శుష్క వాగ్దానాలే సంక్షేమమా? | Mallepally Laxmaiah article on Sc and ST welfare | Sakshi
Sakshi News home page

శుష్క వాగ్దానాలే సంక్షేమమా?

Published Thu, Aug 17 2017 12:38 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

శుష్క వాగ్దానాలే సంక్షేమమా? - Sakshi

శుష్క వాగ్దానాలే సంక్షేమమా?

కొత్త కోణం
మోదీ ప్రభుత్వం దేశంలో ఎస్సీ, ఎస్టీల ఉనికి ఉన్నట్టే భావించడంలేదు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి అంశమే మోదీ ప్రభుత్వం ఎజెండాలో లేకుండా పోయింది. పైగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న అరకొర నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అంబేడ్కర్‌ పట్ల నిజంగానే గౌరవం, భక్తి ఉన్నట్లయితే ఆయన 40 ఏళ్లు శ్రమించి రూపొందించిన పథకాలను, అహర్నిశలు తపనపడి నిర్మించిన రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి.

‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’’ బాలగంగాధర్‌ తిలక్‌ నినాదం. ఇప్పుడు స్వతంత్ర భారతంలో సురాజ్యం నా జన్మహక్కు అనేదే నినాదం కావాలి. ప్రభుత్వాలు బాధ్యతలను, పౌరులు తమ విధులను నిర్వర్తించాలి. దివ్య, భవ్య భారత నిర్మాణమే మనందరి ధ్యేయం కావాలి’’ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఏడు పదుల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల సందర్భంగా పలికిన వ్యాఖ్యలివి. ఈ మాటలకీ, దేశంలో అమలు జరుగుతున్న అంశాలకీ ఏదైనా పొంతన ఉన్నదా? అని ఆలోచిస్తే, కచ్చితంగా లేదనే చెప్పాలి. అభివృద్ధి ధ్యేయంగా అదే ఏకైక నినాదంగా అ«ధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎంత మాత్రం ఆ దిశగా అమలు జరుగుతున్న దాఖలాల్లేవు.

ముఖ్యంగా దళిత, ఆదివాసుల జీవితాలు మరింత దుర్భర పరిస్థితిలోకి కూరుకుపోతున్నాయి. గత ఎన్నో పోరాటాల ఫలితంగా, అంబేడ్కర్‌ లాంటి ఎందరో త్యాగధనుల ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న హక్కులనుసైతం నరేంద్రమోదీ ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది. గత మూడేళ్ళలో నరేంద్రమోదీ ప్రభుత్వం దళిత, ఆదివాసీ ప్రజల కోసం ప్రత్యేకించి ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టకపోగా, అంబేడ్కర్‌ నామజపంతోనే దళితులను బుజ్జగించే ప్రయత్నానికి ఒడిగడుతున్నది.

నోటుమీది బొమ్మ ఆకలి చల్లార్చేనా?
ఇటీవల కొంత మంది కరెన్సీ నోట్లపైన అంబేడ్కర్‌ బొమ్మని ముద్రించాలనే నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. అందుకోసం క్యాంపెయిన్‌ను సైతం మొదలుపెట్టారు. దళితులు, ఆదివాసీల కోసం కేటాయించిన నిధులను కూడా సరిగా ఖర్చు చేయని మోదీ ప్రభుత్వం... అంబేడ్కర్‌ సంస్మరణార్థం ఐదు స్థలాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించుకొన్నది. అంబేడ్కర్‌ జన్మించిన మవు, ఆయన ఢిల్లీ నివాసం, అలీపూర్‌ 26, ఆయన ముంబై నివాసం రాజగృహ, ఆయన బౌద్ధం స్వీకరించిన స్థలం నాగపూర్‌ దీక్షా భూమి, ఆయన సమాధి ఉన్న ముంబైలోని చైత్యభూమి.

అంతేకాకుండా ఆయన లండన్‌లో ఉంటూ చదువుకున్న స్థలాన్ని కూడా స్మారక కేంద్రంగా ప్రకటించారు. దానిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. మూడేళ్లలో అంబేడ్కర్‌ను స్మరించడం, అప్పుడప్పుడు ఆయన పేరును ప్రస్తావించడం మాత్రమే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎవరితోనో అంబేడ్కర్‌ బొమ్మ కరెన్సీ నోట్ల మీద ముద్రించాలనే చర్చ మొదలు పెట్టించారు. అయితే ఇవేవీ నిజమైన అంబేడ్కర్‌ భావజాలన్ని పరివ్యాప్తి చేయలేవన్నది నగ్న సత్యం. ఉదాహరణకు అమెరికా చరిత్రనే తీసుకుంటే అమెరికా కరెన్సీ 20 డాలర్ల నోటుపైన ఉన్న మాజీ అధ్యక్షులు ఆండ్రూ జాక్సన్‌ బొమ్మను తొలగించి, నల్లజాతి ప్రజల హక్కుల కోసం పరితపించిన, జీవితాంతం పోరాడిన పౌరహక్కుల నాయకురాలు హరియత్‌ ట్యూబ్‌మన్‌ బొమ్మను పెడుతున్నట్టు ఏప్రిల్‌ 20, 2016న అమెరికా ట్రెజరీ సెక్రటరీ జాకబ్‌ ల్యూ ప్రకటించారు.

అయితే ఆ నిర్ణయం నల్లజాతి ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాలేదనడానికి ఇప్పటి పరిస్థితే తార్కాణం. ఓట్ల కోసమే తప్ప, నిజంగా అణగారిన ప్రజలకోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టు లేదనడానికి నల్లజాతి ప్రజలు ఎదుర్కొం టున్న వివక్ష, ఆకలి అవమానాలే సాక్ష్యాలు. నూటికి 30 శాతం మంది నల్ల జాతి ప్రజలు తినడానికి రొట్టెముక్కకు కూడా నోచుకోలేకపోతున్నారని ‘‘బ్రెడ్‌ ఫర్‌ వరల్డ్‌ ’’అనే సంస్థ అధ్యయనం వెల్లడించింది. బతకడానికి వేరే దారే లేక పలువురు నల్లజాతి యువతీ యువకులు మత్తు మందు వ్యాపారంలో పావులుగా మారి జైళ్లలో మగ్గుతున్నారని పలు నివేదికలు తెలిపాయి.

అంబేడ్కర్‌ జపం కాదు, ఆయన బాటన సాగండి
అందుకే ఓ రచయిత చెప్పినట్టు అంబేడ్కర్‌ ఫొటోని కరెన్సీ నోట్లపై ముద్రిం చడం కాదు, కనీసం జీవితానికి సరిపోయేంత కరెన్సీ దళిత, ఆదివాసుల జేబుల్లో ఉండేటట్టు చేస్తే మంచిది. దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని నిజంగానే కోరితే, అంబేడ్కర్‌ పూజలకు బదులు ఆయన నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తే మంచిది. దళితుల సామాజిక సమానత్వం కోసం, రాజకీయ ఆర్థిక సాధికారత కోసం అంబేడ్కర్‌ తన జీవిత కాలాన్నంతటినీ వెచ్చించారు. దళితుల రాజకీయ సాధికారత కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఓటింగ్‌ విధానం... దళితులను హిందువులపైన ఆధారపడకుండా స్వతంత్రులను చేయగలదన్న అభిప్రాయంతో గాంధీజీ దానికి గండికొట్టాలని యత్నించి, కృతకృత్యుడయ్యాడు.

చివరకు మధ్యే మార్గంగా గాంధీజీ, అంబేడ్కర్‌ల మధ్య కుదిరిన పూనా ఒప్పందంలో తొమ్మిది అంశాలున్నాయి. ఎనిమిది అంశాలు ఓటింగ్, సీట్ల రిజర్వేషన్‌ తదితర అంశాల మీద ఉండగా, తొమ్మిదవ అంశం మాత్రం అంటరాని కులాల విద్యాభివృద్ధికి సంబంధించినది. ప్రతి రాష్ట్రం తమ బడ్జెట్‌లో తగు నిధులను అంటరాని కులాల విద్యాభివృద్ధికి కేటాయించి ఖర్చు చేయాలని పూనా ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే 1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చిన తరువాత అంటరాని కులాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అర్హతగల షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులను విదేశీ చదువులకు పంపించారు కూడా. ఇటువంటి విధానాన్ని స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 38, ఆర్టికల్‌ 46లను చేర్చారు.

రాజ్యాంగంలోని 38వ ఆర్టికల్, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నది. జాతీయ జన జీవితంలో భాగమైన అన్ని సంస్థలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం కృషి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఆర్టికల్‌ స్పష్టం చేసింది. వివిధ వర్గాల ప్రజల మ«ధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తులు, సామాజిక వర్గాల మధ్య అసమానతలను నిర్మూలించాలని కూడా ఆర్టికల్‌ 38 సూటిగా ఆదేశించింది. అదేవిధంగా ఆర్టికల్‌ 46 బలహీన వర్గాల ప్రజల కోసం, ప్రత్యేకించి షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ఆర్థిక విద్యారంగాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు ప్రభుత్వాలు తగు కార్యక్రమాలను రూపొందించాలని సూచించింది. ఈ ఆర్టికల్‌ వల్లనే, ఈ రోజు వెనుకబడిన కులాలుగా చెప్పబడుతున్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం లభించింది.

సబ్‌ప్లాన్‌ను రద్దు చేసి...
అయితే 1974 వరకు ప్రభుత్వాలు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఎటువంటి విధానాలనూ చేపట్టలేదు. ఆయా వర్గాలకు ప్రత్యేకమైన శాఖలు కానీ, కార్యక్రమాలుగానీ రూపొందించలేకపోయాయి. 1960 దశకం చివరిభాగంలో, 1970 దశకం తొలి భాగంలో దేశవ్యాప్తంగా నక్సలైటు తిరుగుబాటు రూపంలో ఆదివాసులు, దళితుల పోరాటాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాతనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ వర్గాల సంక్షేమంపై దృష్టి సారించడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే నాటి ప్రభుత్వం ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ పేరుతో బడ్జెట్‌లో ప్లాన్‌ పద్దు నుంచి జనాభా శాతం ఆధారంగా నిధులను కేటాయించడాన్ని 1974లో ప్రారంభించింది. ఆ తరువాత 1980 నుంచి ఎస్సీల కోసం స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌ను అమలులోనికి తీసుకొచ్చారు. దాని ద్వారా కొంత మెరుగైన పథకాలు అమలులోకి వచ్చినప్పటికీ నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. పేరుకు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ప్లాన్‌ నిధుల అమలు కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఆ సంస్థ చొరవతో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు 11 ఏళ్ల పాటు జరిపిన ఉద్యమం వల్ల 2012 డిసెంబర్‌ 2న నిధుల ఖర్చు కోసం ఒక చట్టాన్ని తెచ్చారు. అయితే 2017లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్లాన్, నాన్‌ ప్లాన్‌ పద్దులను తొలగించడం వల్ల సబ్‌ప్లాన్‌ చట్టానికి గానీ, ఆ విధానానికి గానీ అర్థం లేకుండా పోయింది. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు చొరవతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ చట్టం స్థానంలో ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దాని ద్వారా మరొక్కసారి జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ నిధుల చట్టం ఆవశ్యకత ముందుకొచ్చింది.

నిధులను మురగబెడుతూ..
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో మాత్రం ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీల ఉనికి ఉన్నట్టే భావించడంలేదు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను పట్టించుకోవడం లేదు. దానితో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి అంశమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎజెండాలో లేకుండా పోయింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న అరకొర నిధులు కూడా ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయి. 2014–15 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌ రూ. 17,63,214 కోట్లు కాగా వారికి కేటాయించింది రూ. రూ. 50,548 కోట్లు. వాస్తవానికి వారి వాటాకు రావాల్సింది రూ. 81,460 కోట్లు. వారికి కేటాయించిన నిధుల శాతం 2.87గా తేల్చారు. 2015–16లో అది 1.47 శాతం, 2016–17లో 1.96 శాతం, 2017–18లో 2.44 శాతం. అదేవిధంగా ఎస్టీ సబ్‌ప్లాన్‌ కూడా అంతకంటే దయనీయంగా ఉంది.

2014–15లో అది 1.84 శాతం, 2015–16లో 1.13 శాతం, 2016–17లో 1.21 శాతం, 2017–18లో 1.49 శాతం కేటాయించారు. ఈ కేటాయింపులను కూడా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల అవసరాలకు పెద్దగా ఉపయోగపడని శాఖలకే అధికంగా కేటాయించారు. ఫలితంగా, 2014–15లో రూ. 39,585 కోట్లు, 2015–16లో రూ. 21,730 కోట్లు, 2016–17లో రూ. 32,168 కోట్లు 2017–18లో రూ. 26,684 కోట్ల రూపాయల నిధులు వీరికి ఉపయోగపడకుండా మురిగిపోయాయి. ఇందులో 78 శాతం పైగా ఇటువంటి పథకాలకే కేటాయించినట్టు లెక్కలు చెపుతున్నాయి.
 
గత మూడేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతున్న నిర్లక్ష్యం ఎలాంటిదో పై లెక్కల ద్వారా మనకు అర్థం అవుతుంది. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ పట్ల గౌరవం, భక్తి ఉన్నట్లయితే, ఆయన నలభై సంవత్సరాల పాటు శ్రమించి రూపొందించిన పథకాలను, అహర్నిశలు తపనపడి నిర్మించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం ఒక్కటే దళితులు, ఆది వాసుల నిజమైన విముక్తి మార్గం.

మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement