
న్యూఢిల్లీ : కశ్మీర్‌లో ఓ సీఆర్ఫీఎఫ్ జవాన్ రెచ్చిపోయాడు. ముగ్గురు సహచర జవాన్లు వాగ్వాదానికి దిగడంతో వారిని తన సర్వీసు రైఫిల్‌తో కాల్చి చంపాడు. సీఆర్ఫీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ అజిత్ కుమార్ కశ్మీర్‌లో నిధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు సహచరులకు అజిత్‌తో వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన అజిత్ తన తుపాకీతో ముగ్గురు సహచరుల్ని కాల్చి, తానూ ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ముగ్గురు జవాన్లు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.
ఈ కాల్పులకు పాల్పడింది కాన్పూర్‌కు చెందిన కుమార్ అని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారు రాజస్థాన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ పొకార్మల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్యానాకు చెందిన ఉమెద్ సింగ్‌లుగా గుర్తించారు. దాడికి పాల్పడిన కుమార్ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. జవాన్ల మధ్య వచ్చిన విభేధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సీఆర్ఫీఎఫ్ 187వ బెటాలియన్ కమాండర్ హరీందర్ సింగ్ తెలిపారు.