
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ బీటౌన్‌లో దాదాపు పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతేకాదు మన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు వీరాభిమానిని కూడా. బాలీవుడ్‌లో ఫేమస్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న మికా సింగ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్‌కు రూ. 50 లక్షల విలువైన డైమండ్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ రింగ్‌ను షారూఖ్ నాకు తిరిగి ఇచ్చారని వెల్లడించారు. అంతే కాదు షారూఖ్ తన లగ్జరీ కారును మూడు నెలల పాటు వాడుకున్నారని మికా సింగ్ తెలిపారు.
ఇంటర్వ్యూలో మికా మాట్లాడుతూ.. ' బాలీవుడ్ ఉత్తమ నటులలో షారూఖ్ ఒకరు. అంతేకాదు పెద్ద మనిషి కూడా. ఆయన నాకు తిరిగిచ్చిన ఉంగరాన్ని ఎల్లప్పుడూ ధరిస్తా. ఎందుకంటే దీని విలువ దాదాపు రూ.50 లక్షలు. ఇలాంటి రింగ్స్ నేను అమితాబ్ బచ్చన్, గురుదాస్ మాన్‌లకు కూడా బహుమతిగా ఇచ్చాను. అయితే దీన్ని మొదటిసారి బహుమతిగా షారూఖ్ ఖాన్‌కే ఇచ్చా. ఎందుకంటే ఈ ముగ్గురి కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నా. అయితే మరుసటి రోజు షారూఖ్ కాల్ చేసి.. దయచేసి ఈ ఉంగరాన్ని వెనక్కి తీసుకోండి.. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది అని నాతో అన్నారు. అయితే ఒకసారి ఆయన కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అదే సమయంలో నా కారు ఇచ్చి ఆయనను ఇంటికి పంపించా. ఆ తర్వాత నా కారు షారూఖ్‌కు నచ్చడంతో దాదాపు మూడు నెలలపాటు తన వద్దే ఉంచుకుని వాడుకున్నారని' మికా పంచుకున్నారు.
ఇటీవల హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీలో తాను షారుఖ్ ఖాన్‌తో సరదాగా గడిపామని మికా సింగ్ వెల్లడించారు. ఈ పార్టీకి హీరో రణ్‌వీర్ సింగ్ కూడా హాజరయ్యాడని చెప్పాడు. పార్టీ అయిపోయిన తర్వాత అంతా కలిసి ఓకే కారులో వెళ్లామని వివరించారు. షారూఖ్ వినియాగించిన కారు తన వద్దే ఉంచుకున్నానని మికా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment