వీరమరణం మీదా వివక్షేనా? | mallepally laxmaiah article on crpf jawans cremations | Sakshi
Sakshi News home page

వీరమరణం మీదా వివక్షేనా?

Published Thu, Jun 30 2016 1:49 AM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

వీరమరణం మీదా వివక్షేనా? - Sakshi

వీరమరణం మీదా వివక్షేనా?

కొత్త కోణం
ఈ దేశ భూభాగాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర జవానుకి అటు ఆరు ఇటు మూడడుగుల జాగా కరువవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ దేశంలో వీరుల నెత్తుటికి అంటుకున్న కులం మర్మాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక సైనికుడు వీర మరణం పొందితే అటువంటి వారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో, గౌరవప్రదంగా నిర్వహిస్తారు. కానీ వీర్‌సింగ్ అంత్యక్రియలకు కులం అడ్డొచ్చింది. అందుకే ఎటువంటి ప్రభుత్వ లాంఛనాలూ లేకుండానే ఓ వీరుడి అంత్యక్రియలు జరిగాయి. దేశ రక్షణ కోసం ఉన్న ఊరినీ, కన్నతల్లినీ, సర్వస్వాన్నీ వదిలి కదనరంగానికి ఉరికే యుద్ధవీరులు వాళ్లు. సరిహద్దులను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టే త్యాగధనులు. నిజమైన దేశభక్తులు. ఇది ఈనాడు ప్రతినోటా వినిపిస్తున్న మాట. మనందరం ఒప్పుకోవాల్సిన మాటే. కానీ అంతకు ముందు అదే దేశభక్తికి అంటుకున్న మైల గురించి కూడా మాట్లాడుకోవాలి.

ఇటీవల జమ్మూ-కశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతంలో జరిగిన మిలిటెంట్ల దాడిలో ఎనిమిది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. వారిలో వీర్ సింగ్ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా నాగ్లా కేవల్ గ్రామానికి చెందినవాడు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియల కోసం వీర్‌సింగ్ భౌతిక కాయాన్ని నాగ్లా కేవల్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలను ప్రభుత్వ స్థలంలో నిర్వహించాలనీ, అక్కడే స్మారక స్తూపం నిర్మించాలనీ కుటుంబ సభ్యులు, మిత్రులు భావించి ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఓ దళితుడికి ప్రభుత్వ భూమిలో, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం ఆ గ్రామ అగ్ర కుల పెత్తందార్లకు కంటగింపయింది. ఆ అమర జవాను వీర్‌సింగ్ దహన సంస్కారాలను అడ్డుకున్నారు. గత్యంతరం లేక కుటుంబ సభ్యులు జిల్లా అధికారులను ఆశ్రయించారు. చాలా సేపటికి చేరుకున్న తాలూకా అధికారి అగ్రకులస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత కేవలం పది గజాల స్థలం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ దేశ భూభాగాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర జవానుకి అటు ఆరు ఇటు మూడడుగుల జాగా కరువవడాన్ని అర్థం చేసు కోవాలంటే ఈ దేశంలో వీరుల నెత్తుటికి అంటుకున్న కులం మర్మాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక సైనికుడు వీర మరణం పొందితే అటువంటి వారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో, గౌరవప్రదంగా, అట్టహాసంగా నిర్వ హిస్తారు. కానీ వీర్‌సింగ్ అంత్యక్రియలకు కులం అడ్డొచ్చింది. అందుకే ఎటు వంటి ప్రభుత్వ లాంఛనాలూ లేకుండానే ఓ వీరుడి అంత్యక్రియలు జరి గాయి. పూడ్చిపెట్టేందుకు జానెడు జాగాకు సైతం నోచుకోని మరో దళితుడి లిస్టులో వీరజవాను చేరిపోయాడు. వీర్‌సింగ్ కడజాతివాడు కనుకనే అతని త్యాగానికి విలువ లేకుండా పోయింది. ఇక్కడ ఒక్కమాట చెప్పాలని వుంది.

హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా చాలా మంది ప్రజా స్వామికవాదులు, దళిత రచయితలు వ్యాసాల ద్వారా నిరసనను వ్యక్తం చేశారు. కొంతమంది ‘దేశభక్తులు’ ఈ ఘటనపై సానుభూతి తెలుపకపోగా, సరిహద్దుల్లో ఎంతోమంది సైనికులు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారనీ, వారిని గురించి ఈ రచయితలు ఎవ్వరూ ఎందుకు మాట్లాడ్డంలేదనీ వెట కారాలు పోయారు. కొంతమందికి ఇది నిజమే కదా అనిపించి ఉండవచ్చు. అయితే ఆ రోజు మేము కూడా జవాన్లు అందరూ ఒక్కటే కదా అనుకున్నాం. వీర మరణం పొందిన ఎవరి ప్రాణానికైనా అంతే విలువుంటుందనుకున్నాం. కానీ వీర్‌సింగ్ భౌతికకాయానికి జరిగిన అవమానం, వివక్ష చూసిన తర్వాత ‘దేశభక్తి’కి కూడా కులం ఉంటుందని నిరూపితమైంది.

ఈ దేశంలో వీర జవాన్ భౌతికకాయానికి జరిగిన అవమానం పత్రికలు, సోషల్ మీడియా ద్వారా వెలుగులోనికి వచ్చింది. కానీ ప్రతి గ్రామంలో దళితుడు మరణిస్తే వారి శవాలను బొందపెట్టే జాగా లేదన్నది కఠోర వాస్తవం. దళితుల శవా లను పూడ్చే శ్మశానాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్వహించిన సర్వే ప్రకారం కొన్ని వందల గ్రామాల్లో  దళితుల శవాలకు శ్మశానాల్లో చోటు లేదు. గత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు, గ్రామంలో దళితులకు ప్రత్యేక శ్మశానాలు నిర్మిస్తామని వాగ్దానం చేశాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఎప్పుడో వందేళ్ల నాటి అంబేడ్కర్ కాదు ఇప్పుడే, ఇక్కడే, మనకళ్ల ముందే ఎందరో అంబేడ్కర్‌లు ఇంకా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారనడానికి ఎన్నో ఉదాహరణలు.
 
మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా, జన్‌పద్ గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి వీరన్ అహిర్‌వార్ తాగే నీటి కోసం పరితపిస్తూ ప్రాణాలు వదిలాడు. మధ్యాహ్న భోజనం ముగించుకొని మంచినీళ్లు తాగడానికి పాఠ శాలలోని చేతిపంపు దగ్గరకి వీరన్ వెళ్లాడు. అయితే దళితుడైన ఈ బాలుడు చేతి పంపు ముట్టుకోవడానికి వీలులేదంటూ అక్కడి ఉపాధ్యాయుడు వెనక్కి పంపారు. ఆ విద్యార్థి దగ్గరలోని మరో చేదబావి దగ్గరకు వెళ్లి తన బాటిల్‌కు తాడు కట్టి బావిలోకి విసిరాడు. నీళ్లు తోడే ప్రయత్నంలో అదుపుతప్పి బావిలో పడడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. కుల దుర హంకారం మరో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆదిలోనే తుంచేసింది.

వీరన్ కుటుంబ సభ్యులు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్సీ విద్యార్థులను ఇదేవిధంగా వివక్షకు గురిచేస్తున్నారని మృతిచెందిన విద్యార్థి సోదరుడు అధికారులకు తెలిపారు. కలెక్టర్ మాత్రం ఆ గ్రామానికి నీటి ఎద్దడి ఉన్నదని, అందరూ కూడా బావిలో నీటికి వెళుతున్నారని, ఆ సందర్భంగా ప్రమాదం జరిగిందని సర్దిచెప్పి, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ సంఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ ఆ గ్రామాధికారిని సస్పెండ్ చేశారు. ఆ గ్రామమేంటి, వందల గ్రామాల్లో దళితులు ఇతరుల బావుల్లో నీటిని చేదుకునే అర్హతకు ఇంకా నోచుకోలేదు. సరిగ్గా వందేళ్ల క్రితం అంబేడ్కర్‌కు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. తాను పాఠశాల నుంచి తిరిగి వస్తూ, ఒక ఇంటిదగ్గర ఆగి మంచినీరు అడిగిన అంబేడ్కర్‌ను, ఆయన కులం తెలుసుకొని బురద గుంటలోని నీళ్లు తాగమని ఒక తల్లి చీదరించుకొన్న గాథను చదువుకున్నాం.


 దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక జవాన్ వీరమరణాన్నీ వదలని వివక్ష, అవమానం ఒకవైపు; గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలు వదల వలసివచ్చిన బాలుడి విషాదం మరోవైపు, దేవుడి ఉత్సవాల కోసం అడ్డుకున్న కుల దుర హంకారం ఇంకోవైపు అడుగడుగునా దళితులను అభద్రతకు, అవమానానికీ గురిచేస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటనేది సమాధానం లేని ప్రశ్న. ఇందుకు గాను ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. కులం, మతం పట్టింపులేని వాళ్లు చాలా మాట్లాడవచ్చు. కానీ ఫలితం పరిమితం. వివక్షకు వ్యతిరేకంగా సాగిన, సాగుతున్న ఉద్యమాలు ఆధిపత్య శక్తులపై ప్రభావం కలుగజేస్తున్నాయి. శాశ్వత పరిష్కారం లభించటం లేదు. పైగా ఇవి పునరావృతం అవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విజయదశమి రోజున నాగపూర్‌లో చేసిన ప్రసంగంలో శ్మశానం, నీరు, దేవాలయాల్లో అందరికీ హక్కు ఉండాలని ప్రకటించారు. కానీ గ్రామాల్లో ఆ మూడు వివక్షలే కాదు, ఇంకా ఎన్నో వివ క్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
వీటి నిర్మూలనకు చిత్తశుద్ధితో  ప్రయత్నం జరగాలి. ఆరెస్సెస్ లాంటి సంస్థల్లోని సభ్యులే ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కులవివక్ష, అంటరానితనం నిర్మూల నకు అమల్లో ఉన్న చట్టాలు సరిగ్గా అమలు జరుగుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురావడానికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమో దించారు. దానికి అనుకున్నంత సానుకూలత లభించలేదు.
ఒకవైపు ప్రభు త్వాలు అంటీముట్టనట్టుంటే, మరోవైపు కొన్ని హిందూ ధార్మిక సంస్థలు, కొందరు స్వాములు హిందూ ధర్మాన్ని రక్షించడానికి చట్టాలు చేయాలం టున్నారు. ఇటీవల అటువంటి బృందం ఒకటి కొందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసింది. వాళ్లు కోరుకుంటున్న సంస్కరణలు ఏమిటనేది తరచి చూడాలి. వేల సంవత్సరాల చరిత్రను బట్టి చూస్తే, హిందూమతానికి బయటి వ్యక్తుల నుంచి కంటే, హిందూత్వ శక్తులు, కులవాదుల నుంచే ప్రమాదం ఎక్కువ.

హిందూ మతం నిజంగా ఒక ధార్మిక శక్తిగా నిలబడాలంటే అందులో సమూల మార్పులు జరగాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ పుస్తకంలో స్పష్టమైన కార్యక్రమం ప్రకటించారు. ‘హిందూ మతం మనుగడ సాగించాలంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఒక నూతన నియమావళిని ప్రకటించాలి. అందులో అందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు ఉండాలి. ముఖ్యంగా ఇతర మతాల లాగా, ఏదో ఒక కులం మాత్రమే పూజారులుగా ఉండే విధానం పోవాలి. మతాన్ని గౌరవించి, దానిని అనుసరించి, ధార్మిక విధానాన్ని అర్థం చేసుకొన్నవారెవరైనా, దానికి సంబంధించిన పూజా విధానాన్ని ఆమూలాగ్రం తెలిసిన వారెవ్వరైనా పూజారులుగా ఉండే విధానం రావాలి. అప్పుడు మాత్రమే హిందూమతంలో అంతస్తుల వ్యవస్థకు ముగింపు పలకగలం. అంతేకాకుండా కొన్ని కులాలను తరతరాలుగా ఇంకా తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం, పశువులకన్నా హీనంగా చూసే విధానానికి స్వస్తి పలకాలి.’

 కుల వివక్ష, అత్యాచారాల వల్ల అంటరాని కులాలు బానిసత్వం నుంచి  విముక్తికి పరాయి పాలకుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా సైనిక యుద్ధతంత్రంలో ఆరితేరిన అంటరాని కులాలు ఇప్పటికే ఈ దేశానికి ఒక హెచ్చరిక చేశాయి. మహారాష్ట్రలోని పీష్వాల పాలనను అంతం చేసింది అక్షరాలా మహర్ సైన్యమేననేది గుర్తు చేసుకోవాలి. దళితుల నేపథ్యాన్ని, త్యాగనిరతిని విస్మరించే తీరులో వీర్‌సింగ్‌కు జరిగిన అవమానాలే పున రావృతమైతే భారత సైన్యంలోని ప్రతి దళితుడికీ అవమానం జరిగినట్టే. దళితుల త్యాగాలకు వెలకట్టమని మేం అడగడం లేదు. కానీ ఓ దళితుడు ఈ దేశం కోసం చేసిన త్యాగాన్ని మరచిపోతే మన పునాదులు మిగలవు. చివరకు దళితుల శవాలను కూడా కులతత్వం పీడిస్తుంటే మరో దళితుడు ఈ దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడడు. తరతరాల వివక్ష క్షోభను మర్చి పోయి సమాజంలో భాగంకాలేడు. ఏ మాత్ర ం చిత్తశుద్ధి ఉన్నా ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి పరీకర్ యావత్ దేశానికి, దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి.
 


 మల్లెపల్లి లక్ష్మయ్య,
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement