
బాలు విగ్రహావిష్కరణలో సంగీత దర్శకుడు కోటి తదితరులు
సాక్షి, పాత గుంటూరు: తెలుగు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్.కోటి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గుంటూరు నగరం నడిబొడ్డున స్థానం కల్పించారని తెలిపారు.
గుంటూరు నాజ్ సెంటర్‌లోని ఐలాండ్‌లో కళాదర్బార్ సంస్థ వ్యవస్థాపకుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకులు కోటి... ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావు, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడుతో కలిసి బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ బాలు తన మొదటిపాట నుంచి అన్ని పాటలు పాడి తనను ఆశీర్వదించారని అన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించిన రంగారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాలు పాడిన పాటలను కోటి ఆలపించి అభిమానులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో విగ్రహ శిల్పి రాజ్‌కుమార్ వడయార్, కార్పొరేటర్లు, విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment