సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావుకి ప్రధాని నరేంద్రమోదీ అవార్డు ఇచ్చి సత్కరించడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకుడైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాల్సిందిపోయి, అతడికి అవార్డులిచ్చి ఎలా సత్కరిస్తారని ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో ప్రశ్నించారు. ‘రోహిత్ వేముల భారతమాత బిడ్డ' అని ఆయన ఆత్మహత్యానంతరం పేర్కొన్న ప్రధాని మోదీ.. ఇప్పుడు రోహిత్ మరణానికి కారణమైన వీసీ అప్పారావును తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో సత్కరించారని లాలూ ఆక్షేపించారు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు కూడా వీసీ అప్పారావుకి అవార్డునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావుకి చంద్రబాబు దగ్గరుండి ప్రధాని మోదీ చేత అవార్డునిప్పించారని విద్యార్థులు ఆరోపించారు. ఈ వీసీ కారణంగానే రోహిత్ వివక్ష, వెలివేత ఎదుర్కొన్నారని ఆయనతోపాటు రస్టికేట్ అయిన అంబేడ్కర్ స్టుడెంట్స్ అసోసియేషన్ నాయకుడు దొంత ప్రశాంత్, విజయ్, శేషు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అప్పారావుకి అవార్డు ఇవ్వడం విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడంలో భాగమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు చేయాల్సిన వ్యక్తికి అవార్డా మోదీ?
Published Wed, Jan 4 2017 6:52 PM | Last Updated on Fri, Jul 26 2019 5:38 PM
Advertisement