ST Sub plan
-
కొత్త మలుపు మేలు కొలుపు
కొత్త కోణం ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లోని ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల విభజనను రద్దు చేసింది. దీంతో తెలంగాణ, ఏపీలలోని సబ్‌ప్లాన్ చట్టానికి ముప్పు ఏర్పడింది. తాజా ఏపీ బడ్జెట్ ఈ సబ్‌ప్లాన్ స్థానంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌ను ప్రకటించింది. అంటే సబ్‌ప్లాన్ చట్టం ఆచ రణలో లేనట్టే. ఇలా కేంద్రం, ఏపీ ప్రభుత్వం దళిత, ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటు న్నాయి. ఇందుకు భిన్నగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ల ఏర్పాటుకు చట్టాన్ని తెచ్చి, అపూర్వమైన రీతిలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి బాటలు వేస్తోంది. అది డిసెంబర్ 2, 2012 అర్ధరాత్రి 11 గంటల సమయం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ దళితుల, ఆదివాసీల జీవితాల్లో పెనుమార్పులకు కారణమయ్యే సబ్‌ప్లాన్ చట్టానికి అతి కష్టం మీద ఆమోద ముద్రవేసింది. అవి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రజాపోరాటాలు మిన్నంటుతున్న సమయమది. అప్ప టికి సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాయిదాపడుతు న్నాయి. అయినా అన్ని అడ్డంకులు దాటుకొని ఒక చరిత్రాత్మక చట్టం అతి కష్టం మీద నిండు సభలో ఆమోద ముద్రను వేయించుకుంది. తరాలుగా అణచివేతకు గురైన ప్రజల కోసం, సామాజిక వెలివేతకు గురైన సమాజం కోసం, జనాభాలో 25 శాతంగా ఉన్న దళిత, ఆదివాసీ వర్గం కోసం గత చరిత్రలో లేని విధంగా శాసనసభ రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు జరు పుకుంది. అంత సునాయాసంగా కాకపోయినా, అన్ని రాజకీయ పార్టీలను ఓ వేదికపైకి తెచ్చి, అన్ని సమస్యలనూ పక్కకునెట్టి సబ్‌ప్లాన్ చట్టాన్ని సాధిం చుకోగలిగిన చరిత్ర ఆనాడు తెలుగు ప్రజలకు దక్కింది. ఆ కొద్దిరోజులకే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సబ్‌ప్లాన్ చట్టం అమలుపై అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజాసంఘాలు పెద్దగా దృష్టిసారించలేదు. కానీ చట్టం వల్ల కలిగిన వెసులుబాటుతో నిధుల కేటాయింపు పెరిగింది. సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యాయని చెప్పలేం. కానీ, కొన్ని పథకాలు దళితుల, ఆదివాసీల ఆర్థిక, సామాజిక జీవితంలో ముఖ్య మార్పులకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. చట్టం రూపుదాల్చిన సంద ర్భంలో చర్చను ముగిస్తూ నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి స్కాలర్ షిప్‌ల మొత్తాన్ని గణనీయంగా పెంచారని గుర్తుంచుకోవాలి. విభజన తర్వాత ఎస్సీ, ఎస్టీల పురోగతికి పట్టం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకోసం రూ. 10 లక్షల (ఇప్పుడది 20 లక్షలు) పథకాన్ని ప్రవేశ పెట్టడం, వ్యవసాయాధారిత నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని మహిళల పేరుతో అందించడం, ఎస్సీ, ఎస్టీ నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ‘కళ్యాణ లక్ష్మి’ పేరుతో రూ. 51 వేల (ఇప్పుడిది రూ. 75,000) సాయాన్ని ప్రభుత్వం ఈ సబ్‌ప్లాన్ ని«ధుల ద్వారానే అందించగలిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు తగు ఆర్థిక సాయాన్ని ఈ చట్టం నిధుల ద్వారా అందిస్తున్నది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, రెసిడెన్షియల్ పాఠశాలల విషయంలో జరిగిన ప్రగతిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీలకు 104 పాఠశాలలను, ఎస్సీ బాలికలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి అమలు చేసింది. అదేవిధంగా ఎస్టీలకు 51 పాఠశాలలను, మరిన్ని కళాశా లలను ప్రారంభించింది. ఇక్కడొక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రభావం కేవలం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే పరిమితం కాలేదు. ఈ పాఠశాలలు, కళాశాలల ప్రభావంతో బీసీలకు, మైనారిటీలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించడం విశేషం. ఇప్పుడు తెలంగాణలో దాదాపు 782 రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేస్తు న్నాయంటే అది సబ్‌ప్లాన్ స్ఫూర్తి ఫలితమేనని గ్రహించాలి. చట్టానికి ముందు 296 రెసిడెన్షియల్ పాఠశాలలే ఉండేవి. పైగా వాటి పనితీరు సైతం ఆర్థిక వనరుల కొరత వలన అంతంత మాత్రంగానే ఉండేది. సబ్‌ప్లాన్ అమలు తర్వాత, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలు సాధించిన పురోగతి దేశంలోనే విలక్షణమైనది. కేంద్రంలో 2014లో అధికారంలోనికి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా, ప్రత్యేకించి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. అది బడ్జెట్లోని ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల విభ జనను రద్దు చేసింది. రాబడి, పెట్టుబడి పద్దులనే స్థూల విభజనకే పరి మితమైంది. దీంతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న సబ్‌ప్లాన్ పథకానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో అమల్లో ఉన్న సబ్‌ప్లాన్ చట్టానికి ప్రమాదం ముంచుకొచ్చింది. 2017–18 కేంద్ర బడ్జెట్లో సబ్‌ప్లాన్ అనే పదాన్నే తొలగించారు. వాటిని కేవలం ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు గానే పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ స్థానంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌ను ప్రకటిం చింది. అంటే ఉమ్మడి ఏపీ శాసనçసభ ఆమోదించిన సబ్‌ప్లాన్ చట్టం ఆచరణలో లేనట్టేనని నేటి ఏపీ ప్రభుత్వం తేల్చివేసింది. ఒకరకంగా చెప్పా లంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం రెండూ దళిత, ఆదివాసీల ఆర్థిక హక్కును దెబ్బతీయడం ద్వారా వారి సామా జిక, ఆర్థికాభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే. ఈ చర్య దళిత, ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తుందనడంలో సందేహం లేదు. చరిత్రాత్మకమైనదిగా రూపొందనున్న కొత్త చట్టం ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నెలక్రితం ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యుల సమావేశం జరిపి దళిత, ఆదివాసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో మార్పులు తెచ్చి, మరింత సమర్థవంతమైన నూతన చట్టాన్ని రూపొందిం చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆ తదుపరి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులతో విడివిడిగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు నాలుగైదు సమా వేశాలు జరిపి, చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలను గురించి వివరమైన చర్చలు జరిపాయి. నూతన చట్టాన్ని రూపొందించడానికి అవసరమైన సిఫారసులను అవి ప్రభుత్వానికి నివేదించాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం స్థానంలో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టాన్ని తీసుకురావాలనేది కూడా ఆ సూచనలలో ఒకటి. ఇదే విష యాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘బడ్జెట్ రూపకల్పనలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా మార్పులు అనివార్యం అవుతాయి. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికై ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అందుకుగాను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం స్థానంలో నూతన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించాం. కొత్త చట్టం ప్రకారం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులు ఒక ఏడాది వ్యయం కాకపోతే, వాటిని తదుపరి సంవత్సరానికి కేటాయించుకొని ఖర్చు చేసుకునే అవకాశాన్ని చట్టంలో పొందుపరుస్తు న్నాం’’ అని ఆర్థికమంత్రి ప్రకటించారు. దానికి కొనసాగింపుగానే బుధ వారం తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, పాత చట్టం స్థానంలో నూతన చట్టం కోసం బిల్లును ఒకటి రెండు రోజుల్లోనే తానే స్వయంగా ప్రవేశపెడతానని ప్రకటించడం గమనార్హం. రానున్న ఈ చట్టం భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం పేరును చిరస్థాయిగా నిలుపుతుం దనడంలో సందేహం లేదు. దళితుల, ఆదివాసీల అభివృద్ధికి కేంద్రమే చొరవ చూపాలి దళితులు, ఆదివాసీలు ఇప్పటికీ మిగతా సమాజంతో పోలిస్తే అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నందువల్ల ఈ చట్టం అవసరం మరింతగా ఉందని గుర్తించాలి. గత 70 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో తగినంత మార్పును తీసుకురాలేకపోయాయి. అందు కోసమే ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1974లో ట్రైబల్ సబ్‌ప్లాన్‌ను, 1980లో స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. కానీ ఎన్నడూ వాటి నిధులు ప్రజలకు చేరిన దాఖలాలు లేవు. పథకాలైతే రూపొందించారు గానీ, వాటికి నిధులను మాత్రం సమకూర్చలేదు. దీంతో పథకాలు జోరుగా ప్రారం భమైనా, అమలులో ఆ జోరు కనిపించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 20 ఏళ్లలో దాదాపు రూ. 20 వేల కోట్లు దారిమళ్లినట్టు గణాంకాలు చెపుతు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల సద్వినియోగం కోసం ఉద్యమాలు చేపట్టాయి. కానీ ప్రభుత్వాలు కేటాయింçపులనైతే చేసినా, ఆచరణలో అనుకున్న ఫలితాలు లభించలేదు. ఫలితంగా 2010 నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలంటే చట్టపరమైన ఏర్పాటు తప్పనిసరి అని ఉద్యమ వేదికలు భావించాయి. దీంతో ప్రజా ఉద్యమం తీవ్రతరమైంది. రాజకీయ పార్టీలన్నీ తరతమ భేదాలను మరిచి ఉద్యమించాయి. దాంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో చట్టాన్ని రూపొందించింది. అటువంటి మహత్తర ప్రయత్నం మళ్లీ జరగాల్సిన అవ సరం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చొరవను ప్రదర్శించాలి. దళిత, ఆదివాసీల అభివృద్ధి కోసం ఎంతో కృషిచేస్తున్నామని ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అర్థం అవుతున్నది. ఒకవైపు రాజ్యాంగం వెలుగులో పాలన సాగిస్తున్నట్టు చెప్పుకుంటూనే అది రాజ్యాం గంలో పొందుపరిచిన అనేక అంశాలను విస్మరిస్తున్న పరిస్థితి మన కళ్ల ముందుంది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీలకు సామాజిక అన్యాయం, అసమానతల నుంచి, అన్ని రకాల దోపిడీల నుంచి రక్షణ కల్పించి, ఆర్థిక, విద్యారంగాల్లో వారికి తగు విధమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ స్ఫూర్తితోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలును కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వాలు ఈ వర్గాల ప్రయోజనాలను. అభివృద్ధికిగల మార్గాలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, తగువిధమైన పాలనాపద్ధతులను, విధానాలను రూపొందించాలి. అంతేకాని నూటికి 25 శాతంగా ఉన్న ఈ వర్గాల ప్రజల ప్రయోజనాలను విస్మరించి పరిపాలన సాగించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
నాటి దురాగతాలకు నేటి ప్రాయశ్చిత్తం
సందర్భం జనజీవన స్రవంతికి దూరంగా శాపగ్రస్త జీవితం గడిపిన దళితులకు ప్రాయశ్చిత్తంగా అదనపు సౌకర్యాలు ఇచ్చి ముందుకు తీసుకురావడం సమంజసమే. సబ్‌ప్లాన్ రూపంలో అధిక నిధులు కేటాయిస్తే దళిత వికాసం సాధ్యపడుతుంది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా కొన్ని డిమాండ్ల సాధనకు ఈ మధ్య కొన్ని ప్రజా సంఘాలు, ఆ వర్గం నుంచి ఎదిగిన ఉన్న తాధికారులు, మాజీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి వెళ్లాను. ప్రస్తుతం ఈ సబ్ ప్లాన్ కింద ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతికి వినియోగించిన నిధులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే వినియోగించాలి. ఒకవేళ మిగిలిపోతే మరుసటి సంవత్సరానికి బద లాయించే అవకాశం లేదు. అవి అలాగే మురిగిపోతాయి. ఇలా కాకుండా మిగిలిన నిధులను మరుసటి ఏడాదికి మిగిల్చి, కొత్త సంవ త్సరంలో మళ్లీ కేటాయించే నిధులను వీటికి కలపాలన్న డిమాండ్ వ్యక్తమయింది. ఈ ప్లాన్ కింద జనాభా నిష్పత్తి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మొత్తం బడ్జెట్లో వాటాను కేటాయిస్తున్నారు. దీనితో పాటు ఈ వర్గాలకు తరతరాల నుంచి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారిని ఇప్పటికైనా ప్రధాన జీవన స్రవంతిలో కలిపేందుకు అదనపు నిధులు కేటాయించాలన్న మరో డిమాండ్ వచ్చింది. వీటిపై వక్తలు తమ, తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే నేను ఈ సమావేశంలో పెద్దగా మాట్లాడలేదు. మౌనంగా వింటూ కూర్చున్నాను. సాధారణంగా నేను పాల్గొన్న ఏ సమావేశంలోనైనా నేను అభిప్రా యాలు చెప్పి వస్తాను. కానీ ఎందుకో ఈ సమావేశంలో మాట్లాడ లేకపోయాను. బహుశా నేను మాట్లాడని సమావేశంగా ఇది మిగిలి పోయిందేమో కానీ నాలో సుడులు తిరిగిన జ్ఞాపకాల నుంచి బయ టపడలేక నేను గళం విప్పలేదు. అయితే సమావేశంలో చర్చకు వచ్చిన రెండు డిమాండ్లు నాకు సమంజసంగానే అన్పించాయి. ముఖ్యంగా ఈ వర్గాలకు తరతరాల నుంచి జరిగిన అన్యాయానికి నేను ప్రత్యక్ష సాక్షిని. వరంగల్ జిల్లా ఘనపూర్‌కు 12 మైళ్ల దూరంలో ఉంది మా ఊరు. మా ఊరుకు పోస్ట్ ఘనపూర్ నుంచే వచ్చేది. అవి 1940 దశ కంలో రోజులు. ఏదైనా దుర్వార్త ఉంటే దానిని దళిత కులానికి చెందిన మనిషి గంట కొట్టుకుంటూ మా ఊరుకు మోసుకొచ్చేవాడు. అలా మా ఊరికి గంట కొట్టుకుంటూ ఒక మనిషి వచ్చాడు అంటే అది దుర్వార్త కింద ఊరంతా ఉలిక్కి పడేది. ఆ మనిషి ఏ గడప దగ్గర ఆగుతాడన్న కలవరపాటుకు గురయ్యేవారు. నిమ్న కులానికి చెందిన మనుషులు దుర్వార్తలను తీసుకొస్తూ అశుభానికి గుర్తుగా నిలిచే వారు. వారి నివాసం ఊరి చివరే. ఒకవేళ ఊళ్లోకి వస్తే చెప్పులు చేత్తో పట్టుకు నడవాలి. రహదారిపై ఉన్నత కులాల వారికి ఎదురు రాకూ డదు. సామాజికంగా మిగతా ఉన్నత కులాల వారితో ఎక్కడా సమా నంగా లేకుండా ఆచార వ్యవహారాలుండేవి. వాటిని ధిక్కరిస్తే కఠిన శిక్షలుండేవి. అలాగే దళితులు ఫత్తేదారు కావడానికి అవకాశం లేదు. ఫత్తేదారు అంటే భూయజమాని. ఆ అవకాశం ఉన్నత కులాల వారికే. కుంట నేలకైనా వీరు సొంత దారులు కాలేరు. భూ రిజిస్ట్రేషన్లకు వారు అర్హులు కారు. అందుకే వారికి సొంత ఆస్తి అనేది ఉండేది కాదు. ఆ విధంగా ఆర్థికంగా దళితులు సొంత కాళ్లపై నిలబడే అవ కాశం లేదు. ఎంతకాలమైనా ‘బాంచను దొర నీ కాల్మొక్తా’ అంటూ ఇతరులపై ఆధారపడి అశుద్ధ పనులకే అంకితం కావాలి. ఈ విధమైన అమానుష, దురాగతాలను ఈ జాతి ఎన్నో శతాబ్దాల పాటు మౌనంగా భరించింది. మేమప్పుడే స్కూలు చదువు పూర్తి చేసుకొని ఉన్నాం. అస్పృశ్యతా నివారణకు గాంధీజీ పిలుపునకు యావత్ జాతి స్పందించే కాలం. ఆ సమయంలో మా ఊళ్లో నేను కొంత మందితో కలసి మాదిగ వాడలలోకి వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకొనేవాళ్లం. అయితే వాళ్లు చాలా భయపడేవారు ‘వద్దు! మా ఇండ్లకు రావద్దు’ అని వారించేవారు ‘ ఏం పాపం చేశామో! మా బతుకులు ఇంతే. మీరు మా కొంపలకు వచ్చి పాపం అంటిం చుకోవద్దు’ అనేవారు అయినా మేము వారిని కలుపుకునేందుకు ప్రయత్నించే వాళ్లం. ఈ విషయం తెలిసి ‘కులం కట్టుబాటు తప్పావు’ అంటూ మా కుటుంబాన్ని వెలివేసారు. అదే సమయంలో మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చింది కానీ నేను అంటరాని వాళ్ల ఇంటికి వెళ్లానన్న నెపంతో మా ఇంటికి ఎవరూ రాలేదు. మా అమ్మ చాలా బాధ పడింది. అప్పటికే నాన్న చనిపోయాడు. అమ్మ బాధ చూడలేని వయస్సు నాది కానీ నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. నేను బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టి ఉండవచ్చు కానీ తోటి మనుషుల ఇళ్లకు వెళ్లడంలో తప్పేమిటి? ఇదే విషయం మా అమ్మ అడిగింది– ‘నా కొడుకు చేసిన పాపం ఏమిటి?’ అని ‘అస్పృశ్యుల ఇళ్లకు వెళ్లడమే నీ కొడుకు చేసిన అపరాధం’ అంటూ ‘పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేయించుకోవాలంటే బంగారు తీగను బాగా కాల్చి నాలుకపై అడ్డంగా కొద్దిసేపు ఉంచాలి. అదే శిక్ష’ అంటూ కుల పెద్దలు చెప్పారు. మా అమ్మ ‘నా కొడుకు ఏ తప్పు చేయలేదంటూ’ నాకు అండగా నిల బడింది. జనజీవన స్రవంతికి దూరంగా శాపగ్రస్త జీవితం గడిపిన దళి తులకు ప్రాయశ్చిత్తంగా అదనపు సౌకర్యాలు ఇచ్చి ముందుకు తీసుకురావడం సమంజసమే. ఇందుకు అనుగుణంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఈ వర్గాలకు కొన్ని వెసులుబాటు కల్పిం చడం వల్ల విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ వంటివి కార్యరూపం దాల్చాయి. ఫలితంగా సివిల్ సర్వీసెస్ నుంచి వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలోకి దళిత ప్రతిభ వికసిస్తోంది. మాధ వరావు, మాజీ ఐఏఎస్ వంటి వారు పాలనా వ్యవస్థలో ఉన్నత స్థాయికి చేరారు. సబ్‌ప్లాన్ రూపంలో అధిక నిధులు కేటాయిస్తే దళిత వికాసం సాధ్యపడుతుంది. నిధులు రెండు రకాలుగా ఉంటాయి. సాధారణ అభివృద్ధికి ఉద్దేశించిన నిధి. రెండోది వేగవంతమైన అభి వృద్ధికి నిర్దేశించిన నిధి. ఈ రెండు మార్గాల్లో నిధులు కేటాయిస్తే దళితులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది. ప్రస్తుత అవకాశాలు వినియోగించుకునేందుకు మద్దతు ఇవ్వడం ఒక మార్గమైతే గత తప్పులు, పాపాల దిద్దుబాటుకు మరికొంత అదనపు సహకారం అందివ్వడం ద్వారా వివక్ష లేని సమాజ అవతరణకు దారి ఏర్పడు తుంది. అందుకు సబ్‌ప్లాన్ బలమైన ఆయుధం కావాలి. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు. -
ఉరుకులు.. పరుగులు
* మార్చి 31తో మురిగిపోనున్న సబ్‌ప్లాన్ నిధులు * ఆఘమేఘాలపై పనులకు ప్రతిపాదనలు * గుంటూరులోని ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు బాపట్ల: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మార్చి 31వ తేదీతో మురిగిపోనున్న నేపథ్యంలో ఆ నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు ఉరుకులు, పరుగులు మొదలెట్టారు. మున్సిపాల్టీల్లో పాలకపగ్గాలు చేపట్టిన తరువాత ఒక పని కూడా చేయలేకపోయామనే అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాను పనులతోనైనా సంతృప్తి పరిచేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 12 మున్సిపాల్టీలో మార్చి 31లోపు చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రతిపాదనల చిట్టా తీసుకుని అధికారయంత్రాంగం గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఒక్కొక్క కౌన్సిలర్ కనీసం వార్డులో రెండు, మూడు పనులు చేపట్టుకునేందుకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు వార్డులో లేకపోతే ఆ వార్డులకు ఈ నిధులు వచ్చే అవకాశం లేకపోవటంతో ఆయా వార్డుల్లో కనీసం తాగునీటి పైపులైన్లు అయినా ప్రతిపాదించాలనే తలంపులో అధికారగణం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. నామినేషన్ పద్ధతిపైనే పనులు.. మార్చి 31లోపు సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జిల్లాలోని మున్సిపాల్టీలో ఆఘమేఘాలపై ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిగిలిన నాలుగు జిల్లాలో మాత్రమే ఈ నిధులు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మున్సిపాల్టీలు ఈ నిధులను దక్కించుకునేందుకు చూస్తున్నాయి. గతంలో మున్సిపాల్టీకి రూ.50లక్షలు మాత్రమే ఇచ్చే ఈ నిధులు మార్చినెలాఖరుతో మురిగిపోనుండటంతో ఎన్ని పనులకైనా అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్క మున్సిపాల్టీలో రూ.5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిపై పనులు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. రోడ్లు, పైపులైన్లు, డ్రైనేజీలతోపాటు దళితవాడలు, వాటికి అనుసంధానంగా ఉండే వార్డుల్లో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాపట్ల మున్సిపాల్టీలో రూ.10 కోట్లతో 200 పనులకు పైగా ప్రతిపాదనలు సిద్ధంగా చేయగా మిగిలిన మున్సిపాల్టీల్లో వారి స్థాయిని అనుసరించి రూ.2 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తంగా జిల్లాలో వెయ్యి పనులకుపైగా చేపట్టాలనే ఉద్దేశంతో ఫైల్స్ తీసుకుని అనుమతులు కోసం గుంటూరు ప్రధాన కార్యాలయాల చుట్టూ మున్సిపల్ యంత్రాంగం తిరుగుతోంది. మున్సిపాల్టీల్లో ప్రత్యేక సమావేశాలు.. గుంటూరులోని ప్రధాన కార్యాలయాల నుంచి ప్రతిపాదనలకు అనుమతులు రావటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాల్టీల్లో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు ఆఘమేఘాలపై ప్రయత్నాలు మొదలు పెట్టారు. గడిచిన పదిరోజులుగా చేపట్టాల్సిన పనులపై సర్వేలు నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటికప్పుడు తయారుచేసిన ఫైల్స్‌ను తీసుకొని గుంటూరులోని కార్యాలయాలకు పయనమవుతున్నారు. -
సబ్‌ప్లాన్‌ను యథాతథంగా కొనసాగించాలి
7 వామపక్షాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఏడు వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని నీరుగా ర్చే ప్రయత్నాలను తిప్పికొట్టనున్నట్లు హెచ్చ రించాయి. మంగళవారం మగ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో సబ్‌ప్లాన్ పేరు మార్పుతోపాటు, నీరుగార్చే ప్రయత్నాలపై చర్చించినట్లు, ఈ చట్ట పరిరక్షణకు అన్ని ప్రయత్నాలు సాగించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే వామపక్ష పార్టీలు, దళిత, ఆదివాసీ సంస్థలు, మేధావులను కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమాన్ని సాగించాలని నిర్ణ యించినట్లు ప్రకటించారు. చాడ వెంకటరెడ్డి (సీపీఐ), జి.నాగయ్య(సీపీఎం),కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), రాంచందర్ (న్యూడెమోక్రసీ),ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ– యూ),మురహరి(ఎస్‌యూసీఐ–సీ), జానకి రాములు (ఆర్ఎస్పీ) పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులను ఎందుకు ఖర్చు చేయలేదు!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: గత మూడేళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆయా వర్గాల సంక్షేమానికి ఎందుకు ఖర్చు చేయలేదో వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల వ్యయానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పర్యవేక్షణ కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని, మహిళలకు 50 శాతం నిధులను కేటాయించాలన్నారు.పార్టీ నాయకులు ఎస్.మల్లారెడ్డి, జాజుల గౌరి తదితరులతో కలసి బీజేపీ రాష్ట్ర డైరీ– 2017ని ఆయన ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు... దళితులు, గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, మొసలి కన్నీరు కార్చేందుకే ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రజానిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. భద్రాచలంలో జరిగిన బీజేపీ సమా వేశంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని, అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని తీర్మానం చేసినందుకు శనివారం పార్టీ కార్యాల యంలో లక్ష్మణ్‌కు మందకృష్ణ అభినందనలు తెలిపారు. రెండు దశాబ్దాల కంటే రెండున్నరేళ్ల కేసీఆర్ పాలనలోనే దళితులు ఎక్కువగా మోసపోయారన్నారు. దళితులను అణిచివేయాలనే కుట్రే కనబడుతోందన్నారు. -
సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కోసం పోరాటం
కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల కిందట అమల్లోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైతే సవరణలు, నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కొత్త బడ్జెట్ తయారీలో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందున సబ్‌ప్లాన్ పేరు మార్చాలని, ఎస్సీ సబ్‌ప్లాన్‌ను ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని పేరు పెట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నిర్ణీత ఏడాదిలో ఖర్చు కాకుంటే వచ్చే ఏడాదికి బదిలీ చేసే పద్ధతి అమలు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా నిధులు ఖర్చు చేయని ఉద్యోగులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగానికి చొరవ చూపిన వారికి అవార్డులు అందించాలని సిఫారసు చేశారు. ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ నాలుగు అంశాలను డిమాండ్ చేశామని, అన్నింటికీ సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లను అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. -
సభలో నవ్వుల పువ్వులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ నడుమ జరిగిన చిన్న ఘటనతో కొద్దిసేపు నవ్వుల పువ్వులు విరిశాయి. చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు మాట్లాడే అవకాశమిచ్చారు. తొలుత డిప్యూటీ స్పీకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంపత్.. త్వరలోనే మీరు మంత్రి పదవితో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇంతలోనే స్పీకర్ మధుసూదనాచారి రావడంతో ఆమె కుర్చీ దిగారు. సంపత్ స్పందిస్తూ.. మంత్రి పదవి ఇస్తారని అనుకుంటుంటే.. ఉన్న పళంగా కుర్చీ నుంచి దించేస్తారా అనడంతో సభలో అధికార, విపక్ష సభ్యుల మోమున చిరునవ్వులు చిందులేశాయి. -
విపక్షం వాకౌట్
ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందంటూ ఫైర్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ శుక్రవారం శాసనసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ అంశంలో ప్రభుత్వం అన్నీ తప్పుడు లెక్కలు చెబుతోందని, పొంతన లేని సమా ధానాలు ఇస్తోందని మండిపడ్డాయి. ‘ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి–ప్రభుత్వ చర్యలు’ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు చర్చలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తప్పుడు లెక్కలు, మాయ మాటలతో ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సబ్‌ప్లాన్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోలేదని, మార్గదర్శకాలనూ రూపొందించలేదని పేర్కొ న్నారు. దీనిపై గత మార్చిలో జరిగిన సమావేశాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పొంతనలేని సమాధానాలిచ్చి సభను తప్పుదోవ పట్టించారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జనాభా గురించి కూడా సర్కారు వద్ద సరైన వివరాలు లేకపోవడం దురదృష్టకర మని.. 54 లక్షలమంది ఎస్సీలుంటే, ప్రభుత్వ ప్రకటనలో 63 లక్షలుగా పేర్కొన్నారని దుయ్యబట్టారు. ఇక 2014–15లో 18.89 వేల మందికి 229 కోట్ల ఆర్థిక తోడ్పాటును ప్రకటించిన ప్రభుత్వం.. సగం మందికి ఇప్ప టికీ నిధులివ్వలేదన్నారు. 2015–16లో 49 వేల మందికి రూ.420 కోట్ల మేర రుణాలి వ్వాల్సి ఉండగా.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు చేరలే దన్నారు. గతంలో ఎస్సీఎస్టీలకు రుణాలను అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్చానల్ను మూసేసిన ప్రభుత్వం.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ల కోసం గ్రీన్చానల్ను తెరిచిందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకంలో దళితులకు రూ.లక్ష అందించాలని డిమాండ్ చేశారు. దళితులపై ప్రేమ ఉన్నట్లయితే ఆ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి (ప్రదీప్ చంద్ర)ను ఏడాది కిందే సీఎస్‌గా చేసేవారని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించడమే: బీజేపీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చుచేయకుండా ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లం ఘిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం ఉపాధి రుణాలకు 2లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 66 వేల మందిని అర్హులుగా ఎంపిక చేసి 14 వేలమందికే రుణాలిచ్చారని మండిపడ్డారు. రెండున్నరేళ్లు దాటినా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ఆత్మగౌరవాన్ని నిలపరా: రాజయ్య దళితుల ఆత్మగౌరవాన్ని నిలిపే ఉప ప్రణాళిక అమలుకు నోచుకోవడం లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు దళిత ఎమ్మెల్యేను మంత్రిగా చేయాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని ఎప్పటి లోగా అన్వయించుకుంటారో చెప్పాలని సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. సలహా మండలి ఏర్పాటుకు సుముఖం: జగదీశ్ విపక్షాలు కోరినట్లుగా దళిత సలహామండలిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి సభలో చెప్పారు. రానున్న బడ్జెట్లో కేంద్రం కొత్త విధానాన్ని అనుసరించనున్నందున సబ్‌ప్లాన్ అమలు విధానాలలో ఆ మేరకు మార్పులు చేస్తామన్నారు. ఖర్చు కాని సబ్‌ప్లాన్ నిధులను వచ్చే ఏడాదికి కొనసాగించలేమని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తామన్నారు. ఇక దళితుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని... ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోని నిధుల కంటే ఎక్కువ మొత్తంలో నిధులను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. -
సబ్‌ప్లాన్‌కు తూట్లు పొడుస్తున్నారు
♦ ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై సర్కారును నిలదీసిన కాంగ్రెస్ ♦ చట్టం నిర్వీర్యమవుతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు ♦ భారీగా నిధులను పక్కదారి పట్టిస్తున్నారు ♦ దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏది? ♦ కేంద్రం ఇచ్చిన స్కాలర్‌షిప్‌లనూ పెండింగ్‌లో పెట్టారు సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి టీఆర్ఎస్ సర్కారు తూట్లు పొడుస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సబ్బండ వర్ణాలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని... రెండున్నరేళ్లలో సబ్‌ప్లాన్ చట్టానికి కనీసం మార్గదర్శకాలు కూడా రూపొందించకపోవడమే ఇం దుకు నిదర్శనమని ధ్వజమెత్తింది. శుక్రవారం శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్; దళిత, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క మాట్లాడారు. సబ్‌ప్లాన్ చట్టం అమలుకోసం వెంటనే మార్గదర్శకాలను రూపొందించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండేళ్ల లోనే రూ.6,500 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లాయన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్‌ప్లాన్ కింద చూపిన రూ.26,152 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.9,074 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని... మిగతా రూ.17,078 కోట్లు ఏమయ్యా యని నిలదీశారు. మార్గదర్శకాలేవీ? వాస్తవానికి సబ్‌ప్లాన్ కింద నిధులు ఖర్చు కాకపోతే వాటిని తర్వాతి ఏడాదికి బదిలీ చేయాల్సి ఉంటుం దని.. కానీ ఈ చట్టం మార్గదర్శకాలను రూపొందించుకోని మూలంగా ఆ నిధులన్నీ మురిగిపోయే పరిస్థితి నెలకొందని భట్టి పేర్కొన్నారు. దళిత, గిరిజనులపై నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందిం చేవారన్నారు. సబ్‌ప్లాన్ చట్టం అమలును పర్యవేక్షించేందుకు సీఎం అధ్యక్షతన మం త్రులు, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేయలేదని.. చట్టం అమలుపై సమీక్ష జరిపిన పాపాన పోలేదని వ్యాఖ్యానిం చారు. ‘‘నోడల్ ఏజెన్సీ లేదు. నోడల్ శాఖను ఏర్పాటు చేయరు. కౌన్సిల్ నియమించరు. సమీక్షలు జరుపరు. సబ్‌ప్లాన్ చట్టాన్ని పూర్తిగా వదిలేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు..’’ అని భట్టి మండిపడ్డారు. సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం దళిత, గిరిజనులకు ఆర్థిక, సామాజిక ప్రయోజ నాలను చేకూర్చేందుకే 100 శాతం నిధుల ఖర్చు చూపెట్టాలని.. అంతేగానీ అన్ని వర్గా లకు అమలు చేస్తున్న పథకాల కింద ఎస్సీ, ఎస్టీలు లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం చెప్పడమేమిటని నిలదీశారు. సబ్‌ప్లాన్ చట్టానికి తూట్లు పొడుస్తుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. 7 లక్షల మందిలో 3 వేల మందికే ఇస్తారా? దళిత, గిరిజనుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తామని.. ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు పెడతామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత రెండున్నరేళ్లలో కేవలం 3,671 దళిత కుటుంబాలకు మాత్రమే భూపంపిణీ చేశారని.. కానీ భూమి కోసం 7 లక్షల మందికిపైగా దళితులు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ లెక్కన రాష్ట్రంలోని దళితులందరికీ భూములి వ్వాలంటే 300 ఏళ్లు పడుతుందని.. మరో లెక్క వేసి పంపిణీ చేసినా కనీసం 150 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని 150 ఏళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందా అని విక్రమార్క ఎద్దేవా చేశారు. దాదాపు రెండున్నర లక్షల మంది దళిత, గిరిజన నిరుద్యోగులు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నారని.. ప్రభుత్వం వారికి ఒక్క రూపాయీ ఇవ్వడం లేదని విమర్శించారు. దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కాలర్షిప్లను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే స్కాలర్‌షిప్‌లనూ పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. చేసింది చెప్పారు..కానీ చెప్పిందే చేయలేదు: జానా అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అధికార విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరుగుతుండగా, విపక్షనేత జానారెడ్డి మధ్యలో లేచి మాట్లా డిన మాటలు సభ్యులందరినీ అయోమయానికి గురిచేశాయి. సబ్‌ప్లాన్ అమలు విషయంలో అధికార పక్షం ఏం చేసిందో అది చెప్పిందని, ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏం చెప్పిందో అది మాత్రం చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ వర్గాల లబ్ధిదారుల సంఖ్య విషయంలో ప్రభుత్వమిచ్చిన లెక్కల్లో తప్పులు న్నందున సరిచూసుకోవాలన్నారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు కంగారుపడి తామిచ్చిన వివరాలు పరిశీలించారు. అయితే వివిధ పథకాల లబ్ధిదారుల సంఖ్యను పోల్చేటప్పుడు తాను కన్ఫ్యూజన్కు గురయ్యానని జానారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ 2.5 లక్షల ఎకరాలిచ్చారు గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2.5 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పంపిణీ చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. కానీ ఆ భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపించారు. హరితహారం పేరుతో పోడు భూములన్నీ ఆవిరైపోయాయని, అటవీ అధికారులు అనాదిగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను గుంజుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా భూమి లాక్కోవడంతో ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలో ఓ గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలవుతున్నా సంక్షేమ హాస్టళ్లలోని దళిత, గిరిజన విద్యార్థులకు యూనిఫారాలు ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నించారు. దళిత, గిరిజనుల దేవుడైన బీఆర్ అంబేడ్కర్ పేరును ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పెడితే... ఈ ప్రభుత్వం దానిని చంపేసిందన్నారు. దళిత, గిరిజనులు అమ్మగా కొలిచే ఇందిరాగాంధీ పేరుతో నిర్మించాల్సిన ఇందిరా సాగర్ ప్రాజెక్టునూ చంపేసిందన్నారు. రోహిత్ వేముల విషయంలో కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం చెప్పారని.. ఆ సంగతి ఏమైందని భట్టి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేతల్లో సామాజిక న్యాయం కనిపించడం లేదని. ఉపన్యాసాలకే ప్రభుత్వం పరిమితం అవుతోందని విమర్శించారు. -
అంబేడ్కర్‌కు నివాళి ఇదేనా?!
సందర్భం డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల్ని ఇటీవలే ఘనంగా జరుపుకుంది మన దేశం. పాలకవర్గాలు, వివిధ పార్టీలు పోటీలు పడి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకు పోతామని ప్రతినబూనాయి. ఆచరణలో మాత్రం వాటి స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీ స్తున్నాయి. సమాచారహక్కు చట్టం ద్వారా బహిర్గత మైన వివరాలు దళితులు, ఆదివాసీల అభివృద్ధి పట్ల వీరి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. గత 35 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన రూ.2.8 లక్షల కోట్ల నిధుల్ని ప్రభుత్వాలు ఖర్చు చేయలేదని ‘ఇండియా స్పెండ్’ వెబ్సైట్ పరిశో ధనలో వెల్లడైంది. తరతరాలుగా దోపిడీ, వివక్షలకు గుర వుతున్న ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధికోసం భారత ప్రభుత్వం 1974-75లలో ఎస్టీ సబ్‌ప్లాన్, 1979-80లలో ఎస్సీ సబ్‌ప్లాన్ ప్రకటించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వశా ఖలు ఈ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ లకు 16.6%, ఎస్టీలకు 8.6% నిధులు విడివిడిగా కేటా యించాలి. వీటిని కేవలం వీరి అభివృద్ధి పనులకే వెచ్చించాలి. ప్రత్యేక కేటాయింపుల ద్వారా వారి అభివృ ద్ధికి పాటుపడాలనే సంకల్పంతో ప్రభుత్వాలు ఈ సబ్ ప్లాన్లు ఏర్పాటుచేశాయి. కానీ ఈ కేటాయింపులు ఏనాడూ నూరుశాతం సద్వినియోగం కాలేదు. అసలు కేటాయింపులే జనాభా నిష్పత్తి ప్రకారం జరగకపోగా విదిల్చిన మొత్తాన్ని సైతం పూర్తిస్థాయిలో వెచ్చించలేదు. ఉదాహరణకు 2012-13 లో కేంద్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 58,823 కోట్లు కేటాయించగా రూ.53,345 కోట్లు ఖర్చు చేసింది. అంటే రూ.5,478 కోట్లు మిగిలిపోయాయి. 2013-14లో ఖర్చు చేయని మొత్తం రూ.9,398 కోట్లకు పెరిగింది. ఎన్డీఏ వచ్చాక కేటాయింపులు రూ. 82,935 కోట్లకు పెరిగాయి. ఖర్చు చేయని మొత్తం కూడా రూ. 32,979 కోట్లకు (251 శాతానికి) పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2005-14 మధ్య కాలంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.19,367 కోట్లు ఖర్చు చేయలేదు. ఏపీ తర్వాతి స్థానంలో యూపీ, పం జాబ్ నిలిచాయి. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో జార్ఖండ్ రూ. 17,107కోట్లు, ఒడిశా రూ.7,292కోట్లు, ఏపీ రూ.6,922 కోట్లు ఈ కాలంలో ఖర్చు చేయలేదు. 2014 -15లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌లో 61% నిధులు, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 64.3% నిధులు అంటే మొత్తం రూ.7,475 కోట్లు ఖర్చు చేయకుండా మురగబెట్టింది. వీరి అభ్యున్నతికి కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు పాలకుల నిర్లక్ష్యం వల్ల మురిగిపోతున్నాయి. పక్కదారి పడుతున్నాయి. అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల స్ఫూర్తితో ఇప్పటికైనా పాలకులు దళితులు, ఆదివాసీల హక్కులకు న్యాయం చేయాలి. ప్రజాపక్ష మేధావులు, మీడియా, ప్రగతిశీల సంఘాలు కృషి చేయాలి. సబ్ ప్లాన్‌కు జాతీయస్థాయిలో చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలి. - బి. భాస్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ 9989692001 -
‘సబ్‌ప్లాన్’ పదేళ్ల నిబంధన తొలగించాలి
- వర్క్‌షాపులో నిపుణుల సూచన సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల ఉపప్రణాళిక చట్టం-2013 ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పదేళ్లపాటు అమల్లో ఉండాలనే నిబంధనను సరి చేసి, రెగ్యులర్‌గా కొనసాగించేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. అందుబాటులో ఉన్న సమాచారం(డేటాబేస్)తో ఎస్సీ, ఎస్టీలకు మౌలిక వసతులు కల్పించేవిధంగా ప్రణాళికలు రూపొం దించాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలపై జరిగిన వర్క్‌షాపులో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయా అంశాలపై మరింత విస్తృతస్థాయిలో చర్చించేందుకు ఈ నెల 18న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. డేటాబేస్ బాధ్యతలను సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) డెరైక్టర్‌కు అప్పగించారు. సబ్‌ప్లాన్ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్ రోడ్లకు 16 శాతం, విద్యకు 25 శాతం నిధులు కేటాయించాలని అధికారులు సూచించారు. సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ కేవలం డబ్బు కేటాయించినంత మాత్రాన అభివృద్ధి జరగదని, నిధులను సక్రమంగా వ్యయం చేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ ఉప ప్రణాళికల బడ్జెట్‌ను ఖర్చు చేయడంలో లోపాలున్నాయని, వాటిని అధిగమిం చాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్టీ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్, ప్లానింగ్ డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి, సెస్ డెరైక్టర్ గాలిబ్, ఓయూ ఫ్యాకల్టీ రెడ్యానాయక్, ఎస్టీ శాఖ జేడీ దశరథ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్.. మాయ
-
సబ్‌ప్లాన్.. మాయ
రాష్ట్రంలో దారితప్పిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు కేటాయింపులు ఘనం.. అరకొరగా వ్యయం.. ఉప ప్రణాళికలకు చట్టరూపం వచ్చినా మారని పరిస్థితి ఇంకా పాత పద్ధతిలోనే ప్రభుత్వశాఖల చేతికి నిధులు ఇలా చేస్తే ఫలితమేమిటని దళిత, గిరిజన సంఘాల ఆవేదన నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, నిధులు ఖర్చు చేయాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ‘సంక్షేమం’ దారితప్పింది.. దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యమన్న హామీ గంగలో కలసిపోయింది.. వచ్చీ రావడంతోనే నానా హడావుడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మళ్లీ పాత బాటే పట్టింది.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల నిధులను తిరిగి ప్రభుత్వ శాఖల చేతుల్లోనే పెట్టింది. నోడల్ ఏజెన్సీలు, ప్రత్యేక పద్దు కింద ఖర్చు వంటి వాటిని గాలికొదిలేసింది.. తీరా చూస్తే కేటాయింపులకు, ఖర్చుకు పొంతనే లేకుండా పోయింది.. కేటాయింపుల్లో వ్యయం 15 శాతానికే పరిమితమైంది.. ఎప్పటిలాగే దళితులు, గిరిజనుల సంక్షేమాన్ని వెక్కిరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న దళితులు, గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బడ్జెట్లో సబ్ప్లాన్లకు భారీ కేటాయింపులు చేశారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు చేసినవాటికన్నా ఇప్పుడు పది జిల్లాలకే మరింత ఎక్కువ కేటాయిం చారు. అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల్లో కలెక్టర్లతో, అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిం చి హడావుడి కూడా చేశారు. కానీ చివరికి ఫలితం మాత్రం శూన్యం. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ఘనంగా రూ. 7,579 కోట్లను కేటాయించారు. అందులో ఇప్పటివరకూ విడుదల చేసింది రూ. 2,222 కోట్లు మాత్రమే.. అందులోనూ గత ఎనిమిది నెలల్లో ఖర్చు చేసింది రూ. 1,179 కోట్లే. అంటే ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన మొత్తం నిధుల్లో ఇది కేవలం 15.55 శాతం మాత్రమే. ఇక గిరిజన ఉప ప్రణాళిక పరిస్థితి మరింత దారుణం. దీనికి బడ్జెట్లో కేటాయించింది రూ. 4,404.59 కోట్లుకాగా.. విడుదల చేసిన నిధులు రూ. 1,267.60 కోట్లే. ఇందులోనూ ఖర్చు రూ. 499.6 కోట్లు మాత్రమే. కేటాయించిన నిధుల్లో ఇది 11.34 శాతం మాత్రమే. ఈ లెక్కన ఎస్సీ, గిరిజన ఉప ప్రణాళికలకు సంబంధించిన మిగతా దాదాపు 85 శాతం నిధులను మార్చి నెల ముగిసేలోపు ఎలా ఖర్చు చేస్తారనేది ప్రశ్నార్థకమే. అంతా హడావుడే ఏటా సబ్ప్లాన్లకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని, ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చుపెడతామనీ తొలిసారిగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ చెప్పారు. ఈ చట్టానికి సవరణలు చేయాలన్న దళిత నేతల డిమాండ్ల మేరకు విధి విధానాల రూపకల్పనకు పూనుకోవాలని అధికారులను ఆదే శించినా అమలుకు నోచుకోలేదు. దళితులకు మూడెకరాల భూమి, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలూ అంతంత మాత్రమే. ఇక సబ్‌ప్లాన్ నిధులను పాత విధానంలోనే ఆయా శాఖలకు కేటాయించడంతో వాటి ఖర్చుపై స్పష్టత లేదు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో గ్రాంటును రూ.10 లక్షలకే పరిమితం చేయడంతో ఆచరణలో విఫలమవుతోంది. ఒక్కపైసా ఖర్చు లేదు కొన్ని శాఖలకు కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద పౌరసరఫరాల శాఖకు రూ. 58.24 కోట్లు కేటాయించగా.. రూ. 25 కోట్లు విడుదల చేశారు. సర్వశిక్షా అభియాన్‌కు రూ. 164.9 కోట్లు కేటాయించగా.. 88.92 కోట్లు విడుదలైనా వ్యయం చేయలేదు. ఇక కాలేజీ విద్యకు రూ. 13.89 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 15.34 కోట్లు, కార్మిక శాఖలకు రూ. 10.8 కోట్లు కేటాయించినా... నిధులే విడుదల చేయలేదు. గృహనిర్మాణం కోసం రూ. 231.56 కోట్లు కేటాయించ గా.. ఖర్చు చేసింది రూ. కోటి పద్దెనిమిది లక్షలే. మహిళా, శిశుసంక్షేమం కింద కేటాయించిన రూ. 215.66 కోట్లలో రూ. 19.97 కోట్లు, ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించిన రూ. 2,435.46 కోట్లలో రూ. 437.14 కోట్లు, పాఠశాల విద్యకు కేటాయించిన రూ. 371.97 కోట్లలో రూ. 6.8 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. గిరిజన ‘ప్లాన్’ మరీ దారుణం గిరిజన సబ్‌ప్లాన్‌కు సర్వశిక్షా అభియాన్ కింద రూ. 100 కోట్లు ఇచ్చినా ఒక్కపైసా ఖర్చు చేయలేదు. గిరిజన సంక్షేమానికి రూ. 1,237 కోట్లు కేటాయించగా.. ఖర్చు చేసింది రూ. 156.43 కోట్లే. మహిళా, శిశుసంక్షేమం కింద కేటాయించిన రూ. 165.7 కోట్లలో రూ. 5.59 కోట్లు, గృహనిర్మాణానికి రూ. 208.75 కోట్లు కేటాయించగా.. ఖర్చు చేసింది 1.91 కోట్లే. పాఠశాల విద్యకు కేటాయించిన రూ. 224 కోట్లలో ఖర్చు చేసింది రూ.1.2 కోట్లే. నోడల్ ఏజెన్సీలేవి? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు 2012 డిసెంబర్ 2నుంచి చట్టరూపం దాల్చాయి. అయినా సబ్ప్లాన్ల నిధులను పాత విధానంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తే ఫలితమేమిటని దళిత, ఆదివాసీ, వామపక్ష సంఘాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. అదే పద్ధతిని టీఆర్ఎస్ సర్కార్ కొనసాగిస్తూ ప్రభుత్వ శాఖలకే నిధులు విడుదల చేస్తోంది. సబ్ప్లాన్ల నిధులను నోడల్ ఏజెన్సీలకు ఇచ్చి, వాటి నుంచి ఖర్చు చేయాలన్న డిమాండ్‌ను కూడా గాలికి వదిలేశారు. వెంటనే నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి, ప్రత్యేక ఆర్థిక కార్యదర్శిని నియమించాలని కోరుతున్నాయి. -
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ పర్యటన
కోటగుమ్మం(రాజమండ్రి): విభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ఉప ముఖ్యమంత్రి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త సి. దామోదర రాజనరసింహ జిల్లాలో పర్యటించారు. శనివారం ఉదయం రాజమండ్రికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నగర అధ్యక్షులు ఎన్.వి. శ్రీనివాస్, దళిత నాయకులు తాళ్ళూరి విజయ్ కుమార్ ఆయన కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన గోకవరం బస్టాండ్ వద్దగల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయం సందర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, కొమరాపు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్‌వి శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు'
హైదరాబాద్: దళితుల పట్ల కేసీఆర్ శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు ఇచ్చారని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ.. ప్రచార ఆర్బాటంతో భూపంపిణీని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారని ఎద్దెవా చేశారు. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్థంతి సందర్భంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో సభలు సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్టు సాంబమూర్తి పేర్కొన్నారు. -
గిరిజన వర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేయాలి...!
పార్వతీపురం: గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వవినతతి పత్రం అందజేసినట్లు ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సచివాలయంలో శుక్రవారం ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి చిన్నప్పను కలిశామని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించామని, అలాగే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ, ఉద్యోగులు సమావేశాలను నిర్వహించుకునేందుకు ప్రతి జిల్లాలో అంబేద్కర్ స్మారక భవనాలను ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించాలని కోరామని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీచేయాలని, గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులను భర్తీచేయాలని, ఏజెన్సీలో గల ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ అందజేయాలని కోరామన్నారు. కార్యక్రమంలో తనతోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. రాములు, పి. రంగయ్య తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
‘సబ్‌ప్లాన్’పై నిర్లక్ష్యం!
విజయనగరం ఫూల్‌బాగ్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ చట్టం ద్వారా గత ఏడాది జిల్లాకు పూర్తి గా నిధులు చేయకపోగా... ఈసారి కూడా అదే వైఖరి కనబరిచా రు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా సబ్‌ప్లాన్‌కు కేటాయించి న నిధులపై ప్రస్తావన లేదు. దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం 2013, జనవరి 24వ తేదీ ఎంతో ఆర్భాటంగా ఈ చట్టాన్ని అమలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013, ఏప్రిల్ నెలలో దళితులకు రూ. 8585 కోట్లు, గిరిజనులకు రూ.3666 కోట్లు సబ్‌ప్లాన్ బడ్జెట్లో నిధు లు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా దళితులు 2,14,839 మంది ఉన్నారు. వీరికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను నిధులు మంజూరు కాలేదు. దీంతో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా మంజూరు కాలేదు. ఆ ఏడాది జిల్లావ్యాప్తంగా వివిధ రుణాల కోసం 697 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 536 మందిని లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు. వీరికి రుణాల మంజూరుకు రూ.3 కోట్ల అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్ ప్లాన్ గురించి కాని, దానికి కేటాయించిన నిధులపై కానీ కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో మొత్తం 83 లక్షల మంది దళితులున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రూ.2657 కోట్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖకు రూ.1150 కోట్లు కేటారుుస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ఎంతోకొంత మేరకు నిధులు కేటాయించారు. కానీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు మాత్రం ఎలాంటి నిధుల కేటాయింపు లేదు. దీనిపై దళిత సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమల్లోకి వచ్చి ఇప్పటికి 20 నెలలు గడుస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యారుు. దళితులు, గిరిజనుల కోసం కేటాయించాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారన్న విమర్శలు ఉన్నారుు. అందులో భాగంగానే గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సిన రూ.5 వేల కోట్లు దారి మళ్లాయి. ఈ నిధులను ఇతర రంగాలకు కేటాయిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రణాళికా బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి తగ్గకుండా నిధులు వేరు చేసి ఆ మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు కేటాయించాల్సి ఉంది. సాధారణ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే నిధులను సబ్‌ప్లాన్ నిధులుగా చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్‌లు, ఇతర మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసే నిధుల్లో ఎస్సీ నుంచి 7 శాతం, ఎస్టీ నుంచి 3 శాతం నిధులను సబ్ ప్లాన్ నిధుల నుంచి కోత విధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన సరైనది కాదని దళిత సంఘాల నేతలు అంటున్నారు. అనివార్య పరిస్థితులలో ఖర్చు కాకుం డా సబ్‌ప్లాన్ నిధులు మిగిలిపోతే వాటిని మురిగిపోనివ్వకుండా వచ్చే ఏడాది సబ్‌ప్లాన్ నిధుల్లో కలిపి అదనంగా కేటాయించాల్సి ఉంది. అది ఎక్కడా అమలు కావడం లేదు. -
తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం: రావెల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని రావెల హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఇకమీదట పటిష్టంగా అమలు చేస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విత్తనాల సబ్సీడిని పెంచే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందని రావెల కిషోర్ బాబు అన్నారు. -
'పార్టీలు అంబేద్కర్ జయంతిని విస్మరించాయి'
హైదరాబాద్ : రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పడి అంబేద్కర్ జయంతిని విస్మరించాయని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా ఆయన సోమవారం ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేసిననాడే దళితుల అభివృధ్ది జరుగుతుందన్నారు. దళితుల అభివృద్ధికి అంబేద్కర్ కృసి మరవలేనిదన్నారు. -
ఇదేనా ‘వెలుగు’
అర్హులైనా వర్తించని ఉచిత విద్యుత్ రాయితీ వెలుగు పథకం ద్వారా అందని లబ్ధి బిల్లులు చెల్లించాల్సిందేన ంటూ ట్రాన్స్‌కో హుకుం లబోదిబోమంటున్న 165 మంది లబ్ధిదారులు పూళ్ల (భీమడోలు), న్యూస్‌లైన్ : దళితులకు ఉచిత విద్యుత్ అందని ద్రాక్షలా మారింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 50 యూనిట్లు లోపు వినియోగించిన దళితులకు రాయితీ వర్తింపు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా మొత్తం బిల్లు చెల్లించాల్సిందేనంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరి స్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, రెవెన్యూ శాఖల నిర్లక్ష్యం వల్ల పేదల గృహాల్లో వెలుగులు నింపాల్సిన ఈ పథకం చీకట్లు కమ్ముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పూళ్లలోని తూర్పు, పడమర దళిత కాలనీల్లో 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు వెలుగు పథకంలో భాగంగా ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని ట్రాన్స్‌కో అధికారులు రెండు నెలల క్రితం భరోసా ఇచ్చారు. అయితే మూడో నెలలో బిల్లులను చెల్లించాలంటూ లబ్దిదారులకు వాటిని అందజేశారు. బిల్లులను చెల్లించకపోతే ఫ్యూజులు తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పూళ్ల పంచాయతీ పరిధిలోని పూళ్లలోని తూర్పు, పడమర, నాగేశ్వరపురం తదితర గ్రామాల్లోని 165 మందికి పైగా లబ్ధిదారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల వద్ద లబ్ధిదారుల జాబితాలో ఇంటి పేర్లు సక్రమంగా లేపోవడంవల్లే ఎస్సీ లబ్ధిదారులను గుర్తించలేకపోయామని వీఆర్వో బి.అనిత చెప్పడం గమనార్హం. ఇంతసొమ్ము కట్టేదెలా? కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. రెండు నెలల క్రితం 50 యూని ట్లలోపు విద్యుత్ వాడితే ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని చెప్పారు. ప్రస్తుతం పాత బిల్లులతో పాటు మూడో నెల బిల్లు కూడా కలిపి మొత్తం రూ.391.96 చెల్లించాల్సిందేనంటున్నారు. ఇంత సొమ్ము ఒకేసారి కట్టాలంటే ఏలా. - లంకపల్లి నల్లయ్య, పడమర దళితపేట, పూళ్ల అయోమయంగా ఉంది రెక్కాడితే గాని డెక్కాడని పరిస్థితి మాది. జనవరిలో 8 యూనిట్లు మాత్రమే వాడా. విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేదనుకున్నా. ఇపుడు మూడు నెలలకు రూ.184 చెల్లించాలంటున్నారు. అంతా అయోమయంగా ఉంది. నా సమస్యను ఎవరికి చెప్పుకోవాలే అర్థం కావడం లేదు. - కొమ్ము కుమారి, పూళ్ల -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఆదిలోనే ఇక్కట్లు
కాసిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా యాభై యూనిట్లలోపు విద్యుత్ వాడుకుంటే ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ఆదివాసీ గిరిజనులకు కలగానే మిగలనుంది. ఉచిత విద్యుత్ అందించాలంటే సంబంధిత కులధ్రువీకరణ పత్రాలు అందించాలని అధికారులు స్పష్టం చేయడంతో గిరిజనులకు అవగహన లేక మీసేవ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా.. వారికి సర్టిఫికెట్లు అందడం లేదు. సర్టిఫికెట్లు అందించె గడువు ముగిసినా నేటికీ 50 శాతం మంది కూడా ధ్రువీకరణపత్రాలు ఇవ్వలేదు. కాసిపేట మండలంలో మొత్తం 3,100 కనెక్షన్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినవిగా నమోదయ్యాయి. వీరంతా ఉచిత విద్యుత్‌కు అర్హులు కాగా.. ఇప్పటి వరకు కేవలం 650 మంది (22శాతం) మాత్రమే కులధ్రువీకరణ పత్రాలు అందించారు. గిరిజనులకు అవగహన కల్పించాల్సి ఉన్నా.. అధికారుల సహకారం ఆ దిశగా కనిపించడం లేదు. విద్యుత్‌శాఖ అధికారులు గ్రామాల వారిగా మీటర్ల నంబర్ల ఆధారంగా లబ్ధిదారుల జాబితా తయారుచేసి రెవెన్యూ అధికారులతో ధ్రువీకరణ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. అయితే.. అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. ఒక్క బల్బు మాత్రమే వాడే మారుమూల ప్రాంతాల ఆదివాసీలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారు. కేవలం 22 శాతం మంది మాత్రమే పత్రాలు అందించడంపై ఎంత వెనకబడి పోయారో తెలుస్తోందని, ప్రభుత్వ పథకం గిరిజనులకు అందకుండా చేయడం దారుణమని, గడువుపెంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సం‘క్షోభ’ హాస్టళ్లు
సాక్షి, గుంటూరు: సంక్షేమం మరిచిన సర్కారు వైఖరికి వసతి గృహాల్లోని బడుగు విద్యార్థులు గజగజలాడుతున్నారు. ప్రతి ఏటా సంక్షేమానికి రూ.కోట్లలో నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్న పాలకుల మాటలకు, క్షేత్ర స్థాయిలో అమలవుతున్న సౌకర్యాలకు పొంతన లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద వసతి గృహాలకు మెరుగైన వసతులు కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు నమ్మబలుకుతున్నారే తప్ప ఆ దిశగా చర్యలు తీసుకొన్న పాపాన పోవడం లేదు. దీంతో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు అసౌకర్యాల నడుమ సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో దుప్పట్లు లేక హాస్టల్ భవనాల తలుపులు, కిటికీలు పాడై శిథిలావస్థకు చేరిన వాటిలోనే బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సబ్ ప్లాన్ కింద పక్కా భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారే తప్ప హామీలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. సాంఘిక సంక్షేమ శాఖ కింద 15 హాస్టళ్లకు పక్కా భవ నాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినా ఇంతవరకు పనులు చేపట్టలేదు. జిల్లాలోని ఎక్కువ వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో సాగుతూ కనీస సదు పాయాలు లేక కునారిల్లుతున్నాయి. వీటిని పట్టించుకునే నాధుడే లేకపోవడంతో విద్యార్థులు రాత్రి పూట ఎదురయ్యే సమస్యలతో కునుకు ‘పాట్లు’ పడుతూనే ఉన్నారు. చలి పులి చంపేస్తుండటంతో మోకాళ్లను కడుపులో దాచుకుని పడుకుంటున్నారు. భవనాలకు తలుపులు, కిటికీలు లేకపోవడంతో ఎక్కడ విష సర్పాలు, పురుగులు వస్తాయోనని నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఇరుకు గదుల్లోనే ఒకరిపై ఒకరు పడుకోవాల్సిన పరిస్థితులు అధిక భాగం వసతి గృహాల్లో ఉన్నాయి. అద్దె గృహాల్లో నడుస్తున్న హాస్టళ్లకు అద్దె సకాలంలో చెల్లించకపోవడంతో భవన యజమానులు సౌకర్యాలు కల్పించడం లేదు. చలికాలంలో సమస్యలు అనేకం ముఖ్యంగా చలికాలంలో పేద విద్యార్థుల సమస్యలు అనేకం ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో ఇచ్చే ఓ దుప్పటినే దాచుకుంటూ చలికాలంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల్లోని పిల్లలకు ఏడాదికి ఓ జంపఖానా, దుప్పటి ఇవ్వాల్సి ఉంది. ఈ సీజన్లోనే దోమ తెరలు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు. గుంటూరులోని కోడి గుడ్డు సత్రంలోని ఎస్సీ హాస్టల్, రాజాగారితోటలోని బాలికల హాస్టల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెదనందిపాడు, క్రోసూరు, ప్రత్తిపాడులో వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. చిలకలూరిపేట, మాచర్ల, సత్తెనపల్లిల్లో కనీస మౌలిక వసతులు లేక, విరిగిన కిటికీలు, తలుపుల కారణంగా చలి పంజా విసురుతోంది. రేకుల షెడ్డుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. దుప్పట్ల పంపిణీ అరకొరే.. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టళ్లలో దుప్పట్ల పంపిణీ అరకొరగానే ఉంది. 62 బీసీ హాస్టళ్లలో మొత్తం 6,500 మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు ఇంకా 3 వేల మందికి దుప్పట్లు పంపిణీ చేయలేదు. ఎస్సీ హాస్టళ్లలో పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా, పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎస్టీ హాస్టళ్లలోనూ ఇంకా 287 మందికి దుప్పట్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి ఆప్కోకు పంపిన ఇండెంట్ రాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.