కొత్త మలుపు మేలు కొలుపు
కొత్త కోణం
ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్‌లోని ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల విభజనను రద్దు చేసింది. దీంతో తెలంగాణ, ఏపీలలోని సబ్‌ప్లాన్ చట్టానికి ముప్పు ఏర్పడింది. తాజా ఏపీ బడ్జెట్ ఈ సబ్‌ప్లాన్ స్థానంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌ను ప్రకటించింది. అంటే సబ్‌ప్లాన్ చట్టం ఆచ రణలో లేనట్టే. ఇలా కేంద్రం, ఏపీ ప్రభుత్వం దళిత, ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటు న్నాయి. ఇందుకు భిన్నగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ల ఏర్పాటుకు చట్టాన్ని తెచ్చి, అపూర్వమైన రీతిలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి బాటలు వేస్తోంది.
అది డిసెంబర్ 2, 2012 అర్ధరాత్రి 11 గంటల సమయం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ దళితుల, ఆదివాసీల జీవితాల్లో పెనుమార్పులకు కారణమయ్యే సబ్‌ప్లాన్ చట్టానికి అతి కష్టం మీద ఆమోద ముద్రవేసింది. అవి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రజాపోరాటాలు మిన్నంటుతున్న సమయమది. అప్ప టికి సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాయిదాపడుతు న్నాయి. అయినా అన్ని అడ్డంకులు దాటుకొని ఒక చరిత్రాత్మక చట్టం అతి కష్టం మీద నిండు సభలో ఆమోద ముద్రను వేయించుకుంది. తరాలుగా అణచివేతకు గురైన ప్రజల కోసం, సామాజిక వెలివేతకు గురైన సమాజం కోసం, జనాభాలో 25 శాతంగా ఉన్న దళిత, ఆదివాసీ వర్గం కోసం గత చరిత్రలో లేని విధంగా శాసనసభ రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు జరు పుకుంది. అంత సునాయాసంగా కాకపోయినా, అన్ని రాజకీయ పార్టీలను ఓ వేదికపైకి తెచ్చి, అన్ని సమస్యలనూ పక్కకునెట్టి సబ్‌ప్లాన్ చట్టాన్ని సాధిం చుకోగలిగిన చరిత్ర ఆనాడు తెలుగు ప్రజలకు దక్కింది. ఆ కొద్దిరోజులకే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సబ్‌ప్లాన్ చట్టం అమలుపై అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజాసంఘాలు పెద్దగా దృష్టిసారించలేదు. కానీ చట్టం వల్ల కలిగిన వెసులుబాటుతో నిధుల కేటాయింపు పెరిగింది. సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యాయని చెప్పలేం. కానీ, కొన్ని పథకాలు దళితుల, ఆదివాసీల ఆర్థిక, సామాజిక జీవితంలో ముఖ్య మార్పులకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. చట్టం రూపుదాల్చిన సంద ర్భంలో చర్చను ముగిస్తూ నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి స్కాలర్ షిప్‌ల మొత్తాన్ని గణనీయంగా పెంచారని గుర్తుంచుకోవాలి.
విభజన తర్వాత ఎస్సీ, ఎస్టీల పురోగతికి పట్టం
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకోసం రూ. 10 లక్షల (ఇప్పుడది 20 లక్షలు) పథకాన్ని ప్రవేశ పెట్టడం, వ్యవసాయాధారిత నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని మహిళల పేరుతో అందించడం, ఎస్సీ, ఎస్టీ నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ‘కళ్యాణ లక్ష్మి’ పేరుతో రూ. 51 వేల (ఇప్పుడిది రూ. 75,000) సాయాన్ని ప్రభుత్వం ఈ సబ్‌ప్లాన్ ని«ధుల ద్వారానే అందించగలిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు తగు ఆర్థిక సాయాన్ని ఈ చట్టం నిధుల ద్వారా అందిస్తున్నది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, రెసిడెన్షియల్ పాఠశాలల విషయంలో జరిగిన ప్రగతిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీలకు 104 పాఠశాలలను, ఎస్సీ బాలికలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి అమలు చేసింది. అదేవిధంగా ఎస్టీలకు 51 పాఠశాలలను, మరిన్ని కళాశా లలను ప్రారంభించింది. ఇక్కడొక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రభావం కేవలం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే పరిమితం కాలేదు. ఈ పాఠశాలలు, కళాశాలల ప్రభావంతో బీసీలకు, మైనారిటీలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించడం విశేషం. ఇప్పుడు తెలంగాణలో దాదాపు 782 రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేస్తు న్నాయంటే అది సబ్‌ప్లాన్ స్ఫూర్తి ఫలితమేనని గ్రహించాలి. చట్టానికి ముందు 296 రెసిడెన్షియల్ పాఠశాలలే ఉండేవి. పైగా వాటి పనితీరు సైతం ఆర్థిక వనరుల కొరత వలన అంతంత మాత్రంగానే ఉండేది. సబ్‌ప్లాన్ అమలు తర్వాత, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలు సాధించిన పురోగతి దేశంలోనే విలక్షణమైనది.
కేంద్రంలో 2014లో అధికారంలోనికి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా, ప్రత్యేకించి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. అది బడ్జెట్‌లోని ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల విభ జనను రద్దు చేసింది. రాబడి, పెట్టుబడి పద్దులనే స్థూల విభజనకే పరి మితమైంది. దీంతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న సబ్‌ప్లాన్ పథకానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో అమల్లో ఉన్న సబ్‌ప్లాన్ చట్టానికి ప్రమాదం ముంచుకొచ్చింది. 2017–18 కేంద్ర బడ్జెట్‌లో సబ్‌ప్లాన్ అనే పదాన్నే తొలగించారు. వాటిని కేవలం ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు గానే పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ స్థానంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌ను ప్రకటిం చింది. అంటే ఉమ్మడి ఏపీ శాసనçసభ ఆమోదించిన సబ్‌ప్లాన్ చట్టం ఆచరణలో లేనట్టేనని నేటి ఏపీ ప్రభుత్వం తేల్చివేసింది. ఒకరకంగా చెప్పా లంటే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం రెండూ దళిత, ఆదివాసీల ఆర్థిక హక్కును దెబ్బతీయడం ద్వారా వారి సామా జిక, ఆర్థికాభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే. ఈ చర్య దళిత, ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తుందనడంలో సందేహం లేదు.
చరిత్రాత్మకమైనదిగా రూపొందనున్న కొత్త చట్టం
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నెలక్రితం ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యుల సమావేశం జరిపి దళిత, ఆదివాసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో మార్పులు తెచ్చి, మరింత సమర్థవంతమైన నూతన చట్టాన్ని రూపొందిం చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆ తదుపరి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులతో విడివిడిగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు నాలుగైదు సమా వేశాలు జరిపి, చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలను గురించి వివరమైన చర్చలు జరిపాయి. నూతన చట్టాన్ని రూపొందించడానికి అవసరమైన సిఫారసులను అవి ప్రభుత్వానికి నివేదించాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం స్థానంలో ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ చట్టాన్ని తీసుకురావాలనేది కూడా ఆ సూచనలలో ఒకటి. ఇదే విష యాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘బడ్జెట్ రూపకల్పనలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా మార్పులు అనివార్యం అవుతాయి. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికై ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అందుకుగాను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం స్థానంలో నూతన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించాం. కొత్త చట్టం ప్రకారం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులు ఒక ఏడాది వ్యయం కాకపోతే, వాటిని తదుపరి సంవత్సరానికి కేటాయించుకొని ఖర్చు చేసుకునే అవకాశాన్ని చట్టంలో పొందుపరుస్తు న్నాం’’ అని ఆర్థికమంత్రి ప్రకటించారు. దానికి కొనసాగింపుగానే బుధ వారం తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, పాత చట్టం స్థానంలో నూతన చట్టం కోసం బిల్లును ఒకటి రెండు రోజుల్లోనే తానే స్వయంగా ప్రవేశపెడతానని ప్రకటించడం గమనార్హం. రానున్న ఈ చట్టం భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం పేరును చిరస్థాయిగా నిలుపుతుం దనడంలో సందేహం లేదు.
దళితుల, ఆదివాసీల అభివృద్ధికి కేంద్రమే చొరవ చూపాలి
దళితులు, ఆదివాసీలు ఇప్పటికీ మిగతా సమాజంతో పోలిస్తే అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నందువల్ల ఈ చట్టం అవసరం మరింతగా ఉందని గుర్తించాలి. గత 70 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో తగినంత మార్పును తీసుకురాలేకపోయాయి. అందు కోసమే ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1974లో ట్రైబల్ సబ్‌ప్లాన్‌ను, 1980లో స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. కానీ ఎన్నడూ వాటి నిధులు ప్రజలకు చేరిన దాఖలాలు లేవు. పథకాలైతే రూపొందించారు గానీ, వాటికి నిధులను మాత్రం సమకూర్చలేదు. దీంతో పథకాలు జోరుగా ప్రారం భమైనా, అమలులో ఆ జోరు కనిపించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 20 ఏళ్లలో దాదాపు రూ. 20 వేల కోట్లు దారిమళ్లినట్టు గణాంకాలు చెపుతు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల సద్వినియోగం కోసం ఉద్యమాలు చేపట్టాయి. కానీ ప్రభుత్వాలు కేటాయింçపులనైతే చేసినా, ఆచరణలో అనుకున్న ఫలితాలు లభించలేదు. ఫలితంగా 2010 నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలంటే చట్టపరమైన ఏర్పాటు తప్పనిసరి అని ఉద్యమ వేదికలు భావించాయి. దీంతో ప్రజా ఉద్యమం తీవ్రతరమైంది. రాజకీయ పార్టీలన్నీ తరతమ భేదాలను మరిచి ఉద్యమించాయి. దాంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో చట్టాన్ని రూపొందించింది. అటువంటి మహత్తర ప్రయత్నం మళ్లీ జరగాల్సిన అవ సరం ఉంది.
ఇందుకు కేంద్ర ప్రభుత్వం చొరవను ప్రదర్శించాలి. దళిత, ఆదివాసీల అభివృద్ధి కోసం ఎంతో కృషిచేస్తున్నామని ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అర్థం అవుతున్నది. ఒకవైపు రాజ్యాంగం వెలుగులో పాలన సాగిస్తున్నట్టు చెప్పుకుంటూనే అది రాజ్యాం గంలో పొందుపరిచిన అనేక అంశాలను విస్మరిస్తున్న పరిస్థితి మన కళ్ల ముందుంది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీలకు సామాజిక అన్యాయం, అసమానతల నుంచి, అన్ని రకాల దోపిడీల నుంచి రక్షణ కల్పించి, ఆర్థిక, విద్యారంగాల్లో వారికి తగు విధమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ స్ఫూర్తితోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలును కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వాలు ఈ వర్గాల ప్రయోజనాలను. అభివృద్ధికిగల మార్గాలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, తగువిధమైన పాలనాపద్ధతులను, విధానాలను రూపొందించాలి. అంతేకాని నూటికి 25 శాతంగా ఉన్న ఈ వర్గాల ప్రజల ప్రయోజనాలను విస్మరించి పరిపాలన సాగించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది.
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213