SP Balasubramanyam
-
అలరించిన బాలగాన గంధర్వులు
దివికేగిన ‘బాలు’ స్మృతిలో భువిలోని బాలలు గాన నివాళులర్పించారు. ప్రముఖ సినీ గాయ కులు స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నివాళిగా నగరానికి చెందిన మ్యూజిక్ రేడియో స్టేషన్ మ్యాజిక్ 106.4 ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో ఎస్పీబీ జయంతి రోజున బాల గాన గంధర్వులు – సీజన్ 4 ఫైనల్స్ ఆదివారం జరిగాయి. ఈ పోటీలో 15 ఏళ్ల లోపు బాల బాలికలు వందలాదిగా పోటీపడ్డారు. వీరిలో టాప్ 5 కంటెస్టెంట్స్ కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ వేదికగా ఫైనల్స్‌లో పోటీపడ్డారు. వీరిలో విశ్వదత్త (9) విజేతగా నిలవగా, లిఖిల, శ్రీ వైష్ణవిలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. న్యాయనిర్ణేతలు సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, హరిణి, సాయి చరణ్ పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆర్జేలు నాని, రవళి, ప్రతీక, సంగీత తమ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. మ్యాజిక్ 106.4 ఎఫ్ఎమ్ ప్రతినిధులు బద్రినాథ్, ధీరజ్, కృష్ణమోహన్, భవానీ పాల్గొన్నారు. -
నేను కృష్ణ గారికి పాడను అంటే అప్పుడు ఆయన అన్న మాట..!
-
పాటల ప్రపంచంలో రారాజు బాలసుబ్రహ్మణ్యం తృతీయ వర్ధంతి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు. పాటల పల్లకిలో నెలరాజుగా గుర్తింపు పొందారు. వేల పాటలు పాడి తెలుగువారికి ఎనలేని గుర్తింపు తెచ్చారు. అమరగాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. బాలు లేని పాటల ప్రపంచంలో ఎంతోమంది యువ గాయకులు ఆయన బాటలో ముందుకు నడుస్తున్నారు. ఆయన స్పూర్తితో దశదిశలా సంగీత పరిమళాలను విరజిమ్ముతున్నారు. అర్ధ శతాబ్దకాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వేశారు. ఎన్నో పాటలతో మనల్ని ఉర్రూతలూగించిన ఈ 'గాన చంద్రుడు' మనల్ని విడిచిపెట్టి నేటికి మూడేళ్లు. 2020 సెప్టెంబర్ 25న ఆయన కరోనా మహమ్మారి వల్ల మనకు దూరం అయ్యారు. నేడు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా సాక్షి నుంచి ప్రత్యేక కథనం. తండ్రే తొలి గురువు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. బాలు అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రే ఆయనకు తొలి గురువు అయ్యారు. ప్రాథమిక విద్యను చిత్తూరు జిల్లా నగరిలో తన మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసిన బాలు హైస్కూల్ విద్యను మాత్రం శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పట్లో మన బాలు చదువు, ఆటల్లో ప్రథమ స్థానంలో ఉండేవారు. అనంతపురంలో ఇంజనీరింగు సీటు వచ్చినా.. శ్రీకాళహస్తిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరిక ననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. అలా ఇంజినీరింగ్ కోర్సు చదువుతుండగానే బాలుకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 'మహమ్మద్ బిన్ తుగ్లక్' అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద మెరిశారు. పలు వేదికలపై కూడా ఆ కాలం లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు. బాలు తొలిపాట ఈ సినిమాలోనే 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బాలుకు మాట ఇచ్చారు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు బాలు. 'ఏమి ఈ వింత మోహం' అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి. సుశీల, కల్యాణం రఘురామయ్య, పి. బి. శ్రీనివాస్‌లతో కలిసి పాడారు. అలా 1967 జూన్ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ‘బాలు’ ప్రభంజనానికి తెరలేపింది. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించారు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్‌తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి బాలుకు అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు 'కోదండపాణి ఆడియో ల్యాబ్స్' అని అతని పేరే పెట్టుకున్నారు బాలు. సంగీతం ఎవరి దగ్గరా నేర్చుకోకపోయినా రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండటంతో ట్యూను ఒకసారి వింటే యథాతథంగా పాడగలిగే టాలెంట్ బాలుకి సొంతం. ప్రపంచంలోనే అరుదయిన రికార్డు సృష్టించిన మన బాలు 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు. డబ్బింగ్ చెప్పడంలోనూ బాలుకు సాటిలేరు కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో సంగీత దర్శకుడు కె.చక్రవర్తి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా బాలు మారారు. అందులో కమల్ హాసన్‌కు చక్రవర్తి డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక క్యారెక్టర్‌కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. పసివాడిప్రాణం చిత్రంలో రఘు వరన్కు చెప్పిన డబ్బింగ్ సిసినిమాకే హైలెట్‌గా నిలిచింది. అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్స్లేకు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పడం విశేషం. నటుడిగా చివరి చిత్రం ఇదే 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదం అయింది. ఆయన నటించిన వాటిలో ఎక్కువగా అతిథిగా పాత్రలైనా అన్నీ గుర్తుండిపోయేవే. ప్రేమికుడు, రక్షకుడు, పవిత్రబంధం, మిథునం తదితర చిత్రాల్లో ఆయన నటనతోనూ మెప్పించారు. చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన ‘దేవదాస్’లో మెరిశారు. ఎప్పటికీ చెరగని రికార్డులతో పాటు మధుర స్మృతులు ► భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అవార్డులను బాలు అందుకున్నారు. ► ‘శంకారభరణం’(1979) చిత్రానికి గానూ తొలిసారి జాతీయ అవార్డును దక్కించుకున్న బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు ఉన్నాయి. ► ‘మైనే ప్యార్‌కియా’ చిత్రానికి గానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న బాలు ఖాతాలో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ► 29 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ► 2016లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ► అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన ‘గాంధీ’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన కింగ్ బెన్‌స్లేకు ఎస్పీబీనే డబ్బింగ్ చెప్పారు. ► 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40 వేలకు పైగా పాటలతో మెప్పించిన బాలు ► లిపి లేని భాషలు కొంకణి, తులులోనూ పాటలు పాడిన బాలు. ► ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తొలిపాట పాడింది (1966)లో 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ' ► 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రానికి గాను తన మొదటి రెమ్యురేషన్ రూ.300 ఇచ్చారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం కావడం విశేషం. ► 'మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు' అంటూ గుక్కతిప్పుకోకుండా రాధికకు ప్రేమ కవిత్వం వినిపిస్తూ కనిపించే బాలసుబ్రహ్మణ్యాన్ని ఇప్పటికీ మరిచిపోలేరు ఆయన అభిమానులు. ► ప్రేమికుడులో ప్రభుదేవాతో పోటీపడి స్టైలిష్ స్టెప్లు వేశారు బాలసుబ్రహ్మణ్యం. ''అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే'' అనే పాటలో కనిపించిన బాలు అందులో కొడుకు పాత్రలో ఉన్న ప్రభుదేవాతో సమానంగా డ్యాన్స్ చేశారు. సాక్షి- వెబ్ డెస్క్ ప్రత్యేకం -
మరచిపోలేని మహనీయుడు
మద్రాసులో బడిలో చదువు కొంటున్న రోజులలో ఘంటసాల గారి ఇంటిముందునుంచి వెడుతూ – ఆ వాకిలి ముందు ఆగి అక్కడ ఉన్న ఆయన పేరు చదివి సంతోషిస్తూ ఉండేవాడిని. యాభై అయిదేళ్ల కిందట ఒక వేసవి మధ్యాహ్నం ఆయనను ఎట్లాగైనా చూసి మాట్లాడాలని ఆయన ఇంటికి వెళ్ళాను. ఎండవేళ వచ్చినందుకు బాధ పడి మజ్జిగ తెచ్చి ఇచ్చి నన్ను తాగమన్నారు. నా గురించీ, నా చదువు సంధ్యల గురించి అడిగారు. ఆయన అంటే నాకు చాలా అభిమానమనీ, ఆయన జీవిత చరిత్ర రాయాలని ఉందనీ చెబితే నవ్వి– ‘ముందు బాగా చదువుకో నాయనా! తర్వాత చూద్దాం’ అన్నారు. 1969 నుంచి ఆయనను నేను తరుచుగా కలుసు కొంటూ ఉండేవాడిని. ఎంత పనితొందరలో ఉన్నా కాసేపయినా నాతో మాట్లాడేవారు. ఆ అభిమానంతో – ఆయన విదేశీ యాత్రల వేళ– విదేశాలలో పాడడానికి ఎన్నుకొన్న పాటలను నాకు వినిపించేవారు. ఆ సందర్భాలలో – నేను ఒక్కడినే శ్రోత కావడం నా భాగ్యం. ఆయన విదేశీ యాత్రలకు బయలుదేరేముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో – నేను ఆయన గురించి తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో నా చిన్న తనపు మిడిమిడి జ్ఞానంతో రాసిన కవితలు వినిపించాను. ఆయన వాటి ప్రతులు తీయించి పత్రికల వారికి పంపడం ఒక గొప్ప అనుభవం. విదేశీయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఆ విశేషాలు పత్రికల వారితో ముచ్చ టించడానికి ఒక సాయంకాలం విందు ఏర్పాటు చేశారు. దానికి నన్నూ రమ్మన్నారు. ఆ గోష్ఠిలో ఇమడలేనేమో అని నేను ఆ విందుకు వెళ్లలేదు. ఆ కార్యక్రమం అయిన కొన్నాళ్ల తర్వాత ఒక సాయంకాలం నేను ఆయనను చూడడానికి వెళ్లాను. రికార్డింగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఘంటసాల నన్ను చూసి ‘ఏం బాబూ! ఆరోజు పార్టీకి రాలేదు?’ అన్నారు. నేను సమాధానం చెప్పడానికి తట పటాయిస్తుంటే ‘నీకు ఇప్పుడే ఇక్కడే పార్టీ ఇస్తున్నాను నా పక్కన కూర్చో... రా...’’ అన్నారు. భార్య సావిత్రమ్మ గారికి ఆ సంగతి చెప్పారు. వేడి వేడి ఇడ్లీలు, లడ్లు, కాఫీలతో సాగిన ఆ ప్రత్యేకమైన విందు నేను ఏనాటికీ మరచిపోలేనిది. అది ఆయన నా మీద చూపిన వాత్సల్యానికి గుర్తు. ఆయన నాతో చాలా విషయాలు మాట్లాడేవారు. ఒకసారి చదువు గురించిన ప్రస్తావన వస్తే – చదువు కొంటున్న రోజులలో చదువు మీద దృష్టి ఉంచాలనీ, వయసు చిన్నదిగా ఉన్నపుడే చదవగలిగినంత చదువులు చదవాలనీ చెప్పారు. ఆయన పాటలు వినిపించడానికి తమ దగ్గరికి వచ్చే యువతీయువకులకు – సంగీతంతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేవారు. ఆయన వాక్శుద్ధి అద్వితీయం. ఒక వర్ధమాన సినిమా రచయిత, పెద్ద దర్శకులు కాగలరని ఘంటసాల గారు చెప్పారు. ఆ తరువాత దర్శకులు కూడా అయిన ఆ రచయితే దాసరి నారాయణ రావుగారు! చిత్తూరులో ఒక బాలుణ్ణి చూసి – ‘బాగా చదువుకో బాబూ! పెద్ద పెరిగాక ఏం కావాలనుకుంటున్నావు?’ అని అడిగితే ఆ బాలుడు తనకు గాయకుడు కావాలని ఉందన్నాడు. ‘కాదు బాబూ! నీవు బాగా చదువుకొని కలెక్టర్ కావాలి’ అన్నారు ఘంటసాల గారు. ఆ బాలుడు ఉత్తరోత్తర కలెక్టర్ అయ్యారు. కలెక్టర్ అయిన ఆ బాలుడి పేరు – కె. చంద్రమౌళి. నాకు మంచి ఉద్యోగం దొరికి నేను పెద్ద అధికారి కాగలననీ ఆయన దీవించారు. ఆ దీవెన ఫలించింది. నేపథ్య గాయకులలో ‘మీ తర్వాత ఎవరు?’ అని అడిగితే ‘ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం’ అన్నారు ఆ ఘంట సాల. ఆ మాటా నిజం అయింది. ఆయన జీవిత చరిత్ర రాయడానికి నాకు అనుమతి ఇవ్వడం, నన్ను ఆశీర్వదించడం నాకు దొరికిన గొప్ప అదృష్టం. భాగ్యం. అర్ధంతరంగా అస్తమించిన ఆ అమృత మూర్తి అంతిమ యాత్రవేళ ఆయన భౌతిక కాయాన్ని నేను కూడా మోశాను. ఆ బాధ మాటలలో చెప్పలేనిది. తమ సంగీతం ద్వారా ఇంకా జీవించి ఉన్న ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. వ్యాసకర్త ఆకాశవాణి పూర్వసంచాలకులు,ఘంటసాల జీవిత చరిత్ర ‘మన ఘంటసాల’ రచయిత డాక్టర్ పి. ఎస్. గోపాలకృష్ణ -
సినీ పరిశ్రమకు అండగా నిలిచిన సీఎం జగన్
సాక్షి, పాత గుంటూరు: తెలుగు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్.కోటి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గుంటూరు నగరం నడిబొడ్డున స్థానం కల్పించారని తెలిపారు. గుంటూరు నాజ్ సెంటర్లోని ఐలాండ్‌లో కళాదర్బార్ సంస్థ వ్యవస్థాపకుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకులు కోటి... ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావు, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడుతో కలిసి బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ బాలు తన మొదటిపాట నుంచి అన్ని పాటలు పాడి తనను ఆశీర్వదించారని అన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించిన రంగారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాలు పాడిన పాటలను కోటి ఆలపించి అభిమానులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో విగ్రహ శిల్పి రాజ్‌కుమార్ వడయార్, కార్పొరేటర్లు, విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కన్నీళ్లకే కన్నీరొచ్చే...నీ పాటే శరణ్యం
సాక్షి,హైదరాబాద్: కోట్లాదిమంది అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కానరాని లోకాలకు తరలిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఆ దివికేగిన ఎస్పీబీని తలచుకుంటే ఇప్పటికీ అభిమానులు గుండెలు కన్నీటి సంద్రాలే. సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించి అపుడే సంవత్సరం గడిచిపోతోంది. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార గత ఏడాది సెప్టెంబరు 25న ఆగిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతోమంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. కేవలం గాయకుడిగానే కాదు డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటు కున్నారు. తన ప్రయాణాన్ని అలా అప్రతిహతంగా కొనసాగిస్తున్న తరుణంలో.. మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. రానున్న బాలూ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని ‘నీవు లేకపోయినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు ఆయన జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలను మళ్లీ గుర్తు చేసుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికల్లో ఆయన పాటలతో ఘన నివాళులర్పించేందుకు సిద్ధ మవుతున్నారు. ప్రఖ్యాత గాయని ఉష ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. లెజెండరీ గాయకుడు దివంగత పద్మవిభూషణ్ ఎస్పీబీ వారసత్వాన్ని కొనసాగించేలా సెప్టెంబర్ 25న ఒక సంస్మరణ కార్యక్రమాన్ని, ఆ తరువాత ఆయన పాటలతో ఒక స్వరఝరి నిర్వహిస్తున్నట్టు ఫేస్బుక్లో వెల్లడించారు. -
ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు సుపరిచితం. -
దయచేసి దుష్ప్రచారం చేయొద్దు: ఎస్పీ చరణ్
సాక్షి, చెన్నై: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులకు సంబంధించి చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి, బాలు ఫ్యామిలీకి మధ్య వివాదం నడిచిందనే వార్తల నేపథ్యంలో ఎస్పీ చరణ్ స్పందించారు. కొంత మంది కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో నాన్నగారి ట్రీట్మెంట్కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించిందని వెల్లడించారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అనారోగ్యం బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నపట్పికీ ఆరోగ్యం తిరగబెట్టడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం అంతిమ సంస్కారాలు జరిగాయి. తమిళనాడు సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించింది. (చదవండి: పాట కోసం రథమే వేసుకొచ్చావ్!) -
నా పాటలను మీరు పాడుతున్నారు అన్నయ్యా అన్నాను – మనో
‘‘సినీ పరిశ్రమలో ఇంత ప్రయాణం చేసిన గాయకుడు ఎవ్వరూ లేరు. ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ. పాట వినేవాళ్లు ‘భలే వినసొంపుగా ఉందే’ అంటారు. కానీ అది అలా తయారవడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. అన్నయ్య (బాలూని మనో అలానే పిలుస్తారు) ప్రయాణం చాలా గొప్పది’’ అన్నారు గాయకుడు మనో. బాలూతో తన సాన్నిహిత్యం గురించి, ఇతర విశేషాలను ఇలా చెప్పారు. ► బాలూగారితో మీ పరిచయం.. ప్రయాణం? 14వ ఏట ఎమ్మెస్ విశ్వనాథన్‌గారి దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్‌గా చేరాను. అప్పుడు బాలూగారితో పరిచయం ఏర్పడింది. ఆయన అప్పుడు నా మీద ఎలాంటి ప్రేమ కురిపించారో ఎప్పటికీ అదే ప్రేమ చూపించారు. విశ్వనాథన్‌గారి తర్వాత నేను చక్రవర్తిగారి దగ్గర ట్రాక్ సింగర్‌గా చేసేవాణ్ణి. మెయిన్ సింగర్ పాట పాడకముందు ఆ పాట ఎలా ఉంటుంది అని ముందు మేము పాడి రికార్డ్ చేయడం మా పని. ఆ తర్వాత వాళ్లు ఎంత అందంగా పాడతారో చూడటం నా పని. పాటలో లీనమైపోయి పాడుతుంటారు. స్క్రీన్ మీద 30–40 శాతం ఆర్టిస్టులు నటిస్తే చాలు.. గాయకులు తమ పాట ఎక్స్ప్రెషన్తో ఆ పాటను హిట్ చేస్తారు. పాటకు ప్రాణం పోసిన మొదటి వ్యక్తి బాలూగారు. భాషతో, సంగీత దర్శకుడితో పని లేదు. ఈ ట్యూన్‌కి నా గొంతుతో ఏ విధంగా జీవం పోయగలను? అని తపించేవారు. నేను ఆయన దగ్గర గమనించిన గొప్ప విషయాల్లో అదొకటి. ► ట్రాక్ సింగర్ నుంచి గాయకుడిగా మారి, బాలూగారితో కలిసి పాటలు పాడారు... అదంతా ఇళయరాజాగారు పెట్టిన బిక్ష. ఆయన పాడించడంతో మిగతావాళ్లు కూడా నన్ను ప్రోత్సహించడం మొదలెట్టారు. యస్పీబీగారితో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడానికి దోహదపడింది ఇళయరాజాగారి ప్రోత్సాహమే. అలాగే బాలూగారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. మేం ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్‌లు, మ్యూజిక్ షోలు చేశాం. ► తమ తోటివారిని ఎదగనివ్వకపోవడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం.. కానీ మీ విషయంలో అలా జరగలేదనుకోవచ్చా? మిగతావాళ్లను పైకి రానివ్వడేమో అని ఆయన గురించి కొందరు అనుకుంటారేమో. అయితే అన్నయ్యకు అంత ఆలోచించే టైమ్ ఉండేది కాదు. ఏయే పాటలు ఎవరు పాడితే బావుంటుందో దర్శక–నిర్మాతలు, సంగీతదర్శకులు ముందే అనుకుంటారు. వాళ్లకీ వీళ్లకీ ఇవ్వకూడదు అని ఆలోచించరు. అన్నయ్యకి అయితే ఎవరికి ఏ పాటలు ఇస్తున్నారో ఆలోచించే తీరిక ఉండేది కాదు. తనకు వచ్చిన పాటలు పాడడానికే టైమ్ సరిపోయేది. ఒక థియేటర్ నుంచి మరో థియేటర్‌కి పరుగులు తీసేవారు. పాటలు ఎవరితో పాడించాలనేది ఆయన చేతిలో ఉండదు. సినిమా ఓకే అవ్వగానే ‘మొత్తం పాటలు నేను పాడతాను. నాకే ఇవ్వండి’ అన్నట్టు ఏమీ ఉండదు. ఆయనకు ఆ అవసరమేంటి? ► ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య సరదా గొడవలు వచ్చాయా? ఆయన నాకు ఇచ్చిన చొరవ మామూలుది కాదు. ఒక్కోసారి నేను ఆయనతో ‘నేను పాడాల్సిన పాటలు నువ్వు పాడేశావు’ అని గొడవ పెట్టుకునేవాడిని. తమిళంలో ఆ పాట నేను పాడి ఉంటాను. తెలుగులో కూడా నేనే పాడాలి. స్టూడియోకి వెళ్తే సాహిత్యం పూర్తవ్వలేదనేవాళ్లు. తిరిగి వెళ్లిపోతుంటే ‘ఆ పెద్దాయన పాడేశారు’ అని అక్కడున్నవాళ్లు చెప్పేవాళ్లు. ఇలా చాలాసార్లు జరిగింది. అన్నయ్యతో గొడవపడుతూ ఇదే విషయం చెప్పాను. ‘మరి.. నువ్వు లోపలకి వచ్చి నాతో ఎందుకు చెప్పలేదు?’ అన్నారు. ‘నువ్వెందుకు పాడుతున్నావో నాకు తెలియదు. నీకు ఎలాంటి ఒత్తిడి ఉందో నాకు తెలియదు. ఒళ్లంతా నూనె పూసుకొని ఇసుకలో ఎంత పొర్లాడినా మనకు ఎంత మట్టి అంటాలో అంతే అంటుతుంది కదా’ అని నేనంటే, ‘ఇంత కల్మషం లేకుండా ఆలోచిస్తున్నావు కాబట్టే నువ్వు పైకొస్తున్నావు’ అని కౌగిలించుకొని ముద్దుపెట్టుకున్నారు. ► బాలూగారితో కలిసి విదేశాల్లో పలు షోస్ చేశారు. అప్పుడు జరిగిన సరదా సంఘటన ఏదైనా? చాలా ఉన్నాయి. ఒకటి చెబుతాను. ఓసారి అమెరికాలో షో చేయడానికి వెళ్లాం. తీరా నా సూట్‌కేస్ మిస్సయింది. నాకు వేసుకోవడానికి బట్టలు లేవు. అంటే.. కోటు అదీ లేదు. అక్కడే బాలూగారి కోటు కనిపించింది. ‘ఏంటీ.. కన్నుSనా కోటు మీద పడినట్టుంది’ అని అడిగారు. నాకు కావాలన్నాను. ‘లేదు.. ప్రోగ్రామ్ సెకండ్ హాఫ్ కోసం పెట్టుకున్న కోటు అది’ అన్నారు. సెకండ్ హాఫ్‌లో ఇచ్చేస్తాలే... అప్పుడు నువ్వు ఫస్ట్‌హాఫ్‌లో వేసుకున్న కోటు తీసి వేసుకుంటా అన్నాను. అలానే వేసుకున్నా. ఆయన కోటు నాకు మోకాలి కిందకు వెళ్లింది. నన్ను చూసి నవ్వారు. ఆ తర్వాత ఆ స్టేజ్ మీద కోటు గురించి చెప్పి, అందర్నీ నవ్వించాం. అలా సరదాగా ఆ ప్రోగ్రామ్ సాగింది. ► బాలూగారు ఇష్టంగా ఏం తినేవారు? ఆయన పూర్తి శాకాహారి. పప్పుల పొడిలో నెయ్యి, సాంబార్లో నెయ్యి, గడ్డ పెరుగు.. ఇలా ఉంటే చాలు. ఒక స్టూడియో నుంచి ఇంకో స్టూడియోకి వెళ్లే గ్యాప్‌లో కారులోనే తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నం తిన్న తర్వాత చాలాసార్లు ఐస్ క్రీమ్ తినేవారు. సింగర్స్ జాగ్రత్తగా ఉండాలి.. గొంతు పాడవుతుంది. ఐస్‌క్రీమ్ తినకూడదు వంటివి పాటించేవారు కాదు. అసలు ఒక సింగర్ పాటించాల్సినవి ఏమీ ఆయన పాటించలేదు (నవ్వుతూ). ఆయన్ని చూసి నేను కూడా చక్కగా ఏది అనిపిస్తే అది తినడం అలవాటు చేసుకున్నాను. ఇదే కాదు.. అన్నయ్య నుంచి చాలా నేర్చుకున్నాను. అంకితభావం, సరదాగా ఉండటం.. ఇలా చాలా విషయాల్లో నాకు ఆయన ఇన్స్పిరేషన్. ► అన్నయ్యా అని పిలిచేంత చనువు ఇచ్చారు మీకు.. అన్నయ్యను కాకాపట్టిన సందర్భాలేమైనా? (నవ్వుతూ).. నేను చక్రవర్తిగారి దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు నన్ను విదేశాలకు తీసుకెళ్లమని ఆయన్ను కాకాపట్టాను ఓసారి. ‘మీరు పాటలు పాడి అలసిపోతే కాళ్లు పడతాను. ఒళ్లు నొక్కుతా’ అని అన్నయ్యతో అంటే, ‘అరే.. నువ్వు ఇలా అడగక్కర్లేదు. ఎన్ని వందల దేశాలు తిరగాలని నీకు రాసుందో’ అని ఆశీర్వదించారు. అన్నయ్య ఆశీర్వాదబలం వల్ల ఇవాళ నాకు 17 పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవతలు తథాస్తు అన్నట్టున్నారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే అవి జరుగుతాయి. ► అవును.. మీ పెళ్లికి బాలూగారు సంతకం పెట్టారట కదా! నా పెళ్లప్పుడు మా మావగారు ‘పిల్లను జాగ్రత్తగా చూసుకుంటావని గ్యారెంటీ ఏంటి?’ అని అడిగితే, చక్రవర్తిగారిని, అన్నయ్యను పెళ్లికి రమ్మన్నాను. ఇద్దరూ వచ్చారు. అప్పటికి నేను కేవలం అసిస్టెంట్‌ని. నన్ను 3 ఇన్ 1 టేప్ రికార్డర్ అనేవాళ్లు. హార్మోనియం వాయించేవాడిని, పాటలు పాడేవాడిని. నోట్స్ రాసేవాడిని. కేవలం నా మీద ప్రేమతో అన్నయ్య వచ్చి సంతకం పెట్టారు గ్యారంటీగా! నాకు మనవళ్లు మనవరాళ్లు ఉన్నా ఇప్పటికీ ‘ఏరా మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా? నేనే సంతకం పెట్టా నీకు జాగ్రత్త’ అనేవారు. ప్రేమగా మందలించే అన్నయ్య లేరంటేనే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. ► ఇళయరాజాగారు, బాలూగారు మంచి స్నేహితులు. ఆ ఇద్దరికీ మధ్య మనస్పర్థలు రావడానికి కారణం బాలూగారు తన పాటలను ఎక్కడా పాడకూడదని రాజాగారు అనడమే అని అందరికీ తెలుసు. కానీ వేరే బలమైన కారణం ఏదైనా ఉందా? ఉంది.. ‘50 ఇయర్స్ ఆఫ్ యస్పీబీ ప్రోగ్రామ్’ చేయాలని అన్నయ్య కుమారుడు చరణ్ ప్లాన్ చేశాడు. అదే సమయంలో రాజాగారి కాన్సర్ట్ ఉంది. యస్పీబీ నా టూర్‌కి ఎలా అయినా వస్తాడని అన్నయ్యతో చెప్పకుండానే రాజాగారు ట్రూప్‌లో ఉన్న అందరికీ యూఎస్‌కి వీసాలు అప్లై చేసేశారు. చరణ్ కూడా అప్లై చేశాడు. అయితే ముందు రాజాగారు అప్లయ్ చేయడం వల్ల వీసాలు ఓకే అయ్యాయి. చరణ్ అప్లై చేసినప్పుడు ఎంబసీలో ఒకేసారి రెండుచోట్ల ఎలా పాడతారు? అని రాజాగారి డీటైల్స్ చూపించారు. ఇళయరాజాది ఫస్ట్ మా దగ్గరకు వచ్చింది.. అందుకే దాన్ని అప్రూవ్ చేస్తున్నాం అన్నారు. మరో ఆరు నెలలకు గానీ అప్రూవ్ చేయరు. దాంతో అన్నయ్య హర్ట్ అయ్యారు. ఎంతో ఇష్టపడి కొడుకు చేయాలనుకున్న ప్రోగ్రామ్ వాయిదా పడిందని బాధపడ్డారు. బాలూగారు రాకుండానే ఇళయరాజాగారి షోకి నేను మొయిన్ సింగర్‌గా వెళ్లి 8 షోలు సక్సెస్‌ఫుల్‌గా చేసి వచ్చాం. ఆర్నెల్ల తర్వాత బాలూగారు షో చేశారు. అప్పుడు ఇళయరాజాగారి షో చేసిన లేడీ ఆయనకు ఫోన్ చేసి ‘మీ షోలకే రాని బాలూగారు మీ పాటలు ఎందుకు పాడాలి?’ అన్నారు. దాంతో ‘నా పాటలు పాడాలంటే నా అనుమతి తీసుకోవాలి’ అని అన్నయ్యకు ఇళయరాజాగారు మెసేజ్ పెట్టారు. కేవలం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇదంతా జరిగింది. కాలం చేసిన ఎడబాటే కానీ కావాలని చేసింది కాదు. నిజానికి అన్నయ్య, రాజాగార్ల బంధం భార్యాభర్తల కన్నా ఎక్కువ. అందుకే యుద్ధం కూడా ఆ రేంజ్లో ఉందేమో. మూడేళ్ల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు. తర్వాత కలిసిపోయారు. అది మాకు ఆనందం. ► మరి.. ఆయన బదులు మీరు ఇళయరాజాగారి షోకి వెళ్లి పాడినందుకు బాలూగారికి కోపం రాలేదా? నా మీద ఏమీ లేదు. నేను లేకుండా షో చేస్తాడా అని రాజాగారి మీద ఇంకా కోపం పెరిగింది. మూడేళ్లు ఎడబాటు ఉన్నా 2019కి కలసిపోయారు. 2020లో అన్నయ్య–రాజాగారు చాలా షోలు చేయాలి. దాదాపు 15 షోలు క్యాన్సిల్ అయ్యాయి. మలేషియా, దుబాయ్, సింగపూర్, యూరప్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. సెప్టెంబర్‌లో యూఎస్ వెళ్లాలి. ఇప్పుడు ఆయన లేకుండా రాజాగారు పడుతున్న బాధ మాటల్లో చెప్పలేం. ఒంటరిని అయిపోయాననే బాధలో ఉన్నారాయన. ఈ ఏడబాటు నా వల్ల జరిగిందా? అని కుమిలిపోతున్నారు. స్నేహితుడిని మూడేళ్లు దూరం పెట్టానే? కరోనా వల్ల ఆఖరి చూపులు చూసుకోవడానికి లేదే అని బాధప డుతున్నారు. మరి.. 50 ఏళ్ల స్నేహం ఇద్దరిదీ. వాళ్ల జర్నీ మళ్లీ కొత్తగా ఈ ఏడాది ప్రారంభం అవుతుందనుకుంటే కరోనావల్ల బ్రేక్ పడింది. ఇప్పుడు శాశ్వత బ్రేక్ పడింది. -
ఆ పాట మీరు పాడొద్దని బాలూగారితో అన్నాను
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘంటసాలగారి తర్వాత ఏయన్నార్, ఎన్టీఆర్ సినిమాలకు మళ్లీ ఎవరు పాడతారు? మాధవపెద్ది సత్యం తర్వాత ఎస్వీ రంగారావు, రేలంగి నరసింహారావులకు ఎవరు పాడతారు? పిఠాపురం నాగేశ్వరరావుగారి తర్వాత పద్మనాభం, రాజబాబుగార్లకు ఎవరు పాడతారు? పీబీ శ్రీనివాస్‌గారి తర్వాత కాంతారావుగారు, హరనాథ్‌గారికి ఎవరు పాడతారు? అని అనుకునే దÔ¶ లో ‘నేను పాడతాను’ అంటూ ఆ మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. టాలీవుడ్‌లోని అందరికీ పాటలు పాడి శభాష్ అనేలా చేశారు. వాళ్లకే కాదు.. నా సినిమాలు ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం, ఎర్రసైన్యం, కూలన్న, అన్నదాతా సుఖీభవ’ వంటి ఎన్నో చిత్రాలకు పాడారాయన. రామారావు, కృష్ణగార్లను ఎలా అనుకరిస్తూ పాడారో నన్ను కూడా అలానే అనుకరించి పాడి మెప్పించారాయన. నిజంగా నాలో ఆవహించాడా? అనేలా పాడారు. చాలామంది నేనే పాడాననుకునేవారు. కానీ ఆయనే పాడారు. నా చిత్రవిజయాలకు ఎంతో దోహదం చేశారాయన. ఒక్క తెలుగు చిత్రసీమలోనే కాదు.. తమిళ చిత్రసీమలో టీఎం సౌందరరాజన్‌గారి తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లకు ఎవరు పాడతారు? అంటే ‘నేను పాడతా’నన్నారు ఎస్పీబీ. కన్నడలో శ్రీనివాసరావుగారి తర్వాత రాజ్‌కుమార్‌గారికి ఎవరు పాడతారు? అంటే ‘నేను పాడతా’నన్నారు. దక్షిణాది శ్రోతలనే కాదు.. ఉత్తరాది శ్రోతలను కూడా మెప్పించారాయన. కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీగార్లు పాడే పాటలని బాలూగారు పాడారు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లేగార్లతో పోటాపోటీగా పాడి ఒప్పించి, మెప్పించి తెలుగుజాతి గౌరవాన్ని ఎగురవేసిన మహానుభావుడాయన. మహమ్మద్ రఫీగారి గొంతులో ఉన్న మార్దవం, మత్తు రెండూ బాలూగారి గొంతులో ఉన్నాయి. ఆయన గ్రేట్ సింగరే కాదు.. యాక్టర్ కూడా.. మంచి వ్యక్తి కూడా. ‘నారాయణమూర్తిగారు ప్రజల కోసం మంచి సినిమాలు తీస్తున్నారు.. ఆయన వద్ద డబ్బులు తీసుకోవద్దు’ అని బాలూగారు తన పీఏకి చెప్పడం ఆయన మానవీయ కోణం. కానీ నేను మాత్రం డబ్బులు తీసుకోవాలి సార్ అని దండం పెడితే ‘ఎంతో కొంత మీకు నచ్చినంత ఇవ్వండి’ అని తీసుకున్న మహానుభావుడాయన. ‘35ఏళ్లుగా సినిమాలు తీస్తూ నిలబడ్డావు కీపిట్ అప్’ అంటూ నన్ను ప్రోత్సహించారు. నా ‘ఎర్రసైన్యం’ సినిమాకి ‘వందేమాతరం’ శ్రీనివాస్ సంగీతం అందించారు. అందులోని ‘పల్లెలెట్లా కదులుతున్నయంటే..’ పాటని నువ్వే పాడు, ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా..’ పాటని బాలూగారితో పాడిద్దాం అని శ్రీనివాస్‌తో అన్నాను. రెండు పాటలూ ఆయనతోనే పాడిస్తే బాగుంటుందని అన్నాడు. ఎందుకంటే కొత్త సంగీత దర్శకుల చిత్రాల్లో బాలూగారు పాడితే అది ఓ క్రెడిట్ కదా. ‘పల్లెలెట్లా కదులుతున్నయంటే..’ పాటని బాలూగారు పాడుతున్నప్పుడు శ్రీనివాస్‌కి నచ్చినట్టు లేదు. అప్పుడు బాలూగారి వద్దకు నేను వెళ్లి ‘సార్.. అలా కాదు.. ఇలా పాడితే బాగుంటుందేమో?’ అన్నాను. మూడు నాలుగు సార్లు మార్చడంతో ఆయన నాపై కోప్పడ్డారు. ‘ఏంటి మూర్తి.. ఎన్నిసార్లు పాడాలి ఈ పాట’ అన్నారు. అప్పుడు నేను ఆయనతో ‘ఈ పాట మీరు పాడొద్దండి’ అన్నాను. అయినా కూడా ఆయన ఫీల్ కాలేదు. ‘మీరు సినిమా రచయిత.. డైరెక్టర్. మీరు ఎలా అంటే అలా?’ అని వెళ్లిపోతుంటే.. ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా.. పాట మాత్రం మీరే పాడాలి సార్’ అంటే ‘తప్పకుండా’ అని పాడి ఊర్రూతలూగించారాయన. అదీ ఆయన గొప్పతనం.. గ్రేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. అలాంటి మహానుభావుడి మరణం తీరనిలోటు.. ముఖ్యంగా నాలాంటివాళ్లకి. ప్రపంచంలో పాట ఉన్నంతకాలం బాలూగారు ఉంటారు.. ఆయన పాటకి నా పాదాభివందనం. -
బాలు గారికి భారతరత్న ఇవ్వాలి: నందిగామ సురేష్
సాక్షి, విజయవాడ: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం దురదృష్టకరమని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తెలిపారు. నందిగామ సురేష్ మాట్లాడుతూ.. బాలు గారు భౌతికంగా మనకు దూరమైనా, ఆయన పాటలు మనతోనే ఉంటాయని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని, బాలు గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు నందిగామ సురేష్ తెలిపారు. కాగా జీవితంలో ఒక్కసారైనా బాలసుబ్రమణ్యం గారిని కలవాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక తనకు తీరలేదని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి, గౌరవానికి, తగినట్టుగా భారతరత్న ఇస్తే ఆయన అభిమానులకు ఊరట కలుగుతుందనే నమక్కం ఉందన్నారు. దీనికి తన వంతు సహాయం చేస్తానని నందిగామ సురేష్ పేర్కొన్నారు. -
నేషనల్ మీడియాపై దర్శకుడి వ్యంగ్యాస్త్రాలు
దక్షిణ భారత దేశ ప్రముఖుల విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై దర్శకుడు హరీష్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన మండిపడ్డారు. శనివారం ట్విటర్ వేదికగా హరీష్ స్పందిస్తూ..‘‘ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది. అంతేలే, కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ( ‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’ ) ఇరుకు సందుల్లో కాదు’’ అని పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్ నేషనల్ న్యూస్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK — Harish Shankar .S (@harish2you) September 26, 2020 -
ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా..
బ్రహ్మరథం! పట్టడానికి వచ్చేది ఎప్పుడూ. పట్టుకుపోవడానికి వచ్చింది! పాటని. ఏమయ్యా దేవుడూ.. ఇటు చూడు. పూమాల తెచ్చావ్!! పాడింది చాలనా? పాడించుకున్నది చాలనా? వినాలని ఉంటే వినిపోవాలి గానీ.. వినడానికి తీసుకుపోవటం ఏంటి? నీ చేతుల్లో ఉందనేగా! కోనేట్లో రాలి పడితే అది నీ పాటే. వాకిట్లోకి వాలి ఉంటే అది మా పాట. తెలియకుండా ఉందా నీకు? ‘కోరినవారు.. దేవుడు’ అని రేడియో వాళ్లకు రాసినా వినిపించేవారే.. ఆ మాత్రం ఐడియా రాకపోయిందా! పాట కోసం రథమే వేసుకొచ్చావ్! కోయిల నాది కాబట్టి రాగాలూ నావేనని లాగేసుకుంటే.. నిన్నెలా కొలవాలి స్వామీ? మా అన్నయ్య వెళ్లిపోయాడు. మాటల్ని తీసుకుని వెళ్లిపోయాడు. భారతజాతి సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలూగారు. ముఖ్యంగా దక్షిణాదిలో బాలూగారంటే ఊపిరి. ఆయనలేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది అంటూ చాలా మంది మామూలు మాటలు మాట్లాడుతుంటారు. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోశం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు. అకాల సూర్యాస్తమయం. చాలా మంది గాయకులు వస్తారు.. పోతారు. నిజానికి కొందరు వస్తారు.. కానీ వెళ్లరు. వాళ్లు వెళ్లారనుకుంటున్న రోజున కాలం కొత్తగా పుడుతుంది. ఈరోజు (శుక్రవారం) ఒంటిగంటకి తెలుగు వారి ఇళ్లల్లో కాలం బాలూగారి పేరుతో మళ్లీ పుట్టింది. సినిమా పాటను పూజించాల్సినటువంటి భావన సమాజానికి లేదు. అలాంటి సినిమా పాటకి అద్భుతమైన స్థాయి తీసుకొచ్చిన గాయకుల్లో బాలూగారు ఒకరు. తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలూగారు. పాట పట్ల ఆయన చేసిన పూజ గురించి, శ్రద్ధ గురించి అందరూ ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఇంటిలోనూ బాలూగారు ఒక ముఖ్యమైన సభ్యుడు. ఆయన గొంతు విననటువంటి రోజు తెలుగువారు ఎరుగుదురా? సినిమా పాటలకు గొంతు అరువు ఇచ్చినటువంటి కళాకారుడు మాత్రమే కాదు.. 20 ఏళ్లుగా ఒక విస్మరించలేనటువంటి, మృతి లేని ఒక కటుంబ సభ్యుడు. సినిమా మాటల్లో సాహిత్యానికి సముచిత స్థానం ఇవ్వడానికి సంకోచించే పరిస్థితులు చాలా కాలం ఉండేవి. నాకు తెలిసి భారతదేశంలో పాటలోని మాట పట్ల ప్రత్యేకించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక్క బాలూగారు తప్ప. ఇవాళ ఆయనలాంటి పెద్ద దిక్కు లేదు. ఆయన లోటు తీర్చలేనిది అంటారు. ఏంటి ఆ లోటు? 40వేల మంది బాలూగార్లను ఆయన నిర్మించి వెళ్లారు. గాలి ఉన్నంత కాలం, కాలం ఉన్నంత కాలం, తెలుగు సినిమా, భారతదేశంలో సినిమా ఉన్నంత కాలం బాలూగారు ఉంటారు. 74ఏళ్లకే ఆయన వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. సినిమా పాటలు రాసే ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ ఇచ్చిన కె. విశ్వనాథ్‌గారిని నాన్నగారు అని పిలుస్తాను. విశ్వనాథ్‌గారిని నేను కలిసిన తొలి రోజు.. ఆయన బాలూగారిని పిలిచారు. నేను ‘గంగావతారం’ అనే పాట పాడి వినిపించినప్పుడు బాలూగారు కుర్చీలోంచి లేచి ‘మీరు ఎన్నో వందల పాటలు రాయాలి, అవి నేను పాడాలని అనుకుంటున్నాను’ అన్నారు. అది సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అనిపించింది. ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా. ఈ పాట ఇలా ఉండాలని ఇప్పుడు నాకు చెప్పేవారెవరు? నా పాట పాడేవారెవరు? ఆయన మూగబోవడం ఏంటి? కాలానుగుణంగా అందరూ వెళ్లాల్సిందే. అయితే బాలూగారు వెళ్లే సమయం ఇది కాదు? ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం పక్కనపెడితే.. ఎన్నో ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించారాయన. ఆయన గంధర్వలోకంలో పాటలు నేర్పడానికి వెళ్లి మనకి దుఃఖం మిగిల్చారు. ఈరోజు నుంచి కాలం బాలూగారి పేరుతో వెళుతుంది. – సిరివెన్నెల సీతారామశాస్త్రి, రచయిత భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. బాలు నా సోదరుడే కాదు, నా ఆరో ప్రాణం. ఇలాంటి దుర్వార్తను ఇంత తొందరగా వింటాననుకోలేదు. మాట్లాడటానికి మాటలు రావడంలేదు. వాడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులందరూ ఈ భాదను ఓర్చుకోవాలని కోరుకుంటున్నాను. – కె. విశ్వనాథ్, దర్శకుడు బాలూ.. నువ్వు త్వరగా తిరిగి రా అని చెప్పాను. నిన్ను చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. వినకుండా వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లిపోయావు? గంధర్వుల కోసం పాటలు పాడటానికి వెళ్లావా? ప్రపంచం శూన్యం అయిపోయింది. ప్రస్తుతం నాకేమీ అర్థం కావడం లేదు. మాట్లాడానికి మాటలు రావడంలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎలాంటి బాధకైనా ఓ హద్దు ఉంటుంది. కానీ ఈ బాధకు హద్దు లేదు. – ఇళయరాజా, సంగీత దర్శకుడు ఈరోజు దుర్దినం. ఎస్పీ బాలూగారు చివరి నిమిషం వరకూ ప్రాణం కోసం పోరాడారు. ఆయన దూరం కావడం చాలా బాధాకరం. భారతదేశంలో ఎస్పీబీ పాటకు, ఆయన స్వరానికి అభిమానులు లేకుండా ఉండరు. వ్యక్తిగా కూడా ఆయన్ను అందరూ అభిమానిస్తారు. కారణం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ సమానంగా గౌరవించారు.. ప్రేమను పంచారు. భారత చిత్రసీమ మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్, ఘంటసాల, టీఎమ్ సౌందరరాజన్ వంటి పెద్ద గాయకులను అందించింది. అయితే వాళ్లు కొన్ని భాషలకే పరిమితమైతే బాలూగారు పలు భాషల్లో పాడారు. గంభీరమైన, మృదువైన ఆయన గొంతు మరో నూరేళ్లయినా మన చెవుల్లో వినపడుతూనే ఉంటుంది. అయితే ఆ గొంతుకి సొంతదారుడు మన మధ్య ఇక ఉండరనేది బాధాకరం. – రజనీకాంత్, నటుడు బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. బాలు గాయకునిగా ఎదుగుతున్న తరుణంలో నేను హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలోని అన్ని పాటలను బాలూతో పాడించాను. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. సింగర్‌గా బాలూని బిజీ చేసింది. వ్యక్తిగతంగా కూడా మేం ఎంతో ఆత్మీయులం. అలాంటి బాలు హఠాత్తుగా దూరం కావటం ఎంతో బాధగా ఉంది. – కృష్ణ, నటుడు బాలూగారితో దశాబ్దాల అనుబంధం గుర్తుకు వస్తుంటే కన్నీరు ఆగడంలేదు. గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఈ భూమి మీద పాట ఉన్నంతవరకు బాలు బతికే ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనలాంటి గాయకుడు మరొకరు పుట్టరు. – కృష్ణంరాజు, నటుడు నేను, బాలు కలిసి కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో చదువుకున్నాం. శ్రీకాళహస్తిలో మొదలైన మా స్నేహం సినీ పరిశ్రమకు వచ్చాక చైన్నైలోనూ కొనసాగింది. అన్ని దేవుళ్ల పాటలను పాడి ఆ దేవుళ్లందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. మా శ్రీ విద్యానికేతన్‌లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. గత మార్చి 19 నా పుట్టినరోజున శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవానికి ఆయన హాజరు కావాల్సింది. కరోనా వల్ల ఆ కార్యక్రమం కేన్సిల్ కావడంతో రాలేకపోయారు. ఈ మధ్య కూడా ఫోన్లో ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనిపిస్తోంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం దగ్గర వంద రూపాయలు తీసుకున్నాను. మేం కలుసుకున్నప్పుడల్లా ‘వడ్డీతో కలిపి ఇప్పుడది ఎంతవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్’ అని ఆటపట్టించేవారు. నా సినిమాల్లో ఆణిముత్యాల్లాంటి పాటలను పాడారాయన. నా చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నా హృదయంలో ఎప్పుడూ ఉంటారాయన. – మోహన్‌బాబు, నటుడు–నిర్మాత బాలూగారి విషయంలో ఏ మాట వినకూడదు అనుకున్నానో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ను కోల్పోవటం దురదృష్టకరం. సంగీత ప్రపంచానికి ఇది దుర్దినం. ఘంటసాల గారి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది బాలూనే. మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే బాలూనే పుట్టాలి. నేను అన్నయ్యా అని పిలుచుకునే నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను. నా కెరీర్ విజయంలో ఆయనకి సింహభాగం ఇవ్వాలి. ‘నువ్వు మంచి నటుడివి.. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుని నీలోని నటుడిని దూరం చేయకు’ అని సలహాలిచ్చేవారు. ఆ సలహాల మేరకే నేను ‘ఆపద్భాంధవుడు’, ‘రుద్రవీణ’, ‘స్వయంకృషి’ చిత్రాల్లో నటించాను. ‘నా పాటలకి సరైన ఎక్స్ప్రెషన్ ఇచ్చే కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒకరు’ అనేవారు. తాను పాడిన పాటల ద్వారా ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. – చిరంజీవి, నటుడు అతికొద్ది ప్రతిభావంతులకు మాత్రమే వాళ్ల ప్రతిభకు తగ్గ పురస్కారాలు, అభినందనలు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అందులో అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఆయన పాడిన పాటల్లో కొన్నింటిలో కనిపించే అదృష్టం నాకు లభించింది. కొన్ని భాషల్లో నాలుగు తరాల నటులకు ఆయన పాడారు. రాబోయే తరాలన్నీ ఆయన కీర్తిని కొనియాడతాయి. – కమల్ హాసన్, నటుడు పాటలు పాడటంలో బాలూగారికి ఆపారమైన ప్రతిభ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ విషయం పక్కనపెడితే ఆయన నేను దర్శకత్వం వహించిన ‘మిథునం’ సినిమాకి హీరో. ఆయన కోసం నేను వంట మనిషిని పెడితే ‘ఎందుకు.. వద్దు భరణి, నాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. తినలేను’ అన్నారు. 30 రోజులపాటు 24 గంటలు నాతోనే గడిపారు. నేను వేసే జోకులను తెగ ఎంజాయ్ చేసేవారు. ఆయన నాతో ఒక మాట అన్నారు. ‘ఎప్పుడైనా నీ జీవితచరిత్ర రాస్తే.. భరణి ‘మిథునానికి ముందు మిథునానికి తర్వాత’ అనేవాడు. బాలు స్థానం చలనచిత్ర రంగానికి సంబంధించినంత వరకు ఖాళీ.– తనికెళ్ల భరణి, నటుడు–దర్శకుడు స్వర ప్రపంచాన్ని శోకసంధ్రంగా చేసి 28వ నక్షత్రంగా నింగిలో వెలిగిపోతున్న శాశ్వత స్వరమంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. – స్వర వీణాపాణి, సంగీత దర్శకుడు ఈ ఏడాది అనేక విషాద ఘటనలు జరుగుతున్నాయి. బాలూగారి వార్త వినగానే నాకు ఎంతో బాధ కలిగింది. ఆయన ఓ వెర్సటైల్ ఆర్టిస్ట్. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌తో ఆయన చేసిన హిందీ పాటలు అద్భుతం. లతా మంగేష్కర్తో ఆయన పాడిన పాటలు అద్భుతం. నేను ఇళయరాజా సంగీతంలో పాడినప్పుడు నా తమిళ ఉచ్ఛారణ విషయంలో ఎంతో సహాయం చేసేవారు. ఆయన మరణం సంగీత ప్రపంచంలో ఓ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – ఆశా భోంస్లే, గాయని. ప్రతిభాశాలి. మధురభాషి, యస్పీ బాలుగారి మరణవార్త విని ఎంతో దుఃఖం కలిగింది. బాలూగారితో కలసి ఎన్నో పాటలు పాడాను. షోస్ చేశాం. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – లతా మంగేష్కర్, గాయని గాన గంధర్వుడిగా గానానికి అర్థం చెప్పిన మహాగాయకుడు ఎస్పీ బాలూగారు. ఈరోజు మనందరినీ వదిలి అల్విదా చెప్పిన బాలూగారు మనతో లేరు అనేది బాధాకరం. చిన్నప్పుడు ఆయన స్ఫూర్తితో పరిశ్రమకి వచ్చిన నేను ఆయన్ను చూస్తూ పెరిగాను. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బాలూగారు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన పాటలెప్పుడూ మనతోనే ఉంటాయి. – జయప్రద, నటి–రాజకీయ నాయకురాలు -
అద్వైతసిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము
ఆ పాట ఒక కుర్రవాడి నూగుమీసాలకు మెరుపు తెచ్చింది. ఆ పాట ఒక పెళ్లి కాని అమ్మాయి కాలేజీ నడకకు తోడు అయ్యింది. ఆ పాట ఒక పండితుని చేతి కాఫీతో పాటు పొగలు గక్కింది. ఆ పాట ఒక రిక్షావాడి పెడల్ మీద కాలి బలాన్ని పెంచింది. ఆ పాట వెన్నెలను చిన్నబుచ్చి తానే వెలిగింది. ఆ పాట ప్రమిద కంటే పవిత్రంగా దేవుని గుడిలో మంత్రధ్వని అయ్యింది. ఆ పాట ఒక్కసారి వచ్చి వేయి వసంతాలను తెచ్చింది. ఆ పాట ప్రతి గొంతులోనూ పల్లవిగా మారింది. తెలుగు వారికి కృష్ణ, గోదావరులతోపాటు బాలు పాట కూడా ఉంది. రామప్ప శిల్పం, మక్కా మసీదు గుమ్మటంతో పాటు బాలు గళసీమ కూడా ఉంది. ఆస్తిపరులైన తెలుగువారిని నేడు ఆ సంపద విడిపోయింది. ప్రాప్తమున్న తీరానికి పాట సాగిపోయింది. చూస్తూ నిలుచున్న లక్షలాది శ్రోతల రేవు.. అదిగో... బావురుమంటోంది. ఖదీర్ – సాక్షి ప్రతినిధి: ‘గువ్వలా ఎగిరి పోవాలి... ఆ తల్లి గూటికే చేరుకోవాలి’.... అని పాడిన, పాడుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946–2020) అను అభిమానుల అతి ఇష్ట ఎస్.పి.బాలు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ పాటే తన నీడా గూడూ అనుకున్నారు. పాట కోసమే జీవించారు. పాటనే శ్వాసించారు. ఆ గళాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీరు మంచు సానువుల వరకూ వినిపించారు. ఆలిండియా రేడియో ఆయన పాటల వల్ల ‘బాలిండియా’ అయ్యింది. కట్టే ఏ పాటకైనా బాలు అనే పేరే అడ్రస్ అయ్యింది. ఘంటసాల ఘన పరంపరకు అసలైన వారసుడు బాలు అనిపించుకున్నారు. సరస, విరస, ధిక్కార, సాహస, విప్లవ, విషాద, విలాప గీతం ఏదైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. 1980–2000 అనే రెండు దశాబ్దాలు సినీసంగీతంలో బాలు దక్షిణాది రాష్ట్రాలను ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. దక్షిణాది వారికి మోకాలడ్డే ఉత్తర భారతదేశంలోనూ గాన పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి తన సత్తాని, తెలుగువారి సత్తాని చాటారు. బాలు ఎన్ని పాటలు పాడారన్నది కచ్చితమైన గణాంకాలు లేకపోయినా 16 వేల నుంచి 35 వేల లోపు ఉండొచ్చని ఒక అంచనా. పల్లవించవా నా గొంతులో... తెలుగు సాంస్కృతిక ఔన్నత్యానికి తార్కాణాలుగా నిలిచిన తిక్కన, దువ్వూరి రామిరెడ్డి వంటి వారిని ఇచ్చిన సింహపూరి సీమ (నెల్లూరు) గాలిని పీల్చి పాటను నేర్చిన బాలు బతుకుతెరువుకు చదువుకొని ఏ ఇంజనీరో అవుదామనుకున్నారు. తిరుపతిలో పి.యు.సి చేశాక అనంతపురంలో బి.ఇ చేరి అక్కడి భోజనం సరిపడక మద్రాసు (చెన్నై) చేరుకున్నారు. అక్కడ కూడా ఏ.ఐ.ఎం.ఇ లో చేరారు కాని మెల్లగా జీవిత లక్ష్యమే పాటవైపు మళ్లింది. అలాగని ఆయన ఇంటిలో శాస్త్రీయ సంగీతం అంటూ ఏమీ లేదు. తండ్రి శ్రీపతి పండిరాధ్యుల సాంబమూర్తి హరికథా గానం చేసేవారు. ఆయన తన కుమారుడిలో గాత్ర ప్రతిభ గమనించినా చదువుకుని బాగుపడాలని కోరుకున్నారు తప్ప ఆ రంగంలో ప్రత్యేకించి ప్రోత్సహించి శాస్త్రీయ సంగీతం నేర్పించాలని అనుకోలేదు. ఆ వెలితి బాల సుబ్రహ్మణ్యానికి చివరివరకూ ఉండింది. కాని కోకిల ఏ గురువును ఆశ్రయించిందని? ఈలలు వేసే పైరగాలి ఏ సంగీతాన్ని అభ్యసించిందని? బాలూకూ ప్రకృతే పాట నేర్పింది. పి.సుశీల, రఫీ పాడిన పాటలను వేదికల మీద పోటీలలో పాడి సెబాష్ అనిపించుకున్నారు. గూడూరులో ఒక పోటీకి జడ్జిగా వచ్చిన ఎస్.జానకి ఆ పోటీలో బాలు ప్రతిభను గమనించి ‘సినిమాల్లో ట్రై చెయ్’ అని ఆశీర్వదించారు. ఆ వాక్కుఫలితమో, ఫలమో అందుకు తొలి మెట్టుగా చెన్నై చేరారు. సాధారణంగా శిష్యులు మార్గదర్శిని కనుగొంటుంటారు. కాని బాలు విషయంలో మార్గదర్శే శిష్యుణ్ణి కనుగొన్నారు. ఆయనే ఎస్.పి.కోదండపాణి. ఇది తొలిపాట 1963లో చెన్నైలో జరిగిన మద్రాసు కల్చరల్ అకాడమీ పాటల పోటీకి ఘంటసాల, పెండ్యాల జడ్జీలు. వారు బాలు పాటను మెచ్చి బహుమతి ఇచ్చి వెళ్లిపోయారు కాని ఆ తర్వాత ఆడియన్స్‌లో నుంచి మెల్లగా వచ్చి తెల్ల పంచె, చొక్కాలో కలిసిన సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది బాబూ. క్రమశిక్షణతో నిలబడితే నలభై ఏళ్లు పాడతావు’ అని ఆశీర్వదించారు. ఆయన అన్నట్టుగానే బాలు నలభై ఏళ్లు పాడారు. కాని అందుకు మొదట కోదండపాణే తన భుజాన్ని ఇచ్చి మోశారు. అనేకమంది సంగీత దర్శకుల దగ్గరకు తీసుకువెళ్లారు. తన సంగీత దర్శకత్వంలోనే ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ (1967)లో మొదటి పాట పాడించారు. ఆ తర్వాత ‘సుఖదుఃఖాలు’ (1968) చిత్రంలో ‘మేడంటే మేడా కాదు’ పాడించి బాలూను అందరి దృష్టిలోకి తెచ్చారు. సంగీత దర్శకుడు సత్యం ‘కన్నెవయసు’ (1973)లో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాడించి బాలూకు అభిమానులను కల్పించారు. పాడాలనే ఉన్నదీ... ఘంటసాల 1974 ఫిబ్రవరిలో మరణించారు. దానికి రెండేళ్ల ముందు నుంచే ఆయన పాడటం తగ్గింది. పరిశ్రమ కొత్త గాయకులను వెతుకుతోంది. బాలు ఒక ప్రత్యామ్నాయం అయితే ‘విచిత్ర బంధం’ (1972) సినిమాతో హఠాత్తుగా దూసుకొచ్చిన గాయకుడు వి.రామకృష్ణ మరో ప్రత్యామ్నాయం. ఈ సమయంలో బాలు కమెడియన్లకు, హీరో కృష్ణకు ఎక్కువ పాటలు పాడుతూ ఉండిపోయారు. ఎన్.టి.ఆర్కు మొదటగా ‘కోడలు దిద్దిన కాపురం’ (1970) పాడినా, అక్కినేనికి ‘ఇద్దరు అమ్మాయిలు’ (1971– నా హృదయపు కోవెలలో) పాడినా ఆ గొంతు ఇంకా వారికి సరిపోలేదని ప్రేక్షకులు భావించారు. ఈలోపు కవి సినారె సిఫార్సుతో ‘చెల్లెలి కాపురం’ (1971)లో ‘చరణ కింకరణులు ఘల్లుఘల్లుమన’ పాడి మెరిశారు బాలు. కాని ఇంకా మేజిక్ జరగాల్సి ఉంది. కమల్‌హాసన్‌తో... కలకాలం ఇదే పాడనీ సంగీత దర్శకుడు చక్రవర్తి ‘శారద’ (1973) సినిమాతో సంగీత దర్శకుడిగా హిట్ కొట్టారు. తమిళంలో ఇళయరాజా ‘అన్నక్కిళి’ (1976)తో సంగీత దర్శకుడు అయ్యాడు. ఇలా జరగడం సినిమా సంగీతంలోనే కాదు బాలూ కెరీర్లో కూడా మలుపు. ఎందుకంటే వీళ్లిద్దరూ బాలూకు చాలా గాఢమైన స్నేహితులు. మరోవైపు దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘బాబు’ (1975) సినిమాతో దర్శకుడిగా మారి తన సినిమాలకు చక్రవర్తినే సంగీత దర్శకుడుగా ఎంచుకోవడం వల్ల చక్రవర్తి బలం పెరిగింది. బాలూకు ధైర్యంగా పాటలు ఇచ్చారు. ఇళయరాజా పాటలు బాలూకు తమిళంలో ఊతం ఇచ్చాయి. మొత్తం మీద 1977వ సంవత్సరం తెలుగులో బాల సుబ్రహ్మణ్యం దశ తిప్పింది. ఆ సంవత్సరమే ఎన్.టి.ఆర్ ‘దానవీరశూర కర్ణ’, ‘అడవిరాముడు’, ‘యమగోల’ సినిమాలకు బాలు పాడి ఇక ఆయనకు మరొకరి గొంతు అక్కర్లేదని శాసనం రాశారు. అక్కినేనికి ‘ఆలుమగలు’ (ఇరక్కపోయి వచ్చాను) ‘బంగారు బొమ్మలు’ (నేనీ దరిని నువ్వా దరిని) పాడి అక్కినేని పాడుతున్నట్టే అనిపించారు. బాలూ శకం మొదలయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీతో... శృతిలయలే జననీ జనకులు కాగా బంగారం బంగారం అంటే సరిపోదు... గీటురాయి మీద గీచి ద్రావకం పోసినప్పుడు చెక్కు చెదరకుండా నిలవాలి. అలాంటి పరీక్షా సమయాలను దాటినప్పుడే మెచ్చుకునే స్థాయి ప్రతిభ కీర్తించే స్థాయి ప్రతిభగా మారుతుంది. బాలూకి అలాంటి అవకాశం కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’ (1980) ఇచ్చింది. శాస్త్రీయ సంగీతాన్ని కథాంశంగా తీసుకున్న ఈ సినిమాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహా సంగీతకారులు పాడాలి. కాని ప్రేక్షకుడికి సినిమాలో కావాల్సింది ‘సినిమా రాగం’ అనీ, వాడికి పండితుడి కంటే పల్స్ తెలిసినవాడే కావాలని నమ్మిన కె.వి.మహదేవన్ బాలూని పాడమన్నారు. కాని బాలు భయపడిపోయారు. సంగీత జ్ఞానం లేని తాను ఆ పాటలు పాడటమా? కాని చిత్తశుద్ధి ఉంటే శివపూజ ఫలించి శివుడే ప్రత్యక్షమవుతాడు. ఇక పాట ఎంత? పుహళేంది ప్రోత్సాహంతో బాలు శంకరాభరణం పాటలను సవాలుగా తీసుకున్నారు. కారులో, ఇంటిలో అనుక్షణం వింటూ తన ఒంటిలో వాటిని రక్త చాలనం గా మార్చుకున్నారు. అందుకే ‘శంకరా’ అని గొంతెత్తితే ఆకాశం నుంచి కుంభవృష్టి కురిసింది. ‘దొరకునా ఇటువంటి సేవ’ అంటే ప్రేక్షకుడి కంట గంగ పొంగింది. ‘రాగం తానం పల్లవి’ ఉన్నంత కాలం బాలు పేరును తెలుగువారు తలుచుకుంటారు అని ఈ సినిమా ఆయనను ఆశీర్వదించింది. ఇదే పాట ప్రతి నోటా బాలూను సంగీత దర్శకుడు సత్యం ‘కొడుకా’ అని పిలిచేవారు. కె.వి.మహదేవన్ ‘ఒరేయ్’ అని బిడ్డతో సమానంగా చూసేవారు. సాలూరి ‘నాయనా’ అని పలుకరించేవారు. అందరికీ బాలూ పాట కావాలి. అందుకే పోటీలు పడి బాలూకు హిట్స్ ఇచ్చారు. తాము హిట్స్ పొందారు. సంగీత దర్శకులందరికీ బాలు మంచి పాటలు పాడారు. ఘంటసాలకు ‘సెలయేటి గలగల’ (తులసి), పెండ్యాలకు ‘చిత్రం.. భళారే విచిత్రం’ (దానవీర శూర కర్ణ), ఆదినారాయణ రావుకు ‘గడసరి అమ్మాయి నడుమొక సన్నాయి’ (కన్నవారిల్లు), సాలూరి రాజేశ్వర రావుకు ‘ఈ రేయి తీయనిది’ (చిట్టి చెల్లెలు), టి.వి.రాజుకు ‘అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది’ (చిన్ననాటి స్నేహితులు), ఎం.ఎస్.విశ్వనాథన్‌కు ‘తాళి కట్టు శుభవేళ’ (అంతులేని కథ), తాతినేని చలపతిరావుకు ‘అందానికి అందానివై’ (దత్తపుత్రుడు), బి. గోపాలంకు ‘కదిలింది కరుణరథం’ (కరుణామయుడు), రమేశ్ నాయుడుకు ‘శివరంజని నవరాగిణి’ (శివరంజని), రాజన్ నాగేంద్రకు ‘మల్లెలు పూసె వెన్నెల కాసే’ (ఇంటింటి రామాయణం), కె.వి.మహదేవన్‌కు ‘నీవుంటే వేరే కనులెందుకు’ (స్నేహం), ఎస్.పి.కోదండపాణికి ‘తనివి తీరలేదే నా మనసు నిండలేదే’ (గూడుపుఠాణి), జి.కె.వెంకటేశ్‌కు ‘రాశాను ప్రేమలేఖలెన్నో’ (శ్రీదేవి), సత్యంకు ‘ఓ బంగరు రంగుల చిలక’ (తోటరాముడు), జె.వి.రాఘవులుకు ‘కలహంస నడకదానా’ (సమాధి కడుతున్నాం చందాలివ్వం డి), చక్రవర్తికి ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ (జ్యోతి), ఇళయరాజాకు ‘మబ్బే మసకేసిందిలే’ (వయసు పిలిచింది), ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు ‘చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ’ (తూర్పు వెళ్లే రైలు)... ఇవన్నీ చెప్పడం అంటే కేవలం విస్తట్లో ఒక్క పదార్థం వేసినట్టే. ఇంకా ఎన్నో పప్పులు, దప్పళాలు, పాల తాలికలు, మజ్జిగ మిరపకాయలు. తెలుగువారు నిద్ర మేల్కొంటూ బాలు పాట విన్నారు. నిద్రకు ఉపక్రమిస్తూ బాలు పాట విన్నారు. దివారాత్రాల గానం అది. రాగాల పల్లకిలో గండు కోయిల తొలితరం హీరోలకు బాలు పాడారు. మలితరంలో వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, రామకృష్ణ, చంద్రమోహన్, మురళీ మోహన్‌లకు పాడరు. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, సుమన్, నరేశ్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్‌లకు పాడారు. ఆ తర్వాత వచ్చిన మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లకూ పాడారు. చక్రవర్తి హయాం తర్వాత వచ్చిన రాజ్‌కోటి, కీరవాణి, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్, చక్రి, రాధాకృష్ణన్, మిక్కీ జె.మేయర్, తమన్‌కు సహా అందరికీ పాడారు. ఆయన పాట ఆగలేదు. అది లేకుండా సినిమా పరిశ్రమ ముందుకు సాగలేదు. అయితే ‘రోజా’ (1992) సినిమాతో ఏ.ఆర్. రహమాన్ రంగప్రవేశం తర్వాత కొత్త గాయకుల ఉధృతి పెరిగింది. పర భాషా గాయకులు తెలుగులో విస్తృతంగా పాడటం మొదలెట్టారు. అయితే ఏమిటి? ఎవరెస్ట్ ఎక్కి జెండా పాతినవాడు విజేత. బాలు ఆ విజేత. ఆయన శిఖరం దిగి వచ్చి కొత్తతరానికి దారి చూపిస్తూ ఉండిపోయారు. అధిరోహణకు స్ఫూర్తిగా మిగిలిపోయారు. ఓ పాపా లాలి.. జన్మకే లాలి... బాలు పాట లేకుండా ఉండలేరు. బాలు లేకుండా పాట ఉండలేదు. అందుకే టెలివిజన్ చానల్స్‌లో పదుల సంఖ్యలో ఆయన షోస్ చేశారు. యాంకర్‌గా ఉన్నారు. కొత్త జనరేషన్‌ను తయారు చేశారు. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై తిరుగుతూ విదేశాలలో షోస్ చేస్తూ అనుక్షణం శ్రోతకు పాటను దగ్గరగా ఉంచారు. అది ఔషధంగా ఇస్తూ వచ్చారు. ప్రతి ఒక్క తెలుగువాడి జీవితంలో వేల గంటలు, వందల రోజులు ఆయన పాటతో గడిచిపోయి ఉంటాయి. వారి సంతోషంలో, దుఃఖంలో, వేడుకలో, ఉత్సవంలో ఆయన పాట అవిభాజ్యం అయ్యింది. ఆయన పాటల క్యాసెట్టు ఇచ్చి పుచ్చుకోవడమే ఒక పెద్ద బహుమతి. అలాంటిది... ఆయన గొంతు ఇక మీదట ప్రత్యక్షంగా వినపడదని, ఆయన రూపం ఎంత మాత్రమూ కనపడదని లక్షలాది మంది అభిమానులకు ఈ క్షణాన అనిపిస్తూ ఉంటే వారు విలపిస్తూ ఉంటే కంఠం రుద్ధం అవుతుంది. కళ్లు మసక గమ్ముతాయి. ఆయన పాటను ఆయనకు నివాళిగా అర్పించడానికి కూడా నోరు పెగలదు. ఒక గొప్ప ఎంటర్టైనర్, ఉల్లాసదాత, ఉత్సాహ దీపం, తోడుగా ఉంటూ వచ్చిన జతగాడు... ఇక లేడు అంటే వీడ్కోలు పలకడానికి తెలుగుభాష మాట కోసం తారాడుతోంది. పాట కోసం పారాడుతోంది. బాలూ సర్... బాలసుబ్రహ్మణ్యం సర్... కొమ్మకొమ్మకో సన్నాయిని నింపుకున్న వేల చెట్ల వనమా... కైమోడ్పులు. జోతలు. అశ్రుతర్పణాలు. అమలిన బాష్పహారాలు. ఇవాళ వెళ్లి రేపు పల్లవీ చరణాలుగా తిరిగి రా! కుటుంబ సభ్యులతో బాలు -
నాద నిలయంలో వేదం పలకాలని..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని తిప్పరాజు వారి వీధిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల స్వార్జితంతో నిర్మించుకుని నివసించిన ఇంటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతి స్వామికి అప్పగించారు. ఆ ఇంట్లో వేదం పలకాలన్న ఆకాంక్షతో రూ. కోట్లు విలువైన తన తల్లిదండ్రుల జ్ఞాపికను ఆ పీఠానికి అప్పగిస్తున్నట్లుగా అప్పట్లో బాలు వివరించారు. తాను తరచూ నెల్లూరుకు వచ్చి వేదనిలయం అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని కూడా చెప్పారు. ఈ ఇల్లు అంటే బాలు తల్లి శకుంతలమ్మకు మమకారం. తాను చనిపోయేంత వరకు ఇక్కడే ఉన్నారు. బాలు ప్రతి నెలా వచ్చి తల్లితో గడిపి వెళ్తుండేవాడు. నాద నిలయంగా ఉన్న ఇల్లు వేద నిలయంగా కూడా మారాలనే తల్లి కోరికతో ఆ ఇంటిని కంచి పీఠానికి అప్పగించారు. తండ్రి తొలిగురువు.. 2015 అక్టోబర్ 3న సాంబమూర్తి విగ్రహావిష్కరణ నెల్లూరులోని శ్రీకస్తూర్బా కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో బాలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తన తొలిగురువని, ఆయన తనను నాటక రంగానికి పరిచయం చేయడంతో పాటు నేపథ్య గాయకుడిగా మారడానికి ప్రోత్సాహించారని చెప్పారు. జీవితంలో సర్వస్వం అయిన నాన్నకు విగ్రహం పెట్టి జన్మ ధన్యం చేసుకున్నానని తెలిపారు. తొలిమెట్టు గూడూరులో.. గూడూరు: ఎస్పీ బాలు గాన ప్రస్థానానికి తొలిమెట్టు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకాళిదాస కళానికేతన్. సంగీత పోటీలు నిర్వహించడానికి షేక్ గౌస్‌బాషా, ప్రభాకర్‌రావు తమ మిత్ర బృందంతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1962లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న బాలుకు మొదటి బహుమతి లభించింది. 1963లో జరిగిన పోటీలకు న్యాయనిర్ణేతగా గానకోకిల జానకి వచ్చారు. ఈ పోటీల్లో బాలుకు 2వ బహుమతి వచ్చింది. సంస్థ ఆనవాయితీ ప్రకారం ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందినవారితో పాటలు పాడించేవారు. ఈ క్రమంలో బాలు పాడిన పాట ఆహూతులను మంత్రముగ్దుల్ని చేసింది. ‘‘నీలాంటి వారు సినిమాల్లో పాడాలి’’ అంటూ జానకి బాలును ప్రోత్సహించారు. 1964లో భానుమతిని కలసిన సందర్భంలో బాలు పాడిన పాట ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. దేశం గర్వించదగ్గ గాయకుడిగా ఎదుగుతావంటూ ఆమె బాలును దీవించారు. నిగర్వి అయిన బాలు వంటి మహానుభావుని పోగొట్టుకోవడం ఎంతో బాధాకరమని శ్రీకాళిదాస కళానికేతన్ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ షేక్ గౌస్‌బాషా కన్నీటి పర్యంతమయ్యారు. -
ఆనంద్‌కు స్పాన్సర్‌గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
చెన్నై: గాన గంధర్వుడు, సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తన అనుబంధాన్ని ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గుర్తు చేసుకున్నాడు. 1983లో జాతీయ టీమ్ చాంపియన్‌షిప్ సందర్భంగా తమ జట్టు చెన్నై కోల్ట్స్‌కు బాలసుబ్రహ్మణ్యం స్పాన్సర్షిప్ అందజేశారని చెప్పాడు. 2002 ప్రపంచ కప్ అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను కలిసినట్లు ఆనంద్ వెల్లడించారు. ఆయనకు పెద్ద అభిమానినని పేర్కొన్న ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో ఎస్పీకి నివాళి అర్పించారు. ‘నాకు 13 సంవత్సరాల వయస్సులో నేషనల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మా జట్టుకు ఆయన స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఆ ఈవెంట్ తర్వాతే నాకు పేరొచ్చింది. మేం ఆ టోర్నీ గెలుపొందాం. అప్పుడు ఆయనతో పరిచయం లేదు. కానీ 2002లో ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి కలిసినపుడు స్పాన్సర్షిప్ గురించి మాట్లాడాను. ఆ విషయం తనకూ గుర్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయనో గొప్ప వ్యక్తి’ అని 50 ఏళ్ల ఆనంద్ గుర్తు చేసుకున్నాడు. -
వెంటిలేటర్‌పై బాలు: వీడియో వైరల్
చెన్నై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఎస్పీ బాలు మృతికి సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు వెంటిలేటర్‌పై ఉండగా వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. చేతులకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నారు బాలు. కొద్ది సేపటి తర్వాత అలసటతో ఆయన ఆపేశారు. ( ఇలా జరగడం బాధాకరం: ఉప రాష్ట్రపతి ) వైద్యులు మళ్లీ చేయించే ప్రయత్నం చేయగా బాలు చేతులు కదపలేక వద్దని వారించారు. కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. దాదాపు 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. -
బాలు మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్ : సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన ఎస్పీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. బాలసుబ్రహ్మణ్యం లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని సీఎం అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాలు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ( ఇలా జరగడం బాధాకరం: ఉప రాష్ట్రపతి ) CM Sri KCR has expressed shock and grief over the demise of legendary playback singer Sri SP Balasubrahmanyam. Hon'ble CM said that Sri Balu won the hearts of fans all over the country through thousands of his melodious songs. — Telangana CMO (@TelanganaCMO) September 25, 2020 -
ఇలా జరగడం బాధాకరం: ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకర’’మన్నారు. ( జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’ ) ఎస్పీ బాలు మరణవార్త కలవరపరిచింది : కిషన్ రెడ్డి ‘‘గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త కలవరపరిచింది. 16 భారతీయ భాషలలో 40,000 పాటలను అందించిన బహుముఖ గాయకుడిని కోల్పోయాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ -
వచ్చే సోమవారం శుభవార్త వింటాం: ఎస్పీ చరణ్
-
పాడేందుకు ప్రయత్నిస్తున్న ఎస్పీ బాలు
-
థాంక్యూ.. ఇదొక శుభదినం: ఎస్పీ చరణ్
-
బాలసముద్రం
-
ఎస్పీ బాలు హెల్త్ బులిటన్ విడుదల
-
ఆగే గుండెకు ఆయువు పోస్తుంది..
సాక్షి, హైదరాబాద్: ఎక్మో మెషీన్.. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రస్తుతం ఈ యంత్రం మీదే చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ కేర్ ఆసుపత్రి వైద్యులు కూడా కరోనాతో సీరియస్ కండిషన్లో ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన పిల్లల డాక్టర్ దయానంద్ సాగర్‌కు ఎక్మో పద్ధతిలోనే విజయవంతంగా చికిత్స చేశారు. 2016లోనూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకూ ఇదే పద్ధతిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.. ఇంతకీ ఏంటీ ఎక్మో? అపర సంజీవనే.. సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకు వచ్చే సమయంలో అత్యవసరంగా ఈ ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబరే ఆక్సిజనేషన్(ఎక్మో) యంత్రం మీద ఉంచి చికిత్స అందిస్తారు. కీలక ఘడియల్లో ఊపిరితిత్తుల పనిని, అవసరమైతే గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి శరీరాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానం ఇది. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో రోగి ప్రాణ రక్షణ కోసం ‘ఎక్మో’చికిత్సా పద్ధతి కీలకమైంది. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి కణానికీ రక్తం అవసరం. రక్తం నిరంతరాయంగా అందుతుంటేనే శరీరంలోని కణాలు, అవయవాలన్నీ సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో రక్త సరఫరా నిలిచిపోతే ఆ కణాలు చచ్చిపోతాయి. మృత్యువు ముంచుకొస్తుంది. అలాగే రక్తాన్ని శరీరమంతా సరఫరా చేసేది గుండె. ఆక్సిజనేషన్(రక్తంలోకి ఆక్సిజన్‌ను చేర్చడం) చేసేది ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే ఆక్సిజనేషన్ జరగదు. దీంతో ప్రాణవాయువు(ఆక్సిజన్) లేని చెడు రక్తమే ఒళ్లంతా తిరుగుతుంటుంది. ఆక్సిజన్ తగినంత అందక అవయవాలన్నీ దెబ్బతినిపోతుంటాయి. అందుకే గుండె, ఊపిరితిత్తులూ రెండూ సమర్థంగా పనిచేస్తుండటం చాలా అవసరం. ‘ఎక్మో’ఏం చేస్తుందంటే? ఎవరికైనా గుండె, ఊపిరితిత్తులు రెండూ విఫలమైపోతే అప్పుడు ఎక్మో పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ యంత్రంలో రోగి శరీరంలోని రక్తనాళాల్లోకి, లేదా నేరుగా గుండెలోకి అమర్చేందుకు ప్రత్యేకమైన గొట్టాలుంటాయి. ఈ గొట్టాలను రోగి మెడ దగ్గర నుంచి గానీ, తొడ దగ్గరగానీ లోనికి పంపి రక్తనాళాల్లో అమరుస్తారు. ఈ గొట్టాలను బయట ఎక్మో యంత్రానికి అనుసంధానిస్తారు. ఇది రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకువచ్చి, యంత్రంలో ఆక్సిజనేషన్ చేసి, ప్రాణవాయువుతో కూడిన మంచి రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తుంది. అంటే ఊపిరితిత్తులు, గుండె ఈ రెండింటి పనినీ ఎక్మో బయట నుంచి చేస్తుందన్నమాట. గుండె, ఊపిరితిత్తుల పనిని బయటే కృత్రిమంగా చేయిస్తుండటం వల్ల వాటికి విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా అవి త్వరగా కోలుకుంటాయి. అలాగే శరీరంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదమూ తప్పుతుంది. ఉన్నట్టుండి గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిన్న వాళ్లకు ఇది ప్రయోజనకరం. ఎక్మో విధానంలో రెండు మూడు వారాల పాటు చికిత్స ఇవ్వవచ్చు. ఊపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లకు ఫలితాలు బాగుంటున్నాయి. వీరు 70–80 శాతం వరకూ కోలుకుంటున్నారు. గుండె దెబ్బతినటం వల్ల ఎక్మో పెట్టిన వాళ్లలో ఫలితాలు అంత గొప్పగా ఉండటం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంత సంక్లిష్టత.. మరికొన్ని సమస్యలు ఎక్మో చికిత్స కోసం రక్తాన్ని బయటకు తీసుకువచ్చేందుకు, మళ్లీ లోపలికి పంపేందుకు గొట్టాలను అమర్చటమే కష్టం. రక్తస్రావం అవడం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్త నాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే రక్తాన్ని బయట శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతినిపోతుంటాయి. ఇది మరో సమస్య. అయితే వైద్యులు వీటిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంటారు. వీళ్లకు బాగా ఉపయోగం.. పుట్టుకతోనే గుండె లోపాలు లేదా పుట్టగానే శ్వాస సమస్యలతో బాధపడే చిన్నపిల్లల్లో ఎక్మో విస్తృతంగా వాడకంలో ఉంది. పెద్దల్లో కూడా ఊపిరితిత్తులు దెబ్బతిని, అవి సరిగా పని చేయని సంద ర్భాల్లో ఈ విధానాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. మరికొందరికి వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఉన్నట్టుండి గుండె కండరం విపరీతంగా వాచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో గుండె పంపింగ్ పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఇలాంటి వారికి వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గే వరకూ ‘ఎక్మో’బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో ఇన్ఫెక్షన్ చేరిపోయి తీవ్రమైన ‘సెప్సిస్’ఉన్న వాళ్లకు.. రక్తంలోని విషతుల్యాల వల్ల ఒక్కోసారి గుండె పని ఆగిపోతుంది. ఇలాంటి వారికి కూడా తాత్కాలికంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. తీవ్రమైన నిమోనియా వచ్చి రెండు ఊపిరితిత్తులూ పని చేసే స్థితిలో లేనప్పుడు కూ డా ఇది ఆదుకుంటుంది. రోగి ఊపిరితిత్తులు బాగుపడుతున్న కొద్దీ, లేదా గుండె పంపింగ్ మెరుగవుతున్న కొద్దీ ఎక్మో మీద ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వచ్చి చివరకు దీన్ని వైద్యులు పూర్తిగా తీసేస్తారు.