- వర్క్‌షాపులో నిపుణుల సూచన
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల ఉపప్రణాళిక చట్టం-2013 ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పదేళ్లపాటు అమల్లో ఉండాలనే నిబంధనను సరి చేసి, రెగ్యులర్‌గా కొనసాగించేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. అందుబాటులో ఉన్న సమాచారం(డేటాబేస్)తో ఎస్సీ, ఎస్టీలకు మౌలిక వసతులు కల్పించేవిధంగా ప్రణాళికలు రూపొం దించాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్ భవన్‌లో ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలపై జరిగిన వర్క్‌షాపులో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆయా అంశాలపై మరింత విస్తృతస్థాయిలో చర్చించేందుకు ఈ నెల 18న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. డేటాబేస్ బాధ్యతలను సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) డెరైక్టర్‌కు అప్పగించారు. సబ్‌ప్లాన్ బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్ రోడ్లకు 16 శాతం, విద్యకు 25 శాతం నిధులు కేటాయించాలని అధికారులు సూచించారు. సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ కేవలం డబ్బు కేటాయించినంత మాత్రాన అభివృద్ధి జరగదని, నిధులను సక్రమంగా వ్యయం చేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.
ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ ఉప ప్రణాళికల బడ్జెట్‌ను ఖర్చు చేయడంలో లోపాలున్నాయని, వాటిని అధిగమిం చాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్టీ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్, ప్లానింగ్ డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి, సెస్ డెరైక్టర్ గాలిబ్, ఓయూ ఫ్యాకల్టీ రెడ్యానాయక్, ఎస్టీ శాఖ జేడీ దశరథ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.