కొలతలు వేస్తున్న సిబ్బంది
ఉరుకులు.. పరుగులు
Published Wed, Feb 15 2017 1:31 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
* మార్చి 31తో మురిగిపోనున్న సబ్‌ప్లాన్ నిధులు
* ఆఘమేఘాలపై పనులకు ప్రతిపాదనలు
* గుంటూరులోని ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
బాపట్ల: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మార్చి 31వ తేదీతో మురిగిపోనున్న నేపథ్యంలో ఆ నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు ఉరుకులు, పరుగులు మొదలెట్టారు. మున్సిపాల్టీల్లో పాలకపగ్గాలు చేపట్టిన తరువాత ఒక పని కూడా చేయలేకపోయామనే అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాను పనులతోనైనా సంతృప్తి పరిచేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 12 మున్సిపాల్టీలో మార్చి 31లోపు చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రతిపాదనల చిట్టా తీసుకుని అధికారయంత్రాంగం గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఒక్కొక్క కౌన్సిలర్ కనీసం వార్డులో రెండు, మూడు పనులు చేపట్టుకునేందుకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు వార్డులో లేకపోతే ఆ వార్డులకు ఈ నిధులు వచ్చే అవకాశం లేకపోవటంతో ఆయా వార్డుల్లో కనీసం తాగునీటి పైపులైన్లు అయినా ప్రతిపాదించాలనే తలంపులో అధికారగణం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
నామినేషన్ పద్ధతిపైనే పనులు..
మార్చి 31లోపు సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జిల్లాలోని మున్సిపాల్టీలో ఆఘమేఘాలపై ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిగిలిన నాలుగు జిల్లాలో మాత్రమే ఈ నిధులు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మున్సిపాల్టీలు ఈ నిధులను దక్కించుకునేందుకు చూస్తున్నాయి. గతంలో మున్సిపాల్టీకి రూ.50లక్షలు మాత్రమే ఇచ్చే ఈ నిధులు మార్చినెలాఖరుతో మురిగిపోనుండటంతో ఎన్ని పనులకైనా అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్క మున్సిపాల్టీలో రూ.5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిపై పనులు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. రోడ్లు, పైపులైన్లు, డ్రైనేజీలతోపాటు దళితవాడలు, వాటికి అనుసంధానంగా ఉండే వార్డుల్లో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాపట్ల మున్సిపాల్టీలో రూ.10 కోట్లతో 200 పనులకు పైగా ప్రతిపాదనలు సిద్ధంగా చేయగా మిగిలిన మున్సిపాల్టీల్లో వారి స్థాయిని అనుసరించి రూ.2 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తంగా జిల్లాలో వెయ్యి పనులకుపైగా చేపట్టాలనే ఉద్దేశంతో ఫైల్స్ తీసుకుని అనుమతులు కోసం గుంటూరు ప్రధాన కార్యాలయాల చుట్టూ మున్సిపల్ యంత్రాంగం తిరుగుతోంది.
మున్సిపాల్టీల్లో ప్రత్యేక సమావేశాలు..
గుంటూరులోని ప్రధాన కార్యాలయాల నుంచి ప్రతిపాదనలకు అనుమతులు రావటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాల్టీల్లో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు ఆఘమేఘాలపై ప్రయత్నాలు మొదలు పెట్టారు. గడిచిన పదిరోజులుగా చేపట్టాల్సిన పనులపై సర్వేలు నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటికప్పుడు తయారుచేసిన ఫైల్స్‌ను తీసుకొని గుంటూరులోని కార్యాలయాలకు పయనమవుతున్నారు.
Advertisement