డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ; లోక్‌సభలో సమావేశ దృశ్యం
సందర్భం
అంబేడ్కర్ గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని పార్లమెంట్‌లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకూ కప్పి ఉంచిన కొన్ని వాస్తవాలను వెలికి తీశాయి. ‘తాము మాట్లాడితే ప్రేమ, ఎదుటివారు మాట్లాడితే ఫ్యాషన్’ అన్నంతగా బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ పట్ల స్వాధీనత ఉందని మాట వరసకి అనుకుందాం. కానీ తర్వాతి వాక్యాలని గుడ్డిగా సమర్థించుకోవడం ఆశ్చర్యమే.
కాంగ్రెస్ సభ్యులు అంబేడ్కర్‌ని ప్రస్తావించడం మీద అమిత్ షా వ్యాఖ్యానిస్తూ ‘అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్... వారు ఇన్ని సార్లు దేవుడి నామం స్మరిస్తే ఏడేడు జన్మల స్వర్గలోక ప్రాప్తి వచ్చే’దని అనడం అంబేడ్కర్ పట్ల గౌరవాన్ని వ్యక్త పరిచినట్లు కాదు; అలాగని ఆ కామెంట్స్ కేవలం కాంగ్రెస్ మీద చేసిన విమర్శగా కూడా చూడలేము. కాంగ్రెస్ మీది కోపాన్ని అంబేడ్కర్ మీద చూపినట్లుగా మాత్రమే కాక, లోపల జీర్ణించుకున్న చులకనభావం బైట పడి నట్లుగా కూడా ఆ మాటలు ఉన్నాయి.
సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కోసం పాటుపడిన అంబేడ్కర్‌ని – విశ్వాసాల మీద ఆధారపడిన దైవభావనతో పోల్చి తక్కువ చేయడం వ్యతిరేకించాల్సిన విషయం. కడుపు నిండిన వారికి స్వర్గలోక ద్వారాల వైపు చూపు ఉండొచ్చు. కానీ కులం, మతం, జెండర్ వంటి అనేక వివక్షలకి లోనయ్యే పీడితులు, పేదలు అంబేడ్కర్‌ని తమ ‘అన్నం గిన్నె’గా అభివర్ణించుకుంటారు. అంబేడ్కర్ పేరు పదేపదే స్మరించడం వారి జీవితాలకి భరోసా.
ప్రధాని ‘ఎక్స్’ వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించడం మరొక విచిత్రం. అసలు వ్యాఖ్యల సంగతి వదిలేసి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కి చేసిన అన్యాయాలను తవ్వితీయడం గొప్ప చతురత. కాంగ్రెస్ చేసిన అన్యాయాలను అంబేడ్కర్‌వాదులు తప్పక ప్రశ్ని స్తారు కానీ ఇప్పటి అమిత్ షా వ్యాఖ్యల సంగతేమిటి? ప్రజలకి నిజం తెలుసుననీ, అది కాంగ్రెస్ వారి దురదృష్టమనీ అన్నారు. అవును, ప్రధానమంత్రి గారూ, ప్రజ లకి నిజం తెలుసు. అయితే అది మీరు నిర్మించే నిజం కాదు.
అంబేడ్కర్ చరిత్రను తుడిపివేసేందుకు కాంగ్రెస్ చేసిన పన్నాగాలను బట్టబయలు చేశామన్న ప్రధానమంత్రి, అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ వివరించారు. పంచ తీర్థ, చైత్యభూమి సమస్య, అంబేడ్కర్ చివరి దశలో గడిపిన ఇల్లు, లండన్‌లో అంబేడ్కర్ నివసించిన ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా ఆయన ఆశ యాలు నెరవేర్చే పనులు చేశామని అన్నారు. ఇవన్నీ అంబేడ్కర్ పట్ల కృతజ్ఞతతో ప్రజలూ ప్రభుత్వాలూ తమ కోసం తాము ప్రతీకగా చేసే పనులు. నాయకారాధన పట్ల స్పష్టమైన అవగాహనతో మాట్లాడిన అంబేడ్కర్ ఎపుడూ తన చిహ్నాల ఉద్ధరణ తన ఆశయ మని చెప్పలేదు.
ఆయన రచనలు, ప్రసంగాలు, ఆచరణ గురించి తెలుసుకుంటే ఆశయాలు ఏమిటో తెలుస్తాయి. అవి మతతత్వ, కులవాద, పితృస్వామిక రాజకీయ పార్టీలను, వ్యవస్థలను నిరంతరం నిలదీస్తాయి. వాటి పీడనకి, వివక్షకి గురయ్యేవారిని అక్కున చేర్చుకుని ‘సమీకరించు, బోధించు, పోరాడు’ అని వెన్ను తడతాయి. కానీ పీడక పార్టీలు, వ్యవస్థలు ఈరోజు అంబేడ్కర్ ప్రభావాన్ని విగ్రహాలకి, నివసించిన స్థలాలకి కుదించి అవే ఆయన ఆశయాలని ప్రచారం చేస్తున్నాయి.
బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ ఆశయాలను నెర వేర్చాలన్న ఆకాంక్ష బలంగా ఉంటే రాజకీయాల్లో మెజారిటీ మత చొరబాట్లను నిరోధించి లౌకిక విలువలను స్వయంగా ప్రచారం చేయాలి. కుల నిర్మూలనకి అంబే డ్కర్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలి. కులాంతర, మతాంతర పెళ్లిళ్లను ప్రోత్సహించాలి. వేదాలు, పురా ణాలు స్త్రీలను, దళితులను ఎంత అమానవీయంగా చూశాయో గుర్తించి వాటిని కల్పనా సాహిత్యంగా మాత్రమే పరిగణించాలి.
దళితుల విద్యా ఉద్యోగ రాజ్యాధికారాలకి ప్రణాళికలు వేయాలి. పౌరులకు ఉన్న రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించాలి. మరీ ముఖ్యంగా మాట్లాడితేనో, నచ్చిన ఆహారం తింటేనో తీసుకెళ్ళి జైళ్ళలో పడేయకూడదు. ప్రజాస్వామ్య భావనని దాని నిజార్థంలో ఆచరించాలి. ఏకత – ఐక్యతలు ఒకటి కావని గుర్తించాలి. ఇలా మన ప్రభుత్వ వ్యవస్థల నియంతృత్వాన్ని సమూలంగా మార్చేయగల అనేక మార్పులను చేయడమే ఆయన ఆశయాలను నెరవేర్చడం.
అందుకే కేవలం ఎక్కడో నాలుగు విగ్రహాలు పెట్టి గొప్ప ఆచరణగా ప్రకటించడం కన్నా, అసంఖ్యాకంగా ఉన్న అంబేద్కర్ రచనలను, ప్రసంగా లను, వివిధ ఘట్టాల్లో ఆయన పని తీరును అధ్యయనం చేయడం ద్వారా ప్రజలకు మేలు చేసే నిజమైన కార్యాచరణ రూపొందించుకోవచ్చు. ‘అంబేడ్కర్ ఆలోచనల తాత్వికత’ పేరిట ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అంతర్జాల మాధ్యమంలో 21 వారాల పాటు 48 ప్రసంగాల సిరీస్ నిర్వహిస్తున్నది.
2024 డిసెంబర్ 22 నుంచి 2025 మే 18 వరకూ నడిచే ఈ సిరీస్‌లో తెలుగు సమాజంలోని మేధావులు అంబేడ్కర్ ఆలోచనల తాత్వికతను ఆయన రచనలు, ప్రసంగాల ఆధారంగా పరిచయం చేస్తారు. ఆసక్తి ఉన్నవారు (zoom ID: 8254545523 Password PRARAVERK) ద్వారా పాల్గొనవచ్చు.
కె.ఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శి ‘ 88850 16788
Comments
Please login to add a commentAdd a comment