దర్భంగ/ముజఫర్‌పూర్/పట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బుధవారం విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లక్ష్యంగా సాగింది. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌ను ‘ఆటవిక రాజ్య యువరాజు(జంగిల్‌రాజ్ కే యువరాజ్)’ అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. బిహార్ బీమారు రాష్ట్రంగా మారడానికి కారణమైన ఆర్జేడీకి మళ్లీ అధికారమిస్తే కరోనాతో పాటు మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలను ప్రధాని హెచ్చరించారు.
ఆర్జేడీ చేసిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని ఎద్దేవా చేస్తూ.. ‘ప్రభుత్వ ఉద్యోగాల విషయం మర్చిపోండి. వాళ్లు గెలిస్తే ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోతాయి. బలవంతపు వసూళ్లకు భయపడి కంపెనీలను మూసేసుకుంటారు. ఆ పార్టీకి ఇక్కడ కిడ్నాప్‌లపై కాపీరైట్ ఉంది’ అన్నారు. బిహార్‌ను దుష్పరిపాలన నుంచి సుపరిపాలన వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడిపించారని ప్రశంసించారు. జేడీయూ నేత నితీశ్‌ను ‘ప్రస్తుత, భవిష్యత్ ముఖ్యమంత్రి’ అంటూ సంబోధించారు. నితీశ్ పాలనలో బిహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దర్భంగ సభలో మాట్లాడుతూ సీతామాత జన్మించిన మిథిలకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది.
ఇన్నాళ్లూ రామాలయ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని విమర్శించిన వారంతా.. ఇప్పుడు తప్పని సరై మా నిర్ణయానికి చప్పట్లు కొడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బిహార్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధుల వైపు రాష్ట్రాభివృద్ధిని కోరుకోని దురాశాపూరిత శక్తులు ఆశగా చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్, రబ్రీదేవీల ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్న కుల ఘర్షణలను ప్రధాని గుర్తు చేశారు. అబద్ధాలు, మోసం, గందరగోళంతో కూడిన విధానాలు వారివని ఆరోపించారు. ప్రతీ ప్రసంగం ప్రారంభంలో ప్రధాని స్థానిక మాండలికంలో మాట్లాడి, స్థానికులైన మహనీయులను గుర్తు చేసి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్భంగలో మైథిలి కవి విద్యాపతిని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment