సబ్‌ప్లాన్.. మాయ | sc, st sub plan grants diverted in telangana | Sakshi
Sakshi News home page

సబ్‌ప్లాన్.. మాయ

Published Thu, Feb 12 2015 2:38 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

సబ్‌ప్లాన్.. మాయ - Sakshi

సబ్‌ప్లాన్.. మాయ

రాష్ట్రంలో దారితప్పిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు
కేటాయింపులు ఘనం.. అరకొరగా వ్యయం..
ఉప ప్రణాళికలకు చట్టరూపం వచ్చినా మారని పరిస్థితి
ఇంకా పాత పద్ధతిలోనే ప్రభుత్వశాఖల చేతికి నిధులు
ఇలా చేస్తే ఫలితమేమిటని దళిత, గిరిజన సంఘాల ఆవేదన
నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, నిధులు ఖర్చు చేయాలని డిమాండ్


తెలంగాణ రాష్ట్రంలో ‘సంక్షేమం’ దారితప్పింది.. దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యమన్న హామీ గంగలో కలసిపోయింది.. వచ్చీ రావడంతోనే నానా హడావుడి చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మళ్లీ పాత బాటే పట్టింది.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల నిధులను తిరిగి ప్రభుత్వ శాఖల చేతుల్లోనే పెట్టింది. నోడల్ ఏజెన్సీలు, ప్రత్యేక పద్దు కింద ఖర్చు వంటి వాటిని గాలికొదిలేసింది.. తీరా చూస్తే కేటాయింపులకు, ఖర్చుకు పొంతనే లేకుండా పోయింది.. కేటాయింపుల్లో వ్యయం 15 శాతానికే పరిమితమైంది.. ఎప్పటిలాగే దళితులు, గిరిజనుల సంక్షేమాన్ని వెక్కిరిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న దళితులు, గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బడ్జెట్‌లో సబ్‌ప్లాన్లకు భారీ కేటాయింపులు చేశారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు చేసినవాటికన్నా ఇప్పుడు పది జిల్లాలకే మరింత ఎక్కువ కేటాయిం చారు. అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల్లో కలెక్టర్లతో, అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిం చి హడావుడి కూడా చేశారు. కానీ చివరికి ఫలితం మాత్రం శూన్యం.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ఘనంగా రూ. 7,579 కోట్లను కేటాయించారు. అందులో ఇప్పటివరకూ విడుదల చేసింది రూ. 2,222 కోట్లు మాత్రమే.. అందులోనూ గత ఎనిమిది నెలల్లో ఖర్చు చేసింది రూ. 1,179 కోట్లే. అంటే ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన మొత్తం నిధుల్లో ఇది కేవలం 15.55 శాతం మాత్రమే. ఇక గిరిజన ఉప ప్రణాళిక పరిస్థితి మరింత దారుణం. దీనికి బడ్జెట్‌లో కేటాయించింది రూ. 4,404.59 కోట్లుకాగా.. విడుదల చేసిన నిధులు రూ. 1,267.60 కోట్లే. ఇందులోనూ ఖర్చు రూ. 499.6 కోట్లు మాత్రమే. కేటాయించిన నిధుల్లో ఇది 11.34 శాతం మాత్రమే. ఈ లెక్కన ఎస్సీ, గిరిజన ఉప ప్రణాళికలకు సంబంధించిన మిగతా దాదాపు 85 శాతం నిధులను మార్చి నెల ముగిసేలోపు ఎలా ఖర్చు చేస్తారనేది ప్రశ్నార్థకమే.

అంతా హడావుడే
ఏటా సబ్‌ప్లాన్లకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని, ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చుపెడతామనీ తొలిసారిగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ చెప్పారు. ఈ చట్టానికి సవరణలు చేయాలన్న దళిత నేతల డిమాండ్ల మేరకు విధి విధానాల రూపకల్పనకు పూనుకోవాలని అధికారులను ఆదే శించినా అమలుకు నోచుకోలేదు. దళితులకు మూడెకరాల భూమి, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలూ అంతంత మాత్రమే. ఇక సబ్‌ప్లాన్ నిధులను పాత విధానంలోనే ఆయా శాఖలకు కేటాయించడంతో వాటి ఖర్చుపై స్పష్టత లేదు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో గ్రాంటును రూ.10 లక్షలకే పరిమితం చేయడంతో ఆచరణలో విఫలమవుతోంది.

ఒక్కపైసా ఖర్చు లేదు
కొన్ని శాఖలకు కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద పౌరసరఫరాల శాఖకు రూ. 58.24 కోట్లు కేటాయించగా.. రూ. 25 కోట్లు విడుదల చేశారు. సర్వశిక్షా అభియాన్‌కు రూ. 164.9 కోట్లు కేటాయించగా.. 88.92 కోట్లు విడుదలైనా వ్యయం చేయలేదు. ఇక కాలేజీ విద్యకు రూ. 13.89 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 15.34 కోట్లు, కార్మిక శాఖలకు రూ. 10.8 కోట్లు కేటాయించినా... నిధులే విడుదల చేయలేదు. గృహనిర్మాణం కోసం రూ. 231.56 కోట్లు కేటాయించ గా.. ఖర్చు చేసింది రూ. కోటి పద్దెనిమిది లక్షలే.

మహిళా, శిశుసంక్షేమం కింద కేటాయించిన రూ. 215.66 కోట్లలో రూ. 19.97 కోట్లు, ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించిన రూ. 2,435.46 కోట్లలో రూ. 437.14 కోట్లు, పాఠశాల విద్యకు కేటాయించిన రూ. 371.97 కోట్లలో రూ. 6.8 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు.

గిరిజన ‘ప్లాన్’ మరీ దారుణం
గిరిజన సబ్‌ప్లాన్‌కు సర్వశిక్షా అభియాన్ కింద రూ. 100 కోట్లు ఇచ్చినా ఒక్కపైసా ఖర్చు చేయలేదు. గిరిజన సంక్షేమానికి రూ. 1,237 కోట్లు కేటాయించగా.. ఖర్చు చేసింది రూ. 156.43 కోట్లే. మహిళా, శిశుసంక్షేమం కింద కేటాయించిన రూ. 165.7 కోట్లలో రూ. 5.59 కోట్లు,  గృహనిర్మాణానికి రూ. 208.75 కోట్లు కేటాయించగా.. ఖర్చు చేసింది 1.91 కోట్లే. పాఠశాల విద్యకు కేటాయించిన రూ. 224 కోట్లలో ఖర్చు చేసింది రూ.1.2 కోట్లే.

నోడల్ ఏజెన్సీలేవి?
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు 2012 డిసెంబర్ 2నుంచి చట్టరూపం దాల్చాయి. అయినా సబ్‌ప్లాన్ల నిధులను పాత విధానంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తే ఫలితమేమిటని దళిత, ఆదివాసీ, వామపక్ష సంఘాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. అదే పద్ధతిని టీఆర్‌ఎస్ సర్కార్ కొనసాగిస్తూ ప్రభుత్వ శాఖలకే నిధులు విడుదల చేస్తోంది. సబ్‌ప్లాన్ల నిధులను నోడల్ ఏజెన్సీలకు ఇచ్చి, వాటి నుంచి ఖర్చు చేయాలన్న డిమాండ్‌ను కూడా గాలికి వదిలేశారు. వెంటనే నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి, ప్రత్యేక ఆర్థిక కార్యదర్శిని నియమించాలని కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement