కులాన్ని దోచుకునే కుట్రా? | govt focus on caste to under play rohith vemula case | Sakshi
Sakshi News home page

కులాన్ని దోచుకునే కుట్రా?

Published Thu, Mar 3 2016 12:20 AM | Last Updated on Fri, Jul 26 2019 5:38 PM

కులాన్ని దోచుకునే కుట్రా? - Sakshi

కులాన్ని దోచుకునే కుట్రా?

కొత్త కోణం
కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ఎస్సీ, ఎస్టీలపై అత్యా చారాల నిరోధక చట్టం కింద కేంద్ర మంత్రులపై కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరలేదు. రోహిత్ కులంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ‘పరిశోధించింది’. రోహిత్‌ను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనే ఈ ఆరాటం తగదు. ప్రభుత్వం ఇప్పటికైనా రాధిక కులం ‘ఆరాలు’ ఆపి, దోషులను కాపాడే యత్నం మానాలి. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలవాల్సి వస్తుంది. 

 రోహిత్... మూడక్షరాలు భారత పాలకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఇవే మూడక్షరాలు ఏమార్పుగా ఉన్న విద్యార్థి యువజనోద్యమానికి మార్గ నిర్దేశనం చేశాయి.  హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రాజుకున్న విద్యార్థి ఉద్యమ జ్వాలలు ఢిల్లీని చుట్టుముట్టాయి. కులం నాగు కోరలు పెరికే విద్యార్థి శక్తిని అడ్డుకోలేని శక్తులు అదే కులాన్ని పావుగా మలుచుకొని రోహిత్ తల్లి రాధిక పోరాట పటిమను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఓ దళిత స్త్రీ... అందులోనూ కడుపున పుట్టిన మహా మేధావిని పోగొట్టుకున్న తల్లి కుప్పకూలిపోకుండా. దృఢంగా నిలిచి, పోరాడింది. గుండెను చిక్కబట్టుకొని, ఎన్ని అడ్డంకులెదురైనా తన దారి పోరు దారేనని విద్యార్థి ఉద్యమంలో భాగమైంది.

ఇదే ప్రత్యర్థులకు మింగుడు పడనిది.  నయానా భయానా లొంగదీసుకోవాలని, ఉద్యమాన్ని అణచెయ్యాలని ఎన్నో కుయుక్తులు పన్నారు. ఏదీ సాధ్యం కాకపోగా, అమాత్యుల మెడలకే ఉచ్చు బిగుస్తుం డటంతో పాత పాచికలు మరోసారి బయటకు తీశారు. రాధిక దళితురాలు కాదని నిరూపించి, సత్యాన్ని మరుగుపర్చే యత్నం మొదలెట్టారు. ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ చేసిన కుట్ర పూరిత ప్రసంగం అభాసుపాలైంది. ఆగ్రహావేశాలతో ఉపన్యసించిన స్మృతీ ఇరానీ ‘‘నేను ఇచ్చిన వివరణతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే నా తల తీసి ఇస్తాన’’ని సవాలు విసిరారు. ‘‘నేను మీ వివరణతో సంతృప్తి చెందలేదు, మీ తల తీసివ్వండి’’ అంటూ బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి నిలదీయడంతో నిజంగానే స్మృతీ ఇరానీ తల తీసేసినంత పనయ్యింది. రోహిత్ కులాన్ని వివాదాస్పదం చేసి పాలకులు తమ తలలేని తనాన్ని బయటపెట్టుకుంటున్నారనిపిస్తోంది.

తిమ్మిని బమ్మిచేస్తే తప్పు ఒప్పయ్యేనా?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, చైతన్యవంతమైన విద్యార్థి ఉద్యమంపై కుల దురహంకారులు ద్వేషం వెళ్లగక్కారు. పథకం ప్రకారం రాజకీయ అండదండలతో రోహిత్ సహా ఐదుగురు దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి వెలివేశారు. తదనంతర పరిణామాలను జీర్ణించుకోలేని రోహిత్ ఆత్మహత్య చేసుకొని దేశాన్ని, ప్రత్యేకించి దళిత ఉద్యమకారులను నిద్రలేపాడు. అంతేకాదు, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, వైస్ చాన్స్‌లర్ అప్పారావు తదితరుల మీద రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పిన అభియోగంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదైంది. దీంతో వారు తొలుత రోహిత్ అసలు ఎస్సీ కాదని నిరూపించాలని శతవిధాలా యత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం తన మిత్రపక్షమైన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడాలని రకరకాల ప్రచారాలు, తప్పుడు వాదనలు ప్రచారంలోకి రావడానికి ఆస్కారం కల్పించింది.

ఈ  వివాదం పథకం ప్రకారం పన్నిన కుట్ర. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైన వెంటనే రోహిత్ వేముల తండ్రిని తెరపైకి తెచ్చి, అతని చేత రోహిత్ వడ్డెర కులస్తుడని చెప్పించి నమ్మించాలని ప్రయత్నిం చారు. ఎన్నడో తల్లిని పిల్లలను వీడి, ఎన్నడూ పిల్లల ఆలనా పాలనా చూడని ఆ తండ్రి కులాన్ని రోహిత్‌కి అంటగట్టాలని చూశారు. రోహిత్ తల్లి రాధిక ఎస్సీ ‘మాల’ కనుక రోహిత్ ఆమె కులస్తుడే అవుతాడని తెలిసి వెనక్కి తగ్గారు.  ఇప్పుడు రాధికే ఎస్సీ కాదనే కొత్త వాదన మొదలు పెట్టి, రకరకాల రుజువులు చూపడం ప్రారంభించారు.

తిరుగులేని వాస్తవాలనూ కాదంటారా?
రోహిత్ తల్లి రాధిక జీవితాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే వాస్తవాలు తేటతెల్లమవుతాయి. ఫిబ్రవరి మొదటి వారంలో గుంటూరు జిల్లా అధికారులు రాధిక పెంపుడుతల్లి అంజనీదేవి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. దాని ప్రకారం రాధిక, కూలి పని చేసుకునే ఓ వలస కూలీల జంటకు పుట్టిన బిడ్డ. అప్పటికే ఒక పాపను కోల్పోయిన అంజనీదేవి చక్కగా ఉన్న ఈ పాప(రాధిక)ను తనకివ్వమని కోరగా, పేదరికంలో ఉన్న ఆ జంట  ఆ పసిపాపను ఆమెకు అప్పగించి వెళ్లిపోయారు. రాధిక మాల కులస్తురాలనే విషయాన్ని కావాలనే తాము దాచిపెట్టి, తమ కులస్తురాలనే చెప్పామని అంజనీదేవి తెలిపారు. 14వ ఏటనే రాధికను తమ వడ్డెర కులస్తుడైన మణి కుమార్‌కిచ్చి పెళ్ళి చేశారు.

పెళ్ళిలో కూడా రాధిక ఎస్సీ అని బయట పడనివ్వ లేదని ఆమె మీడియాకు చెప్పారు. రాధిక ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక ఆమె మాల అని భర్తకు తెలిసింది. దీంతో మణికుమార్ రాధికను హింసించడంతో పాటూ, అంజనీదేవితో సైతం గొడవపడేవాడట. ఈ హింస తట్టుకోలేకే రాధిక విడాకులు తీసుకుందని మణికుమార్ తాత చెప్పారు. రాధిక తన ముగ్గురు పిల్లలతో వచ్చి కొంత కాలం అంజనీదేవి వద్దే ఉన్నా, తర్వాత గుంటూరుకు...అది కూడా తన కులంవారు నివసించే మాలవాడకు చేరింది.

 రాధికను పెంచుకోవడం మొదలు పెట్టాక అంజనీదేవికి నలుగురు పిల్లలు పుట్టారు. వారంతా మంచి చదువులు చదివి, మంచి వృత్తులలో బాగా బతుకుతున్నవారే. అంజనీదేవి సైతం ఎంఏ, ఎంఈడీ  చదివి, మున్సిపల్ హైస్కూల్‌లో హెడ్మాస్టర్‌గా పనిచేశారు. ఆమె భర్త ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ విషయాలను ప్రస్తావించడానికి బలమైన కారణమే ఉంది. పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్న ఆ జంట సొంత పిల్లలను చదివించి వృద్ధిలోకి తెచ్చినా, రాధికను మాత్రం చదివించకుండా బాల్య వివాహం చేసి పంపేసింది. భర్తతో విడాకులు తీసుకుని వచ్చిన రాధికను, ఆమె పిల్లలను అంజనీదేవి దంపతులే గాక, ఇంట్లో వారంతా పనివాళ్లకంటే హీనంగా చూసేవారని ప్రత్యక్ష సాక్షి అయిన రోహిత్ ప్రాణమిత్రుడు రియాజ్ చెప్పారు. రాధిక గుంటూరుకు చేరాక వారు తమకు ఎలాంటి సాయం చేయలేదని, రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి తెలిపారు. అనాథ అయినా రాధిక వడ్డెర కులస్తురాలై ఉంటే అంజనీదేవి కుటుంబం నుంచి తగు సాయం అందేది. అందరితో సమానంగా చూసేవారు.

 రాధిక వడ్డెర కులంలో పుట్టలేదనడానికి రెండు రుజువులున్నాయి. ఒకటి అంజనీదేవి స్టేట్‌మెంట్, రెండవది రాధిక విడాకుల గురించి ఆమె భర్త మణికుమార్ బంధువు చెప్పిన విషయాలు. రాధిక మాలవాడలో నివసిం చాలని నిర్ణయించుకోవడం కూడా కీలకమైనది. దళితేతరులెవ్వరూ మాల, మాదిగలుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. రాధిక  మాల కులస్తురాలు కాకపోతే ఏరికోరి దళిత కాలనీకి వెళ్ళే అవకాశమే లేదు. ‘‘మాల మాదిగలుగా ఎవ్వరూ పుట్టాలనుకోరు. అది యాదృచ్ఛికం. రాజులుగానో, మహారాజులు గానో ఉండాలనుకుంటారు’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారు! రాధిక తమది వడ్డెర కులమని చెప్పుకుని ఉంటే, కుల వివక్ష కూడా అంతగా ఉండేది కాదు. తన కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ముగ్గురు కేంద్ర మంత్రులపై ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరుకోలేదు. రోహిత్ కులమేమిటని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో శ్రద్ధగా ‘పరిశోధించింది’. ఎలాగైనా వాస్తవాలను మసిపూసి మారేడు కాయగా మార్చాలనీ చూస్తున్నది.

ఓ ఒంటరి దళిత స్త్రీ కులంపై ఇంతటి ‘పరిశోధనా’?
ఒక ఒంటరి దళిత స్త్రీ రాధిక కులం నేడు దేశవ్యాప్త చర్చనీయాంశం ఎందుకయ్యింది? గత కొన్నేళ్ళుగా నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని పలు ఆరోపణలు ప్రభుత్వాలకు అందాయి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ విషయంపై విచారణలు, క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నివేదికలను అందించింది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన పరిశీలనలో హైదరాబాద్‌లోని ఆదాయం పన్ను శాఖలో 31 మంది, టెలికమ్యూనికేషన్స్‌లో 8 మంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 10 మంది, విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో 13 మంది, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో 7 మంది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో 33 మంది, మొత్తం 102 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు కమిషన్ తేల్చింది. కానీ ఇంతవరకు ఎవ్వరి మీదా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో సైతం నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది, ఉన్నత పదవులు అనుభవించి రిటైరైన వారున్నారని ఫిర్యాదులున్నాయి. అయినా చర్యలు శూన్యం.

 కానీ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, ఆత్మబలిదానం చేసుకున్న రోహిత్ కులం గురించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ఆతృత, ఆసక్తి, ప్రత్యేక శ్రద్ధ చూపి ఏం తేల్చదల్చుకున్నారు? విచారణ ద్వారా ఏ వాస్తవాలను అవాస్తవాలని చలామణి చేయాలనుకుంటున్నారు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ దళిత స్త్రీ కుల హక్కుని సైతం దోచుకోవాలని ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? రోహిత్ బలిదానం ఎలుగెత్తి చాటిన ఉన్నత విద్యాలయాల్లోని కుల వివక్షను కాదా? ఒక్క హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఇప్పటి వరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రస్తావిస్తే... కేంద్ర మంత్రి స్మృతీఇరానీ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగాయని ఆవేశంగా మాట్లాడారు.

విశ్వవిద్యాలయాల్లో వివక్ష జరిగింది కాంగ్రెస్ హయాంలోనా, బీజేపీ హయాంలోనా? అనేది ప్రశ్నే కాదు. కేంద్రానికే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ, ఇతర అణగారిన వర్గాల పిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష మీద విచారణ జరపాలి, నివారణకు పరిష్కార మార్గాలను ఆలోచించాలి. అంతేకానీ, రోహిత్ ప్రాణాలను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనుకుంటే ఒక తప్పుని కప్పిపెట్టడానికి మరో తప్పు చేయడమే అవుతుంది. దుష్పర్యవసానాలూ  తదనుగుణంగానే ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వివేచనతో వ్యవహరించి, రోహిత్ తల్లి రాధిక కులంపై ఆరాను ఆపి, దోషులను కాపాడే ప్రయత్నం మానుకోవాలి. రోహిత్ సమస్యను మరింత జటిలం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్నది వాస్తవం.
http://img.sakshi.net/images/cms/2015-03/51426100574_295x200.jpg

 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య ) మొబైల్: 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement