
అలరించిన ‘స్వర్ణమంజరి’
సాక్షి, ముంబై: స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్, ముంబై ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ప్రభాదేవిలోని రవీంద్ర నాట్య మందిర్ హాలులో నిర్వహించిన ‘స్వర్ణమంజరి’ అనే పాటల కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు ‘పాడుతా తీయగా’ చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సచిన్ భావూ ఆహిర్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల్ని అభినందించారు. తెలుగువారి సేవలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అయితే ‘తెలుగు వారికి శుభాకాంక్షలు’ అంటూ మాట్లాడడంతో సభికులు ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత చిన్నారులు ఆలపించిన సినీ గేయాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. తర్వాత అంబిక అనే బాలిక ప్రదర్శించిన ‘రింగ్ డ్యాన్స్’ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాన గంధర్వ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య శాలువ, మెమెంటో, సన్మాన పత్రంతో నిర్వాహకులు సన్మానించారు. తర్వాత శివాజీ పార్క్ ప్రాంతానికి చెందిన స్వామి సమర్థ్ సేవా మండలికి చెందిన బాలికలు తాడుపై చేసిన విన్యాసాలు, యోగాసనాలు సభికుల్ని ఆకట్టుకున్నాయి. యువకులు ప్రదర్శించిన మల్ఖంబ్ విన్యాసాలు కూడా ప్రేక్షకులను అబ్బురపరిచాయి. తర్వాత నేత్ర హీనులైన యువకులు, వికలాంగులు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు సహాయక పరికరాలను బాలసుబ్రహ్మణ్యం అందజేశారు. మెరిట్ సాధిం చిన తెలుగు విద్యార్థులను కూడా సన్మానించారు. ఇటీవల అత్యంత ధైర్య సాహాసాలు ప్రదర్శించి రాష్ట్రపతి అవార్డు పొందిన తెలుగు యువకుడు రోహిత్‌ను కూడా సన్మానించారు. కార్యక్రమంలో చివరగా స్వర్ణాంధ్ర సంస్థకు చెందిన సావనీర్‌ను ఎస్.పి.బాలు ఆవిష్కరించారు సెవెన్‌హిల్స్ ఆస్ప త్రి డాక్టర్ సత్యప్రసాద్, డాక్టర్ నాగేంద్ర పర్వతనేని, రాజ్‌గిరి ఫౌండేషన్‌కు చెందిన అశోక్ రాజ్‌గిరిని సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కె.ఆబూరావు, పట్టెం వీరు, మంతెన రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు కృషి చేశారు.