కులాధిపత్య భాషను సహించాలా? | mallepalli lakshmaiah writes on caste based speeches | Sakshi
Sakshi News home page

కులాధిపత్య భాషను సహించాలా?

Published Thu, Feb 2 2017 1:17 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

కులాధిపత్య భాషను సహించాలా? - Sakshi

కులాధిపత్య భాషను సహించాలా?

కొత్త కోణం

ఛండాల జాతికి చెందినవారైన నేటి షెడ్యూల్డ్‌ కులాల వారు తమ పూర్వ చరిత్రను అర్థం చేసుకోవాలి. ఆధిపత్య కులాహంకారంతో పదే పదే ఛండాల పద ప్రయోగానికి పూనుకోవడాన్ని ఎంత మాత్రం సహించ రాదు. సంప్రదాయాల ద్వారా తెలియకుండానే భాషలో వ్యక్తమయ్యే కుల వివక్షను అంతం చేయాలి.

మారుతున్న సామాజిక పరిస్థితులకు అను గుణంగా ఎప్పటికప్పుడు తప్పొప్పులను బేరీజు వేసుకొని భాషను సరిదిద్దుకోవడం ఒక నిరంతర ప్రక్రియ. లేకుంటే భాషాభివృద్ధే ఉండదు.  తప్పులు అక్షరాల్లో కాదు, భాషలో ఉంటాయి. మనం నివసిస్తున్న సమాజంలోనూ, అది ఆధార పడిన భావజాలంలోనూ ఉంటాయి. ఒక మని షిని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని కించపరిచే అభి వ్యక్తి సమాజ గౌరవానికే భంగకరం. ఇటీవల హిందూ మత ప్రచారకులు చాగంటి కోటేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు యాదవులకు మనస్తాపం కలిగించాయి. ఇలాగే గతంలో పలువురు రాజ కీయ నేతల వ్యాఖ్యలు, సామెతలు పలు కులాలకు బాధ కలిగించాయి. చాగంటి వ్యాఖ్యలపై  నేనిక్కడ చర్చ చేయబోవడం లేదు. కాకపోతే ఆయన వ్యాఖ్యలు  వివాదాన్ని సృష్టించాయి అన్నది వాస్తవం.

కులాన్ని కించపరిచే మాటలు ఎందుకు?
కులాల సమ్మేళనంతో కూడిన హిందూ మత నిర్మాణంలోనే కులాధిపత్య భాషా సమస్య ఇమిడి ఉన్నది. ఒక కులం, ఇంకొక కులం వారిని సాటి మనుషులుగా భావించదు. కొందరు తాము అధి కుల మనుకుంటే, ఇంకొందరు తమను తాము తక్కువవారమని భావించడం కుల సమాజ లక్షణం. అయితే అణచివేతకు గురౌతున్న వృత్తి కులాలు, సేవా రంగంలోని కులాలు, అంటరాని కులాలు ఇటీవలి కాలంలో చైతన్యవంతం అయ్యాయి. దీంతో వారు ఆధిపత్య కులాలు తమను కించపరిచే భాషా ప్రయోగాన్ని, పద ప్రయోగాలను సహించడానికి సిద్ధపడటం లేదు. అయినా ఆధిపత్య కులాలు నేటికీ కొన్ని సామా జిక వర్గాలను కించపరిచేలా అలవోకగా మాట్లా డుతుండడం విచారకరం.

ఛండాల అంటే?
తరచుగా చాలా మంది నోట వినిపించే మాట ‘ఛండాల’. అది ఒక కులాన్ని అవమాన పరచేది, ఒక వ్యక్తి నీచుడైతే ఛండాలుడు అనేయడం చాలా మందికి అలవాటు.  ఏది నచ్చకపోయినా ఛండా లంగా ఉందంటారు. విజ్ఞానులు, పండితులు, మేధావులు సైతం తడబాటే లేకుండా ఇలా మాట్లాడేస్తుంటారు. అది తప్పేం కాదనుకుం టారు. ఆ కులస్తుల సంఖ్య చాలా తక్కువ, కొన్ని ప్రాంతాలకే పరిమితం. కాబట్టి అందుకు నిరసనా తక్కువే. కానీ ఎవరైనా ‘ఛండాల’ అనే పదాన్ని హీనమైన అర్థంలో వాడితే, వారి మీద ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టవచ్చు. అయితే మన దేశంలో చట్టాలకన్నా, సంప్ర దాయాలు బలమైనవి. అవి మనకు తెలియకుండానే తప్పులు చేయిస్తుం టాయి. పైగా అంటరాని కులాల ఉద్యమాలు ‘ఛండాల’ పద ప్రయోగంపై దృష్టి పెట్టలేదు. ఛండాల పద ప్రయోగంతో అంటరాని కులాలకున్న సంబంధం ఏమిటో తెలియకపోవడమే ఇందుకు కారణం.

కులాధిపత్య ధిక్కార సంకేతం...
ఆది శంకరుడు అతి చిన్న వయస్సులోనే దేశాన్ని చుట్టివచ్చి, హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేశాడని ప్రతీతి. ఆయన ఒకనాడు శిష్యులతో కలసి స్నానానికి నదికి వెళుతుండగా... ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కలతో ఎదురు పడతాడు. ఆ వ్యక్తిని పక్కకు తప్పుకోమని కోరగా అతడు గుక్క తిప్పుకోకుండా ఇలా ప్రశ్నిస్తాడు: ‘‘వేద వేదాంగాలు తెలిసిన నువ్వేనా నన్ను తప్పుకోమంటున్నది? సరే ఒకవేళ తప్పుకోవాల్సి వస్తే నా శరీరం తప్పుకోవాలా? లేదా ఆత్మ తప్పుకోవాలా? ఆత్మకు రూపం లేదు కదా? నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. ఏమిటి తేడా? సూర్యుడు ఆకాశం నుంచి ప్రసరిస్తుంటే కిరణాలు నీ మీదా పడుతున్నాయి, నా మీదా పడుతున్నాయి.

ఎందుకో చెప్పగలవా? ఇక్కడ వీస్తున్న గాలి, నన్ను తాకుతున్నది. నిన్ను తాకుతున్నది ఏమిటి తేడా? మనుషులంతా ఒక్కటే అందరి శరీరాలలో ఉన్న చీము, నెత్తురులు ఒక్కటే అని చెప్పే నువ్వు ఎందుకు నన్ను తప్పుకోమంటున్నావు’’. దీంతో శంకరుడు తాను ప్రవ చిస్తున్న సిద్ధాంతానికి ఆచరణ పూర్వకమైన సమాధానం దొరికినందుకు ఆ వ్యక్తి కాళ్లకు నమస్కరిస్తాడు. ఆ వ్యక్తే ఛండాలుడు. ఆది శంకరుడు ఛండా లుని కాళ్లకు మొక్కాడంటే ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుంటుందని శివుడే ఛండాలుని రూపంలో వచ్చాడని కథలు అల్లారు. ఛండాలుని తిరుగు బాటును శివుని హితబోధగా చిత్రించారు.

బౌద్ధం సమానతా సందేశం
అయితే ఛండాల జాతి గురించిన ప్రస్తావనలు చరిత్రలో, ప్రత్యేకించి బౌద్ధ సాహిత్యంలో చాలా ఉన్నాయి. అంటరానివారిగా పరిగణించే ఛండాల కుల స్తుడైన మాతంగుడు పలు అవమానాలకు గురవుతాడు. వాటికి వ్యతి రేకంగా పోరాడి, చివరకు విజేతగా నిలుస్తాడు. జైన సాహిత్యంలోని ‘అచ రంగ నిరుక్త’ గ్రం«థంలో కూడా ఈ ప్రస్తావన ఉన్నది. ఆనాటికి ఛండాల జాతి ఒక స్వతంత్ర తెగగా ఉండడం మాత్రమే కాదు. వైదిక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో బౌద్ధం అనుచరులుగా మారారు. బౌద్ధ సాహి త్యంలో ఛండాలిక బాలిక ప్రస్తావన ఉంది. దాని ఆధారంగానే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘ఛండాలిక’ నాటికకు సృజించాడు. బావి నుంచి నీళ్లు తోడు తున్న ఒక ఛండాల బాలికను... బుద్ధుని ప్రథమ శిష్యుడు ఆనందుడు నీళ్లు పోయమని అడుగు తాడు. అంటరానిదానినంటూ ఆ బాలిక నిరా కరిస్తుంది. అందరూ సమానమేనని, నీవు నీళ్లు పోయాల్సిందేనని ఆనందుడు పట్టుపడతాడు. దానితో ఎంతో చలించిపోయిన ఛండాలిక ఆనం దునికి నీళ్లు పోస్తుంది. తర్వాత బౌద్ధ భిక్కునిగా మారుతుంది. వైదిక, బ్రాహ్మణ, హిందూ సంప్ర దాయాలను వ్యతిరేకించిన చరిత్ర ఛండాల జాతిదేనని చెప్పక తప్పదు.

పూర్వ చరిత్రను గుర్తుంచుకోవాలి
ఆర్యుల రాకకు పూర్వమే ఛండాల జాతి ఉన్నట్టు చారిత్రక పరిశోధనల వల్ల తెలుస్తున్నది. ఆర్యు లకు ముందు స్త్రీ దేవతారాధన అధికంగా ఉండేది. చండీగఢ్‌కు మధ్యలో చండీ దేవి ఆలయం ఉన్నది. ఆ చండీదేవి పేరిటనే చంఢీగఢ్‌ను నిర్మించారు.  కశ్మీర్‌లోని పూంచ్‌కు సమీపంలో చండీ గ్రామం ఉన్నది. జార్ఖండ్‌లో ఛండేలియా ప్రాంతం ఉన్నది. నేడు మన దేశంలో ఉన్న వందలాది అంటరాని కులాల ప్రాచీన నామం ఛండాల అనే  అనుకోవాల్సి ఉంటుంది. కాలక్రమేణా అంటరాని కులాలకు వేరు వేరు పేర్లు ఏర్పడ్డట్టు భావించాలి. ఒకప్పుడు దేశమంతా విస్తరించి ఉన్న ఛండాల కులం కొన్నివేల మందికి పరిమితమైంది.

పశ్చిమ బెంగాల్‌లోని నామ శూద్రులను ఒకప్పుడు ఛండాలురనే వారు. ఈ ప్రాంతంలోని సాంఘిక సంస్కరణ ఉద్యమం ఛండాల అనే పేరును మార్చిందని బెంగాల్‌ దళిత ఉద్యమ చరిత్ర చెబుతున్నది. అలాంటి మార్పులు దేశవ్యాప్తంగానే జరిగినట్టు తెలుస్తున్నది. ఛండాల జాతికి చెంది నవారైన నేటి షెడ్యూల్డ్‌ కులాలవారు తమ పూర్వ చరిత్రను అర్థం చేసు కోవాలి. ఆధిపత్య కులాహంకారంతో పదే పదే ఛండాల పద ప్రయోగానికి పూనుకోవడాన్ని ఎంత మాత్రం సహించరాదు.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

మల్లెపల్లి లక్ష్మయ్య
మొబైల్‌ : 97055 66213  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement