ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ | Lovers Commits Suicide in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌

Published Wed, Jun 12 2019 6:57 AM | Last Updated on Wed, Jun 12 2019 6:57 AM

Lovers Commits Suicide in Tamil Nadu - Sakshi

రాధిక, విఘ్నేష్‌ (ఫైల్‌)

కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పెట్టిన పోస్టు ఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతను రేపింది. ఈ పోస్టు కారణంగా ఆ యువతి, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడడంతో విధ్వంసకర పరిస్థితి చోటుచేసుకుంది.

సాక్షి, చెన్నై: ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫొటోలను మార్పింగ్‌ చేయడం, వారి పరువును బజారు కీడ్చే రీతిలో వ్యవహరించే మృగాళ సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ఇలాంటి పోస్టింగ్‌ల కారణంగా  ఆ యువతులు, ఆ కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురి కావడమే కాదు, బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో పట్టుబడే వారితో కఠినంగా వ్యవహరించకపోవడం కాబోలు, తప్పుల మీద తప్పులు చేస్తూ యువతుల జీవితాలతో చెలగాటం ఆడే వారి సంఖ్య పెరుగుతున్నదని చెప్పవచ్చు. అలాగే, పోలీసులు సైతం సామాజిక వర్గాల నేతల ఒత్తిళ్లతో పట్టుబడే వారిని మందలించి వదలి పెట్టడం, ఆ తదుపరి తీవ్ర పరిణామాలు ఎదురైన పక్షంలో పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా కడలూరులో ఘటన వెలుగుచూసింది.

మొదటి నుంచి వేధింపులు....
కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్‌కుప్పంకు చెందిన నీలకంఠం కుమార్తె రాధిక (20) కడలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. కళాశాలలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమెను అదే ప్రాంతానికిచెందిన పన్నీరు కుమారుడు ప్రేమ్‌కుమార్‌ టీజింగ్‌లతో వేధించే వాడు. తొలుత పెద్దగా పట్టించుకోనప్పటికీ, చివరకు అతడి చర్యలు శ్రుతిమించడంతో రాధికకు మనోవేదన తప్పలేదు. ఫేస్‌ బుక్‌లోనూ వేధించడం మొదలెట్టడంతో తనలోని ఆగ్రహాన్ని రాధిక బయటపెట్టింది. ఫేస్‌బుక్‌ ద్వారానే ప్రేమ్‌కుమార్‌కు చీవాట్లు పెట్టింది. అయితే, ప్రేమ్‌కుమార్‌ మరింత ఆగ్రహానికిలోనై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇద్దరి మధ్య తొలుత ఫేస్‌బుక్‌లో పెద్ద సమరమే సాగింది. చివరకు విసిగి వేసారిన రాధిక ఈ వేధింపుల గురించి తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో ప్రేమ్‌కుమార్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ వివాదం అన్నది ఇరు సామాజిక వర్గాల మధ్య సమరం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయనేతలు, పెద్దల జోక్యంతో ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు మందలించి వదలి పెట్టారు.

మారుతాడుకుంటే..కక్ష కట్టాడు...
పోలీసులు మందలించడంతో ప్రేమ్‌కుమార్‌ మారతాడని రాధిక భావించింది. అయితే, ఆమెపై అతగాడు కక్ష పెంచుకోవడమే కాదు,  ఆమె పరువు బజారుకీడ్చేందుకు తగ్గ సమయం కోసం వేచి చూసినట్టున్నాడు. ఈ వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో వడలూరు పార్వతీపురంలో ఉన్న మేనత్త కుమారుడు విఘ్నేష్‌(23) ప్రేమలో రాధిక  పడింది. ఈ ఇద్దరు తిరుగుతుండడం కుటుంబీకుల దృష్టికి చేరింది. ఇరు కుటుంబాల పెద్దలు ఆ ఇద్దరికి వివాహం చేయడానికి నిర్ణయించారు. చదువులు పూర్తి అయ్యాక పెళ్లి చేద్దామన్నట్టుగా ముందుకు సాగారు. దీంతో రాధిక, విఘ్నేష్‌ల ఆనందానికి హద్దే లేదని చెప్పవచ్చు. అయితే, ఈ ఆనందాన్ని ఆవిరి చేయడమే కాదు,  ఆ ఇద్దరి పెళ్లి జరగకూడదని, ఇరు కుటుంబాల మధ్య వివాదాన్ని రేపే రీతిలో తనలోని మానవ మృగాన్ని ప్రేమ్‌కుమార్‌ బయటకు తీశాడు. సమయం కోసం వేచి ఉన్న ప్రేమ్‌కుమార్‌ కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో రాధిక ఫొటోలను మార్ఫింగ్‌ చేసే పనిలో పడ్డారు. అ సభ్యకరంగా ఉన్న ఆ  ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న రాధిక తీవ్ర మనస్తాపానికి గురి అయింది. తన పరువు బజారుకెక్కడంతో కలత చెంది సోమవారం ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె  ఆత్మహత్యకు గల కారణం తెలుసుకున్న కుటుంబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రేమ్‌కుమార్‌ ఇళ్లు, వారి బంధువుల ఇళ్లపై దాడులకు దిగారు.

ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం భగ్గుమనడంతో పరస్పరం దాడులు సాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేయత్నం చేశారు. అదే సమయంలో రాధిక ఆత్మహత్య చేసుకున్న సమాచారం చెవిన పడడంతో విఘ్నేష్‌ మనోవేదనలో పడ్డారు. రాధిక లేని జీవితం తనకు వద్దు అని భావించినట్టున్నాడు. సెంగం పాళయం వద్ద ఓ చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు విఘ్నేష్‌ వేలాడుతుండడాన్ని చూసిన అటు వైపుగా వెళ్లిన వారు ఆందోళనకు లోనయ్యారు. కిందకు దించగా, అప్పటికే మరణించి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ్‌కుమార్‌ పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా రాధికా, విఘ్నేష్‌ ఆత్మహత్య చేసుకోవడం ఆ సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. రోడ్డెక్కిన ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ప్రేమ్‌కుమార్‌ సామాజిక వర్గానికి చెందిన వారి వాహనాలపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడలూరు జిల్లా యంత్రాంగం బలగాల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. చివరకు మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే, ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసే వరకు మృతదేహాల్ని తీసుకోబోమని తేల్చడంతో అతడి కోసం వేట మొదలెట్టారు.  తన కోసం పోలీసులు గాలిస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం కోర్టులో ప్రేమ్‌కుమార్‌ లొంగిపోయాడు. దీంతో  ఇద్దరి మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆ గ్రామంలో పరిస్థితి మరలా అదుపు తప్పకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాగా, ఈ వ్యవహారంపై పీఎంకే నేత రాందాసు తీవ్రంగానే స్పందించారు. ఇప్పుడు ఎవరు ఎవర్ని వేధిస్తున్నారో అన్నది స్పష్టం అవుతుందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలకు భద్రత అన్నది కరువు అవుతోందని, ఇప్పుడు ఇద్దర్నిపొట్టన పెట్టుకున్న ప్రేమ్‌కుమార్‌ లాంటి వారితో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా, లేదా అని పరోక్షంగా వీసీకే నేత తిరుమావళవన్‌ను హెచ్చరించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement