శుక్రవారం హెచ్‌సీయూలో రూపన్వాల్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు
• రూపన్వాల్ కమిషన్ నివేదికపై మండిపడ్డ విద్యార్థులు
• ఆ రిపోర్టు నిరాధారం.. విద్యార్థుల అభిప్రాయాలు పరిశీలించలేదు
• రోహిత్‌తోపాటు రస్టికేషన్‌కు గురైన విద్యార్థుల ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సం బంధించి నియమించిన జస్టిస్ రూపన్వాల్ కమిషన్ రోహిత్ తల్లి రాధిక మనో నిబ్బరాన్ని దెబ్బతీసేందుకు కులాన్ని ఉపయోగించుకుందని హెచ్‌సీయూ విద్యార్థులు ఆరోపించారు. రిజర్వేషన్ల కోసమే రాధిక కులాన్ని ఉపయోగించుకున్నారనడాన్ని వారు ఖండించారు. రూపన్వాల్ కమిషన్ రిపోర్టుని వ్యతిరేకిస్తూ శుక్రవారం హెచ్‌సీయూలో విద్యార్థులు ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక రిజర్వేషన్ల కోసమే కులాన్ని ఉపయోగించుకున్నారని కమిషన్ వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్య అని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో దళిత తల్లుల పక్షాన నిలిచి పోరాడుతున్న రాధికను మానసికంగా కుంగదీసేందుకే కమిషన్ ఇటువంటి రిపోర్టునిచ్చిందన్నారు.
కమిషన్ రిపోర్టు నిరాధారమైనదని, అందులో ఎక్కడా విద్యార్థుల అభిప్రాయాలుగానీ, రోహిత్ మరణానికి కారణాలను కానీ పరిశీలించినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పరిధిని మించి వ్యవహరించిందని, మొత్తంగా రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు నుంచి కాపాడేందుకు చేసిన కుట్రలో భాగమే ఈ నివేదిక అని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల రస్టికేషన్‌ని సైతం కమిషన్ సమర్థించడం నేరపూరిత వ్యాఖ్యానమని అభిప్రాయపడ్డారు. రోహిత్ దళితుడో కాదో తేల్చమని హెచ్‌ఆర్‌డీ శాఖ కమిషన్‌ను కోరలేదని, అటువంటప్పుడు రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తి ప్రదర్శించడానికి కారణాలేమిటో తమకు అర్థం కావడం లేదని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు వ్యాఖ్యానించారు.
అది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర..
రూపన్వాల్ కమిషన్ ముమ్మాటికీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రని రోహిత్‌తో పాటు రస్టికేట్ అయిన దొంత ప్రశాంత్, వేల్పుల సుంకన్న, విజయ్, శేషు పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌సీయూలో జరిగిన విద్యార్థుల సభలో వారు ఓ ప్రకటన విడుదల చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను కాపాడేందుకు కమిషన్ పేరిట కుట్ర చేశారన్నారు.
రోహిత్ మరణానంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ క్యాంపస్‌లో వివక్షని ఎత్తిచూపిందని, హెచ్‌సీయూలోని విద్యార్థి వ్యతిరేక పరిణామాలను, రస్టికేషన్‌ను తప్పుపట్టిందని గుర్తుచేశారు. అయితే విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులు అనుభవిస్తున్న వివక్షని, ఆత్మహత్యలకు కార ణాలను విస్మరించి రూపన్వాల్ కమిషన్ విద్యార్థి వ్యతిరేక రిపోర్టును ఇచ్చిందన్నారు. హాస్టల్స్ నుంచి వెలివేతను సమర్థించ డాన్ని బట్టే కమిషన్ గుట్టు బట్టబయలైందని ఆరోపించారు. బీజేపీ, ఏబీవీపీకి కొమ్ముగాస్తున్న వీసీ అప్పారావును, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, అప్పటి వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు.