లండన్: ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసిన ఒక మహిళ భారతీయ యాసను వెక్కిరించిన పోలీస్ కానిస్టేబుల్‌ను బ్రిటన్ క్రమశిక్షణా ట్రిబ్యూనల్ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీ జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీసు ప్యాట్రిక్ హ్యారిసన్‌ను దోషిగా తేలుస్తూ లండన్‌లోని ట్రిబ్యూనల్ తీర్పుచెప్పింది. గత నెలలో తీర్పువెలువగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి.
వెస్ట్ యార్క్‌షైర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్యాట్రిక్ ఘటన జరిగిన రోజు లండన్‌లోని ఫోర్స్ కాల్‌సెంటర్‌లో విధుల్లో ఉన్నాడు. తనపై ఒకరు విద్వేష నేరానికి పాల్పడ్డారంటూ ఒక మహిళ ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును పట్టించుకోకుండా ప్యాట్రిక్ ఆమె మాట్లాడే భారతీయ యాసను వెక్కిరించడం మొదలెట్టాడు. అసలది విద్వేష నేరమని ఎందుకు అనుకుంటున్నావ్? అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు.
ఫోన్ కట్‌చేశాక ఆమె ఫిర్యాదుచేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెకు వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె ఏం అనుకుందోనని ఆరాతీశాడు. ప్యాట్రక్ చర్యతో విసిగిపోయిన ఆమె ‘టెల్ మామా’కు ఫిర్యాదుచేసింది. బ్రిటన్‌లో ముస్లింవ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం ‘టెల్ మామా(ఎంఏఎంఏ–మెజరింగ్ యాంటీ ముస్లిం అటాక్స్) ప్రాజెక్ట కింద చర్యలు తీసుకుంటోంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్ వైఖరిని ట్రిబ్యూనల్ తీవ్రంగా తప్పుబట్టింది.
‘15 ఏళ్లపాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం, హోదాను మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం తగ్గిపోతాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. జాతి వివక్ష, ఇస్లామోఫోబియా దేశవ్యాప్తంగా పోలీసుల్లో గూడుకట్టుకోవడం ఆందోళనకరం’’ అని ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని విధుల నుంచి తప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment