
జడలు విప్పిన జాత్యహంకారం
నిజమైన భూమి పుత్రులైన స్థానిక ఆదివాసీ తెగలు ఒక్క శాతం తప్ప, మిగతా 99 శాతం అమెరికన్లంతా వలసవచ్చిన వారే. అధ్యక్షుడు ట్రంప్ తాత జర్మనీ నుంచి అలా వలసదారు గానే అమెరికా గడ్డపై కాలు మోపారు.
కొత్త కోణం
నిజమైన భూమి పుత్రులైన స్థానిక ఆదివాసీ తెగలు ఒక్క శాతం తప్ప, మిగతా 99 శాతం అమెరికన్లంతా వలసవచ్చిన వారే. అధ్యక్షుడు ట్రంప్ తాత జర్మనీ నుంచి అలా వలసదారు గానే అమెరికా గడ్డపై కాలు మోపారు. ఆయన మనుమడు వలసదారులంటూ రేకెత్తిస్తున్న జాతి విద్వేషాగ్ని తొలి లక్ష్యాలు ముస్లింలు, మెక్సికన్లే. కానీ భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన సైతం దాడులు జరుగుతున్నాయి. శ్రీనివాస్ హత్యకు ముందు ట్రంప్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలను మన ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి.
అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార హత్యలు ప్రపంచాన్ని కలవరపరు స్తున్నాయి. ఇటీవల కాన్సస్‌లో జరిగిన తెలుగు యువకుడి హత్య మరింత భయాందోళనలను కలిగిస్తున్నది. నీది ఏజాతి? అమెరికన్‌వా? కాదా? అని అడిగి మరీ అత్యంత దారుణంగా కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపారు. ఈ హత్య అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయుల్లో అభద్రతను, అంతు లేని భయాందోళనలను పాదుకొల్పింది. అమెరికాలో ఉన్న పిల్లల తల్లిదండ్రు లను తీవ్ర భయందోళనలకు గురిచేస్తోంది. చివరకు మాతృభాషలో మాట్లా డటమే దుస్సాహసమనే స్థితి ఏర్పడింది. బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లిషులోనే మాట్లాడటమే సురక్షితమని ప్రచారం చేసేంతగా అక్కడి మనవారు వణికి పోతున్నారు. అంతటి అభద్రతను సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా అమెరికన్ల కోసమే’నంటూ జాతి విద్వేషం వెళ్లగక్కుతు న్నారు. కాబట్టే అసలు అమెరికా ఎవరిది? అనే ప్రశ్నతో మూలాలలోకి వెళ్లాల్సి వస్తోంది.
శ్వేతజాతీయులే అమెరికన్లా?
అమెరికా జాతీయులంటూ ప్రస్తుతం ట్రంప్‌లాంటి వారు చేస్తున్న వాదన ఎంత మాత్రం సరైనది కాదు అని చరిత్రను అధ్యయనం చేసిన వారందరికీ అర్థం అవుతుంది. ట్రంప్‌గానీ, ఆయన మద్దతుదారులు గానీ, అమెరికన్లుగా గుర్తింపు పొందుతున్నవారిలో అత్యధికులంతా అక్కడికి వలస వచ్చిన వారే. కేవలం ఆసియన్లు, ప్రత్యేకించి భారతీయులు, తెలుగు వారు మాత్రమే వలసదారులు కారు. అమెరికాలో నివసిస్తున్న వారిలో 99 శాతం వలస దారులే. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని కుటుంబం సైతం నవీన వలసదారులేనన్నది సుస్పష్టమే. డొనాల్డ్ ట్రంప్ పూర్వీకులు జర్మనీకి చెందిన వారని అందరికీ తెలిసిందే. ట్రంప్ తాత ఫ్రెడరిక్ 1885లో అమెరికాకు వచ్చారు. ఫ్రెడరిక్ ట్రంప్ మొదట హోటల్ వ్యాపారం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఫ్రెడ్ ట్రంప్ హోటల్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. వాటినే డొనాల్డ్ ట్రంప్ కొనసాగించి, పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఒక వంద సంవత్సరాల తరువాత అంటే 1970 తరువాత సమాచార సాంకేతికత వృద్ధి చెందాక తెలుగువారు సహా భారతీయులు చాలా మంది బతుకు తెరువు కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ఎన్నో వేల భార తీయ కుటుంబాలు అమెరికానే తమ దేశంగా భావిస్తున్నాయి. వారంతా అమెరికాను అమితంగా ప్రేమిస్తున్నారనడం నిస్సందేహం. రాజకీయ లబ్ధి కోసం, సామాజిక ఆర్థిక ఆధిపత్యం కోసం కొంత మంది శ్వేత జాతీయులు ఇతర దేశాల ప్రజల పట్ల విద్వేషంతో కూడిన జాత్యహంకారాన్ని రెచ్చ గొడుతున్నారు. ఈ జాతి విద్వేషానికే భారత యువకులు బలైపోతున్నారు. ఈ జాతి విద్వేషాన్ని, జాత్యహంకార విధానాలను ఎదుర్కోవాలంటే నిజ మైన అమెరికా చరిత్రను పరిశీలించాలి. శ్వేతజాతీయులు మాత్రమే అమెరిక న్లనే అపోహనుతిప్పికొట్టడానికి అది అత్యావశ్యకం కూడా.
ఇటలీ నావికుడు కొలంబస్ 1492లో అమెరికా ఖండాన్ని ‘కనిపెట్ట డానికి’ ముందే అక్కడ వేల సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న ఆదిమ తెగలు అనేకం ఉన్నాయి. వారు అప్పటికే వేటతోపాటు, వ్యవసాయాన్ని చేస్తుండేవారు. ముఖ్యంగా పొగాకు, మిర్చి, మొక్కజొన్న పంటలు వారు సాగుచేసేవారు. క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం మధ్య వాళ్లు వ్యవసాయంలో ఎంతో ప్రగతిని సాధించినట్టు చరిత్ర కారులు చెపుతున్నారు. నాలుగు వేల ఏళ్ల క్రితమే వాళ్లు వ్యవసాయం ప్రారం భించారని, దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే మొక్కజొన్న పండించడం మొదలు పెట్టారని చరిత్రకారులు నిర్ధారించారు. మొక్కజొన్న ఆనాటి నుంచే వారి రోజువారీ ఆహారంలో ప్రధానమైన భాగం. ఆ తర్వాత క్రీస్తుశకం 800లో బీన్స్, స్క్వాష్ (ఒక రకం గుమ్మడి), జొన్న పంటలను స్థిరపరిచారు. ఈ పంటలను ముగ్గురు అక్కచెల్లెళ్లని పిలిచేవారు. వ్యవసాయంలో స్త్రీల భాగ స్వామ్యం చాలా ఎక్కువ. మగవాళ్లు భూమిని దున్నడం వరకే పరిమితం. నాట్లు, పంటల సంరక్షణ, కోతలు లాంటి మూడు ముఖ్యమైన పనులను స్త్రీలే చేసేవారు. వారి పంటల ఎంపికలో ఎంతో శాస్త్రీయత ఉండేది. జొన్నవేసిన తర్వాత బీన్స్ వేసేవారు. భూమి నుంచి జొన్న పంట తీసుకున్న నైట్రోజన్‌ను బీన్ పంట తిరిగి భూమికి అందించేది. నిజమైన అమెరికన్లయిన ఆదిమ తెగలు ఇలా శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అవలంబించేవి. ఈ అమెరికా ఆదివాసీ తెగల సంస్కృతిని, సంప్రదాయాలను, చరిత్రను యూరప్ నుంచి వచ్చిన వలసవాదులు ధ్వంసం చేశారు. అంతేకాదు అనాదిగా ఉన్న ఆ తెగల పేర్లను, వాటి మధ్య ఉన్న వైవిధ్యాన్ని తుడిచిపెట్టేసి అందరినీ కలిపి రెడ్ ఇండియన్స్‌గా పిలవడం ప్రారంభించారు.
‘రెడ్ ఇండియన్లే’ అసలు అమెరికన్లు
నిజానికి కొలంబస్ అమెరికా ఖండాన్ని కనిపెట్టాలని అనుకోనే లేదు. భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనిపెట్టాలనే లక్ష్యంతో కొలంబస్ బయలుదేరాడు. 15వ శతాబ్దానికి ముందే యూరప్ ఖండానికి భారత్, చైనా, తూర్పు ఇండియా దేశాలతో సిల్క్‌రూట్ ద్వారా వ్యాపారం సంబంధాలు ఉండేవి. కానీ 1453లో కాన్‌స్టాంటినోపుల్ టర్కీ వశం కావడంతో ఆ వ్యాపార సంబంధాలు సమస్యాత్మకంగా, ప్రమాదకరంగా మారాయి. దీంతో ఆసియా దేశాలకు సముద్ర మార్గం కోసం అన్వేషణ సాగింది. యూరప్ నుంచి తూర్పు దిశగా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి ఆసియాను చేరే మార్గాన్ని కను గొన్నారు. కానీ కొలంబస్ భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తూర్పున ఉన్న ఆసియాకు పడమటి నుంచి కూడా చేరుకోవచ్చనే అంచనాతో ఆ దిశగా కొత్త మార్గం కోసం అన్వేషించాడు. అలా కొలంబస్ నైరుతి దిశగా ప్రయాణం చేసి 1492లో అమెరికాను చేరాడు. నిజానికి కొలంబస్‌కు ముందే, 11వ శతాబ్ది నాటికే యూరోపియన్ నావికులు అమెరికా ఖండాలను చేరుకున్నారు. కొలం బస్ మాత్రమే దాన్ని ఆయన భారతదేశంగా పొరబడ్డాడు, అక్కడి ప్రజలను రెడ్ ఇండియన్లు అన్నాడు. అయితే కొలంబస్ ‘కనుగొన్న’ తర్వాతనే అమె రికాకు యూరప్ దేశాల నుంచి వలసల ప్రవాహం, ఆఫ్రికా నుంచి బానిస లను తరలించి, వ్యాపారం చేయడం, ఆదివాసి తెగల ఊచకోత వంటి విపరి ణామాలు సంభవించాయి.
1492కు ముందు అక్కడ దాదాపు 43 రకాల ఆదివాసీ తెగలు జీవనం సాగిస్తుండేవి. అందులో అపాచే, బ్లాక్ ఫీట్, చెరోకి, చెయెన్నె, చికాసా, చోక్టాల్, క్రీక్, క్రో తదితర తెగలు ముఖ్యమైనవి. యూరప్ నుంచి వచ్చిన స్పెయిన్, ఇంగ్లండ్, ఫ్రెంచ్, డచ్ వలసవాదులు అమెరికా భూమి పుత్రులైన ఆదివాసుల మీద యుద్ధాన్ని సాగించారు. యూరప్ నుంచి వారు మోసుకెళ్లిన మశూచి, స్కార్లెట్ ఫీవర్, టైఫాయిడ్ అతిసార, క్షయ తదితర రోగాల బారిన పడి ఆదివాసీ తెగల ప్రజలు లక్షలాదిగా చనిపోయారు.
అదే సమయంలో ప్రత్యక్ష దాడుల ద్వారా కూడా ఆదివాసీ తెగలను మట్టుబెట్టి యూరప్ దేశాలు అమె రికాను ఆక్రమించుకున్నాయి. మొదట స్పానిష్ వలసవాదులు ఆదివాసీ తెగ లపై 1513లో ఫ్లోరిడాలో తొలిసారి దాడి చేసి వారిని వశపరుచుకున్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వలసవాదులు 1534 నుంచి 1649 వరకు తమ దాడుల పరంపరను కొనసాగించారు. సెయింట్ లారెన్స్ వ్యాలీపైన ఫ్రెంచ్ దాడి జరి గింది. 1609లో డచ్ వ్యాపారస్తులు, 1608 నుంచి ఇంగ్లిష్ వ్యాపారస్తులు అమెరికా ఖండాల్లో తమ స్థావరాలను ఏర్పాటుచేసుకోవడం మొదలు పెట్టారు. ఈ దేశాలు క్రమంగా మెక్సికో, కెనడాలను, నేటి అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఆక్ర మించుకున్నాయి. స్థానిక ఆదివాసీ తెగలు తమ భూమి మీది నుంచి గెంటేశారు. లక్షలాదిగా ఆకలితో, అనారోగ్యంతో ప్రాణాలు కోల్పో యారు. యుద్ధాలు, రోగాలు స్థానిక ఆదివాసీ తెగల ఆనవాళ్లే లేకుండా చేశాయి. 1518లో 2 కోట్ల 5 లక్షలు ఉన్న అమెరికా ఆదివాసీ ప్రజల జనాభా 1593 నాటికి 25 లక్షలకు పడిపోయింది. నేటి గణాంకాలు సైతం అదే చెబు తాయి. 2010లో అమెరికా జనాభాలో ఆదివాసీ తెగల జనాభా 25,53,566గా నమోదైంది. 400 ఏళ్ల తరువాత కూడా అమెరికన్ ఆదివాసీల జనాభా అంతే నమోదైందంటే 1593 తర్వాత కూడా ఆ మారణహోమం సాగిందనేది స్పష్టమే. ఒకవైపు స్థానిక ఆదివాసీ తెగలను తుడిచిపెడుతూ, రెండో వైపు యూరప్ నుంచి లక్షలాదిగా అమెరికాకు తరలి వచ్చారు. భూములను, సహజ వనరులను, భూగర్భ సంపదను సంపూర్ణంగా దోచుకున్నారు.
‘అమెరికన్లదే అమెరికా’ నినాదం బూటకం
ప్రస్తుతం అమెరికా జనాభా మొత్తం 30 కోట్లు ఉంటే, అందులో 4 కోట్ల 28 లక్షల మంది, అంటే 15 శాతం జర్మన్లు, 10.8 శాతం ఐరిష్‌వారు, 8.7 శాతం ఇంగ్లిష్‌వారు, 5.6 శాతం ఇటాలియన్లు, 3 శాతం పోలిష్‌వారు ఉన్నారు. మొత్తం జనాభాలో యూరప్ నుంచి వలస వచ్చిన శ్వేత జాతీయులు 72.4 శాతం. ఆఫ్రికా నుంచి బానిసలుగా బం«ధించి తీసుకొచ్చిన నల్లజాతీయులు 12 శాతం ఉన్నారు. భారత్ సహా ఆసియాకు చెందినవారు ఒక కోటీ 40 లక్షల మంది ఉన్నారు. 500 సంవత్సరాల కింద ఆ భూమి పుత్రులుగా బతికిన స్థానిక ఆదివాసీ తెగలు ఒక్క శాతం మాత్రమే. అంటే ఒక్క శాతం తప్ప, మిగతా 99 శాతం అమెరికా వాసులంతా వలసదారులు, చొరబాటుదారులు లేదా బతుకుదెరువు కోసం వెళ్లినవారు. అలా వలస వచ్చిన ట్రంప్ 1930ల నుంచి జర్మనీలో అమలైన నాజీయిజం తరహా జాతివిద్వేష పాలనను నెల కొల్పాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఈ జాతివిద్వేషానికి మొదటగా గుర య్యేది ముస్లింలు, మెక్సికన్లు కావచ్చు. కానీ భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు సైతం గురి అవుతున్నారు. కూచిభొట్ల శ్రీనివాస్ హత్య జరగ డానికి ముందు రోజున డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఉపన్యాసంలో భారతీయులపై చేసిన వ్యాఖ్యలను మన ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. భారత ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాల్సిన అవసరముంది. ఈ విద్వేష వైఖరి కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలలో, వ్యాపార, వాణిజ్య రంగాలలో మన సహకారం ఉండదని అమెరికా ప్రభుత్వానికి నిర్మొహమాటంగా తెలియ జేయాల్సిన అవసరముంది. ఏదేమైనా ‘అమెరికా అమెరికన్లదే’ అనే బూట కపు నినాదం ముసుగున నిస్సిగ్గుగా వెర్రితలలు వేస్తున్న శ్వేతజాత్యహంకా రాన్ని నిర్ద్వద్వంగా ఖండించాల్సి ఉంది.
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213