
‘‘కన్నప్ప’(Kannappa) మూవీ అవకాశాన్ని రెండు సార్లు తిరస్కరించాను. కానీ, భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా ఒప్పుకునేలా చేసింది. చాలా శక్తిమంతమైన కథ ఇది. లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా ఉంది’’ అని అక్షయ్ కుమార్ తెలిపారు. విష్ణు మంచు(Vishnu Manchu) హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’.
ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. గురువారం ముంబైలో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’ కేవలం ఓ సినిమా కాదు.. నా జీవిత ప్రయాణం.
కన్నప్ప కథతో నాకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది’’ అని చెప్పారు. ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ–‘‘విష్ణు, అక్షయ్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలను డైరెక్ట్ చేయడం అద్భుతమైన అనుభవం. వారి పాత్రలు తెరపై అద్భుతం చేయబోతున్నాయి’’ అన్నారు. ఈ ఈవెంట్‌లో చిత్ర ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి పాల్గొన్నారు.