
సాక్షి,హైదరాబాద్: కోట్లాదిమంది అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కానరాని లోకాలకు తరలిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఆ దివికేగిన ఎస్‌పీబీని తలచుకుంటే ఇప్పటికీ అభిమానులు గుండెలు కన్నీటి సంద్రాలే.
సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించి అపుడే సంవత్సరం గడిచిపోతోంది. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార గత ఏడాది సెప్టెంబరు 25న ఆగిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎంతోమంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. కేవలం గాయకుడిగానే కాదు డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటు కున్నారు. తన ప్రయాణాన్ని అలా అప్రతిహతంగా కొనసాగిస్తున్న తరుణంలో.. మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది.
రానున్న బాలూ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని ‘నీవు లేకపోయినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు ఆయన జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలను మళ్లీ గుర్తు చేసుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికల్లో ఆయన పాటలతో ఘన నివాళులర్పించేందుకు సిద్ధ మవుతున్నారు. ప్రఖ్యాత గాయని ఉష ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. లెజెండరీ గాయకుడు దివంగత పద్మవిభూషణ్ ఎస్‌పీబీ వారసత్వాన్ని కొనసాగించేలా సెప్టెంబర్ 25న ఒక సంస్మరణ కార్యక్రమాన్ని, ఆ తరువాత ఆయన పాటలతో ఒక స్వరఝరి నిర్వహిస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment