ఉత్తరాది, దక్షిణాది వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి ఆహార శైలి, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. దివంగత నటి శ్రీదేవిది సౌత్ అయితే ఆమె భర్త బోనీకపూర్‌ది నార్త్. దీనివల్ల ఉదయం అల్పాహారం చేసేటప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్నతో గొడవపడేదని చెప్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్.
టిఫిన్ దగ్గర గొడవ
దేవర ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. ఉదయం ఆలూ పరాటా తినే నాన్న... అమ్మ వల్ల ఇడ్లీ సాంబార్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ నార్త్ ఇండియన్‌లా గొడవపడేది అని పేర్కొంది. నార్త్‌లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తారక్.. శ్రీదేవి అని టక్కున సమాధానమిచ్చాడు.
ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే!
అలాగే జాన్వీ గురించి ఓ చాడీ చెప్పాడు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం తినిపించాను. నేను ముంబై వచ్చినప్పుడు మాత్రం ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం లేదా హోటల్ ఫుడో పంపించలేదని తారక్ అనడంతో జాన్వీ పగలబడి నవ్వేసింది. అటు సైఫ్.. సౌత్‌లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు శ్రీదేవి అని బదులిద్దామని రెడీగా ఉన్నానన్నాడు. ఈ ఫన్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. పూర్తి ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 28న ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment