సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కోసం పోరాటం
కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల కిందట అమల్లోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైతే సవరణలు, నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కొత్త బడ్జెట్ తయారీలో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందున సబ్‌ప్లాన్ పేరు మార్చాలని, ఎస్సీ సబ్‌ప్లాన్‌ను ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ అని పేరు పెట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నిర్ణీత ఏడాదిలో ఖర్చు కాకుంటే వచ్చే ఏడాదికి బదిలీ చేసే పద్ధతి అమలు చేయాలని కోరారు.
ఉద్దేశపూర్వకంగా నిధులు ఖర్చు చేయని ఉద్యోగులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగానికి చొరవ చూపిన వారికి అవార్డులు అందించాలని సిఫారసు చేశారు. ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ నాలుగు అంశాలను డిమాండ్ చేశామని, అన్నింటికీ సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లను అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు.