakshi

లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్‌ మీదే చికిత్స అందించారు.

1942లో గాయనిగా ఆమె కెరీర్‌ ప్రారంభించారు. నౌషాద్‌ నుంచి ఏఆర్‌ రెహమాన్‌ వరకు.. ఎందరి సంగీతంలో ఆమె పాటలు పాడారు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న ఆమె..  దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు.  హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు.

తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం
తెలుగులో 1955 లో ఏఎన్నార్‌ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా.. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట. 1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు.

గానమే పరమావధిగా..
1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించారు లత. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లత సంగీతమే మరోలోకంగా జీవించారు.  చిన్న తనంలోనే తండ్రి మరణించడంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. దీంతో  సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు.  ఆ తరువాత పలు చిత్రల్లో నటించారు కూడా. 

గిన్నిస్‌ బుక్‌లోకి..
1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా  లత  ప్రస్థానంమొదలైంది. మహల్‌తో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో  ఉన్న శిఖరాల్ని అధిరోహించారు. పలు భాషల్లో పాటలు పాడిన ఆమె జనం గుండెల్లో లెజెండరీ సింగర్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. తొలిసారిగా 1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు సంగీత సారధ్యం వహించారు లతా. సాధి మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా.  1948- 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. 

నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకున్న లతాజీ భారతీయ సినీ రంగానికి  చేసినవిశిష్ట సేవలకు  భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న  అవార్డుతో సత్కరించింది . అలాగే పద్మ భూషణ్ , పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఎంఎస్‌  సుబ్బులక్ష్మి తరువాత  భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement