సబ్‌ప్లాన్‌కు తూట్లు పొడుస్తున్నారు | bhatti vikramarka fired on trs government on sc,st subplan | Sakshi
Sakshi News home page

సబ్‌ప్లాన్‌కు తూట్లు పొడుస్తున్నారు

Published Sat, Jan 7 2017 2:56 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

సబ్‌ప్లాన్‌కు తూట్లు పొడుస్తున్నారు - Sakshi

సబ్‌ప్లాన్‌కు తూట్లు పొడుస్తున్నారు

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై సర్కారును నిలదీసిన కాంగ్రెస్‌
చట్టం నిర్వీర్యమవుతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు
భారీగా నిధులను పక్కదారి పట్టిస్తున్నారు
దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏది?
కేంద్రం ఇచ్చిన స్కాలర్‌షిప్‌లనూ పెండింగ్‌లో పెట్టారు


సాక్షి, హైదరాబాద్‌: దళితులు, గిరిజనుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టానికి టీఆర్‌ఎస్‌ సర్కారు తూట్లు పొడుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. సబ్బండ వర్ణాలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని... రెండున్నరేళ్లలో సబ్‌ప్లాన్‌ చట్టానికి కనీసం మార్గదర్శకాలు కూడా రూపొందించకపోవడమే ఇం దుకు నిదర్శనమని ధ్వజమెత్తింది. శుక్రవారం శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌; దళిత, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ తరఫున భట్టి విక్రమార్క మాట్లాడారు. సబ్‌ప్లాన్‌ చట్టం అమలుకోసం వెంటనే మార్గదర్శకాలను రూపొందించి, అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండేళ్ల లోనే రూ.6,500 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లాయన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్‌ప్లాన్‌ కింద చూపిన రూ.26,152 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.9,074 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని... మిగతా రూ.17,078 కోట్లు ఏమయ్యా యని నిలదీశారు.

మార్గదర్శకాలేవీ?
వాస్తవానికి సబ్‌ప్లాన్‌ కింద నిధులు ఖర్చు కాకపోతే వాటిని తర్వాతి ఏడాదికి బదిలీ చేయాల్సి ఉంటుం దని.. కానీ ఈ చట్టం మార్గదర్శకాలను రూపొందించుకోని మూలంగా ఆ నిధులన్నీ మురిగిపోయే పరిస్థితి నెలకొందని భట్టి పేర్కొన్నారు. దళిత, గిరిజనులపై నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందిం చేవారన్నారు. సబ్‌ప్లాన్‌ చట్టం అమలును పర్యవేక్షించేందుకు సీఎం అధ్యక్షతన మం త్రులు, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేయలేదని.. చట్టం అమలుపై సమీక్ష జరిపిన పాపాన పోలేదని వ్యాఖ్యానిం చారు. ‘‘నోడల్‌ ఏజెన్సీ లేదు. నోడల్‌ శాఖను ఏర్పాటు చేయరు. కౌన్సిల్‌ నియమించరు. సమీక్షలు జరుపరు. సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పూర్తిగా వదిలేశారు. కాంగ్రెస్‌ తెచ్చిన ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు..’’ అని భట్టి మండిపడ్డారు. సబ్‌ప్లాన్‌ చట్టం ప్రకారం దళిత, గిరిజనులకు ఆర్థిక, సామాజిక ప్రయోజ నాలను చేకూర్చేందుకే 100 శాతం నిధుల ఖర్చు చూపెట్టాలని.. అంతేగానీ అన్ని వర్గా లకు అమలు చేస్తున్న పథకాల కింద ఎస్సీ, ఎస్టీలు లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం చెప్పడమేమిటని నిలదీశారు. సబ్‌ప్లాన్‌ చట్టానికి తూట్లు పొడుస్తుంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.

7 లక్షల మందిలో 3 వేల మందికే ఇస్తారా?
దళిత, గిరిజనుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తామని.. ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు పెడతామని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత రెండున్నరేళ్లలో కేవలం 3,671 దళిత కుటుంబాలకు మాత్రమే భూపంపిణీ చేశారని.. కానీ భూమి కోసం 7 లక్షల మందికిపైగా దళితులు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ లెక్కన రాష్ట్రంలోని దళితులందరికీ భూములి వ్వాలంటే 300 ఏళ్లు పడుతుందని.. మరో లెక్క వేసి పంపిణీ చేసినా కనీసం 150 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని 150 ఏళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందా అని విక్రమార్క ఎద్దేవా చేశారు. దాదాపు రెండున్నర లక్షల మంది దళిత, గిరిజన నిరుద్యోగులు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నారని.. ప్రభుత్వం వారికి ఒక్క రూపాయీ ఇవ్వడం లేదని విమర్శించారు. దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే స్కాలర్‌షిప్‌లనూ పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు.


చేసింది చెప్పారు..కానీ చెప్పిందే చేయలేదు: జానా
అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అధికార విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరుగుతుండగా, విపక్షనేత జానారెడ్డి మధ్యలో లేచి మాట్లా డిన మాటలు సభ్యులందరినీ అయోమయానికి గురిచేశాయి. సబ్‌ప్లాన్‌ అమలు విషయంలో అధికార పక్షం ఏం చేసిందో అది చెప్పిందని, ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఏం చెప్పిందో అది మాత్రం చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ వర్గాల లబ్ధిదారుల సంఖ్య విషయంలో ప్రభుత్వమిచ్చిన లెక్కల్లో తప్పులు న్నందున సరిచూసుకోవాలన్నారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు కంగారుపడి తామిచ్చిన వివరాలు పరిశీలించారు. అయితే వివిధ పథకాల లబ్ధిదారుల సంఖ్యను పోల్చేటప్పుడు తాను కన్‌ఫ్యూజన్‌కు గురయ్యానని జానారెడ్డి పేర్కొన్నారు.

వైఎస్సార్‌ 2.5 లక్షల ఎకరాలిచ్చారు
గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని... వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2.5 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పంపిణీ చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. కానీ ఆ భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపించారు. హరితహారం పేరుతో పోడు భూములన్నీ ఆవిరైపోయాయని, అటవీ అధికారులు అనాదిగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను గుంజుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా భూమి లాక్కోవడంతో ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలో ఓ గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు.

ఇక విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలవుతున్నా సంక్షేమ హాస్టళ్లలోని దళిత, గిరిజన విద్యార్థులకు యూనిఫారాలు ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నించారు. దళిత, గిరిజనుల దేవుడైన బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పెడితే... ఈ ప్రభుత్వం దానిని చంపేసిందన్నారు. దళిత, గిరిజనులు అమ్మగా కొలిచే ఇందిరాగాంధీ పేరుతో నిర్మించాల్సిన ఇందిరా సాగర్‌ ప్రాజెక్టునూ చంపేసిందన్నారు. రోహిత్‌ వేముల విషయంలో కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం చెప్పారని.. ఆ సంగతి ఏమైందని భట్టి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చేతల్లో సామాజిక న్యాయం కనిపించడం లేదని. ఉపన్యాసాలకే ప్రభుత్వం పరిమితం అవుతోందని విమర్శించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement