అబలల చేతి అక్షరాయుధం
కొత్త కోణం
జ్యోతిరావు తండ్రి గోవిందరావును భయపెట్టి కొడుకునీ, కోడలినీ ఇంటి నుంచి పంపించ డంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో సావిత్రి స్నేహితురాలు ఫాతిమా షేక్ ఆశ్రయం ఇచ్చారు. పాఠశాలలు ఆగలేదు. అలాగే దాడులూ ఆగలేదు. సావిత్రి పాఠశాలకు వెళ్తున్న సమయంలో పేడతో, రాళ్లతో చాటు నుంచి దాడిచేసేవారు. ఇది నిత్యకృత్యం కావడంతో సావిత్రీబాయి పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఒక పాత చీర కట్టుకొని, మరొకటి వెంట తీసుకొని వెళ్లేవారు. కానీ వారి దాడులు తీవ్రమయ్యాయే తప్ప తగ్గలేదు.
‘‘మేము సజీవంగా సమాధుల్లో మగ్గుతున్న వాళ్లం. అక్షరం మాకు నిషిద్ధం. భగవంతుడు మా మొరనాలకించి బ్రిటిష్ వారిని పాలకులుగా పంపాడు. ఇప్పుడు మమ్మల్నెవరూ వే«ధించి, బాధించలేరు. ఉరితీసి చంప టానికీ, సజీవంగా పాతిపెట్టడానికీ సాహసించరు. మా ముందు తరాలకు కూడా భవిష్యత్తుపై భరోసా ఉన్నదిప్పుడు. మేమిప్పుడు ఒంటినిండా బట్ట కట్టగలుగుతున్నాం. స్వేచ్ఛగా, అర్థవంతంగా జీవిస్తున్నాం. ఆంక్షలూ, నిషే ధాలూ తొలగిపోయి బజారులూ, ఉద్యానవనాలూ మాకు తలుపులు తెరిచాయి.’’
1848లో ప్రారంభమైన ఒక బాలికల పాఠశాలలో చదివిన మాతంగ కులానికి చెందిన విద్యార్థిని రాసిన ఉత్తరమిది. సామాజిక విప్లవ పితామహు డుగా పేర్గాంచిన జ్యోతిబా పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి çఫూలే నిర్వహించిన పాఠశాలల ప్రత్యక్ష ఫలితమిది. సామాజిక అసమానతలను తలకిందులు చేసి మహర్, మాతంగ కులాల్లోని యువతీ యువకుల్లో చైత న్యాన్ని నింపిన ఒక ఉద్యమ సందర్భమది. ఆ బాలిక పేర్కొన్నట్టే అంటరాని కులాలకు అందివచ్చిన భద్రతకు సంబంధించిన ఒక ఘటన సావిత్రీబాయి ఫూలే నాయకత్వంలో జరిగింది. ఈ వివరాలను సావిత్రీబాయి, జ్యోతీరావు ఫూలేకు రాసిన లేఖలో తెలియజేశారు. అనారోగ్యంతో సావిత్రీబాయి తల్లి గారి ఊరైన సతారా జిల్లా నయ్‌గావ్‌లో ఉన్నప్పుడు అది జరిగింది. ‘‘మా గ్రామంలో గణేష్ అనే బ్రాహ్మణ యువకుడు చుట్టుపక్కల గ్రామాల్లో జాతకాలు చెప్పేవాడు. మహర్ కులానికి చెందిన షార్జా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వాళ్ల ప్రేమ వ్యవహారం బయటపడేనాటికే ఆ అమ్మాయి ఆరునెలల గర్భవతి. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వాళ్లిద్దరినీ చంపడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయం నా చెవినపడగానే అక్కడికి పరుగెత్తాను. వాళ్లను హత్యచేస్తే బ్రిటిష్ ప్రభుత్వపు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించాను. దాంతో బెదిరిపోయిన గ్రామపెద్దలు హత్యాప్రయత్నాన్ని విరమించుకున్నారు. వాళ్లిద్దరినీ గ్రామం నుంచి వెలేశారు. నేను కలుగజేసు కోకపోతే వారి ప్రాణాలు దక్కేవి కావని నా పాదాలపై పడి కన్నీళ్లు పెట్టు కున్నారు. వారికి ఆశ్రయమిచ్చి, ఏదైనా ఉపాధి కల్పించండి!’’
రెండు ఉత్తరాలు. ఒకటి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. రెండవది ధిక్కార స్వరం. మాతంగ బాలికకు ఆత్మవిశ్వాసం కలగడానికి సావిత్రీబాయి చూపిన పోరాటపటిమే కారణం. జ్యోతిబా, సావిత్రీబాయి ఇరువురూ సామాజిక మార్పుకోసం కలసికట్టుగా చేసిన పోరాటం ఆనాడు మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో ఒక చరిత్ర.
ఉద్యమమే ఊపిరిగా...
అంటరాని కులాలను దుర్మార్గంగా హింసించిన పీష్వాల పాలన 1818 లోనే అంతమైంది. సుమారు అయిదు వందల మంది మహర్ సైనికులు, వేలాది మందితో ఉన్న పీష్వాల సైన్యాన్ని తుదముట్టించి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేశారు. అప్పటివరకు అంతులేని కుల వివక్ష, అణచివేతని అనుభవించిన అంటరాని కులాలు బ్రిటిష్ వారి రాకతో ఊపిరి పీల్చుకు న్నాయి. వారు ప్రారంభించిన ఇంగ్లిష్ విద్య సావిత్రీబాయి లాంటి వాళ్లను చైతన్యపరిచింది. అయినప్పటికీ కొన్ని దుర్భర పరిస్థితులు అప్పటికి మిగిలే ఉన్నాయి. ఆ నేపథ్యంలో సావిత్రీబాయి కృషి ఎలాంటిదో అర్థం చేసుకోవా లంటే నాటి సామాజిక స్థితిగతులను గమనించాలి.
ఈస్టిండియా కంపెనీ రైల్వే, తపాల, విద్యాశాఖలను ప్రారంభించింది. అయితే భారత సమాజం కులాలుగా విడిపోయి ఉంది. మహిళల పరిస్థితి మరింత దయనీయం. శూద్రులతో సమంగా, ఇంకా చెప్పాలంటే వారికన్నా హీనంగా స్త్రీలను చూసేవారు. ఆధిపత్య కులాలు, బ్రాహ్మణ కులాల్లో పురు షుల దాష్టీకం ఎక్కువగా ఉండేది. బాల్య వివాహం, సతీసహగమనం, పున ర్వివాహాల వల్ల చాలామంది యుక్తవయసులోనే వితంతువులయ్యేవారు. వీరిని పురుషులు కేవలం పనిముట్లుగా భావించేవాళ్లు. మగవారి పశుత్వానికి బలై, గర్భవతులైతే ఇక వారికి ఆత్మహత్యలే శరణ్యం. వితంతువులకు శిరోముండనం చేసేవాళ్లు. అప్పుడే దహనసంస్కారానికి అర్హమైన పవిత్రత సిద్ధిస్తుందని భావించేవారు. రెండవది భర్త చనిపోతే ఆస్తులు పంచవలసి వస్తుందని మహిళలను ఇంటినుంచి గెంటివేసేవాళ్లు. స్త్రీల పట్ల దుర్మార్గమైన పద్ధతులు అవలంబిస్తూనే సమస్త నష్టాలకు మళ్లీ మహిళలే మూలమనే దుర భిప్రాయాన్ని ప్రచారం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మహాత్మా జోతీరావు, సావిత్రీబాయి ఉద్యమం పురుడుపోసుకున్నది.
స్త్రీవిద్యకు అంకురార్పణ
సావిత్రీబాయి 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయా గావ్‌లో జన్మించారు. ఖండోజి నేవనే పాటిల్, లక్ష్మీబాయి మొదటి సంతానం సావిత్రి. ఆమెకు సిద్ధూజీ, సఖారామ్, శ్రీపతి అనే ముగ్గురు తమ్ముళ్లు. పూనాకు చెందిన జ్యోతీరావుతో సావిత్రీబాయికి తొమ్మిదో ఏట పెళ్లి కుది రింది. అప్పుడు ఫూలేకు 13 ఏళ్లు. తల్లి చిన్నప్పుడే మరణించింది. దూరపు బంధువు సుగుణాబాయి ఫూలేను పెంచింది. ఆమె ఒక క్రైస్తవ ఫాదర్ ఇంట్లో పనిచేసేది. సుగుణాబాయి వద్ద పెరగడం వల్ల ఫూలేకు ఇంగ్లీషు భాష పట్ల మక్కువ ఏర్పడింది. క్రైస్తవంలో ఉండే మానవీయ విలువలు ప్రభావితం చేశాయి. నిజానికి సుగుణాబాయి చొరవతోనే సావిత్రి, జ్యోతిరావుల వివా హం జరిగింది. సుగుణాబాయికి జ్యోతిరావుకు ఇంగ్లిష్ చదువు చెప్పించాలని ఉండేది. కానీ ఫూలే తండ్రి గోవిందరావు ఒక బ్రాహ్మణ పూజారి మాటతో కొడుకుచేత చదువుకు స్వస్తి పలికించి వ్యవసాయంలో పెట్టాడు. దానితో కలత చెందిన సుగుణాబాయి లెగ్గిట్ అనే ఇంగ్లిష్ ఆఫీసరు, గఫార్ బేగ్ అనే ముస్లిం విద్యావంతుని ద్వారా ఫూలే తండ్రిని ఒప్పించగలిగారు. దానితో జ్యోతిబాకు తిరిగి చదువు కొనసాగించే అవకాశం కలిగింది. 1843లో సుగు ణాబాయి చొరవతో ఫూలే మిషన్ స్కూల్‌లో చేరి చదువు మొదలుపెట్టారు. ఒకవైపు చదువు సాగిస్తూనే, రెండోవైపు తన పొలంలోని మామిడి చెట్ల నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. అందులో సుగుణాబాయి, సావి త్రీబాయితో సహా ఇంకొందరు విద్యార్థులు చేరారు.
మగవారికీ, ఆధిపత్య కులాలకూ సైతం అప్పుడప్పుడే చదువు అందు తున్నది. స్త్రీలకైతే అది గగనకుసుమమే. అయినా పురుషుల కన్నా స్త్రీ విద్య అవసరం ఎక్కువని గుర్తించినందువల్లనే చెట్ల కింద విద్యాబుద్ధులు నేర్పేం దుకు జ్యోతిబా సిద్ధమయ్యారు. తరువాత పూర్తిస్థాయిలో పాఠశాలను నడపా లని నిర్ణయించుకున్నారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే (1832) బాలికల కోసం పూనాలోని బుధవార్ పేట్‌లో పాఠశాలను ప్రారంభించింది. కానీ అందులో చేరాలంటే కలెక్టర్ అనుమతి కావాలి. ఇది ఫూలేకు నచ్చలేదు. అందుకే 1848 జనవరి 14న అదే వాడలో తాత్యాసాహెబ్ బీడే అనే బ్రాహ్మ ణుని ఇంటిలో బాలికల పాఠశాలను ఫూలే ప్రారంభించారు. సావిత్రీబా యితో సహా ఫూలే ఇంటింటికీ తిరిగి, అమ్మాయిలను పాఠశాలల్లో చేర్పిం చాలని ప్రచారం చేసేవారు. అన్నపూర్ణా జోషి, సుమతీ ముఖాషీ, దుర్గా దేశ్ ముఖ్, మాధవి దత్తే, సోనూ పవార్, జాన్ కరెడిలే అనే ఆరుగురు అమ్మా యిలు ఈ పాఠశాలలో అడుగుపెట్టారు. ఈ తొలి బృందానికి మొదటి ఉపా ధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. ఆ తరువాత 1851 సెప్టెంబర్ 1న రాస్తా పేటలో ఫూలే దంపతులు మరో పాఠశాలను తెరిచారు. దీనితో పాఠశాలల్లో చేరే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పాఠశాలల సంఖ్య కూడా 18కి పెరిగింది. ఇందులో కొన్ని పాఠశాలలను అంటరాని కులాలైన మహర్, మాతంగ్ కులాల పిల్లల కోసమే నిర్వహించడం విశేషం.
ప్రతిఘటనలను అధిగమించి...
ఈ పాఠశాలల మీద దుష్ప్రచారంతో పాటు, ఫూలే దంపతులపై దాడులు మొదలయ్యాయి. అప్పుడు సావిత్రిబాయికి 17 ఏళ్లు. ఛాందసులు కొందరు ఈ పాఠశాలల నిర్వహణను ఆపడానికి భౌతికంగా ఆమె మీద దాడులకు సిద్ధపడ్డారు. జ్యోతిరావు తండ్రి గోవిందరావును భయపెట్టి కొడుకునీ, కోడలినీ ఇంటి నుంచి పంపించడంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో సావిత్రి స్నేహితురాలు ఫాతిమా షేక్ ఆశ్రయం ఇచ్చారు. పాఠశాలలు ఆగ లేదు. అలాగే దాడులూ ఆగలేదు. సావిత్రి పాఠశాలకు వెళ్తున్న సమయంలో పేడతో, రాళ్లతో చాటు నుంచి దాడిచేసేవారు. ఇది నిత్యకృత్యం కావడంతో సావిత్రీబాయి పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఒక పాత చీర కట్టుకొని, మరొకటి వెంట తీసుకొని వెళ్లేవారు. కానీ వారి దాడులు రోజు రోజుకు తీవ్రమయ్యాయే తప్ప తగ్గలేదు. కొంతమంది గూండాలు ఒక యువకుడిని రెచ్చగొట్టి సావిత్రీ బాయి మీదకు ఉసిగొల్పారు.
ఆ యువకుడు దుర్భాషలాడుతూ, అంటరాని కులాలకు చదువు చెప్పావంటే నీ అంతుచూస్తానని సావిత్రీబాయిపై చేయి చేసుకోబోయాడు. ఆ పరిస్థితిని ముందే గమనించిన సావిత్రీబాయి వెంటనే తేరుకొని చెంపమీద చెడామడా వాయించింది. ఆ పరిణామానికి భయపడిన ఆ యువకుడు సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయాడు. దానితో మరెప్పుడూ, మరెవ్వరూ ఆమె మీద దాడికి సాహసించలేదు. ఆ సంఘటనతో సావిత్రీ బాయి మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది. కాశీబాయి అనే వితంతువు గర్భవతై ఆత్మహత్యకు ప్రయత్నించింది. జ్యోతిబా వారించి, మూడు నెలల తరువాత ప్రసవించిన ఆమె కుమారుడిని దత్తత తీసుకున్నాడు. ఆ తరువాత ఇటువంటి పిల్లల కోసం బాల రక్షణ సదనాన్ని ప్రారంభించారు. వితంతువు లుగానీ, ఇతరులుగానీ పిల్లలను కని, పెంచలేని పరిస్థితి వస్తే ఈ సదనం ఆశ్రయం ఇచ్చేది.
1890 నవంబర్ 28న జ్యోతిబా మరణం సావిత్రీబాయిని కుంగదీసింది. అయినప్పటికీ వారు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. ఒక వైపు విద్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణతో పాటు 1897లో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో రాత్రింబవళ్లు రోగుల సేవలో సావిత్రీబాయి నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. చివరకు 1897 మార్చి, 10 వ తేదీన తుదిశ్వాస విడిచారు. నేటికి నూటఇరవై ఏళ్ల క్రితమే బాలికల విద్య కోసం, అంటరాని కులాల అభ్యున్నతి కోసం, స్త్రీల హక్కుల కోసం అంతులేని పోరాటం చేసిన సావిత్రీబాయి నేటికీ, ఏనాటికీ మహిళా పోరాటాలకు స్ఫూర్తిదాయకమే.
(జనవరి 3, సావిత్రీబాయి ఫూలే జయంతి)
(వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 )