స్వర్గం కొత్త కాంతులతో వెలుగుతుంది | Movie Celebrities condolences after passing away of Lata Mangeshkar | Sakshi
Sakshi News home page

స్వర్గం కొత్త కాంతులతో వెలుగుతుంది

Published Mon, Feb 7 2022 4:51 AM | Last Updated on Mon, Feb 7 2022 4:51 AM

Movie Celebrities condolences after passing away of Lata Mangeshkar - Sakshi

భారత గానకోకిల, దిగ్గజ గాయని లతా దీదీ ఇక లేరు. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. సంగీతం సజీవంగా ఉన్నంత వరకు ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
– చిరంజీవి

లతాగారి మరణం దేశానికే కాదు.. సంగీత ప్రపంచానికే తీరని లోటు. దేశంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారామె. విదేశాలు కూడా పురస్కారాలతో ఆమెను గౌరవించడం గర్వకారణం.
– బాలకృష్ణ

నైటింగేల్‌ ఇక లేరని తెలిసి నా హృదయం ముక్కలయింది. లతాగారు ఎందరికో స్ఫూర్తి ఇచ్చారు. ఆమె లేని లోటు ఎప్పటికీ శూన్యాన్ని సృష్టిస్తుంది.
– వెంకటేశ్‌

లతాజీ మరణం తీరని లోటు. భారతదేశ నైటింగేల్‌కి నా హృదయపూర్వక నివాళులు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.
– రాజమౌళి, డైరెక్టర్‌

భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార, గాన కోకిల లతా మంగేష్కర్‌గారు తుదిశ్వాస విడి చారన్న విషయం ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికే తీరని లోటు. బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె నిలిచి, గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం.
– పవన్‌ కల్యాణ్‌

మా గానకోకిల మూగబోయింది. మా మధ్య భౌతికంగా మీరు లేకపోవచ్చేమో కానీ మీ పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. పాటలో ఒకే ఒక్క లైన్‌తో మమ్మల్ని ఎన్నో అనుభూతులకు గురి చేశారు.
– మహేశ్‌బాబు

పాకిస్తాన్‌–బర్మా యుద్ధంలో బర్మా తరఫున యుద్ధం చేస్తున్న మన దేశ సైనికులు చాలామంది అమరులయ్యారు. కొంతమంది గాయాలపాలయ్యారు. ఆ సమయంలో లతా మంగేష్కర్‌తో పాటు చాలామంది ప్రముఖులు సైనికులను పరామర్శించడానికి బర్మా వెళ్లారు. గాయపడ్డ ఓ సైనికుడు ‘లతాగారిని చూడాలని, ఆమె పాట వినాలని ఉంది’ అని డాక్టర్‌కి చెప్పాడు. లతగారు అతన్ని ఆలింగనం చేసుకుని, ‘ఆరాధన’ సినిమాలోని పాట పాడారు. ఆ పాటతో అతనిలో ఊపిరి వచ్చి కోలుకొని బతికాడు.. దటీజ్‌ లతా మంగేష్కర్‌.
– ఆర్‌. నారాయణమూర్తి

భారతీయ సినిమా నైటింగేల్‌ లతా మంగేష్కర్‌ను కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మా సంస్థ నిర్మించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్ల చీరకు..’ పాటకు మీరు (లతా మంగేష్కర్‌) ఇచ్చిన వాయిస్‌ మీతో మాకు ప్రత్యేక అనుబంధాన్ని కలగజేసింది.
– వైజయంతి మూవీస్‌

భారతీయ సంగీతంలో ఆరేడు దశాబ్దాలుగా తన అద్భుత స్వరంతో సంగీత శ్రోతలను మైమరచిపోయేలా చేశారు లతా మంగేష్కర్‌గారు. ఆమె మరణం నాలో ఓ శూన్యతను నెలకొల్పింది. ఈ శోకం నుంచి నేను ఎలా బయటకు రావాలో అర్థం కావడం లేదు. ఒక్క మ్యూజిక్‌ ఇండస్ట్రీకే కాదు.. ఆమె మరణం ప్రపంచానికే తీరని లోటు. కానీ ఆమెతో కలిసి పని చేశాననే భావన నన్ను కాస్త ఓదార్చుతోంది. మనందరి హృదయాల్లోని లతా మంగేష్కర్‌ స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది.  
– ఇళయరాజా

మా నాన్నగారితో (సంగీతదర్శకుడు ఆర్కే శేఖర్‌) లతా మంగేష్కర్‌గారు వర్క్‌ చేశారు.  అప్పట్లో నేను ఆమె రికార్డింగ్స్‌ను చూస్తూ ఎంతో స్ఫూర్తి పొందాను. ప్రతి లిరిక్‌ను ఎంతో స్పష్టంగా, ఎంతో బాగా పాడతారామె. భారతీయ సంగీతంలో ఆమె ఓ భాగం. లతగారు పాడిన పాటలకు నేను సంగీతం అందించడం, ఆమెతో కలిసి పాటలు పాడటం, కలిసి స్టేజ్‌ షేర్‌ చేసుకోవడం వంటివాటిని నేను మర్చిపోలేను. ఆమె నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను.
– ఏఆర్‌ రెహమాన్‌

మ్యూజిక్‌ ఇండస్ట్రీకి బ్లాక్‌ డే. లతాగారిలాంటి సింగర్‌ వస్తారా? అనేది నాకో క్వశ్చన్‌ మార్క్‌.  లతా మంగేష్కర్‌గారిని రెండుసార్లు కలిసే అవకాశం నాకు లభించింది. ముంబైలోని ఉన్నప్పుడు ఆమె స్టూడియోలో వర్క్‌ చేసేవాడిని. ఓ సందర్భంలో ఆవిడ అక్కడకు వచ్చారు. అప్పుడు అక్కడి వారు నన్ను ఆవిడకు పరిచయం చేశారు. అంత పెద్ద గాయని అయ్యుండి ‘నమస్తే.. అనూప్‌ జీ’ అని ఎంతో గౌరవంగా మాట్లాడారు.
– అనూప్‌ రూబెన్స్‌

భారతదేశం పాటలు పాడుతున్నంత కాలం లతా మంగేష్కర్‌ జీవించే ఉంటారు. ఆమె అద్భుతమైన సింగరే కాదు. మంచి మానవతావాది కూడా. నా దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘లేకిన్‌’ (1991)కు లతా మంగేష్కర్‌ ఓ నిర్మాత. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో చిత్రయూనిట్‌ సభ్యులకు ఆమె బహుమతులు ఇచ్చారు. ‘లేకిన్‌’ సినిమాలోని పాటకు బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌గా లతా మంగేష్కర్‌కు జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. గౌతమ బుద్ధుని ప్రతిమలను సేకరించే అలవాటు నాకు ఉందని తెలుసుకున్న ఆమె నాకు నాలుగు బుద్ధుని ప్రతిమలను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆరు నెలల క్రితం కూడా ఆవిడ నాకు ఓ గౌతమ బుద్ధుని ప్రతిమను బహుమతిగా పంపారు.    ఆమె వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం.
– గుల్జార్‌

లతా మంగేష్కర్‌గారి మరణం తీరని లోటు. ఆమె పాటలతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.
– శత్రుఘ్న సిన్హా

కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్‌గారితో హాస్పిటల్‌లో మాట్లాడాను. లతా మంగేష్కర్‌గారు తిరిగి కోలుకుంటారని డాక్టర్స్‌ చెప్పేవారు. కానీ ఊహించనిది జరిగింది. నా జీవితంలో నన్ను ఎన్నోసార్లు మోటివేట్‌ చేశారు. ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉంది.
– ధర్మేంద్ర

ఆమె మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఎన్నో శతాబ్దాలు నిలిచి ఉండగల స్వరం మనకు దూరమైపోయింది. ఆ స్వరం ఇప్పుడు స్వర్గంలో ప్రతిధ్వనిస్తోంది.
– అమితాబ్‌ బచ్చన్‌

లతా మంగేష్కర్‌గారు ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఉన్నవారు. ఆమె పాడిన ఎన్నో హిట్‌ సాంగ్స్‌లో నా పెర్ఫార్మెన్స్‌ ఉండటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి 6 బ్లాక్‌ డే. వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటు. లతా  స్వరం ఇకపై స్వర్గంలో వినిపిస్తుంది.        
– హేమమాలిని

మన నైటింగేల్‌ను మిస్‌ అవుతున్నాం. కానీ మీ (లతా మంగేష్కర్‌) స్వరం మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.
– సల్మాన్‌ ఖాన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement