విముక్తి పోరు బావుటా కోరెగాం! | Mallepally Laxmaiah article on maharastra dalits movement | Sakshi

విముక్తి పోరు బావుటా కోరెగాం!

Published Thu, Jan 4 2018 1:31 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

Mallepally Laxmaiah article on maharastra dalits movement - Sakshi

కొత్త కోణం

కోరెగాం యుద్ధం అంతస్సారంలో దళిత విముక్తి పోరాటం. సమానతకు కట్టుబడ్డ శివాజీ తదుపరి కాలంలో మెహర్‌లను అçస్పృశ్యులుగా, అంటరానివారుగా నీచంగా చూసిన పీష్వాల పీచమణచేందుకే కొన్ని వందల మంది మెహర్‌ సైనికులు వేల కొలది పీష్వాల సేనతో తెగించి పోరాడారు. ఏటా జనవరి ఒకటిన దళితులు భీమా నది ఒడ్డున ఉన్న స్మారక స్తూపానికి నివాళులర్పించి, స్ఫూర్తిని పొందే ఆనవాయితీ ఈనాటిది కాదు. సామాజిక అంతరాలున్నంత వరకూ చరిత్రపుటల్లో దాగిన ఆ దళిత విముక్తి పోరాటాన్ని గుర్తుచేసుకోవాల్సిందేనని  అంబేడ్కర్‌ చెప్పారు.  

‘‘హం హై వీర్‌.. శూర్‌ – హం తోడే జంజీర్‌!’’ప్రపంచమంతా నూత్న సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్న జనవరి ఒకటవ తేదీన మహారాష్ట్రలోని కోరెగాం ఊరేగింపులో... తరాల అంతరాలను ధిక్కరిస్తూ, అసమానతలనూ, అణచివేతలను ప్రతిఘటిస్తూ పోటెత్తిన మహాజనసంద్రం ఇచ్చిన నినాదమిది.

ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడి
భీమా నదికి దక్షిణాన నినాదాలు హోరెత్తుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు.. అత్యంత శ్రద్ధాసక్తులతో పసికందు నుంచి పండు ముదుసలి వరకు. తదేక దీక్షతో జన పోరాట ప్రతీక కోరెగాం స్తూపాన్ని సందర్శించడానికి గంటల తరబడి నిలబడి సాగిపోతున్నారు. వారి క్రమశిక్షణకు తలొగ్గి సూర్యుడి తీక్షణత సైతం తగ్గేలా ఉందా జనప్రవాహం. భీమా నదికి ఒకవైపు ఇంతటి శక్తిని ప్రదర్శిస్తూ దళితులంతా తమ ఐక్యత సంకేతాన్ని నినాదంగా ప్రదర్శిస్తున్నారు. మరో వైపు భీమా నదికి అవతల ఉత్తరాన వధూ భద్రుకు గ్రామంలో కొంత మంది ఆధిపత్య కులాలు కాషాయ జెండాలతో, ఇనుప రాడ్లతో, రాళ్లతో చాటుమాటుగా పొలాల్లో దాగారు. భీమా కోరెగాంకు ప్రదర్శనగా వస్తోన్న వారిపైన వారు ముందుగా రాళ్ల దాడి చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడికి చెల్లాచెదురైన దళితులపైన వెంట తెచ్చుకున్న ఆయుధాలతో క్రూరంగా దాడి చేసారు. అక్కడే నిలిచిపోయిన వాహనాలను తగులబెట్టారు. ఈ గ్రామానికి తోడుగా దాని పక్కనే ఉన్న సన్సావాడి, శిఖరాపూర్‌ అనే రెండు గ్రామాల ఆధిపత్య కులాలు కూడా ఇలాగే దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, రాహుల్‌ ఫతంగ్‌లే తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మరణించారు.

ఈ దాడి హఠాత్తుగా ఆరోజుకారోజు జరిగింది కాదని, ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల ముందే, డిసెంబర్‌ 29న వధూ భద్రుకు గ్రామంలో అక్కడి దళితులు నిర్మించుకున్న ఒక అమరవీరుని సమాధిని కూల్చివేసి ఆధిపత్యకులాలు ఈ ఘర్షణకు శ్రీకారం చుట్టాయి. గత మూడు నెలలుగా దేశవ్యాప్తంగా భీమా కోరెగాం విజయ యాత్రపై జరుగుతున్న చర్చ స్థానిక ఆధిపత్య కులాలకు, హిందూత్వ శక్తులకు నిద్రలేకుండా చేసినట్టు కనిపిస్తున్నది. భీమా కోరెగాం పోరాట బాటని తమ విముక్తి బాటగా భావించి దళితులు సగర్వంగా తలెత్తుకొని నిలబడ్డారు. అది అక్కడి ఆధిపత్య కులాలకు కంటగింపుగా తయారయ్యింది. అదే వారిని ఈ దాడికి ఉసిగొల్పింది. మహిళలు, పిల్లలతో కలసి వస్తున్న నిరాయుధ దళితులపైన ఈ అమానుష దాడికి ఒడిగట్టారు.

చరిత్రలో కోరెగాం ప్రత్యేకత
ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రతీ యుద్ధం అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో సాగిననే. కానీ 200 ఏళ్ల క్రితం కోరెగాంలో జరిగిన యుద్ధం ఆత్మగౌరవం కోసం జరిగింది. దళిత జాతి విముక్తి కోసం జరిగింది. మనిషిని మనిషిగా గుర్తించే కనీస మానవత్వపు జాడలను వెతుక్కునే ప్రయత్నంగా మాత్రమే జరిగింది. అప్పటి వరకూ మెహర్‌లను అçస్పృశ్యులుగా, అంటరానివారుగా, నీచంగా చూసే పీష్వాల పీచమణచేందుకు జరిగింది. రాచరికపు అరాచకాలకు ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి పోరాడిన దళిత పోరాటాల చరితకు, ఇంకా చెప్పాలంటే దిటవు గుండెల దళిత ధిక్కారపు వాడికి వేడికి కోరెగాం అపూర్వ నిదర్శనమై నిలిచింది. ఏటా జనవరి 1న  మహారాష్ట్రలోని పుణే సమీపాన ఉన్న భీమా నది ఒడ్డున నిటారుగా నింగికెగసి, సగర్వంగా తలెత్తి నిలిచిన కోరెగాం స్మారక స్తూపం వద్ద దేశవ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలంతా వినమ్రంగా నివాళులర్పిస్తారు. ఇది ఈనాటిది కాదు. దోపిడీ, పీడన అణచివేత, కుల రాకాసి కోరలు పీకేందుకు పీష్వాలకెదురొడ్డి పోరాడిన మెహర్‌ వీరులను మదినిండా తలుచుకోవడం ఈనాటి నుంచి ప్రారంభం కాలేదు. అది 200 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 1922 జనవరి ఒకటవ తేదీన కోరెగాంను సందర్శించి అక్కడ సభను నిర్వహించారు. అంతరాలున్నంత వరకూ చరిత్రపుటల్లో దాగిన ఆ దళిత విముక్తి పోరాటాన్ని గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈనాటికీ దేశంలోని దళిత ప్రజలంతా అదే ఆత్మగౌరవ స్ఫూర్తిని కొనసాగిస్తూ వస్తున్నారు.

శివాజీ తర్వాత అమలైన మనుధర్మంపై గెలుపు
జనవరి 1, 1818న భీమా నది ఒడ్డున కోరెగాం దగ్గర జరిగిన యుద్ధంలో 500 మంది మెహర్‌ సైనికులు 28,000 పీష్వా సైన్యంతో తలపడ్డారు. ఈ యుద్ధం పీష్వాలకూ, బ్రిటిష్‌ సైన్యానికీ మధ్య జరిగినదిగానే ప్రచారం జరిగింది. కానీ ఇందులో పాల్గొన్న సైనికుల్లో అత్యధికులు మెహర్‌లు కావడమూ, కేవలం కొన్ని వందల మంది సైనికులే వేల కొలదిగా గల పీష్వాల సైన్యాన్ని ఓడించడం చరిత్రలోనే అత్యంత విశేషంగా చెప్పొచ్చు. పీష్వాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ యుద్ధం బ్రిటిష్‌ ప్రభుత్వానికి విజయాన్ని తెచ్చిపెట్టిన మాట నిజమే. కానీ అందులో మెహర్‌ దళిత జాతి విముక్తి నినాదం కూడా అంతర్లీనంగా ఉంది. అపూర్వమైన తెగింపును, ధైర్యసాహసాలను ప్రదర్శించి సైన్యంలో అగ్రగాములు, ప్రధాన శక్తులుగా నిలిచిన మెహర్‌ల అంతరాంతరాళాల్లో ఇమిడి ఉన్నది అదే. పీష్వా పాలనను అంతం చేస్తే తప్ప తమకు విముక్తిలేదని మెహర్‌లు భావించారు. అందువల్లనే వందల్లో ఉన్న మెహర్‌ సైనికులు ప్రాణాలకు లెక్కచేయక వీరోచితంగా వేలమంది పీష్వా సైనికులను ఓడించడం సాధ్యమైంది.

అప్పటికే మెహర్‌లకు వందల ఏళ్ల సైనిక వారసత్వం ఉంది. శివాజీ కాలంలోనే మెహర్‌లను సైనికులుగా చేర్చుకోవడం ప్రారంభమైంది. శివాజీ తన సమతా దృక్పథంతో మెహర్‌లకు సైన్యంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. కానీ శివాజీ తరువాత అధికారంలోనికి వచ్చిన పీష్వాలు మనుధర్మాన్ని అమానవీయంగా, అత్యంత క్రూరంగా అమలు చేశారు. దుర్మార్గమైన పద్ధతుల్లో నీచమైన సంప్రదాయాలతో అంటరానితనాన్ని పాటించారు. అంటరాని కులాలైన మెహర్, మాంగ్, మాతంగ్‌ కులాలకు చెందిన వారెవరికీ గ్రామాల్లోకి అడుగుపెట్టే అర్హత ఉండేది కాదు. ఉదయం, సాయంత్రాలైతే ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. ఆ సమయాల్లో సూర్యుడు ఏటవాలుగా ఉంటాడు కాబట్టి వారి నీడలు ఊరిలోని ఇళ్లపైన, మనుషులపైన పడే అవకాశం ఉంటుందని    అటువంటి నిషేధం విధించారు. ఎప్పుడైనా అత్యవసరమైతే సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు మాత్రమే, అదీ వారి అనుమతితోనే, వారి అవసరాల నిమిత్తమే అనేక ఆంక్షలతో దళితులను ఊరిలోనికి రానిచ్చేవారు. దళితులు తమ అడుగుజాడలను తామే చెరిపేసుకునేలా నడుముకు వెనుకవైపు చీపురుకట్టుకోవాలి. మెహర్‌లు ఉమ్మితే ఆ స్థలం అపవిత్రమౌతుందన్నారు కాబట్టి తమ ఉమ్మి బయటపడకుండా మూతికి ముంత కట్టుకొని అందులోనే ఉమ్మివేయాలి. ఎప్పుడైనా పొరపాటున పీష్వాల వ్యాయామ శాలల ముందు నుంచి వెళ్లిన మెహర్, మాతంగ్‌ల తలలను నరికి, కత్తులతో బంతాట ఆడేవారు. ఇది అక్కడ పీష్వాలు సాగించిన దుర్మార్గ పాలన.

అంటరానితనం నుంచి విముక్తే ఆ పోరు అంతస్సారం
మెహర్‌లు ఇంతటి క్రూర పాలనను అనుభవించారు కనుకనే.. చచ్చినా, బతికినా ఒకటే కాబట్టి బ్రిటిష్‌ సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపారు. పీష్వాల క్రూర అణచివేత కారణంగానే వారిలో ప్రాణాలకు తెగించి పోరాడే కసీ, పట్టుదలా పెరిగాయి. లేకపోతే 500 మంది మెహర్‌ సైనికులు 28,000 మంది పీష్వా సైనికులను తరిమి తరిమి కొట్టడం సాధ్యమయ్యే పని కాదు. మెహర్‌లు చూపిన ఈ తెగువ, సాహసం, వెనుక ఎంతో చారిత్రక తాత్వికత దాగున్నది. నీచమైన బతుకు కన్నా యుద్ధరంగంలో చావడమే గౌరవమని ఆనాడు మెహర్‌లు భావించారు. కనుకనే విజయం తలవంచి వారి కాళ్లకు నమస్కరించింది. అమెరికా మానవ హక్కుల నాయకుడు, వర్జీనియా విముక్తి పోరాట యోధుడు పాట్రిక్‌ హెన్రీ మాటలు ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ‘‘మనం విముక్తి పొందాలంటే పోరాటం తప్పనిసరి. నా వరకైతే విముక్తి పొందడమో, వీర మరణమో కావాలి.’’ కోరెగాం యుద్ధంలో మెహర్‌లు సరిగ్గా ఇలాగే అంటరానితనం సంకెళ్లను తెంచుకోవడానికి ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యారు. విజయం సాధించారు. ఇది కోరెగాం విజయగా«థ.

కోరెగాంలో జనవరి 1, 2018న దళితుల మీద జరిగిన దాడులు, తదనంతర నిరసన ప్రతిఘటనలపై కొందరు మేధావులు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఒకవైపు దళితులపైన జరిగిన దాడిని ఖండిస్తూనే, రెండోవైపు 200 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటనను ఇప్పుడు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. వారికి నాదొక విజ్ఞప్తి. వందల ఏళ్లు అమానుషత్వానికీ, అమానవీయతకూ, అణచివేతకూ, కట్టుబానిసత్వానికీ బలైపోయిన దళితులు చేసిన ఆ తిరుగుబాటే... వారిని తలెత్తుకొని నిలబడేలా చేయగలిగింది. అందువల్లనే వారు తరతరాలుగా ఆ విజయగా«థ నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉన్నారు. నేటికీ వారి ఆత్మగౌరవ చిహ్నంగా కోరెగాం çస్తూపాన్ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. పీడనకు, అణచివేతకు, దోపిడీకి గురైన జాతి, ప్రజలు, దేశం తమ విముక్తికి కారణమైన పోరాటాల, విజయాల గాథలను గుర్తుచేసుకోవడం సహజం. ఆ విజయగాథలు వారిని నిరంతరం చైతన్య పరుస్తూనే ఉంటాయి. అటువంటిదే భారత స్వాతంత్య్రం కూడా. 70 ఏళ్ళు గడిచినప్పటికీ మనం అత్యంత గౌరవభావంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని వీధివీధినా, వాడవాడలా జరుపుకుంటూనే ఉన్నాం, ఇక ముందూ జరుపుకుంటాం. కోరెగాం సంస్మరణ కూడా అలాంటి సత్సాంప్రదాయమే. కోరెగాం విజయగా«థను గుర్తుచేసుకోవడం దళితులు చేస్తున్న తప్పయితే యావద్భారతం దేశ æస్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం కూడా తప్పిదమే అవుతుందని గుర్తించాలి.
    


మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement