పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి!
ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం..
జాన్వీ కపూర్
దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్‌చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది.
సైఫ్ అలీఖాన్
తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్‌గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట!
బాబీ డియోల్
బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌లో విలన్‌గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు.
ఇమ్రాన్ హష్మీ
ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్‌లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు.
సంజయ్ దత్, రవీనా టండన్
సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు.
అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్‌గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment