విపక్షం వాకౌట్
ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందంటూ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ శుక్రవారం శాసనసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ అంశంలో ప్రభుత్వం అన్నీ తప్పుడు లెక్కలు చెబుతోందని, పొంతన లేని సమా ధానాలు ఇస్తోందని మండిపడ్డాయి. ‘ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి–ప్రభుత్వ చర్యలు’ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
చర్చలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తప్పుడు లెక్కలు, మాయ మాటలతో ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సబ్‌ప్లాన్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోలేదని, మార్గదర్శకాలనూ రూపొందించలేదని పేర్కొ న్నారు. దీనిపై గత మార్చిలో జరిగిన సమావేశాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పొంతనలేని సమాధానాలిచ్చి సభను తప్పుదోవ పట్టించారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జనాభా గురించి కూడా సర్కారు వద్ద సరైన వివరాలు లేకపోవడం దురదృష్టకర మని.. 54 లక్షలమంది ఎస్సీలుంటే, ప్రభుత్వ ప్రకటనలో 63 లక్షలుగా పేర్కొన్నారని దుయ్యబట్టారు.
ఇక 2014–15లో 18.89 వేల మందికి 229 కోట్ల ఆర్థిక తోడ్పాటును ప్రకటించిన ప్రభుత్వం.. సగం మందికి ఇప్ప టికీ నిధులివ్వలేదన్నారు. 2015–16లో 49 వేల మందికి రూ.420 కోట్ల మేర రుణాలి వ్వాల్సి ఉండగా.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు చేరలే దన్నారు. గతంలో ఎస్సీఎస్టీలకు రుణాలను అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్‌చానల్‌ను మూసేసిన ప్రభుత్వం.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ల కోసం గ్రీన్‌చానల్‌ను తెరిచిందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకంలో దళితులకు రూ.లక్ష అందించాలని డిమాండ్ చేశారు. దళితులపై ప్రేమ ఉన్నట్లయితే ఆ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి (ప్రదీప్ చంద్ర)ను ఏడాది కిందే సీఎస్‌గా చేసేవారని వ్యాఖ్యానించారు.
చట్టాన్ని ఉల్లంఘించడమే: బీజేపీ
సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చుచేయకుండా ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లం ఘిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం ఉపాధి రుణాలకు 2లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 66 వేల మందిని అర్హులుగా ఎంపిక చేసి 14 వేలమందికే రుణాలిచ్చారని మండిపడ్డారు. రెండున్నరేళ్లు దాటినా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు.
ఆత్మగౌరవాన్ని నిలపరా: రాజయ్య
దళితుల ఆత్మగౌరవాన్ని నిలిపే ఉప ప్రణాళిక అమలుకు నోచుకోవడం లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు దళిత ఎమ్మెల్యేను మంత్రిగా చేయాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని ఎప్పటి లోగా అన్వయించుకుంటారో చెప్పాలని సున్నం రాజయ్య డిమాండ్ చేశారు.
సలహా మండలి ఏర్పాటుకు సుముఖం: జగదీశ్
విపక్షాలు కోరినట్లుగా దళిత సలహామండలిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి సభలో చెప్పారు. రానున్న బడ్జెట్‌లో కేంద్రం కొత్త విధానాన్ని అనుసరించనున్నందున సబ్‌ప్లాన్ అమలు విధానాలలో ఆ మేరకు మార్పులు చేస్తామన్నారు. ఖర్చు కాని సబ్‌ప్లాన్ నిధులను వచ్చే ఏడాదికి కొనసాగించలేమని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తామన్నారు. ఇక దళితుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని... ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోని నిధుల కంటే ఎక్కువ మొత్తంలో నిధులను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.