పాటల ప్రపంచంలో రారాజు బాలసుబ్రహ్మణ్యం తృతీయ వర్ధంతి | SP Balasubrahmanyam Death Anniversary Special Story On Biography, Career Details, Awards And Records - Sakshi
Sakshi News home page

SP Balasubrahmanyam Life Story: 'విశ్వగానగంధర్వుడు' బాలసుబ్రహ్మణ్యం తొలి గురువు ఎవరు..?

Published Mon, Sep 25 2023 9:11 AM | Last Updated on Mon, Sep 25 2023 10:40 AM

SP Balasubrahmanyam Death Anniversary Special Story - Sakshi

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు. పాటల పల్లకిలో నెలరాజుగా గుర్తింపు పొందారు. వేల పాటలు పాడి తెలుగువారికి ఎనలేని గుర్తింపు తెచ్చారు. అమరగాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. బాలు లేని పాటల ప్రపంచంలో ఎంతోమంది యువ గాయకులు ఆయన బాటలో ముందుకు నడుస్తున్నారు. ఆయన స్పూర్తితో  దశదిశలా సంగీత పరిమళాలను విరజిమ్ముతున్నారు. అర్ధ శతాబ్దకాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను  ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం వేశారు. ఎన్నో పాటలతో మనల్ని ఉర్రూతలూగించిన ఈ 'గాన చంద్రుడు' మనల్ని విడిచిపెట్టి నేటికి మూడేళ్లు. 2020 సెప్టెంబర్‌ 25న ఆయన కరోనా మహమ్మారి వల్ల మనకు దూరం అయ్యారు. నేడు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా సాక్షి నుంచి ప్రత్యేక కథనం.

తండ్రే తొలి గురువు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. బాలు అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.  తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ.  తండ్రి హరికథా కళాకారుడు కావడంతో అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రే ఆయనకు తొలి గురువు అయ్యారు. ప్రాథమిక విద్యను చిత్తూరు జిల్లా నగరిలో తన మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసిన బాలు హైస్కూల్‌ విద్యను మాత్రం శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పట్లో మన బాలు చదువు, ఆటల్లో ప్రథమ స్థానంలో ఉండేవారు.

అనంతపురంలో ఇంజనీరింగు సీటు వచ్చినా..
శ్రీకాళహస్తిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరిక ననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.

అలా ఇంజినీరింగ్‌ కోర్సు చదువుతుండగానే బాలుకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 'మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌' అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో 'హ్యాపీ బర్త్‌ డే టు యూ' అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద మెరిశారు. పలు వేదికలపై కూడా ఆ కాలం లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.

బాలు తొలిపాట ఈ సినిమాలోనే
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బాలుకు మాట ఇచ్చారు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు బాలు. 'ఏమి ఈ వింత మోహం' అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి. సుశీల, కల్యాణం రఘురామయ్య, పి. బి. శ్రీనివాస్‌లతో కలిసి పాడారు.

అలా 1967 జూన్‌ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ‘బాలు’ ప్రభంజనానికి తెరలేపింది. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించారు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్‌తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి బాలుకు అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు 'కోదండపాణి ఆడియో ల్యాబ్స్' అని అతని పేరే పెట్టుకున్నారు బాలు. సంగీతం ఎవరి దగ్గరా నేర్చుకోకపోయినా రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండటంతో ట్యూను ఒకసారి వింటే యథాతథంగా పాడగలిగే టాలెంట్‌ బాలుకి సొంతం.

ప్రపంచంలోనే అరుదయిన రికార్డు సృష్టించిన మన బాలు
1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు.

డబ్బింగ్‌ చెప్పడంలోనూ బాలుకు సాటిలేరు
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో సంగీత దర్శకుడు కె.చక్రవర్తి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా బాలు మారారు. అందులో కమల్ హాసన్‌కు చక్రవర్తి డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక క్యారెక్టర్‌కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. పసివాడిప్రాణం చిత్రంలో రఘు వరన్‌కు చెప్పిన డబ్బింగ్ సిసినిమాకే హైలెట్‌గా నిలిచింది.

అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్‌స్లేకు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పడం విశేషం.

నటుడిగా చివరి చిత్రం ఇదే
1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదం అయింది. ఆయన నటించిన వాటిలో ఎక్కువగా అతిథిగా పాత్రలైనా అన్నీ గుర్తుండిపోయేవే. ప్రేమికుడు, రక్షకుడు, పవిత్రబంధం, మిథునం తదితర చిత్రాల్లో ఆయన నటనతోనూ మెప్పించారు. చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన ‘దేవదాస్‌’లో మెరిశారు.

ఎప్పటికీ చెరగని రికార్డులతో పాటు మధుర స్మృతులు
► భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన ‘పద్మభూషణ్‌’, ‘పద్మశ్రీ’ అవార్డులను బాలు అందుకున్నారు.
► ‘శంకారభరణం’(1979) చిత్రానికి గానూ తొలిసారి జాతీయ అవార్డును దక్కించుకున్న బాలు సుదీర్ఘ ప్రస్థానంలో  6 జాతీయ పురస్కారాలు ఉన్నాయి.
► ‘మైనే ప్యార్‌కియా’ చిత్రానికి గానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న బాలు ఖాతాలో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఉన్నాయి.
► 29 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు.
► 2016లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు.
► అటెన్‌ బరో దర్శకత్వంలో వచ్చిన  ‘గాంధీ’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషించిన కింగ్‌ బెన్‌స్లేకు ఎస్పీబీనే డబ్బింగ్‌ చెప్పారు.
► 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40 వేలకు పైగా పాటలతో మెప్పించిన బాలు
► లిపి లేని భాషలు కొంకణి, తులులోనూ పాటలు పాడిన బాలు.
► ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తొలిపాట పాడింది (1966)లో 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ'
► 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రానికి గాను తన మొదటి రెమ్యురేషన్‌ రూ.300 ఇచ్చారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం కావడం విశేషం.
► 'మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు' అంటూ గుక్కతిప్పుకోకుండా రాధికకు ప్రేమ కవిత్వం వినిపిస్తూ కనిపించే బాలసుబ్రహ్మణ్యాన్ని ఇప్పటికీ మరిచిపోలేరు ఆయన అభిమానులు.
► ప్రేమికుడులో ప్రభుదేవాతో పోటీపడి స్టైలిష్ స్టెప్‌లు వేశారు బాలసుబ్రహ్మణ్యం. ''అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే'' అనే పాటలో కనిపించిన బాలు అందులో కొడుకు పాత్రలో ఉన్న ప్రభుదేవాతో సమానంగా డ్యాన్స్ చేశారు.
సాక్షి- వెబ్‌ డెస్క్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement