లతా మంగేశ్కర్ రాకతో గానానికి జ్ఞానం వచ్చింది! ఆ జ్ఞానం సినిమా గానాన్నే కాదు మొత్తం సంగీత క్షేత్రాన్నే సుసంపన్నం చేసింది; ఆ జ్ఞానం గాన, సంగీత అభిమానుల్ని పరవశింపజేసింది. శాస్త్రీయ సంగీత గానం, సినిమా గానం, లలిత గానం అనే వర్గీకరణలకు అతీతంగా లతా మంగేశ్కర్ ఒక మహోన్నతమైన గాయని. సంగీత క్షేత్రంలో లత గానం, గాత్రం మహోన్నతంగా వెల్లివిరిశాయి.
Rounded even, clear resonant voice లతా మంగేశ్కర్‌ది. లత Timbre ఆమె వచ్చిన సమయానికి మన దేశంలో న భూతో; సంగీత దర్శకుడు గులాం హైదర్ ఈ విషయాన్ని ముందుగా పసిగట్టారు. తరువాత ఆ Timbre న భవిష్యతి కూడా అయింది. విశిష్టమైన గాత్రం లత గాత్రం. Verve ఉంటుంది లత గాత్రంలో. లత గాత్రం సహస్రాబ్ధి గాత్రం (Voice Of Millennium).
ఖేంచంద్ ప్రకాష్ సంగీతంలో మహల్ సినిమాలో "ఆయేగా ఆయేగా..." పాటతో ఊపందుకున్న లత గానం ఆ పాట వచ్చిన సంవత్సరం (1949)లోనే శంకర్-జైకిషన్ సంగీతంలో బర్సాత్ సినిమాలో "జియా బేకరార్ హై...", "బర్సాత్ మే హంసే మిలే...", "హవామే ఉడ్తా జాయే..." పాటలతో మొత్తం దేశాన్నే ఊపేసింది. నాణ్యత, రంజన రెండూ లత గానంలో రాజిల్లాయి. లత స్థాయి నాణ్యమైన, ఆమెలా రాణించిన మఱొక గాయని మనదేశంలో లేరు.
Lata has unerring sense of pitch and rhythm. "లతా సుర్ కా అవ్‌తార్" అని అన్నారు బడే గులామ్ అలీఖాన్. సినిమా పాటలంటే చిన్నచూపు ఉన్న శాస్త్రీయ సంగీత విద్వాన్ బడే గులామ్ అలీఖాన్. ఆయన లతా మంగేశ్కర్ గాత్రానికి, గానానికి ముగ్ధులయ్యారు. "శ్రుతి అవతారం లత" అని అంటూ అలా, అంతలా ప్రస్తుతించారు. ఠుమ్రీ గాన విధానానికి బడే గులామ్ అలీ ఖాన్ మార్గ దర్శకుడు. ఆయన స్ఫూర్తితో బాజూబంద్ (1954) హిందీ సినిమాలో లత గొప్పగా ఒక ఠుమ్రీ పాడారు.
మన దేశ చలన చిత్ర గానంలో bel canto
పురుషుల పరంగా మొహమ్మద్ రఫీ, మహిళల పరంగా లత తోనే మొదలయింది! స్వర సమం (తాళ సమం కాదు), mood, balance, diction, modulation, expression వీటిపై లతా మంగేశ్కర్‌కు గొప్ప అవగాహన ఉంది. "Lata sings others make miserable effort" అని అన్నారు మన దేశంలోనే ప్రశస్తమైన చలన చిత్ర సంగీత దర్శకుడు సజ్జాద్ హుస్సైన్.
హల్‌చల్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఆజ్ మేరే నసీబ్..." పాటలో లత గానం metronomical balanceతో ఉంటుంది. మదన్ మోహన్ సంగీతం చేసిన అన్‌పధ్ సినిమాలోని "ఆప్ కీ నజ్ రోనే సంఝా..." గానం balance అన్నదానికి సరైన అభివ్యక్తి. రుస్తమ్ సొహరాబ్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఏ దిల్ రుబా..." పాట ఒక్క లత మాత్రమే అంత గొప్పగా పాడగలరు. శంకర్-జైకిషన్ సంగీతంలో "జా జారే జా బాలమ్..." (సినిమా: బసంత్ బహార్), "ఓ బసంతీ పవన్..." (సినిమా: జిస్ దేశ్ మే గంగా బహ్ తీ హై), "రసిక్ బల్ మా..."( సినిమా: చోరీ చోరీ), "ఏ షామ్‌కీ తన్ హాయియా..."(సినిమా: ఆహ్) వంటి ఎన్నో అద్భుతాల్ని పాడారు లత. నౌషాద్ సంగీతంలో బైజుబావ్‌రా సినిమాలో పాడిన "మొహెభూల్ గయె సావరియా" పాట మరెవరు పాడినా అంత గొప్ప పాట కాకుండా పోయేది.
భారతదేశ చలన చిత్రాలలోనే అత్యుత్తమమైన జోల పాట సి. రామచంద్ర సంగీతం చేసిన అల్‌బేలా సినిమాలో లత పాడిన "ధీరేసే ఆజా..." పాట. అటు తరువాత ధోభీగా జమీన్ సినిమాలో సలిల్ చౌధురీ సంగీతం చేసిన "ఆజారీ ఆ నిందియా...", సన్సార్ సినిమాలో రోషన్ సంగీతం చేసిన "హన్సే టిమ్ టిమ్...", పూనమ్ సినిమాలో శంకర్- జైకిషన్ సంగీతం చేసిన "ఆయీ ఆయీ రాత్ సుహానీ...", కట్‌పుత్‌లీ సినిమాలో శంకర్-జైకిషన్ సంగీతం చేసిన "సోజా రే సోజా మేరీ..." వంటి దేశంలో వచ్చిన గొప్ప జోల పాటలు లత పాడడంవల్ల మరింత గొప్ప జోల పాటలయ్యాయి.
సలిల్ చౌధురీ సంగీతంలో లత పాడిన "ఓ సజ్ నా..." , టాంగా వాలీ సినిమాలో "మే లుట్ గయీ దునియా వాలో..." అంటూ పాడిన పాట, అన్నదాత సినిమాలో " రాతో మే క్యా క్యా.." పాట విశేషమైనవి. ఎస్.డి. బర్మన్ సంగీతంలో "మేఘా ఛాయా ఆధీ రాత్..." (సినిమా: షర్మిలీ) వంటి పలు ఉదాత్తమైన పాటలు పాడారు లత. "సునో సజ్‌నా..." (సినిమా: ఆయే దిన్ బహార్ కే) అంటూనూ, "జీవన్ డోర్ తుమ్ హీ..." (సినిమా: సతీ సావిత్రీ) అంటూనూ, "సత్యమ్ శివమ్ సుందరమ్..." (సినిమా: సత్యమ్ శివమ్ సందరమ్) అంటూనూ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సంగీతంలో గొప్ప పాటలు పాడారు లత. ఆర్.డి.బర్మన్ సంగీతంలో లత పాడిన "రేనా బీతి జాయే షామ్ న ఆయే..." పాట గాన కళకు ఉచ్చ స్థితి. గాన కళను మెఱుగు పఱుచుకుంటే పోతే ఒక దశలో రేనా బీతి జాయే పాటలాగా వస్తుంది. ఆర్.డి.బర్మన్ సంగీతంలో "క్యా జానూ సజన్..." ( సినిమా: బహారోంకే సప్‌నే), "సీలీ హవా ఛూ గయే..."( సినిమా: లిబాస్), "నా కోయీ ఉమంగ్ హై..." (సినిమా: కటీ పతంగ్), "తేరే లియే పల్‌కోంకీ ఝాలర్..." (సినిమా: హర్‌జాయీ) వంటి ప్రతేకమైన పాటలు పాడారు లత.
"తుమ్ క్యా జానో తుమ్హారీ యాద్..." అంటూ సి. రామచంద్ర సంగీతంలో (సినిమా: శిన్ శినాకీ బూబ్లబూ) లత చేసిన గానం మరో గాయని అందుకోలేని ఔన్నత్యం. భావ యుక్తంగా బాగా పాడడం అన్నదానికి మించి Mood (మనోధర్మం), spirit, అతీతమైన మేలిమి(super fineness), profoundity, శ్రుతి శుభగత్వం వీటితో ఈ పాటలో లత గానం అత్యుదాత్తంగా ఉంటుంది. ఇలా అత్యుదాత్తంగా రోషన్ సంగీతంలో "ఇస్ దిల్ కీ హాలత్ క్యా కహి యే..." (సినిమా: అన్హోనీ), పండిత్ రవి శంకర్ సంగీతంలో "హాయ్ రే వొ దిన్..." (సినిమా: అనూరాధా), నౌషాద్ సంగీతంలో "మొహే పన్‌ఘట్..."(సినిమా: ముఘల్-ఎ-ఆజమ్), "తోడ్ దియా దిల్ మేరా..." (సినిమా: అందాజ్) హేమంత్ కుమార్ సంగీతంలో "కుచ్ దిల్ నే కహా..." (సినిమా: అనుపమ), హృదయానాథ్ మంగేశ్కర్ సంగీతంలో "యారా సీలీ సీలీ..." (సినిమా: లేకిన్), ఖయ్యామ్ సంగీతంలో "బహారో మేరా జీవన్ భీ సవారో..." (సినిమా: ఆఖ్‌రీకత్), ఎస్. డి. బర్మన్ సంగీతంలో "థండీ హవాయే..." (సినిమా: నౌజవాన్)
చిత్రగుప్త సంగీతంలో "దిల్ కా దియా జలా కే గయా..." (సినిమా: ఆకాశ్ దీప్) మదన్ మోహన్ సంగీతంలో "లగ్ జాగలే కే ఫిర్ హసీ రాత్..."(సినిమా: వో కౌన్ థీ), "న తుమ్ బేవఫా హో న హమ్ బేవఫా హై..."(సినిమా: ఏక్ కలీ ముస్కాఈ) సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో "వొ రాత్ దిన్ వొ చాందినీ..." (సినిమా: సైయా), "కిస్మత్ మే ఖుషీ కా నామ్ నహీ..." (సినిమా: సైయా), వంటి పాటలూ, ఇంకా పలు పాటలూ పాడారు లత.
తెలుగులో సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో "నిద్దుర పోరా తమ్ముడా అంటూ గొప్పగా పాడారు లత. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకర శాస్త్రి సంగీతంలో బహుత్ దిన్ హుఎ సినిమాలో "చందా చమ్కే నీల్ గగన్ మే..." అంటూ గొప్పగా పాడారు లత. ఆఖరి పోరాటం సినిమాలో ఇళయరాజా సంగీతంలో "తెల్లచీరకు తకధిమి తపనలు..." అంటూ చక్కగా పాడారు ఆమె. ఎ.ఆర్. రహ్మాన్‌తో సహా పలువురు సంగీత దర్శకులకు పలు భాషల్లో పలు ఉన్నతమైన పాటలు పాడారు లత.
1929 సెప్టెంబర్ 28న పుట్టిన లత తన 7వయేట తండ్రి మరాఠీ నాటకం సుభద్రాలో నారదుడి వేషంలో పాడుతూ నటించారు. ఆ తరువాత 13యేళ్ల వయసులో మరాఠీ సినిమా పహిలీ మంగల్ గౌర్ (1945) సినిమాలో నటిస్తూ తనకు "నటాలీ చైత్రాచి నవలాయీ" అన్న మరాఠీ పాట పాడుకున్నారు. లత తన మొదటి హిందీ పాట "హిందూస్థానీ లోగో..." అంటూ గజభావూ(1945) అన్న మరాఠీ సినిమాలో నటిస్తూ పాడుకున్నారు. 1945లో వచ్చిన బడీమా హిందీ సినిమాలో నటించి తనకు తాను "తుమ్ హో బడీ మా..." అంటూ ఒక పాట పాడుకున్నారు. ఈ బడీమా సినిమాలో "నట్ కట్ హటీ లే గోపాల్..." అంటూ లత తొలిసారి నేపథ్య గానం చేశారు.
ఆ తరువాత 1946లో వచ్చిన ఆప్ కీ సేవా మే హిందీ సినిమాలో "ఏక్ నయే రంగ్ మే...", "పా లాగూ కర్ జోరి రే..." పాటలు పాడారు. ఈ ఆప్ కీ సేవా మే పాటలు బొంబాయిలో రికార్డ్ అయిన లత తొలి పాటలు. ఇవి ఆమె నేపథ్య గానం చేసిన తొలి పాటలు కావు. పూణేలో రికార్డ్ అయిన బడీమా సినిమాలోని "నట్ కట్ హటీ లే గోపాల్..." పాట నేపథ్య గాయనిగా లత పాడిన తొలి పాట. 2019లో "సౌగంధ్ ముఝే ఇస్ మిట్టి కీ..." అంటూ మన దేశ సైన్యానికి నివాళిగా తన చివరి పాట పాడారు లత.
సినిమా పాటలు, భజన్‌లు, గజళ్లు, లలిత గీతాలు, అభంగ్‌లు, బెంగాలీ సంగీతం, జానపద సంగీతం ఇలా పలు ధోరణుల్లో లత గానం ప్రవహించింది. అన్ని భాషల్నీ కలుపుకుని 6,550 పైచిలుకు సినిమా పాటలూ, ఇంచు మించు 1,000 ఇతర పాటలూ లత పాడారని తెలుస్తోంది. ఎంత ఎక్కువగా ఊహించుకున్నా ఈ సంఖ్య 8,000 పైచిలుకు దాటకపోవచ్చు. లత 40,000 లేదా 30,000 పాటలు పాడారని చెప్పబడుతూండడం సరి కాదు.
పాడడం అన్న కళ లతా మంగేశ్కర్‌వల్ల పరిపుష్టమైంది, పరిఢవిల్లింది, పరిపూజనమైంది. Rendition-intensity లేదా ప్రగాఢమైన గానం లత వైశేష్యం. Profound singingతో, rounded even singingతో లత ఒక గాన శకం అయ్యారు. లతా మంగేశ్కర్ 'ఒక ప్రకృతి అద్భుతం' అన్న మాట ఉంది. సంగీత ప్రపంచానికి ప్రకృతి ఇచ్చిన వర వరం లత. 'Lata, a boon and boost to the world of music".
ఎనెన్నో పురస్కారాలు, బిరుదులు ఆమెను దక్కించుకున్నాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత్ రత్న ఆమెవయ్యాయి. రత్నానికి అరగడం ఉండదు; రత్నం ఎప్పటికీ వాడిపోదు. లత గానం శ్రేష్ఠమైన రత్నం. అది ఎల్లప్పుడూ మనలో మెఱుస్తూనే ఉంటంది; మనకై మెఱుస్తూనే ఉంటుంది.
6/2/2022 న లత తుది శ్వాస విడిచారు. లతా మంగేశ్కర్‌కు వర్ధంతులు వస్తూ ఉంటాయి. కానీ ఆమె గానానికి వర్ధంతులు ఉండవు! ఎందుకంటే ఆ గానం మరణించలేదు కాబట్టి; ఆ గానానికి మరణం రాదు కాబట్టి. ఇవాళ మనతో లత శరీరం లేదు. కానీ ఆమె శారీరం ఈ మట్టిలో, ఈ మట్టి ప్రజలో, సంగీత ప్రపంచంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎల్లప్పుడూ నిలిచి ఉండే గాన తటిల్లత లత.
- రోచిష్మాన్, 9444012279
Comments
Please login to add a commentAdd a comment