సం‘క్షోభ’ హాస్టళ్లు | students suffer due to Lack of facilities in hostels | Sakshi
Sakshi News home page

సం‘క్షోభ’ హాస్టళ్లు

Published Sat, Dec 14 2013 4:58 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

students suffer due to Lack of facilities in hostels

సాక్షి, గుంటూరు:  సంక్షేమం మరిచిన సర్కారు వైఖరికి వసతి గృహాల్లోని బడుగు విద్యార్థులు గజగజలాడుతున్నారు. ప్రతి ఏటా సంక్షేమానికి రూ.కోట్లలో నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్న పాలకుల మాటలకు, క్షేత్ర స్థాయిలో అమలవుతున్న సౌకర్యాలకు పొంతన లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద వసతి గృహాలకు మెరుగైన వసతులు కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు నమ్మబలుకుతున్నారే తప్ప ఆ దిశగా చర్యలు తీసుకొన్న పాపాన పోవడం లేదు. దీంతో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు అసౌకర్యాల నడుమ సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో దుప్పట్లు లేక హాస్టల్ భవనాల తలుపులు, కిటికీలు పాడై శిథిలావస్థకు చేరిన వాటిలోనే బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

 సబ్ ప్లాన్ కింద పక్కా భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారే తప్ప హామీలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.  సాంఘిక సంక్షేమ శాఖ కింద 15 హాస్టళ్లకు పక్కా భవ నాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినా ఇంతవరకు పనులు చేపట్టలేదు. జిల్లాలోని ఎక్కువ వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో సాగుతూ కనీస సదు పాయాలు లేక కునారిల్లుతున్నాయి. వీటిని పట్టించుకునే నాధుడే లేకపోవడంతో విద్యార్థులు రాత్రి పూట ఎదురయ్యే సమస్యలతో కునుకు ‘పాట్లు’ పడుతూనే ఉన్నారు. చలి పులి  చంపేస్తుండటంతో మోకాళ్లను కడుపులో దాచుకుని పడుకుంటున్నారు. భవనాలకు తలుపులు, కిటికీలు లేకపోవడంతో ఎక్కడ విష సర్పాలు, పురుగులు వస్తాయోనని నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నారు.
 ఇరుకు గదుల్లోనే ఒకరిపై ఒకరు పడుకోవాల్సిన పరిస్థితులు అధిక భాగం వసతి గృహాల్లో ఉన్నాయి. అద్దె గృహాల్లో నడుస్తున్న హాస్టళ్లకు అద్దె సకాలంలో చెల్లించకపోవడంతో భవన యజమానులు సౌకర్యాలు కల్పించడం లేదు.
 చలికాలంలో సమస్యలు అనేకం
 ముఖ్యంగా చలికాలంలో పేద విద్యార్థుల సమస్యలు అనేకం ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో ఇచ్చే ఓ దుప్పటినే దాచుకుంటూ చలికాలంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల్లోని పిల్లలకు ఏడాదికి ఓ జంపఖానా, దుప్పటి ఇవ్వాల్సి ఉంది. ఈ సీజన్‌లోనే దోమ తెరలు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు. గుంటూరులోని కోడి గుడ్డు సత్రంలోని ఎస్సీ హాస్టల్, రాజాగారితోటలోని బాలికల హాస్టల్‌లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెదనందిపాడు, క్రోసూరు, ప్రత్తిపాడులో వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. చిలకలూరిపేట, మాచర్ల, సత్తెనపల్లిల్లో కనీస మౌలిక వసతులు లేక, విరిగిన కిటికీలు, తలుపుల కారణంగా చలి పంజా విసురుతోంది. రేకుల షెడ్డుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
 దుప్పట్ల పంపిణీ అరకొరే..
 జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టళ్లలో దుప్పట్ల పంపిణీ అరకొరగానే ఉంది. 62 బీసీ హాస్టళ్లలో మొత్తం 6,500 మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు ఇంకా 3 వేల మందికి దుప్పట్లు పంపిణీ చేయలేదు. ఎస్సీ హాస్టళ్లలో పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా,  పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎస్టీ హాస్టళ్లలోనూ ఇంకా 287 మందికి దుప్పట్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి ఆప్కోకు పంపిన ఇండెంట్ రాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement