ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా.. | Film Actors Speaks About SP Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

 పాట కోసం రథమే వేసుకొచ్చావ్‌!

Published Sat, Sep 26 2020 4:35 AM | Last Updated on Sat, Sep 26 2020 9:22 AM

Film Actors Speaks About SP Balasubrahmanyam - Sakshi

బ్రహ్మరథం! పట్టడానికి వచ్చేది ఎప్పుడూ. పట్టుకుపోవడానికి వచ్చింది! పాటని. ఏమయ్యా దేవుడూ.. ఇటు చూడు. పూమాల తెచ్చావ్‌!! పాడింది చాలనా? పాడించుకున్నది చాలనా? వినాలని ఉంటే వినిపోవాలి గానీ.. వినడానికి తీసుకుపోవటం ఏంటి? నీ చేతుల్లో ఉందనేగా! కోనేట్లో రాలి పడితే అది నీ పాటే. వాకిట్లోకి వాలి ఉంటే అది మా పాట. తెలియకుండా ఉందా నీకు? ‘కోరినవారు.. దేవుడు’ అని రేడియో వాళ్లకు రాసినా వినిపించేవారే.. ఆ మాత్రం ఐడియా రాకపోయిందా! పాట కోసం రథమే వేసుకొచ్చావ్‌! కోయిల నాది కాబట్టి రాగాలూ నావేనని లాగేసుకుంటే.. నిన్నెలా కొలవాలి స్వామీ? 

మా అన్నయ్య వెళ్లిపోయాడు. మాటల్ని తీసుకుని వెళ్లిపోయాడు. భారతజాతి సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలూగారు. ముఖ్యంగా దక్షిణాదిలో బాలూగారంటే ఊపిరి. ఆయనలేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది అంటూ చాలా మంది మామూలు మాటలు మాట్లాడుతుంటారు. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోశం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు. అకాల సూర్యాస్తమయం. చాలా మంది గాయకులు వస్తారు.. పోతారు. నిజానికి కొందరు వస్తారు.. కానీ వెళ్లరు. వాళ్లు వెళ్లారనుకుంటున్న రోజున కాలం కొత్తగా పుడుతుంది. ఈరోజు (శుక్రవారం) ఒంటిగంటకి తెలుగు వారి ఇళ్లల్లో కాలం బాలూగారి పేరుతో మళ్లీ పుట్టింది. సినిమా పాటను పూజించాల్సినటువంటి భావన సమాజానికి లేదు. అలాంటి సినిమా పాటకి అద్భుతమైన స్థాయి తీసుకొచ్చిన గాయకుల్లో బాలూగారు ఒకరు. తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలూగారు. పాట పట్ల ఆయన చేసిన పూజ గురించి, శ్రద్ధ గురించి అందరూ ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఇంటిలోనూ బాలూగారు ఒక ముఖ్యమైన సభ్యుడు.

ఆయన గొంతు విననటువంటి రోజు తెలుగువారు ఎరుగుదురా? సినిమా పాటలకు గొంతు అరువు ఇచ్చినటువంటి కళాకారుడు మాత్రమే కాదు.. 20 ఏళ్లుగా ఒక విస్మరించలేనటువంటి, మృతి లేని ఒక కటుంబ సభ్యుడు. సినిమా మాటల్లో సాహిత్యానికి సముచిత స్థానం ఇవ్వడానికి సంకోచించే పరిస్థితులు చాలా కాలం ఉండేవి. నాకు తెలిసి భారతదేశంలో పాటలోని మాట పట్ల ప్రత్యేకించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక్క బాలూగారు తప్ప. ఇవాళ ఆయనలాంటి పెద్ద దిక్కు లేదు. ఆయన లోటు తీర్చలేనిది అంటారు. ఏంటి ఆ లోటు? 40వేల మంది బాలూగార్లను ఆయన నిర్మించి వెళ్లారు. గాలి ఉన్నంత కాలం, కాలం ఉన్నంత కాలం, తెలుగు సినిమా, భారతదేశంలో సినిమా ఉన్నంత కాలం బాలూగారు ఉంటారు. 74ఏళ్లకే ఆయన వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. సినిమా పాటలు రాసే ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ ఇచ్చిన కె. విశ్వనాథ్‌గారిని నాన్నగారు అని పిలుస్తాను.

విశ్వనాథ్‌గారిని నేను కలిసిన తొలి రోజు.. ఆయన బాలూగారిని పిలిచారు. నేను ‘గంగావతారం’ అనే పాట పాడి వినిపించినప్పుడు బాలూగారు కుర్చీలోంచి లేచి ‘మీరు ఎన్నో వందల పాటలు రాయాలి, అవి నేను పాడాలని అనుకుంటున్నాను’ అన్నారు. అది సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అనిపించింది. ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా. ఈ పాట ఇలా ఉండాలని ఇప్పుడు నాకు చెప్పేవారెవరు? నా పాట పాడేవారెవరు? ఆయన మూగబోవడం ఏంటి? కాలానుగుణంగా అందరూ వెళ్లాల్సిందే. అయితే బాలూగారు వెళ్లే సమయం ఇది కాదు? ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం పక్కనపెడితే.. ఎన్నో ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించారాయన. ఆయన గంధర్వలోకంలో పాటలు నేర్పడానికి వెళ్లి మనకి దుఃఖం మిగిల్చారు. ఈరోజు నుంచి కాలం బాలూగారి పేరుతో వెళుతుంది. – సిరివెన్నెల సీతారామశాస్త్రి, రచయిత

భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. బాలు నా సోదరుడే కాదు, నా ఆరో ప్రాణం. ఇలాంటి దుర్వార్తను ఇంత తొందరగా వింటాననుకోలేదు. మాట్లాడటానికి మాటలు రావడంలేదు. వాడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులందరూ ఈ భాదను ఓర్చుకోవాలని కోరుకుంటున్నాను. – కె. విశ్వనాథ్, దర్శకుడు

బాలూ.. నువ్వు త్వరగా తిరిగి రా అని చెప్పాను. నిన్ను చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. వినకుండా వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లిపోయావు?  గంధర్వుల కోసం పాటలు పాడటానికి వెళ్లావా? ప్రపంచం శూన్యం అయిపోయింది. ప్రస్తుతం నాకేమీ అర్థం కావడం లేదు. మాట్లాడానికి మాటలు రావడంలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎలాంటి బాధకైనా ఓ హద్దు  ఉంటుంది. కానీ ఈ బాధకు హద్దు లేదు. – ఇళయరాజా, సంగీత దర్శకుడు  

ఈరోజు దుర్దినం. ఎస్పీ బాలూగారు చివరి నిమిషం వరకూ ప్రాణం కోసం పోరాడారు. ఆయన దూరం కావడం చాలా బాధాకరం. భారతదేశంలో ఎస్పీబీ పాటకు, ఆయన స్వరానికి అభిమానులు లేకుండా ఉండరు. వ్యక్తిగా కూడా ఆయన్ను అందరూ అభిమానిస్తారు. కారణం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ సమానంగా గౌరవించారు.. ప్రేమను పంచారు. భారత చిత్రసీమ మహమ్మద్‌ రఫీ, కిశోర్‌ కుమార్, ఘంటసాల, టీఎమ్‌ సౌందరరాజన్‌ వంటి పెద్ద గాయకులను అందించింది. అయితే వాళ్లు కొన్ని భాషలకే పరిమితమైతే బాలూగారు పలు భాషల్లో పాడారు. గంభీరమైన, మృదువైన ఆయన గొంతు మరో నూరేళ్లయినా మన చెవుల్లో వినపడుతూనే ఉంటుంది. అయితే ఆ గొంతుకి సొంతదారుడు మన మధ్య ఇక ఉండరనేది బాధాకరం. – రజనీకాంత్, నటుడు

బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. బాలు గాయకునిగా ఎదుగుతున్న తరుణంలో నేను హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలోని అన్ని పాటలను బాలూతో పాడించాను. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది. సింగర్‌గా బాలూని బిజీ చేసింది. వ్యక్తిగతంగా కూడా మేం  ఎంతో ఆత్మీయులం. అలాంటి బాలు హఠాత్తుగా దూరం కావటం ఎంతో బాధగా ఉంది.  – కృష్ణ, నటుడు

బాలూగారితో దశాబ్దాల అనుబంధం గుర్తుకు వస్తుంటే కన్నీరు ఆగడంలేదు. గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఈ భూమి మీద పాట ఉన్నంతవరకు బాలు బతికే ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనలాంటి గాయకుడు మరొకరు పుట్టరు. – కృష్ణంరాజు, నటుడు

నేను, బాలు కలిసి కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో చదువుకున్నాం. శ్రీకాళహస్తిలో మొదలైన మా స్నేహం సినీ పరిశ్రమకు వచ్చాక చైన్నైలోనూ కొనసాగింది. అన్ని దేవుళ్ల పాటలను పాడి ఆ దేవుళ్లందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. మా శ్రీ విద్యానికేతన్‌లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. గత మార్చి 19 నా పుట్టినరోజున శ్రీ విద్యానికేతన్‌ వార్షికోత్సవానికి ఆయన హాజరు కావాల్సింది. కరోనా వల్ల ఆ కార్యక్రమం కేన్సిల్‌ కావడంతో రాలేకపోయారు. ఈ మధ్య కూడా ఫోన్‌లో ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనిపిస్తోంది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం దగ్గర వంద రూపాయలు తీసుకున్నాను. మేం కలుసుకున్నప్పుడల్లా ‘వడ్డీతో కలిపి ఇప్పుడది ఎంతవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్‌’ అని ఆటపట్టించేవారు. నా సినిమాల్లో ఆణిముత్యాల్లాంటి పాటలను పాడారాయన. నా చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నా హృదయంలో ఎప్పుడూ ఉంటారాయన. – మోహన్‌బాబు, నటుడు–నిర్మాత

బాలూగారి విషయంలో ఏ మాట వినకూడదు అనుకున్నానో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ను కోల్పోవటం దురదృష్టకరం. సంగీత ప్రపంచానికి ఇది దుర్దినం. ఘంటసాల గారి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది బాలూనే. మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే బాలూనే పుట్టాలి. నేను అన్నయ్యా అని పిలుచుకునే నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను. నా కెరీర్‌ విజయంలో ఆయనకి సింహభాగం ఇవ్వాలి. ‘నువ్వు మంచి నటుడివి.. కమర్షియల్‌ చట్రంలో ఇరుక్కుని నీలోని నటుడిని దూరం చేయకు’ అని సలహాలిచ్చేవారు. ఆ సలహాల మేరకే నేను ‘ఆపద్భాంధవుడు’, ‘రుద్రవీణ’, ‘స్వయంకృషి’ చిత్రాల్లో నటించాను. ‘నా పాటలకి సరైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చే కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒకరు’ అనేవారు. తాను పాడిన పాటల ద్వారా ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. – చిరంజీవి, నటుడు

అతికొద్ది ప్రతిభావంతులకు మాత్రమే వాళ్ల ప్రతిభకు తగ్గ పురస్కారాలు, అభినందనలు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అందులో అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఆయన పాడిన పాటల్లో కొన్నింటిలో కనిపించే అదృష్టం నాకు లభించింది. కొన్ని భాషల్లో నాలుగు తరాల నటులకు ఆయన పాడారు. రాబోయే తరాలన్నీ ఆయన కీర్తిని కొనియాడతాయి.  – కమల్‌ హాసన్, నటుడు

పాటలు పాడటంలో బాలూగారికి ఆపారమైన ప్రతిభ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ విషయం పక్కనపెడితే ఆయన నేను దర్శకత్వం వహించిన ‘మిథునం’ సినిమాకి హీరో. ఆయన కోసం నేను వంట మనిషిని పెడితే ‘ఎందుకు.. వద్దు భరణి, నాకు బేరియాట్రిక్‌ సర్జరీ జరిగింది. తినలేను’ అన్నారు. 30 రోజులపాటు 24 గంటలు నాతోనే గడిపారు. నేను వేసే జోకులను తెగ ఎంజాయ్‌ చేసేవారు. ఆయన నాతో ఒక మాట అన్నారు. ‘ఎప్పుడైనా నీ జీవితచరిత్ర రాస్తే.. భరణి ‘మిథునానికి ముందు మిథునానికి తర్వాత’ అనేవాడు. బాలు స్థానం చలనచిత్ర రంగానికి సంబంధించినంత వరకు ఖాళీ.– తనికెళ్ల భరణి, నటుడు–దర్శకుడు

స్వర ప్రపంచాన్ని శోకసంధ్రంగా చేసి 28వ నక్షత్రంగా నింగిలో వెలిగిపోతున్న శాశ్వత స్వరమంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. – స్వర వీణాపాణి, సంగీత దర్శకుడు

ఈ ఏడాది అనేక విషాద ఘటనలు జరుగుతున్నాయి. బాలూగారి వార్త వినగానే నాకు ఎంతో బాధ కలిగింది. ఆయన ఓ వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌. లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌తో ఆయన చేసిన హిందీ పాటలు అద్భుతం. లతా మంగేష్కర్‌తో ఆయన పాడిన పాటలు అద్భుతం. నేను ఇళయరాజా సంగీతంలో పాడినప్పుడు నా తమిళ ఉచ్ఛారణ విషయంలో ఎంతో సహాయం చేసేవారు. ఆయన మరణం సంగీత ప్రపంచంలో ఓ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – ఆశా భోంస్లే, గాయని.

ప్రతిభాశాలి. మధురభాషి, యస్పీ బాలుగారి మరణవార్త విని ఎంతో దుఃఖం కలిగింది. బాలూగారితో కలసి ఎన్నో పాటలు పాడాను. షోస్‌ చేశాం. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – లతా మంగేష్కర్, గాయని

గాన గంధర్వుడిగా గానానికి అర్థం చెప్పిన మహాగాయకుడు ఎస్పీ బాలూగారు. ఈరోజు మనందరినీ వదిలి అల్విదా చెప్పిన బాలూగారు మనతో లేరు అనేది బాధాకరం. చిన్నప్పుడు ఆయన స్ఫూర్తితో పరిశ్రమకి వచ్చిన నేను ఆయన్ను చూస్తూ పెరిగాను. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బాలూగారు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన పాటలెప్పుడూ మనతోనే ఉంటాయి. – జయప్రద, నటి–రాజకీయ నాయకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement