లాలూ.. పుత్రోత్సాహం | Lalu Yadavs First Public Appearance After Coming Out Of Jail | Sakshi
Sakshi News home page

Lalu Prasad Yadav: లాలూ.. పుత్రోత్సాహం

Published Tue, Jul 6 2021 1:21 AM | Last Updated on Tue, Jul 6 2021 8:54 AM

Lalu Yadavs First Public Appearance After Coming Out Of Jail - Sakshi

పాట్నా: చాలా కాలం తర్వాత ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బీహార్‌ రాజకీయ యవనికపై ప్రత్యక్షమయ్యారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీశ్‌ పాలన అనేక వైఫల్యాలతో నిండిం దంటూ నిప్పులు చెరిగారు. ఆర్‌జేడీకి తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో మంచి భవిష్యత్‌ ఉంటుందని ఆశాభావం ప్రకటించారు. రాష్ట్రీయ జనతాదళ్‌ స్థాపించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఆయన మద్దతుదారులనుద్దేశించి ఢిల్లీలోని కూతురు నివాసం నుంచి మాట్లాడారు. ఓబీసీ కోటా కోసం తాను ఎంతగా కొట్లాడింది గుర్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆయన ప్రసంగం వినేందుకు పలువురు నేతలు కార్యకర్తలు పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యలయానికి చేరకున్నారు. దాణా కుంభ కోణంలో జైలు శిక్ష, అనారోగ్యం, కుటుంబ సమస్యలు ఇటీవల కాలంలో లాలును కుంగదీశాయి.

తాజా ప్రసంగంలో లాలూ మార్కు చమక్కులు లేకున్నా, ప్రత్యర్ధులపై విమర్శలు మాత్రం తగ్గలేదు. జీఎస్‌టీ, నోట్ల రద్దు, కరోనాతో ఆర్థిక సంక్షోభం వచ్చిందని, ఇలాంటి తరుణంలో కొందరు మతాన్ని రెచ్చగొట్టే యత్నాలు చేస్తున్నా రని పరోక్షంగా బీజేపీని దుయ్యబట్టారు. తన హయాన్ని జంగిల్‌రాజ్‌గా గతంలో అభివర్ణించ డాన్ని విమర్శిస్తూ, బలహీన వర్గాలు పదవులు చేపట్టడం నచ్చకే తమపై ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. పీఎస్‌యూల ప్రైవేటీకరణను ప్రస్తావిస్తూ, రైల్వేలను కూడా ప్రైవేటీకరిస్తున్నారని, దీనివల్ల నిరుద్యోగిత మరింత పెరుగుతుందని ఆరోపించారు. ఇంధన ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిగిందన్నారు. తన ప్రధాన ప్రత్యర్ధి నితీశ్‌పై లాలూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, కరోనా సమయంలో నిర్వహణ బాగాలేదని, రాష్ట్రంలో రోజుకు 4 హత్యలు జరగుతున్నాయని విమర్శించారు. లక్షలాది మంది ఉపాధిలేక వలసకూలీలుగా మారిపోతున్నారన్నారు. 

పుత్రోత్సాహం 
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడు సాధించిన విజయాలపై లాలూ మురిసిపోయారు. ఒంటిచేత్తో పార్టీకి మంచి విజయాన్నిచ్చాడని, తేజస్వి ఇంత చేయగలడని తానూహించలేదని చెప్పారు. తేజస్వీ నాయకత్వంలో పార్టీకి మంచి భవిష్యత్‌ ఉందన్నారు. గత ఎన్నికల్లో ఆర్‌జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ, జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. తన పెద్ద కుమారుడిని సైతం లాలు ప్రశంసించారు. తాను ఐదుగురు పీఎంల ఎంపికలో కీలకపాత్ర పోషించానని గుర్తు చేసుకున్నారు. తాను జీవించిఉన్నానంటే తన భార్యా పిల్లలు చూపిన శ్రద్ధ కారణమన్నారు. త్వరలోనే తాను బీహార్‌లో పర్యటిస్తానని పార్టీ శ్రేణులకు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement