HCU VC apparao
-
హెచ్సీయూ వీసీ హత్యకు కుట్ర!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్సీయూ) వైస్ ఛాన్సులర్ అప్పారావు హత్యకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు హెచ్సీయూ విద్యార్థులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం-చర్ల రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హెచ్సీయూ విద్యార్థులు చందన్ మిశ్రా, పృధ్వీరాజ్ పోలీసులకు చిక్కారు. కాగా 2013లో రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా వీసీ అప్పారావు హత్యకు వీరు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర చంద్రన్నదళ సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ ఆదేశాలతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. హెచ్సీయూలో ఎంఏ చదువుతున్న చందన్ కుమార్ మిశ్రా కోల్కతా వాసి. ఇక అంకల పృధ్వీరాజ్ కృష్ణాజిల్లా కేసరపల్లికు చెందినవాడు. వీరిద్దరికీ హెచ్సీయూలో పరిచయం ఉన్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. వీరిని శనివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. మరోవైపు వీరిద్దర్ని వారం క్రితమే పోలీసులు పట్టుకున్నారని విరసం ఆరోపిస్తోంది. వారిద్దరినీ విడుదల చేయాలని విరసం ఇప్పటికే పోస్టర్లు విడుదల చేసింది. ఇక ఈ ఘటనపై హెచ్సీయూ వీసీ అప్పారావు స్పందిస్తూ...‘నాకు ఎటువంటి బెదిరింపులు రాలేదు. నన్ను చంపడం కోసం ఎవరు కుట్ర చేశారో కూడా తెలియదు. పోలీసులు కూడా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం హెచ్సీయూ ప్రశాంతంగా ఉంది.’ అని అన్నారు. -
అరెస్టు చేయాల్సిన వ్యక్తికి అవార్డా మోదీ?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావుకి ప్రధాని నరేంద్రమోదీ అవార్డు ఇచ్చి సత్కరించడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకుడైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాల్సిందిపోయి, అతడికి అవార్డులిచ్చి ఎలా సత్కరిస్తారని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో ప్రశ్నించారు. ‘రోహిత్ వేముల భారతమాత బిడ్డ' అని ఆయన ఆత్మహత్యానంతరం పేర్కొన్న ప్రధాని మోదీ.. ఇప్పుడు రోహిత్ మరణానికి కారణమైన వీసీ అప్పారావును తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్లో సత్కరించారని లాలూ ఆక్షేపించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు కూడా వీసీ అప్పారావుకి అవార్డునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావుకి చంద్రబాబు దగ్గరుండి ప్రధాని మోదీ చేత అవార్డునిప్పించారని విద్యార్థులు ఆరోపించారు. ఈ వీసీ కారణంగానే రోహిత్ వివక్ష, వెలివేత ఎదుర్కొన్నారని ఆయనతోపాటు రస్టికేట్ అయిన అంబేడ్కర్ స్టుడెంట్స్ అసోసియేషన్ నాయకుడు దొంత ప్రశాంత్, విజయ్, శేషు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అప్పారావుకి అవార్డు ఇవ్వడం విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడంలో భాగమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.