
గుంటూరు : 'మేము సహనం కోల్పోయిన మరుక్షణం నీ సీటు గల్లంతవుతుంది' అని సీఎం చంద్రబాబు నాయుడును రోహిత్ వేముల తల్లి రాధిక హెచ్చరించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తే గుంటూరులో రవికుమార్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు. పెందుర్తిలో దళిత మహిళను నడిరోడ్డుపై వివస్త్ర చేసి కొట్టారని రాధిక నిప్పులు చెరిగారు.
ప్రకాశం జిల్లాలో దళితుల భూములు లాక్కుని వేధించారని రాధిక అన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం తాను దళిత పక్షపాతినంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటారన్నారు. అధికారంలోకి రాగానే అణచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక మీ ఆటలు సాగవని, ప్రజాసంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment