నా పాటలను మీరు పాడుతున్నారు అన్నయ్యా అన్నాను – మనో | Singer Mano Speaks About SP Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

నా పాటలను మీరు పాడుతున్నారు అన్నయ్యా అన్నాను – మనో

Published Sun, Sep 27 2020 4:27 AM | Last Updated on Sun, Sep 27 2020 4:27 AM

Singer Mano Speaks About SP Balasubrahmanyam - Sakshi

‘‘సినీ పరిశ్రమలో ఇంత ప్రయాణం చేసిన గాయకుడు ఎవ్వరూ లేరు. ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ. పాట వినేవాళ్లు ‘భలే వినసొంపుగా ఉందే’ అంటారు. కానీ అది అలా తయారవడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. అన్నయ్య (బాలూని మనో అలానే పిలుస్తారు) ప్రయాణం చాలా గొప్పది’’ అన్నారు గాయకుడు మనో. బాలూతో తన సాన్నిహిత్యం గురించి, ఇతర విశేషాలను ఇలా చెప్పారు.

► బాలూగారితో మీ పరిచయం.. ప్రయాణం?
14వ ఏట ఎమ్మెస్‌ విశ్వనాథన్‌గారి దగ్గర మ్యూజిక్‌ అసిస్టెంట్‌గా చేరాను. అప్పుడు బాలూగారితో పరిచయం ఏర్పడింది. ఆయన అప్పుడు నా మీద ఎలాంటి ప్రేమ కురిపించారో ఎప్పటికీ అదే ప్రేమ చూపించారు. విశ్వనాథన్‌గారి తర్వాత నేను చక్రవర్తిగారి దగ్గర ట్రాక్‌ సింగర్‌గా చేసేవాణ్ణి. మెయిన్‌ సింగర్‌ పాట పాడకముందు ఆ పాట ఎలా ఉంటుంది అని ముందు మేము పాడి రికార్డ్‌ చేయడం మా పని. ఆ తర్వాత వాళ్లు ఎంత అందంగా పాడతారో చూడటం నా పని. పాటలో లీనమైపోయి పాడుతుంటారు. స్క్రీన్‌ మీద 30–40 శాతం ఆర్టిస్టులు నటిస్తే చాలు.. గాయకులు తమ పాట ఎక్స్‌ప్రెషన్‌తో ఆ పాటను హిట్‌ చేస్తారు. పాటకు ప్రాణం పోసిన మొదటి వ్యక్తి బాలూగారు. భాషతో, సంగీత దర్శకుడితో పని లేదు. ఈ ట్యూన్‌కి నా గొంతుతో ఏ విధంగా జీవం పోయగలను? అని తపించేవారు. నేను ఆయన దగ్గర గమనించిన గొప్ప విషయాల్లో అదొకటి. 

► ట్రాక్‌ సింగర్‌ నుంచి గాయకుడిగా మారి, బాలూగారితో కలిసి పాటలు పాడారు...
అదంతా ఇళయరాజాగారు పెట్టిన బిక్ష. ఆయన పాడించడంతో మిగతావాళ్లు కూడా నన్ను ప్రోత్సహించడం మొదలెట్టారు. యస్పీబీగారితో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్‌ చేయడానికి దోహదపడింది ఇళయరాజాగారి ప్రోత్సాహమే. అలాగే బాలూగారు కూడా బాగా ఎంకరేజ్‌ చేసేవారు. మేం ఎన్నో స్టేజ్‌ ప్రోగ్రామ్‌లు, మ్యూజిక్‌ షోలు చేశాం. 

► తమ తోటివారిని ఎదగనివ్వకపోవడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం.. కానీ మీ విషయంలో అలా జరగలేదనుకోవచ్చా?
మిగతావాళ్లను పైకి రానివ్వడేమో అని ఆయన గురించి కొందరు అనుకుంటారేమో. అయితే అన్నయ్యకు అంత ఆలోచించే టైమ్‌ ఉండేది కాదు. ఏయే పాటలు ఎవరు పాడితే బావుంటుందో దర్శక–నిర్మాతలు, సంగీతదర్శకులు ముందే అనుకుంటారు. వాళ్లకీ వీళ్లకీ ఇవ్వకూడదు అని ఆలోచించరు. అన్నయ్యకి అయితే ఎవరికి ఏ పాటలు ఇస్తున్నారో ఆలోచించే తీరిక ఉండేది కాదు. తనకు వచ్చిన పాటలు పాడడానికే టైమ్‌ సరిపోయేది. ఒక థియేటర్‌ నుంచి మరో థియేటర్‌కి పరుగులు తీసేవారు. పాటలు ఎవరితో పాడించాలనేది ఆయన చేతిలో ఉండదు. సినిమా ఓకే అవ్వగానే ‘మొత్తం పాటలు నేను పాడతాను. నాకే ఇవ్వండి’ అన్నట్టు ఏమీ ఉండదు. ఆయనకు ఆ అవసరమేంటి? 

► ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య సరదా గొడవలు వచ్చాయా?
ఆయన నాకు ఇచ్చిన చొరవ మామూలుది కాదు. ఒక్కోసారి నేను ఆయనతో ‘నేను పాడాల్సిన  పాటలు నువ్వు పాడేశావు’ అని గొడవ పెట్టుకునేవాడిని. తమిళంలో ఆ పాట నేను పాడి ఉంటాను. తెలుగులో కూడా నేనే పాడాలి. స్టూడియోకి వెళ్తే సాహిత్యం పూర్తవ్వలేదనేవాళ్లు. తిరిగి వెళ్లిపోతుంటే ‘ఆ పెద్దాయన పాడేశారు’ అని అక్కడున్నవాళ్లు చెప్పేవాళ్లు. ఇలా చాలాసార్లు జరిగింది. అన్నయ్యతో గొడవపడుతూ ఇదే విషయం చెప్పాను. ‘మరి.. నువ్వు లోపలకి వచ్చి నాతో  ఎందుకు చెప్పలేదు?’ అన్నారు. ‘నువ్వెందుకు పాడుతున్నావో నాకు తెలియదు. నీకు ఎలాంటి ఒత్తిడి ఉందో నాకు తెలియదు. ఒళ్లంతా నూనె పూసుకొని ఇసుకలో ఎంత పొర్లాడినా మనకు ఎంత మట్టి అంటాలో అంతే అంటుతుంది కదా’ అని నేనంటే, ‘ఇంత కల్మషం లేకుండా ఆలోచిస్తున్నావు కాబట్టే నువ్వు పైకొస్తున్నావు’ అని కౌగిలించుకొని ముద్దుపెట్టుకున్నారు. 

► బాలూగారితో కలిసి విదేశాల్లో పలు షోస్‌ చేశారు. అప్పుడు జరిగిన సరదా సంఘటన ఏదైనా?
చాలా ఉన్నాయి. ఒకటి చెబుతాను. ఓసారి అమెరికాలో షో చేయడానికి వెళ్లాం. తీరా నా  సూట్‌కేస్‌ మిస్సయింది. నాకు వేసుకోవడానికి బట్టలు లేవు. అంటే.. కోటు అదీ లేదు. అక్కడే బాలూగారి కోటు కనిపించింది. ‘ఏంటీ.. కన్నుSనా కోటు మీద పడినట్టుంది’ అని అడిగారు. నాకు కావాలన్నాను. ‘లేదు.. ప్రోగ్రామ్‌ సెకండ్‌ హాఫ్‌ కోసం పెట్టుకున్న కోటు అది’ అన్నారు. సెకండ్‌ హాఫ్‌లో ఇచ్చేస్తాలే... అప్పుడు నువ్వు ఫస్ట్‌హాఫ్‌లో వేసుకున్న కోటు తీసి వేసుకుంటా అన్నాను. అలానే వేసుకున్నా. ఆయన కోటు నాకు మోకాలి కిందకు వెళ్లింది. నన్ను చూసి నవ్వారు. ఆ తర్వాత ఆ స్టేజ్‌ మీద కోటు గురించి చెప్పి, అందర్నీ నవ్వించాం. అలా సరదాగా ఆ ప్రోగ్రామ్‌ సాగింది.

► బాలూగారు ఇష్టంగా ఏం తినేవారు?
ఆయన పూర్తి శాకాహారి. పప్పుల పొడిలో నెయ్యి, సాంబార్‌లో నెయ్యి, గడ్డ పెరుగు.. ఇలా ఉంటే చాలు. ఒక స్టూడియో నుంచి ఇంకో స్టూడియోకి వెళ్లే గ్యాప్‌లో కారులోనే తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నం తిన్న తర్వాత చాలాసార్లు ఐస్‌ క్రీమ్‌ తినేవారు. సింగర్స్‌ జాగ్రత్తగా ఉండాలి.. గొంతు పాడవుతుంది. ఐస్‌క్రీమ్‌ తినకూడదు వంటివి పాటించేవారు కాదు. అసలు ఒక సింగర్‌ పాటించాల్సినవి ఏమీ ఆయన పాటించలేదు (నవ్వుతూ). ఆయన్ని చూసి నేను కూడా చక్కగా ఏది అనిపిస్తే అది తినడం అలవాటు చేసుకున్నాను. ఇదే కాదు.. అన్నయ్య నుంచి చాలా నేర్చుకున్నాను. అంకితభావం, సరదాగా ఉండటం.. ఇలా చాలా విషయాల్లో నాకు ఆయన ఇన్‌స్పిరేషన్‌. 

► అన్నయ్యా అని పిలిచేంత చనువు ఇచ్చారు మీకు.. అన్నయ్యను కాకాపట్టిన సందర్భాలేమైనా?
(నవ్వుతూ).. నేను చక్రవర్తిగారి దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు నన్ను విదేశాలకు తీసుకెళ్లమని ఆయన్ను కాకాపట్టాను ఓసారి. ‘మీరు పాటలు పాడి అలసిపోతే కాళ్లు పడతాను. ఒళ్లు నొక్కుతా’  అని అన్నయ్యతో అంటే, ‘అరే.. నువ్వు ఇలా అడగక్కర్లేదు. ఎన్ని వందల దేశాలు తిరగాలని నీకు రాసుందో’ అని ఆశీర్వదించారు. అన్నయ్య ఆశీర్వాదబలం వల్ల ఇవాళ నాకు 17 పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవతలు తథాస్తు అన్నట్టున్నారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే అవి జరుగుతాయి. 

► అవును.. మీ పెళ్లికి బాలూగారు సంతకం పెట్టారట కదా!
నా పెళ్లప్పుడు మా మావగారు ‘పిల్లను జాగ్రత్తగా చూసుకుంటావని గ్యారెంటీ ఏంటి?’ అని అడిగితే, చక్రవర్తిగారిని, అన్నయ్యను పెళ్లికి రమ్మన్నాను. ఇద్దరూ వచ్చారు. అప్పటికి నేను కేవలం అసిస్టెంట్‌ని. నన్ను 3 ఇన్‌ 1 టేప్‌ రికార్డర్‌ అనేవాళ్లు. హార్మోనియం వాయించేవాడిని, పాటలు పాడేవాడిని. నోట్స్‌ రాసేవాడిని. కేవలం నా మీద ప్రేమతో అన్నయ్య వచ్చి సంతకం పెట్టారు గ్యారంటీగా! నాకు మనవళ్లు మనవరాళ్లు ఉన్నా ఇప్పటికీ ‘ఏరా మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా? నేనే సంతకం పెట్టా నీకు జాగ్రత్త’ అనేవారు. ప్రేమగా మందలించే అన్నయ్య లేరంటేనే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది.

► ఇళయరాజాగారు, బాలూగారు మంచి స్నేహితులు. ఆ ఇద్దరికీ మధ్య మనస్పర్థలు రావడానికి కారణం బాలూగారు తన పాటలను ఎక్కడా పాడకూడదని రాజాగారు అనడమే అని అందరికీ తెలుసు.  కానీ వేరే బలమైన కారణం ఏదైనా ఉందా?
ఉంది.. ‘50 ఇయర్స్‌ ఆఫ్‌ యస్పీబీ ప్రోగ్రామ్‌’ చేయాలని అన్నయ్య కుమారుడు చరణ్‌ ప్లాన్‌ చేశాడు. అదే సమయంలో రాజాగారి కాన్సర్ట్‌ ఉంది. యస్పీబీ నా టూర్‌కి ఎలా అయినా వస్తాడని అన్నయ్యతో చెప్పకుండానే రాజాగారు ట్రూప్‌లో ఉన్న అందరికీ యూఎస్‌కి వీసాలు అప్లై చేసేశారు. చరణ్‌ కూడా అప్లై చేశాడు. అయితే ముందు రాజాగారు అప్లయ్‌ చేయడం వల్ల వీసాలు ఓకే అయ్యాయి. చరణ్‌ అప్లై చేసినప్పుడు ఎంబసీలో ఒకేసారి రెండుచోట్ల ఎలా పాడతారు? అని రాజాగారి డీటైల్స్‌ చూపించారు. ఇళయరాజాది ఫస్ట్‌ మా దగ్గరకు వచ్చింది.. అందుకే దాన్ని అప్రూవ్‌ చేస్తున్నాం అన్నారు. మరో ఆరు నెలలకు గానీ అప్రూవ్‌ చేయరు. దాంతో అన్నయ్య హర్ట్‌ అయ్యారు. ఎంతో ఇష్టపడి కొడుకు చేయాలనుకున్న ప్రోగ్రామ్‌ వాయిదా పడిందని బాధపడ్డారు. బాలూగారు రాకుండానే ఇళయరాజాగారి షోకి నేను మొయిన్‌ సింగర్‌గా వెళ్లి 8 షోలు సక్సెస్‌ఫుల్‌గా చేసి వచ్చాం. ఆర్నెల్ల తర్వాత బాలూగారు షో చేశారు. అప్పుడు ఇళయరాజాగారి షో చేసిన లేడీ ఆయనకు ఫోన్‌ చేసి ‘మీ షోలకే రాని బాలూగారు మీ పాటలు ఎందుకు పాడాలి?’ అన్నారు. దాంతో ‘నా పాటలు పాడాలంటే నా అనుమతి తీసుకోవాలి’ అని అన్నయ్యకు ఇళయరాజాగారు మెసేజ్‌ పెట్టారు. కేవలం మిస్‌అండర్‌స్టాండింగ్‌ వల్ల ఇదంతా జరిగింది. కాలం చేసిన ఎడబాటే కానీ కావాలని చేసింది కాదు. నిజానికి అన్నయ్య, రాజాగార్ల బంధం భార్యాభర్తల కన్నా ఎక్కువ. అందుకే యుద్ధం కూడా ఆ రేంజ్‌లో ఉందేమో. మూడేళ్ల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు. తర్వాత కలిసిపోయారు. అది మాకు ఆనందం.

► మరి.. ఆయన బదులు మీరు ఇళయరాజాగారి షోకి వెళ్లి పాడినందుకు బాలూగారికి కోపం రాలేదా?
నా మీద ఏమీ లేదు. నేను లేకుండా షో చేస్తాడా అని రాజాగారి మీద ఇంకా కోపం పెరిగింది.  మూడేళ్లు ఎడబాటు ఉన్నా 2019కి కలసిపోయారు. 2020లో అన్నయ్య–రాజాగారు చాలా షోలు చేయాలి. దాదాపు 15 షోలు క్యాన్సిల్‌ అయ్యాయి. మలేషియా, దుబాయ్, సింగపూర్, యూరప్‌ అన్నీ క్యాన్సిల్‌ అయ్యాయి. సెప్టెంబర్‌లో యూఎస్‌ వెళ్లాలి. ఇప్పుడు ఆయన లేకుండా రాజాగారు పడుతున్న బాధ మాటల్లో చెప్పలేం. ఒంటరిని అయిపోయాననే బాధలో ఉన్నారాయన. ఈ ఏడబాటు నా వల్ల జరిగిందా? అని కుమిలిపోతున్నారు. స్నేహితుడిని మూడేళ్లు దూరం పెట్టానే? కరోనా వల్ల ఆఖరి చూపులు చూసుకోవడానికి లేదే అని బాధప డుతున్నారు. మరి.. 50 ఏళ్ల స్నేహం ఇద్దరిదీ. వాళ్ల జర్నీ మళ్లీ కొత్తగా ఈ ఏడాది ప్రారంభం అవుతుందనుకుంటే కరోనావల్ల బ్రేక్‌ పడింది. ఇప్పుడు శాశ్వత బ్రేక్‌ పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement