పూలు చల్లే చేతుల్లోనే రాళ్లు..!
దళితులను, ఆదివాసీలను వివక్షకు గురిచేస్తూ, అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం, ఆయన నివసించిన ప్రదేశాలను యాత్రాస్థలాలుగా మార్చడం పట్ల చూపే శ్రద్ధ దళిత, ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై చూపకపోవడం యాదృచ్ఛికం కాదు.
చాయ్‌వాలాని గెలిపించిన భారత దేశ ప్రజలు బలహీన వర్గాల ప్రతినిధిగా మోదీ ప్రజ లను ఆకట్టుకుంటాడని ఆశించారు. యువత రంలో ఆశని రేకె త్తించే అనర్గళమైన ఉపన్యా సాలు, వాగ్దానాలనే నీటి మూటలతో ఆకట్టుకున్న మోదీ ప్రజల ఓట్లను కొల్లగొట్టారు కానీ ఆచరణలో ఆయా వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అర క్షణమైనా ఆలోచించిన దాఖలాలు లేవు. పర్యవసానంగా దేశం అల్లకల్లోలంగా మారింది. రెండేళ్లు పూర్తిచేసుకున్న మోదీ పాలనలో ప్రజలాశించిన దేమిటి? వారికి లభించినదేమిటో తరచి చూసుకోవాలి.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మోదీ ప్రధానిగా రెండేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ స్వతహాగానే లోక్‌సభలో మెజారిటీ సంపాదించింది. ఎన్నికల సమయంలో మోదీ చేసిన ప్రసంగాలు, యువతరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, కల్పించిన ఆశలు గానీ ఆచరణలో కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు.
ముఖ్యంగా సమాజంలోని అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కానీ, వారి సంక్షేమం, విద్యలపైన దృష్టి కానీ మోదీ ప్రభుత్వ ఎజెండాలోనే కనిపించడంలేదు. పైగా భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ఉనికినే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీలు కలిస్తే ఈ దేశ జనాభాలో దాదాపు పావుభాగం.
రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకు కల్పించిన హక్కులు, రాయితీలను నిర్లక్ష్యం చేసిన ఏ పాలకులూ సుదీర్ఘకాలం కొనసాగలేకపోయారు. గత రెండేళ్లుగా ఈ వర్గాల ప్రజలకేం జరిగిందనే విషయంపై దేశమే కాదు ప్రపంచం యావత్తు దృష్టి సారించింది. కానీ ఈ వర్గాలకు ఈ రెండేళ్ళలో జరిగిన నష్టం గతంలో ఎప్పుడూ జరగలేదన్నది స్పష్టం.
ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లకు ముందుగా దేశ, వివిధ రాష్ట్రాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద ‘ఎకనామిక్ రివ్యూ’ పేరుతో ఒక సుదీర్ఘమైన విశ్లేషణ ఉంటుంది. నిజానికి బడ్జెట్ రూపకల్పనలో ఇందులో పేర్కొన్న అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు. గత అరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ‘ఎకనామిక్’ రివ్యూలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల స్థితి గతులు, వారికి అందిస్తున్న పథకాలు అంతేకాకుండా, ఆ వర్గాలు సాధించిన ప్రగతి చోటుచేసుకుంటుంది. అయితే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎకనామిక్ రివ్యూ నుంచి ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలనే తొలగించింది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఉనికిని కూడా ప్రభుత్వం గుర్తించేందుకు సిద్ధంగా లేదని దీనర్థం.
అయితే ఈ వర్గాల పట్ల వివక్ష ఆచరణలో కూడా కనిపిస్తున్నది. 2015-16, 2016-17, కేంద్ర బడ్జెట్‌లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం నిధుల కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ఈ రెండు బడ్జెట్‌లలో సగానికి సగం కేటాయింపులకు కోత పెట్టారు. ఉదాహరణకు, 2015-16 బడ్జెట్‌లో ఎస్సీలకు 16.6 శాతం నిధులు కేటాయించారు. రూ.77,236 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ. 30,850 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎస్టీలకు 8.6 శాతమే.
రూ. 40,014 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ. 19,980 కోట్లు మాత్రమే కేటాయించడం గమనించాల్సిన విషయం. 2014-15 బడ్జెట్‌తో పోలిస్తే ఇది గణనీయంగా పడిపోయిందని తెలుస్తుంది. ఈ కేటాయిం పుల్లోనూ అంకెల్లోనే కోట్ల రూపాయలు ఉంటాయి. ఆచ రణలో అవి ఏ మాత్రం ప్రయోజనాన్ని చేకూర్చలేవు.
అందుకుగాను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్థవం తంగా అమలు చేయడానికి చట్టబద్ధత కావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. వీటినేమాత్రం పట్టించుకోని ప్రభుత్వం ‘నీతి ఆయోగ్’ రూపంలో ఊహించని దాడికి పాల్పడుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని, అమలు చేసే పథకాలను ‘ప్రణాళికా సంఘం’ పర్యవేక్షించేది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల చూపుతున్న వివక్షను గమనించిన నీతి ఆయోగ్.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలును పర్యవేక్షించే బాధ్యతను తాము తీసుకోవడం లేదని ప్రకటించింది. దీనితో ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధిపట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిర్ల క్ష్యం పరాకాష్టకు చేరింది.
అదే సమయంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విద్యార్థి సంఘం నాయకుడు, దళిత రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాల్లో జరుగుతున్న కుల వివక్షను బట్టబయలు చేసింది. దేశమంతా రోహిత్‌కి జరిగిన అన్యాయానికి కోడై కూస్తుంటే మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చు న్నారు. కనీసం స్పందించలేదు.
ఈ విషయాలన్నింటిపై కమిటీ వేసి, ఆ సిఫారసుల ఆధారంగా చర్యలు తీసు కోవాలనే డిమాండ్‌ను సైతం పట్టించుకోలేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దళిత, ఆదివాసీ విద్యార్థుల అసం తృప్తికి ఒక ప్రధాన కారణం వివక్ష, అలాగే ఆయా వర్గాల ఆర్థిక అవసరాలను తొక్కిపెట్టడం. విద్యార్థుల ప్రయోజ నాలను నిర్లక్ష్యం చేయడం, బడ్జెట్‌లో కేటాయింపులకు కోత పెట్టడం. ఇవన్నీ దళిత, ఆదివాసీ విద్యార్థుల సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. కార్పోరేట్ రంగానికి మాత్రం విపరీతంగా రాయితీలు, పన్నులు మినహాయింపులు ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు దళితులను, ఆదివాసీలను వివక్షకు, నిర్ల క్ష్యానికి గురిచేస్తూ, బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం, ఆయన నివసించిన ప్రదేశాలను యాత్రాస్థలాలుగా మార్చడం లాంటి విషయాలపట్ల చూపు తున్న శ్రద్ధ దళిత, ఆదివాసీ ప్రజల సామాజిక, ఆర్థికా భివృద్ధిపై చూపకపోవడం యాదృచ్చికం కాదు. ఈ రెండేళ్ళలో ఒక్కటంటే, ఒక్కటి కూడా పనికి వచ్చే పథకం లేదు. కనీసం ఈ రెండేళ్ళు పూర్తయిన సందర్భంగానైనా గత పాలనను సమీక్షించుకొని, దళితులు, ఆదివాసీల పట్ల తమ వివక్షాపూరితమైన వైఖరిని పునఃసమీక్షించుకోకపోతే మోదీ ప్రభుత్వానికి తిప్పలు తప్పవు.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్: 97055 66213