చేయి కాల్చుకోవాలనుకున్నా: రోహిత్ తల్లి
గుంటూరు ఎడ్యుకేషన్ : ‘‘ బీజేపీకి ఓటు వేసి గెలిపించి తప్పు చేసినందుకు నా చేతిని మంటల్లో కాల్చుకోవాలనుకున్నా. అధికారం కట్టబెట్టిన దళితులను నిండా మోసగించారు. నా కొడుకు చనిపోయి ఏడాది దాటినా ఇప్పటివరకూ ఏ ఒక్క దోషికి శిక్షపడలేదు. ప్రతిభావంతుడైన నా కొడుకు రోహిత్‌ను మానసికంగా వేధింపులకు గురి చేసి బలవన్మరణానికి ప్రేరేపించిన దోషులు సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. రోహిత్ మృతి కారకులకు శిక్ష పడే వరకూ, దళిత విద్యార్థుల భద్రత కోసం రోహిత్ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే వరకూ పోరాటం చేస్తాం’’ ఇవి ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ తల్లి వేముల రాధిక అన్న మాటలు.
వేముల రోహిత్ స్మృత్యర్ధం గుంటూరు నగరంలో మంగళవారం ప్రజా, విద్యార్థి, పౌర, దళిత సంఘాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ‘‘ఐ యామ్ రోహిత్’’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముఖాలకు రోహిత్ చిత్రంతో ఉన్న మాస్క్‌లను ధరించిన ఆయా సంఘాల నాయకులు రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాధిక ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కొడుకు చనిపోయిన బాధ కంటే అతనిపై వేసిన నిందలు తమను ఎంతగానో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు లేఖల ఆధారంగా వీసీ అప్పారావు రోహిత్‌ను వర్సిటీ నుంచి బహిష్కరించారని, మానసిక వేదనకు గురైన తన కొడుకు ఆత్మహత్మ చేసుకున్నాడని చెప్పారు. కేసులో అగ్రవర్ణాలకు చెందిన పెద్ద మనుషులు ఉన్నందునే వారిపై కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసి మోదీని ప్రధానిని చేసినందుకు తమకు తగిన శాస్తి చేశారని మండిపడ్డారు. దళితులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న మోదీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రోహిత్ చనిపోయింది హైదరాబాద్‌లో అని సీఎం చంద్రబాబు, రోహిత్ ఆంధ్ర విద్యార్ధి అని కేసీఆర్ రాజకీయాలు చేస్తూ కేసు గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
విచారణ పేరుతో ఆర్డీవో వేధించారు..
రోహిత్ ఎస్సీ అని గుంటూరు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించగా దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రాధిక చెప్పారు. కుల విచారణ పేరుతో గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు తమను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. గతేడాది నవంబర్ 2న గురజాల ఆర్డీవో కార్యాలయంలో విచారణ పేరుతో తనను పిలిపించిన ఆర్డీవో మురళి తనతో అసభ్యకరంగా మాట్లాడారని వాపోయారు. భర్తతో కాపురం చేయకుండా వదిలివేసిన దానిని పిల్లలను ఏ విధంగా పెంచుతున్నావంటూ అభ్యంతరకరమైన మాటలతో తనను వేధించారని మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. తానూ ఆత్మహత్యకు పాల్పడితే కేసు నీరుగారిపోతుందనే భావనతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో దోషులకు శిక్షపడి, తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ప్రదర్శనలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీనియర్ న్యాయవాది వైకే, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, దళిత, ప్రజా సంఘాల నాయకులు, హెచ్‌సీయూ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.