ఇదేనా ‘వెలుగు’
అర్హులైనా వర్తించని ఉచిత విద్యుత్ రాయితీ
వెలుగు పథకం ద్వారా అందని లబ్ధి
బిల్లులు చెల్లించాల్సిందేన ంటూ ట్రాన్స్‌కో హుకుం
లబోదిబోమంటున్న 165 మంది లబ్ధిదారులు
పూళ్ల (భీమడోలు), న్యూస్‌లైన్ :
దళితులకు ఉచిత విద్యుత్ అందని ద్రాక్షలా మారింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 50 యూనిట్లు లోపు వినియోగించిన దళితులకు రాయితీ వర్తింపు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా మొత్తం బిల్లు చెల్లించాల్సిందేనంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరి స్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, రెవెన్యూ శాఖల నిర్లక్ష్యం వల్ల పేదల గృహాల్లో వెలుగులు నింపాల్సిన ఈ పథకం చీకట్లు కమ్ముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పూళ్లలోని తూర్పు, పడమర దళిత కాలనీల్లో 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు వెలుగు పథకంలో భాగంగా ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని ట్రాన్స్‌కో అధికారులు రెండు నెలల క్రితం భరోసా ఇచ్చారు. అయితే మూడో నెలలో బిల్లులను చెల్లించాలంటూ లబ్దిదారులకు వాటిని అందజేశారు. బిల్లులను చెల్లించకపోతే ఫ్యూజులు తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పూళ్ల పంచాయతీ పరిధిలోని పూళ్లలోని తూర్పు, పడమర, నాగేశ్వరపురం తదితర గ్రామాల్లోని 165 మందికి పైగా లబ్ధిదారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల వద్ద లబ్ధిదారుల జాబితాలో ఇంటి పేర్లు సక్రమంగా లేపోవడంవల్లే ఎస్సీ లబ్ధిదారులను గుర్తించలేకపోయామని వీఆర్వో బి.అనిత చెప్పడం గమనార్హం.
ఇంతసొమ్ము కట్టేదెలా?
కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. రెండు నెలల క్రితం 50 యూని ట్లలోపు విద్యుత్ వాడితే ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని చెప్పారు. ప్రస్తుతం పాత బిల్లులతో పాటు మూడో నెల బిల్లు కూడా కలిపి మొత్తం రూ.391.96 చెల్లించాల్సిందేనంటున్నారు. ఇంత సొమ్ము ఒకేసారి కట్టాలంటే ఏలా.
- లంకపల్లి నల్లయ్య, పడమర దళితపేట, పూళ్ల
అయోమయంగా ఉంది
రెక్కాడితే గాని డెక్కాడని పరిస్థితి మాది. జనవరిలో 8 యూనిట్లు మాత్రమే వాడా. విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేదనుకున్నా. ఇపుడు మూడు నెలలకు రూ.184 చెల్లించాలంటున్నారు. అంతా అయోమయంగా ఉంది. నా సమస్యను ఎవరికి చెప్పుకోవాలే అర్థం కావడం లేదు.
- కొమ్ము కుమారి, పూళ్ల