అంబేడ్కర్‌కు నివాళి ఇదేనా?! | Is this way tribute to Ambedhkar about Tribals developement | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌కు నివాళి ఇదేనా?!

Published Tue, Oct 4 2016 1:44 AM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM

అంబేడ్కర్‌కు నివాళి ఇదేనా?! - Sakshi

అంబేడ్కర్‌కు నివాళి ఇదేనా?!

సందర్భం
డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల్ని ఇటీవలే ఘనంగా జరుపుకుంది మన దేశం. పాలకవర్గాలు, వివిధ పార్టీలు పోటీలు పడి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకు పోతామని ప్రతినబూనాయి. ఆచరణలో మాత్రం వాటి స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీ స్తున్నాయి. సమాచారహక్కు చట్టం ద్వారా బహిర్గత మైన వివరాలు దళితులు, ఆదివాసీల అభివృద్ధి పట్ల వీరి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి.
 
 గత 35 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన రూ.2.8 లక్షల కోట్ల నిధుల్ని ప్రభుత్వాలు ఖర్చు చేయలేదని ‘ఇండియా స్పెండ్’ వెబ్‌సైట్ పరిశో ధనలో వెల్లడైంది. తరతరాలుగా దోపిడీ, వివక్షలకు గుర వుతున్న ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధికోసం భారత ప్రభుత్వం 1974-75లలో ఎస్టీ సబ్‌ప్లాన్, 1979-80లలో ఎస్సీ సబ్‌ప్లాన్ ప్రకటించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వశా ఖలు ఈ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ లకు 16.6%, ఎస్టీలకు 8.6% నిధులు విడివిడిగా కేటా యించాలి. వీటిని కేవలం వీరి అభివృద్ధి పనులకే వెచ్చించాలి. ప్రత్యేక కేటాయింపుల ద్వారా  వారి అభివృ ద్ధికి పాటుపడాలనే సంకల్పంతో ప్రభుత్వాలు ఈ సబ్ ప్లాన్‌లు ఏర్పాటుచేశాయి.
 
 కానీ ఈ కేటాయింపులు ఏనాడూ నూరుశాతం సద్వినియోగం కాలేదు. అసలు కేటాయింపులే జనాభా నిష్పత్తి ప్రకారం జరగకపోగా విదిల్చిన మొత్తాన్ని సైతం పూర్తిస్థాయిలో వెచ్చించలేదు. ఉదాహరణకు 2012-13 లో కేంద్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 58,823 కోట్లు కేటాయించగా రూ.53,345 కోట్లు ఖర్చు చేసింది. అంటే రూ.5,478 కోట్లు మిగిలిపోయాయి. 2013-14లో ఖర్చు చేయని మొత్తం రూ.9,398 కోట్లకు పెరిగింది. ఎన్‌డీఏ వచ్చాక కేటాయింపులు రూ. 82,935 కోట్లకు పెరిగాయి.
 
 ఖర్చు చేయని మొత్తం కూడా రూ. 32,979 కోట్లకు (251 శాతానికి) పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2005-14 మధ్య కాలంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.19,367 కోట్లు ఖర్చు చేయలేదు. ఏపీ తర్వాతి స్థానంలో యూపీ, పం జాబ్ నిలిచాయి. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో జార్ఖండ్ రూ. 17,107కోట్లు, ఒడిశా రూ.7,292కోట్లు, ఏపీ రూ.6,922 కోట్లు ఈ కాలంలో ఖర్చు చేయలేదు. 2014 -15లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌లో 61% నిధులు, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 64.3% నిధులు అంటే మొత్తం రూ.7,475 కోట్లు ఖర్చు చేయకుండా మురగబెట్టింది.
 
 వీరి అభ్యున్నతికి కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు పాలకుల నిర్లక్ష్యం వల్ల మురిగిపోతున్నాయి. పక్కదారి పడుతున్నాయి. అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల స్ఫూర్తితో ఇప్పటికైనా పాలకులు దళితులు, ఆదివాసీల హక్కులకు న్యాయం చేయాలి. ప్రజాపక్ష మేధావులు, మీడియా, ప్రగతిశీల సంఘాలు కృషి చేయాలి. సబ్ ప్లాన్‌కు జాతీయస్థాయిలో చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలి.
 - బి. భాస్కర్
 వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్  9989692001

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement