
‘‘ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశాలను ఎవరికీ కూడా నిరాకరించకూడదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసినంత మాత్రానే ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు. పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల చేత కూడా ఆ ప్రభుత్వం నిర్వహించబడాలి’’ అని బాబాసాహెబ్ అన్న మాటలకు సరిగ్గా నిండా నూరేళ్ళు. మాంటెగ్ చెమ్స్‌ఫర్డ్ కమిటీ నియమించిన సౌత్ బరో బృందం ముందు హాజరైన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1919లో భారత ప్రజలందరి పక్షాన ఈ ప్రకటన చేశారు. అంబేడ్కర్ రాజకీయ జీవితంలో ఇదే మొట్టమొదటి కార్యాచరణ.
భారత ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్‌పైన ఏర్పాౖటెన మాంటెగ్ చెమ్స్‌ఫర్డ్ కమిటీ అధ్యయనం తర్వాత మరింత అవగాహన కోసం లార్డ్ సౌత్ బరో అధ్యక్షతన ఒక బృందాన్ని నియమించారు. ఆ బృందం అనేక మందిని సంప్రదించి ఒక నివేదికను రూపొందించింది. ఒక అంటరాని యువకుడుగా 1913లో అమెరికాకు వెళ్ళిన అంబేడ్కర్, 1917 మార్చిలో బొంబాయి తిరిగి వచ్చేనాటికి ఒక గొప్ప ప్రజాస్వామికవాదిగా, హక్కుల నాయకుడిగా తనను మలుచుకున్నట్టు మనకు కనిపిస్తాడు.
న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తోన్న సమయంలో కూతవేటు దూరంలో ఉన్న హర్లెంలో నల్లజాతి పునరుజ్జీవనోద్యమం పురుడుపోసుకుంటున్నది.. నల్లజాతి బానిసత్వం కన్నా, అంటరానితనం అత్యంత అమానుషమైనదనే విషయాన్ని కూడా ఆయన గ్రహించారు. దీనితో పాటు, అంబేడ్కర్ గురువు జాన్ డ్యూయి మార్గదర్శకత్వం కూడా అంబేడ్కర్‌ను గొప్ప ప్రజాస్వామ్య వాదిగా రూపుదిద్దుకోవడానికి తోడ్పడింది. జాన్‌డ్యూయి 20వ శతాబ్దంలో ప్రజాస్వామిక తాత్వికవేత్త. తనవద్ద విద్యను అభ్యసించడం వల్ల అంబేడ్కర్‌కు ప్రజాస్వామ్యమంటే ఎంతో ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడింది. వీటికి తోడుగా, అప్పటికే మహారాష్ట్రలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు కూడా అంబేడ్కర్‌ను ఒక గొప్ప నాయకుడిగా రూపుదిద్దుకోవడానికి కారణాలయ్యాయి.
19వ శతాబ్దంలో జ్యోతీరావు ఫూలే సాగించిన కుల వివక్ష వ్యతిరేక పోరాటం అంబేడ్కర్‌ను ప్రభావితం చేసింది. అందుకే అంబేడ్కర్ జ్యోతీరావుఫూలేను తన గురువుగా కూడా ప్రకటించుకున్నారు. జ్యోతీరావు ఫూలే ఆచరణ, సిద్ధాం తాలతో సామాజిక న్యాయం కోసం నడుంబిగించిన కొల్లాపూర్ సంస్థానాధీశుడు సాహుమహారాజ్ 1902లోనే బ్రాహ్మణేతర వర్గాలందరికీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రకటించి, అమలు చేశారు. అంటరాని కులాలకోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఈ అంశాలు కూడా అంబేడ్కర్‌కు ఎంతో ధైర్యాన్నీ, శక్తినీ అందించాయి. ఆయన చిన్ననాటి నుంచి అనుభవించిన అనేకానేక అనుభవాల సారం, సామాజిక పరిస్థితుల కలబోత ప్రపంచదేశాల ఎదుట అంబేడ్కర్‌ను గొప్ప దార్శనికుడిగా నిలిచేలా చేసింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ వంద ఏళ్ళ కిందట అమెరికాలో విద్యను అభ్యసించి. తన వ్యక్తిగత జీవితంకోసం కాకుండా, తాను జన్మించిన సామాజిక వర్గం విముక్తి కోసం సమరం ప్రారంభించడం సౌత్‌బరో కమిటీతోనే ప్రారంభం అయ్యింది. అయితే అప్పటికే మహారాష్ట్రలో అంటరానికులాల వివక్షపై మహర్షి వి.ఆర్.షిండే నాయకత్వంలో 1906లో ‘డిప్రెస్డ్ క్లాస్ మిషన్’ను ప్రారంభించారు. 1918లో వి.ఆర్.షిండే ఆధ్వర్యంలో బరోడా సంస్థానాధీశుడు సాయాజిరావు గైక్వాడ్ అధ్యక్షతన అఖిల భారతీయ అసృ్పశ్య నివారక్ పరిషత్ సదస్సు జరిగింది. అయితే ఈ సంస్థలు ఏవీ కూడా సౌత్‌బరో కమిటీ ముందు తమ వాదనలను వినిపించలేదు. అంబేడ్కర్ వ్యక్తిగతంగానే సౌత్ బరో కమిటీ ముందు అంటరానికులాల రాజకీయ హక్కులను మొదటిసారిగా వినిపించారు.
‘కొంకణ్ ప్రాంతంలో అందరూ నడిచే దారుల్లో అంటరాని వాళ్ళు వెళ్ళకూడదు. ఎవరైనా ఆధిపత్య కులాల వ్యక్తి ఎదురుపడితే, తమ నీడ ఆయన మీద పడనంత దూరం జరగాలి అని, ఇది ఒక కేవలం ఒక దృష్టాంతం మాత్రమేనని అంబేడ్కర్ వివరించారు. 1909లో అమలులోకి వచ్చిన చట్టం వల్ల కొన్ని కులాలకు అధికారంలో భాగస్వామ్యం వచ్చిందనీ, ముస్లిలకు ప్రత్యేక ఓటింగ్ విధానమే అమలులోకి వచ్చింది, కానీ, తరతరాలుగా సమాజంలో నుంచి వెలివేతకు గురైన అంటరాని కులాలు ఏనాడూ ఈ సమాజంలో భాగం కాలేకపోయాయనీ అంబేడ్కర్ కమిటీ ముందు వివరిం చారు. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం కో–ఆప్ట్ చేస్తే సరిపోతుందని కొందరు చేసిన వాదనను అంబేడ్కర్ తిరస్కరించారు. ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలి తప్ప, ఇతర కులాల సభ్యులు నియమించడం ప్రజాస్వామ్యం కాబోదనీ, దాని వల్ల ఆయా కులాలకు అనుకూలంగా ఈ ప్రజాప్రతినిధులు మారే ప్రమాదం ఉంటుందనీ, లేదా వారికి అనుకూలంగా ఉండేవారు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే ప్రమాదాన్ని ఆనాడే అత్యంత స్పష్టంగా అంబేడ్కర్ వాదించారు.
సౌత్‌బరో కమిటీ ముందు అంబేడ్కర్ మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు ఉంచారు. 1. అంట రాని కులాల పక్షాన తమ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికకాకపోతే, అంటరానితనం నిర్మూలన కాదు. 2. కౌన్సిళ్లలో అంటరాని కులాల ప్రజాప్రతినిధులు ఆధిపత్య కులాలకు సంబంధిం చిన మెజారిటీ సభ్యులని మించకూడదని, ప్రభుత్వమే అంటారని కులాల నుంచి తగు సమర్థులను ఎంపిక చేయాలని అంబేడ్కర్ వాదించారు. 3. అంటరాని కులాలు రాజకీయంగా ఎదగాలంటే, వారి అభ్యర్థుల్ని వారే ఎన్నుకునే విధానం అమలు చేయాలని అంబేడ్కర్ కోరారు.
అంతేకాకుండా, ప్రతి పౌరుడికీ చదువు, సంపద కాకుండా ఓటింగ్ హక్కు ఉండాలని వాదించిన తొలి వ్యక్తి కూడా అంబేడ్కరే. అప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 34 ఏళ్ళు గడిచినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రధానమైన రాజకీయ డిమాండ్‌ను చేసిన పాపాన పోలేదు. 1919లో ప్రారంభమైన ఆయన రాజకీయ హక్కుల పోరాటం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగంతో ఒక దశకు చేరింది. ఒకవైపు అంటరాని కులాల హక్కుల కోసం పోరాడుతూనే రెండో వైపు భారత ప్రజ లందరి తరఫున రాజ్యాంగ సభలో గళమెత్తి, అప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో అమలులో లేని సార్వజనీన ఓటింగ్ హక్కును రాజ్యాంగంలో చేర్చారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఉద్దండులు అందరికీ ఓటింగ్ హక్కును వ్యతిరేకించారు. చివరకు అందరికీ ఓటింగ్ హక్కును అందించిన మహనీయుడిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు.
దళిత ప్రజాప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలన్న అంబేడ్కర్ తొలి పోరాట నినాదం ఇంకా అసంపూర్తిగానే ఉన్నది. సపరేట్ ఎలక్టోరేట్ విధానం ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటిన అంబేడ్కర్ లోతైన దార్శనికత నేటి రాజకీయాల్లో ఎంత కీలకమైనదో రుజువవుతూనే ఉన్నది. సపరేట్ ఎలక్టోరేట్ విధానం లేకపోవడం వల్ల నిజమైన దళిత ప్రతినిధులు ఎన్నిక కావడం లేదు. రాజకీయ పక్షాలను, ఆధిపత్య కులాల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు మాత్రమే ఎన్నికవుతున్నారు. ఇప్పటికింకా ఈ రోజు దళిత సమాజం ముందున్న అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ఏదైనా ఉందీ అంటే అది సపరేట్ ఎలక్టోరేట్ విధానం కోసం పోరాడటమే.
వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment