మరచిపోలేని మహనీయుడు | Sakshi Guest Column On Ghantasala Venkateswararao | Sakshi
Sakshi News home page

మరచిపోలేని మహనీయుడు

Published Sun, Dec 4 2022 3:31 AM | Last Updated on Sun, Dec 4 2022 3:31 AM

నేడు ఘంటసాల శత జయంతి ముగింపు  - Sakshi

మద్రాసులో బడిలో చదువు కొంటున్న రోజులలో ఘంటసాల గారి ఇంటిముందునుంచి వెడుతూ – ఆ వాకిలి ముందు ఆగి అక్కడ ఉన్న ఆయన పేరు చదివి సంతోషిస్తూ ఉండేవాడిని. యాభై అయిదేళ్ల కిందట ఒక వేసవి మధ్యాహ్నం ఆయనను ఎట్లాగైనా చూసి మాట్లాడాలని ఆయన ఇంటికి వెళ్ళాను. ఎండవేళ వచ్చినందుకు బాధ పడి మజ్జిగ తెచ్చి ఇచ్చి నన్ను తాగమన్నారు. నా గురించీ, నా చదువు సంధ్యల గురించి అడిగారు. ఆయన అంటే నాకు చాలా అభిమానమనీ, ఆయన జీవిత చరిత్ర రాయాలని ఉందనీ చెబితే నవ్వి– ‘ముందు బాగా చదువుకో నాయనా! తర్వాత చూద్దాం’ అన్నారు. 

1969 నుంచి ఆయనను నేను తరుచుగా కలుసు కొంటూ ఉండేవాడిని. ఎంత పనితొందరలో ఉన్నా కాసేపయినా నాతో మాట్లాడేవారు. ఆ అభిమానంతో – ఆయన విదేశీ యాత్రల వేళ– విదేశాలలో పాడడానికి ఎన్నుకొన్న పాటలను నాకు వినిపించేవారు. ఆ సందర్భాలలో – నేను ఒక్కడినే శ్రోత కావడం నా భాగ్యం. 

ఆయన విదేశీ యాత్రలకు బయలుదేరేముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో – నేను ఆయన గురించి తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో నా చిన్న తనపు మిడిమిడి జ్ఞానంతో రాసిన కవితలు వినిపించాను. ఆయన వాటి ప్రతులు  తీయించి పత్రికల వారికి పంపడం ఒక గొప్ప అనుభవం. విదేశీయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఆ విశేషాలు పత్రికల వారితో ముచ్చ టించడానికి ఒక సాయంకాలం విందు ఏర్పాటు చేశారు. దానికి నన్నూ రమ్మన్నారు. 

ఆ గోష్ఠిలో ఇమడలేనేమో అని నేను ఆ విందుకు వెళ్లలేదు. ఆ కార్యక్రమం అయిన కొన్నాళ్ల తర్వాత ఒక సాయంకాలం నేను ఆయనను చూడడానికి వెళ్లాను. రికార్డింగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఘంటసాల నన్ను చూసి ‘ఏం బాబూ! ఆరోజు పార్టీకి రాలేదు?’ అన్నారు. నేను సమాధానం చెప్పడానికి తట పటాయిస్తుంటే ‘నీకు ఇప్పుడే ఇక్కడే పార్టీ ఇస్తున్నాను నా పక్కన కూర్చో... రా...’’ అన్నారు. భార్య సావిత్రమ్మ గారికి ఆ సంగతి చెప్పారు. వేడి వేడి ఇడ్లీలు, లడ్లు, కాఫీలతో సాగిన ఆ ప్రత్యేకమైన విందు నేను ఏనాటికీ మరచిపోలేనిది. అది ఆయన నా మీద చూపిన వాత్సల్యానికి గుర్తు.

ఆయన నాతో చాలా విషయాలు మాట్లాడేవారు. ఒకసారి చదువు గురించిన ప్రస్తావన వస్తే – చదువు కొంటున్న రోజులలో చదువు మీద దృష్టి ఉంచాలనీ, వయసు చిన్నదిగా ఉన్నపుడే చదవగలిగినంత చదువులు చదవాలనీ చెప్పారు. ఆయన పాటలు వినిపించడానికి తమ దగ్గరికి వచ్చే యువతీయువకులకు – సంగీతంతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేవారు. 

ఆయన వాక్శుద్ధి అద్వితీయం. ఒక వర్ధమాన సినిమా రచయిత, పెద్ద దర్శకులు కాగలరని ఘంటసాల గారు చెప్పారు. ఆ తరువాత దర్శకులు కూడా అయిన ఆ రచయితే దాసరి నారాయణ రావుగారు! చిత్తూరులో ఒక బాలుణ్ణి చూసి – ‘బాగా చదువుకో బాబూ! పెద్ద పెరిగాక ఏం కావాలనుకుంటున్నావు?’ అని అడిగితే ఆ బాలుడు తనకు గాయకుడు కావాలని ఉందన్నాడు. ‘కాదు బాబూ! నీవు బాగా చదువుకొని కలెక్టర్‌ కావాలి’ అన్నారు ఘంటసాల గారు.

ఆ బాలుడు ఉత్తరోత్తర కలెక్టర్‌ అయ్యారు. కలెక్టర్‌ అయిన ఆ బాలుడి పేరు – కె. చంద్రమౌళి. నాకు మంచి ఉద్యోగం దొరికి నేను పెద్ద అధికారి కాగలననీ ఆయన దీవించారు. ఆ దీవెన ఫలించింది. నేపథ్య గాయకులలో ‘మీ తర్వాత ఎవరు?’ అని అడిగితే ‘ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం’ అన్నారు ఆ ఘంట సాల. ఆ మాటా నిజం అయింది. 

ఆయన జీవిత చరిత్ర రాయడానికి నాకు అనుమతి ఇవ్వడం, నన్ను ఆశీర్వదించడం నాకు దొరికిన గొప్ప అదృష్టం. భాగ్యం. అర్ధంతరంగా అస్తమించిన ఆ అమృత మూర్తి అంతిమ యాత్రవేళ ఆయన భౌతిక కాయాన్ని నేను కూడా మోశాను. ఆ బాధ మాటలలో చెప్పలేనిది.  తమ సంగీతం ద్వారా ఇంకా జీవించి ఉన్న ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. 

వ్యాసకర్త ఆకాశవాణి పూర్వసంచాలకులు,ఘంటసాల జీవిత చరిత్ర ‘మన ఘంటసాల’ రచయిత
డాక్టర్‌ పి. ఎస్‌. గోపాలకృష్ణ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement