సినిమా రంగంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రతిభ కంటే అదృష్టానికే విలువెక్కువ. గుడ్డి నమ్మకాలకు గౌరవిస్తూ పేర్లను కూడా మార్చుకుంటారు. ఈ సెంటిమెంట్ స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి వింత అలవాట్లు, సెంటిమెంట్లను ఫాలో అవుతున్న కొంతమంది బాలీవుడ్ స్టార్స్ గురించి..
పేరుతో సక్సెస్ రాదు.. చేసే పనితో వస్తుంది అకుంటాం. కానీ బాలీవుడ్లో దీనికి రివర్స్! పేరులో అక్షరాలు కరెక్ట్‌గా ఉంటేనే సక్సెస్ అని నమ్ముతారు బాలీవుడ్ సెలబ్రిటీస్‌లో చాలా మంది. సీనియర్ మోస్ట్ యాక్టర్ సంజయ్ దత్ ఇలాంటి నమ్మకాల్లోనూ సీనియరే. చిన్నప్పుడు స్కూల్లో అతని పేరు ‘Sunjay dutt’గా నమోదయింట. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సక్సెస్ అంతత్వరగా దరి చేరకపోయేసరికి ‘Sajay’లోని‘U’అక్షరాన్ని తీసేసి ఆ స్థానంలో ‘A’ని చేర్చి ‘Sanjay’గా మార్చుకున్నాడట. అప్పటి నుంచి సక్సెస్ ఆ పేరుకు సఫిక్స్ అయిందని అతని స్ట్రాంగ్ బిలీఫ్!
బాలీవుడ్ నటుడు గోవిందా ఏదైనా షూటింగ్‌లో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి విజిటర్ ఎవరైనా రెడ్ కలర్ డ్రెస్‌లో వస్తే ఆ విజిటర్‌ని కొట్టేసేంత ఆవేశాన్ని, కోపాన్నీ కంట్రోల్ చేసుకుంటాడట. కారణం షూటింగ్స్‌లో రెడ్ అతనికి యాంటీసెంటిమెంట్ అట. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఇంటి భోజనమే తింటాడు. ఈ సెంటిమెంట్ ఎంతదూరం వెళ్లిందంటే ఔట్‌డోర్ షూటింగ్స్‌కి తనింటి గేదేనే తీసుకెళ్లేంత. ఈ గేదె పాలతో కాచిన కాఫీ, టీలనే తీసుకుంటాడని బాలీవుడ్ వర్గాల భోగట్టా.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా సెంటీఫెలోనే.. న్యూమరాలజీ విషయంలో! ఆయనకు నంబర్ 9 పట్ల అబ్సెషన్. రెమ్యునరేషన్ కూడా టోటల్ నైన్ వచ్చేలా తీసుకుంటాడట. అంటే 5 కోట్లు, 63 కోట్లు, 72 కోట్లు.. ఇలా రెండు అంకెలను కూడితే 9(ఇండస్ట్రీలో తనకున్న డిమాండ్, తన సినిమాలకు ఉన్న మార్కెట్‌ను బట్టి) వచ్చేలా చూసుకుంటాడట. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. తెల్ల కాగితం మీద ‘ఓం’అని రాసి.. దానికి దండం పెట్టుకోందే ఏ కొత్త పనీ మొదలుపెట్టడట.
బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు రాజ్‌కుమార్ రావ్ అని అందరికీ తెలిసిందే! అయితే రావు అనేది అతని పెట్టుడు పేరు అని తెలిసింది మాత్రం కొందరికే! ఆ నటుడి అసలు పేరు రాజ్‌కుమార్ యాదవ్. ఈ పేరుతో కొనసాగినన్నాళ్లూ సినిమాల్లో అతనికి సహాయక పాత్రలే దొరికాయి. అవి ‘మంచి నటుడు’అని పేరు తెచ్చినా.. ముఖ్య పాత్రలను మాత్రం రప్పించలేకపోయాయి. సెంటిమెంట్ల ఊట అయిన సినిమా ఫీల్డ్‌లో ఎవరు సలహా ఇచ్చారో మరి.. తన పేరును మార్చుకున్నాడు. Rajkummar Rao అని! అంతే హీరో అయిపోయాడు. సింపుల్‌గా పేరు ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లో ఎక్స్‌ట్రాగా ఒక ‘M’ చేర్చి, యాదవ్‌ని డిలీట్ చేసి రావ్‌ని యాడ్ చేశాడు అంతే! చమత్కార్ హోగయా!
అమితాబ్ బచ్చన్‌కి ఉన్న మూఢనమ్మకాన్ని వింటే నిజంగానే విస్తుపోతారు. అమితాబ క్రికెట్‌కి వీరాభిమాని. అంత అభిమానం ఉన్నవాళ్లెవరైనా స్టేడియంలో కూర్చొని ఆటను చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోరు కదా! కానీ అమితాబ్ అలాంటి ప్యాన్ కదాఉ. లైవ్ మ్యాచెస్‌కి వెళ్లడు. టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తాడు. ఎందుకంటే తను స్టేడియంలో కూర్చొని ఆటను తిలకిస్తే.. తన ఫేవరేట్ టీమ్ ఓడిపోతుందని భయమట. ఒకటి రెండు సార్లు అలా జరిగిందట. అందుకే అప్పటి నుంచి ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఆటను టీవీలోనే చూస్తాడట.
జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లినా వెంట మెరుపు మెరుపుల గులాబీ రంగు వాటర్ బాటిల్‌ని క్యారీ చేస్తుందట. అంతేకాదు దానికి ‘చుస్కీ(సిప్)’అని పేరు కూడా పెట్టుకుందట. ఆ బాటిల్, ఆ పేరు ఎంతగా ఫేమస్ అయిందంటే.. జాన్వీ కపూర్ ఫ్యాన్ ఒకరు చుస్కీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను క్రియేట్ చేసేంతగా!
సల్మాన్ ఖాన్‌కి వేడి వేడి భోజనమే ఇష్టం. అయితే చద్దాన్నాన్ని డస్ట్‌బిన్‌లో పారేస్తాడా? అయ్యే లేఉద.. అన్నం పరబ్రహ్మా స్వరూపం అని గట్టిగా నమ్ముతాడు. మరైతే వేడి చేసుకుని తర్వాత పూటకు తినేస్తాడా? నో. ఒక్కసారి వండినవాటిని మళ్లీ వేడిచేయడం అనారోగ్యమనే ఆరోగ్య సూత్రాన్ని అస్సలు విస్మరించడు. మరేం చేస్తాడు? చద్దన్నానికి బటర్, పచ్చడి కలుపుకొని లాగిస్తాడట.
సోనమ్ కపూర్ అహుజా సెంటిమెంట్ వింటే విస్తుపోతారు. తను నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్‌లో గనుక తను పొరపాటున కిందపడితే ఆ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆమె నమ్మకం. అందుకే షూటింగ్ ముహూర్తం రోజు నుంచి షూటింగ్ ఆఖరి రోజు వరకు తను కిందపడిపోయే చాన్స్ కోసం ఎదురు చూస్తుంటుందట.
ఫిట్‌నెస్ క్వీన్ బిపాశా బసుకు దిష్టి మీద నమ్మకం ఎక్కువ. అందుకే ప్రతి శనివారం నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలు కొని వాటిని ఒక ఇనుప తీగకు గుచ్చి కారు విండ్ షీల్డ్‌కున్న రియల్ వ్యూ మిర్రర్‌కి వేలాడదీస్తుందట. ఈ ప్రాక్టీస్‌ని వాళ్లమ్మ నుంచి నేర్చుకుందట బిపాశా.
డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి గుర్తున్నాడు కదా! అతనికున్న నమ్మకం గురించి కూడా చదివేయండి. తను నటించే సినిమా షూటింగ్ ముహుర్తాలు ఎగ్గోడ్తాడట. తను షూటింగ్ ముహూర్తానికి హాజరయిన సినిమాలన్నీ ఘోరంగా ఫ్లాప్ అవడంతో తను ముహుర్తానికి అటెండ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే నమ్మకం ఏర్పడిపోయిందట అతనికి. ఇక అప్పటి నుంచి తన సినిమా ముహుర్తాలకు ఆబ్సెంట్ వేయించుకోవడం మొదలుపెట్టాడట.
నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదా సీదా కాటుక కాదు.. పాకీస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్‌గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా!
Comments
Please login to add a commentAdd a comment