అలుపెరుగని పోరుపై అధ్యయనం | Study on an undefeated conflict, writes Mallepalli Laxmaiah | Sakshi
Sakshi News home page

అలుపెరుగని పోరుపై అధ్యయనం

Published Thu, Nov 23 2017 3:20 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

Study on an undefeated conflict, writes Mallepalli Laxmaiah - Sakshi

సామాజిక వెలికి గురైన వర్గానికి రాజకీయరంగంలో ప్రత్యేక అవకాశాల కోసం అంబేడ్కర్‌ రూపొందించిన ఆలోచనా దృక్పథాన్ని, ఆ ఆశయ సాధన కోసం, దళితుల రాజకీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటాన్ని, అలుపెరుగని ప్రయాణాన్నీ రాజశేఖర్‌ ఉండ్రు లోతుగా అధ్యయనం చేశారు. భారత చరిత్రగతిలో దళిత రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని, దళితుల భావి పరిస్థితులను అంచనావేసిన అంబేడ్కర్‌ తాత్విక చింతనలోని మరుగునపడిన ఎన్నో కోణాలను ఆవిష్కరించారు.

ప్రజలకు అన్ని రంగాల్లో తగు ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక లక్షణం. ఆధునిక పరిపాలనా విధానంలో రాజకీయ భాగ స్వామ్యం అత్యంత కీలకమైనది.  మన సమాజంలోని అన్ని వర్గాలకూ రాజకీ యాధికారం అందడంలేదనేదీ, అందుకు కారణమూ సుస్పష్టమే. సామాజిక అంతరాలు రాజకీయ భాగస్వామ్యాన్ని కొందరికే కట్టబెడుతున్నాయి. మహి ళలు, ఆదిమతెగలు, దివ్యాంగులు, విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, మతాలు ఎదుర్కొంటున్న వివక్షను తొలగించడానికి ప్రత్యేకమైన రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు, విధానాలు ప్రపంచం అంతటా అవసరమవుతు న్నాయి. ఆయా దేశాలు తమకు అనుకూలమైన విధానాలను రూపొందించు కొని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంటున్నాయి. ఇది అనివార్యం. అయితే ఈ మార్పులేవీ సహజంగా వాటంతటవే జరిగిపోలేదు. ఎన్నో ఘర్షణలు, ఎందరో తాత్వికవేత్తల, మేధావుల త్యాగాలు ఈ మార్పుకి దారితీశాయి. ఈ నేపథ్యం నుంచే మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ రాజకీయ ప్రాతినిధ్య రిజర్వేషన్లను అర్థం చేసుకోవాలి. దళితుల రాజకీయాధికారానికి సంబంధించి అంబేడ్కర్‌ సాగించిన అత్యంత కీలక సైద్ధాంతిక పోరాటానికి మరో రెండేళ్లలో నూరేళ్లు నిండబోతున్నాయి.

సామాజిక వెలికి గురైన వర్గానికి రాజకీయరంగంలో ఉండాల్సిన ప్రత్యేక అవకాశాల కోసం డాక్టర్‌ బాబాసాహెబ్‌ రూపొందించిన ఆలోచనా దృక్ప థాన్ని, ఆ ఆశయ సాధన కోసం, దళితుల రాజకీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటాన్ని,  అలుపెరుగని ప్రయాణాన్నీ దళిత మేధావి, ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రాజశేఖర్‌ ఉండ్రు లోతుగా అధ్యయనం చేసి, అక్షర రూపమిచ్చారు. అది ‘‘అంబేడ్కర్, గాంధీ అండ్‌ పటేల్‌ – ది మేకింగ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎలక్టోరల్‌ సిస్టం’’ (బ్లూమ్స్‌బరీ ప్రచురణ)అనే ఆంగ్ల పుస్తకంగా వెలువడనుంది. ఒక ఐఏఎస్‌ అధికారిగా, సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా, దళితుల అభ్యున్నతిని మనసావాచా కాంక్షిస్తూ, అందుకు నిరంతరం కృషిచేస్తున్న వారు రాజశేఖర్‌. అంబేడ్కర్‌ను అన్ని కోణాల నుంచి అర్థం చేసు కొని ఆయన దృక్పథాన్నీ, ఆలోచనా విధానాన్నీ వర్తమాన పరిస్థితులకు అన్వ యింపజేయడానికి సరైన ప్రాతిపదికను రూపొందించడంలో రాజశేఖర్‌ చేసిన కృషి అమూల్యమైనది.

దళిత ప్రతినిధులే పావులుగా దళత వ్యతిరేక క్రీడ
చట్టసభల్లో అంటరాని కులాలకు తగు ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో 1919 నుంచి 1956 వరకు అంబేడ్కర్‌ సాగించిన సమరాన్ని, అందులో ఇప్పటి వరకు వెలుగు చూడని ఎన్నో కొత్త అంశాలను ఆయన తన పరిశోధన ద్వారా వెల్లడించారు. ఎస్సీ ప్రజాప్రతినిధులు ఎస్సీల ప్రయోజనాల కోసం గాక, ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు ఆయన పరిశోధన రూఢి చేసింది. డిసెంబర్‌ 19, 2012న ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రమంత్రి బిల్లు ప్రవేశపెట్టడానికి లేచి నిలబడిన వెంటనే... లోక్‌సభలోని దళిత ప్రజాప్రతినిధి యశ్వీర్‌ సింగ్‌ ఆ బిల్లు కాగితా లను మంత్రి నుంచి లాక్కొని చింపి పారేశారు. అలా నిలచిపోయిన ఆ బిల్లు నేటికీ చట్టంగా రూపొందలేదు. యశ్వీర్‌ సింగ్‌ పుట్టుకతో దళితుడు. ఉత్తర ప్రదేశ్‌లోని నాగిన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పీ) అభ్యర్థిగా ఎన్నికయ్యారు(2009). ఎస్‌పీ, యూపీలోని బీసీలలో సామాజికంగా, ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న యాదవ కులానికి ప్రాతి నిధ్యం వహించేపార్టీ. అక్కడ ఆ పార్టీకి తక్షణ శతృవు దళితుల పక్షాన పనిచేసే బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ). బీసీల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునే దృష్టితో ఆ రాష్ట్రంలో ఎస్‌పీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగం గానే అది ఒక దళిత ప్రజాప్రతినిధిని పావుగా వాడు కుని ఈ దుశ్చర్యకు పాల్పడింది. అంటే యశ్వీర్‌ లాంటి వాళ్లు ఎస్సీ స్థానాల్లోంచి ఎన్నికైనా ఎస్సీల కోసం పనిచేయకపోగా, పార్టీ ప్రయోజనాల కోసం ఎస్సీ లకు తీవ్ర నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ ఘటన వల్ల ఎస్సీ రాజకీయ రిజ ర్వేషన్ల ప్రక్రియపైనే సమీక్ష జరపాల్సిన అవసరం ఏర్ప డింది. ఆ అవసరాన్ని తీర్చడం కోసం చేసిన సుదీర్ఘ అధ్యయ నంలో భాగమే ఈ పుస్తకం. ‘‘రాజకీయ రంగంలో తాము ఎవరి పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్నామో, వారి తరఫున మాట్లాడటం, వారి వాదనలు వినిపించడం ద్వారా అంతిమంగా వారికి నిజమైన ప్రతిబింబా లుగా, ప్రజాప్రతినిధులుగా ఉండాలి. దీనినే రాజకీయ ప్రాతినిధ్యానికి నిజ మైన నిర్వచనంగా భావించవచ్చు’’ అని అమెరికా రాజకీయ సిద్ధాంతవేత్త హన్నా పిట్‌కిన్‌ అన్న మాటలను రాజశేఖర్‌ ఉపోద్ఘాతంలో ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంది.

దళిత రాజకీయ ప్రాతినిధ్యానికి అడుగడుగునా ఆటంకాలే
1919లో సౌత్‌బరో కమిటీ ముందు అంటరాని కులాలకు రాజకీయ ప్రాతిని ధ్యంతోపాటు, పౌరులందరికీ సార్వజనీన ఓటింగ్‌ హక్కు ఉండాలని అంబే డ్కర్‌ ప్రతిపాదించారు. అప్పటి నుంచి 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చేంత వరకు ఆయన నిరంతర పోరాటం చేశారు. దళితులకు రాజకీయ రంగంలో నిజమైన ప్రజాప్రాతినిధ్యం అవసరాన్ని ఆయన ప్రతీచోటా నొక్కి చెప్పారు. ప్రత్యేక ఓటింగ్‌ విధానం దానికి పరిష్కారంగా ఆయన భావిం చారు.  తర్వాత 1928లో సైమన్‌ కమిషన్‌కు అందించిన నివేదికలో కూడా రాజకీయ ప్రాతినిధ్యమే ప్రధానాంశం. 1930–31లో జరిగిన లండన్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లలో సైతం అంబేడ్కర్‌ అంటరాని కులాల రాజకీయ ప్రాతి నిధ్యం గురించి ప్రతిపాదించారు. హిందూ సమాజంలోని సామాజిక అసమా నతలు, వివక్షలూ, అంటరాని కులాలను అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురిచేశాయనీ, దీంతో రాజకీయంగా కూడా ఆ కులాలవారు అధికారం అంచుల్లోకైనా రాలేకపోతున్నారని అంబేడ్కర్‌ వాదించారు. సంఖ్యాధిక్యత లేని అంటరాని కులాల వారు ఎన్నికల్లో పోటీ చేసినా హిందూ సమాజం వారిని గెలవనివ్వదనీ, అందువల్ల అంటరానికులాల ప్రతినిధులను అంటరా నికులాల వారే ఎన్నుకునే విధానం రావాలని ఆయన కోరారు. ఈ విధానం కొత్తదేమీ కాదనీ, ముస్లింలకు, ఆంగ్లో ఇండియన్లకు అప్పటికే ఈ ప్రత్యేక ఓటింగ్‌ విధానం ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఆ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ ప్రతిపాదనను నిర్ద్వం ద్వంగా తిరస్కరించారు. అంటరాని కులాలను హిందువుల నుంచి వేరుచే యడం సరైనది కాదని వాదించారు. కానీ, హిందూ సమాజంలో అంటరాని కులాలు మైనారిటీలుగా ఉండటమే గాక, అణచివేతకు, వెలివేతకు గురవు తున్నాయని, వారెంత మాత్రం హిందూ సమాజంలో భాగం కాదని అంబే డ్కర్, గాంధీ వాదనని తిప్పికొట్టారు. దానితో ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం అంబేడ్కర్‌ వాదనను అంగీకరించి, కమ్యూనల్‌ అవార్డు పేరుతో దళితులకు సెపరేట్‌ ఎలక్టోరేట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ద్రోహాల చరిత్ర
అయితే, రెండవ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో గాంధీ, ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రాణాన్నైనా త్యజిస్తాను కానీ, అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్‌ విధానం అమలుకు అంగీకరించనని శపథం చేశారు. దళితులకు ప్రత్యేక ఓటింగ్‌ విధానం అమలుకు వ్యతిరేకంగా పూనాలోని ఎరవాడ జైలులో గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గాంధీ ప్రాణానికి హాని జరిగితే దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతాయని హిందూ సంఘాలు, కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ను బెదిరించాయి. వారు అంబేడ్కర్‌పై తీవ్రమైన ఒత్తిడిని తీసు కొచ్చి సెపరేట్‌ ఎలక్టోరేట్‌కు బదులుగా రిజర్వుడు నియోజకవర్గాల విధానా నికి ఒప్పించారు. దీనినే ‘పూనా ఒడంబడిక’గా పిలుస్తారు. దీనివల్ల దళితుల పక్షాన నిజమైన ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే అవకాశం చేజారిపోయింది. ఈ విధానం ఆధారంగా 1937 – 1944లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తోకలుగా ఉన్న దళిత ప్రతినిధులే ఎన్నికయ్యారని అంబేడ్కర్‌ తన ‘కాంగ్రెస్‌ – గాంధీ అంటరాని కులాలకు ఏం చేశారు?’లో వివరించారు. ఈ విషయా లన్నీ సవివరంగా రాజశేఖర్‌ తన పుస్తకంలో పొందుపరచారు. దళితులకు రాజ్యాంగ రచనా సభ సాక్షిగా జరిగిన మోసం, ఈ పుస్తకంలోని మరొక ప్రధాన ఘట్టం. దళితుల పక్షాన నిజమైన ప్రజాప్రతినిధులు  ఎన్నిక కాకుండా గాంధీ తొలి ఘట్టంలో ఏ విధంగా అడ్డుకున్నారో, అలాగే ద్వితీయ ఘట్టంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దళితులకు చేయాలనుకున్న ద్రోహం అత్యంత తీవ్ర మైనదని రాజశేఖర్‌ బలమైన సాక్ష్యాలతో వివరించారు.

భారత రాజ్యాంగ సభకు అనుబంధంగా ఏర్పాటు చేసిన మైనారిటీల సలహా సంఘం 1947 నివేదిక ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులతో పాటూ అంటరాని కులాలకు కూడా రిజర్వుడు సీట్లను కేటాయించాలని సిఫారసు చేసింది. 1949లో పటేల్‌ ఈ ప్రతిపాదనకు అడ్డుపడి, ఈ రిజర్వేషన్లన్నింటినీ రద్దుచేయాలని ప్రతిపాదించారు. అంబేడ్కర్, దీన్ని పూర్తిగా వ్యతిరేకించడమే గాక, రిజర్వేషన్లను కల్పించకపోతే రాజ్యాంగ రచనా సంఘానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన రాజ్యాంగసభకు హాజరుకాలేదు. దీంతో పటేల్‌ 1949 మే 25వ తేదీన ముస్లింలు, ఇతర మైనా రిటీల రిజర్వుడు సీట్లను రద్దుచేస్తూ, షెడ్యూల్డ్‌ కులాలకు మాత్రమే రిజర్వుడు స్థానాలను కేటాయించాలనే తీర్మానాన్ని ప్రతిపాదించారు.

దాదాపు రెండు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత ఎస్సీలకు రిజర్వుడు సీట్లను కేటాయిస్తూ రాజ్యాంగ సభ తీర్మానం చేసింది. మరో విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. అంబేడ్కర్‌ 1919 నుంచీ కోరుతున్న సార్వజనీన ఓటింగ్‌ హక్కును కూడా పటేల్‌ వ్యతిరేకించారు. పౌరు లందరికీ ఓటు హక్కు ఉండటం సరైంది కాదనే వాదనను సర్దార్‌ పటేల్‌ ముందుకు తెచ్చారు. అప్పటివరకు కేవలం విద్యాధికులకు, పన్నులు చెల్లించే వారికి మాత్రమే భారత దేశంలో ఓటు హక్కు ఉండేది. అంబేడ్కర్‌ పటేల్‌ ప్రతిపాదనను చాలా తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు, అందుకు సంబం ధించిన కమిటీలలోని సభ్యుల మద్దతును కూడా కూడగట్టారు. కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్న బాబూ జగజ్జీవన్‌రాం కూడా ఆయనకు అండగా నిలిచారు. అనివార్యమైన పరిస్థితుల్లో పటేల్, అంబేడ్కర్‌ సార్వజనీన ఓటింగు హక్కు ప్రతిపాదనను అంగీకరించారు.

భారత చరిత్రగతిలో దళిత రాజకీయ ప్రస్థానానికి ఎదురైన ఎన్నో అడ్డం కులను ఎదుర్కొని, శతాబ్దకాలానికి ముందే దళితుల భవిష్యత్‌  పరిస్థితులను అంచనావేసిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తాత్విక చింతనకు సంబం ధించిన మరుగునపడిన అనేకానేక కోణాలను రాజశేఖర్‌ పుస్తకం సందర్భో చితంగా, సవివరంగా ఆవిష్కరించింది.


- మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement