చెన్నై: గాన గంధర్వుడు, సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తన అనుబంధాన్ని ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గుర్తు చేసుకున్నాడు. 1983లో జాతీయ టీమ్ చాంపియన్‌షిప్ సందర్భంగా తమ జట్టు చెన్నై కోల్ట్స్‌కు బాలసుబ్రహ్మణ్యం స్పాన్సర్‌షిప్ అందజేశారని చెప్పాడు. 2002 ప్రపంచ కప్ అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను కలిసినట్లు ఆనంద్ వెల్లడించారు. ఆయనకు పెద్ద అభిమానినని పేర్కొన్న ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో ఎస్పీకి నివాళి అర్పించారు. ‘నాకు 13 సంవత్సరాల వయస్సులో నేషనల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మా జట్టుకు ఆయన స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఆ ఈవెంట్ తర్వాతే నాకు పేరొచ్చింది. మేం ఆ టోర్నీ గెలుపొందాం. అప్పుడు ఆయనతో పరిచయం లేదు. కానీ 2002లో ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి కలిసినపుడు స్పాన్సర్‌షిప్ గురించి మాట్లాడాను. ఆ విషయం తనకూ గుర్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయనో గొప్ప వ్యక్తి’ అని 50 ఏళ్ల ఆనంద్ గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment